30 వేల అడుగుల ఎత్తులో గుర్రం గందరగోళం, వెనుదిరిగిన బోయింగ్ విమానం

విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బ్రాండన్ డ్రెనాన్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

ఒక గుర్రం గందరగోళం సృష్టించడంతో ఆకాశంలో 30 వేల అడుగుల ఎత్తు (9,144 మీటర్లు)లో ఎగురుతున్న బోయింగ్ 747 కార్గో విమానం వెనుదిరగాల్సి వచ్చింది.

అమెరికాలోని న్యూ యార్క్ నుంచి బెల్జియం వెళ్తున్న విమానంలో గుర్రం క్రేట్ (గుర్రాన్ని కట్టేసి ఉంచే బోను లాంటి ఏర్పాటు) నుంచి తప్పించుకుంది. దాంతో దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత విమానం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

‘‘మా విమానంలో ఒక జంతువు ఉంది. ఒక గుర్రం. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)తో పైలట్ చెబుతున్న ఆడియో రికార్డైంది.

‘‘విమానం నియంత్రణలోనే ఉంది, కానీ క్రేట్ నుంచి తప్పించుకున్న గుర్రంతోనే ఆందోళనగా ఉంది’’ అని ఎయిర్ అట్లాంటా ఐస్‌ల్యాండిక్ ఫ్లైట్ 4592 పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చెప్పారు.

విమానం వెనక్కి వచ్చి జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఒక పశువైద్యుడు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటన గత గురువారం జరిగింది. విమానం వెనుదిరిగి వచ్చే క్రమంలో మసాచూసెట్స్ సమీపంలోని ఈస్ట్ ఆఫ్ నాన్టుకెట్ వద్ద 20 టన్నుల ఇంధనాన్ని ఖాళీ చేయాలని పైలట్ చెప్పారు.

విమానం బరువు కారణంగా ఇంధనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

అసలు గుర్రం ఆ క్రేట్ నుంచి ఎలా తప్పించుకుందో ఇంకా తెలియలేదు. అయితే, విమానాశ్రయంలో విమానం దిగేప్పటికి గుర్రం అదుపులో లేదు.

విమానం

ఫొటో సోర్స్, PA

''మీకు ఏదైనా సాయం కావాలా?'' అని విమానం దిగిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌ను అడిగారు.

అందుకు పైలట్ బదులిస్తూ ''గ్రౌండ్ ప్రతికూలంగా ఉంది'' అన్నారు. ''మాకు ర్యాంప్ కావాలి. ఒక గుర్రానికి ఇబ్బందిగా ఉంది'' అని చెప్పారు.

అయితే, కొద్దిసేపటి తర్వాత విమానం తిరిగి బయలుదేరిందని, మరుసటి రోజు శుక్రవారం ఉదయం లీజ్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ‘ఫ్లైట్‌రాడార్24’ వెబ్‌సైట్ తెలిపింది.

ఈ ఘటనపై సమాచారం కోసం ఎయిర్ అట్లాంటిక్ ఐస్‌ల్యాండిక్‌ను బీబీసీ సంప్రదించినప్పటికీ ఆ సంస్థ స్పందించలేదు.

అయితే, గుర్రాన్ని విమానంలో ఎందుకు తరలిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. రేసు గుర్రాలను రవాణా చేస్తూ ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

''జంతువుల కోసం కూడా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఎకానమీ సౌకర్యాలు ఉంటాయి'' అని ఒకరు సీఎన్ఎన్‌తో చెప్పారు.

విమానంలో జంతువు క్రేట్ నుంచి తప్పించుకోవడం ఇదే తొలిసారి కాదు. ఆగస్టులో దుబాయ్ నుంచి బాగ్దాద్ వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానంలో ఒక ఎలుగుబంటి తన క్రేట్ నుంచి తప్పించుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: