అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దొంగల దాడి, సయ్యద్ మజార్ అలీకి తీవ్ర గాయాలు.. ఇది షాక్ కలిగించిందన్న బాధితుడు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని షికాగో నగరంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సయ్యద్ మజార్ అలీపై దొంగలు దాడి చేసినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ దాడిలో సయ్యద్ మజార్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. ఆరు నెలల క్రితమే ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లారు.
వార్తాసంస్థ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, సయ్యద్ మజార్ అలీ రాత్రి పూట తన చేతులను జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఆయన్ను ముగ్గురు వ్యక్తులు అనుసరిస్తూ వచ్చారు.
ఈ ముగ్గురు వ్యక్తులు ఆయన కళ్లపై, మూతిపై, పక్కటెముకలపై తన్నినట్లు సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియోలో ఉన్నట్లు పీటీఐ తెలిపింది.
‘నా కలలను నెరవేర్చుకొనేందుకు అమెరికా వచ్చా’
గాయాలపాలైన సయ్యద్ మజార్ అలీని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించినట్లు ఏబీసీ 7 న్యూస్ చానల్ రిపోర్టు చేసింది.
సయ్యద్ మజార్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నారు.
‘‘నా కలలను సాకారం చేసుకునే దేశం అమెరికా. అవి నెరవేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మాస్టర్స్ చదువుతున్నాను. ఈ దాడి నన్ను షాక్‌కు గురి చేసింది’’ అని అలీ ఏబీసీ 7 న్యూస్ చానల్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter@TelanganaCMO
తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ డెస్క్
సయ్యద్ మజార్ అలీపై దాడి జరిగిన తర్వాత ఇటీవల అమెరికాలో పెరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమెరికాలో నివసించే విద్యార్థులు, భారతీయ పౌరుల భద్రత విషయంలో ఉన్న తమ ఆందోళలను పరిష్కరించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
‘‘అమెరికాలో, ఇతర దేశాల్లో నివసించే యువత అందరి కోసం ముఖ్యంగా విద్యార్థులకు వారికి అవసరమైన సేవలందించేందుకు మా ప్రభుత్వం ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణకు చెందిన పౌరులందరూ వారు ఏ ప్రాంతంలో ఉన్నా మీకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నేను భరోసా ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఒహాయోలో బీ.శ్రేయాస్ రెడ్డి మృతి తర్వాత, షికాగోలో దొంగలు హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థిపై దాడి చేసినట్లు తెలిసి తమకు చాలా బాధ కలిగిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter@TelanganaCMO
బాధిత కుటుంబానికి దౌత్య కార్యాలయం భరోసా
బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలుగా సాయపడతామని భరోసా ఇస్తున్నట్లు షికాగోలోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది.
‘‘సయ్యద్ మజార్ అలీతో, భారత్‌లో ఉన్న ఆయన భార్య సయ్యద్ రుఖియా ఫాతిమా రిజ్వీతో మేం టచ్‌లో ఉన్నాం. అన్ని విధాలా సాయపడతామని మేం వారికి భరోసా ఇచ్చాం. ఈ దాడి ఘటనను విచారిస్తున్న స్థానిక అధికారులతో మేం సంప్రదింపులు జరుపుతాం’’ అని కార్యాలయం వివరించింది.
అమెరికాలో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న సమయంలో షికాగో దాడి జరిగింది.
గత వారం అమెరికాలో శ్రేయాస్ రెడ్డి అనే భారతీయ విద్యార్థి ఒహాయోలో మృతి చెందారు. ఆయన మరణానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
శ్రేయాస్ రెడ్డి ‘లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ విద్యార్థి అని పలు మీడియా కథనాలు చెప్పాయి.
శ్రేయాస్ మృతిపై న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం తన ట్విటర్ అకౌంట్‌లో స్పందించింది. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, పోలీసు విచారణ కొనసాగుతోందని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
- ఇజ్రాయెల్-గాజా యుద్ధం: 'మిలటరీ ట్యాంకు ఇటే వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది.. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి' -దాడుల మధ్య చిక్కుకున్న ఆరేళ్ళ చిన్నారి
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- బీర్ నిండుకోవడంతో ఈ అద్భుత దీవుల్లో పర్యాటకం దెబ్బతింటోంది
- మిస్ జపాన్: వివాహితుడితో అఫైర్ బయటపడినందుకు ‘కిరీటం’ కోల్పోయిన విజేత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














