షమీ, కోహ్లీ, అయ్యర్: సిక్స్‌లు, సెంచరీలు, వికెట్లు.. ఒక్క మ్యాచ్, 11 రికార్డులు

మొహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌‌ను ఓడించి నాలుగోసారి ప్రపంచ కప్ ఫైనల్స్‌కి చేరింది భారత్. గతంలో 1983, 2003, 2011లో ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరిన టీమిండియా రెండుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.

బుధవారం న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 398 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ దూకుడు, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్‌‌ను మొహమ్మద్ షమీ కుప్పకూల్చాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి భారత జట్టుకి విజయాన్ని అందించాడు.

క్రికెట్ వరల్డ్ కప్‌‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న భారత క్రికెటర్లు బలమైన బ్యాటింగ్ లైనప్, అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డులను తిరగరాస్తున్నారు. పరుగుల వరదతో పాటు రికార్డులతో మోత మోగిస్తున్నారు.

ఈ సెమీ ఫైనల్‌లో రోహిత్ సిక్స్‌లతో మొదలైన రికార్డుల హోరు.. కోహ్లీ సెంచరీతో కొనసాగి, షమీ బౌలింగ్‌తో ముగిసింది. దీంతో ఈ ఒక్క మ్యాచ్‌లోనే అనేక రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

51 సిక్స్‌లు

వరల్డ్ కప్‌ మ్యాచ్‌లలో అత్యధిక సిక్స్‌ల రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లలో 51 సిక్స్‌లు బాదేశాడు రోహిత్.

ప్రపంచ కప్‌‌లో అత్యధికంగా 49 సిక్స్‌లు కొట్టిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్‌గేల్ రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. ఈ టోర్నీలోనే రోహిత్ 28 సిక్స్‌లు కొట్టాడు.

2015లో ఒకే టోర్నీలో 26 సిక్స్‌లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా అధిగమించాడు రోహిత్ శర్మ.

అలాగే, 2023లో ఆడిన 21 మ్యాచ్‌లలో 14 సార్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ జోడీ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

50 సెంచరీలు

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బద్దలుకొట్టాడు కింగ్ కోహ్లీ.

ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు విరాట్. వరల్డ్ కప్‌ టోర్నీలో ఇప్పటి వరకూ 711 పరుగులు చేశాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ తెందూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డును అధిగమించాడు.

దూకుడుగా ఆడిన రోహిత్ అవుటైనా, ఆ తర్వాత వచ్చిన కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగించాడు. మొదట ఈ ప్రపంచకప్‌లో తన ఫిఫ్టీ పూర్తి చేయగానే ఒక వరల్డ్ కప్‌ టోర్నీలో 8 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డ్ ఇప్పటివరకూ సచిన్, బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ పేరిట ఉంది. 2003లో సచిన్, 2013లో షకీబుల్ హసన్ 7 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు.

శ్రేయాస్ అయ్యర్

ఫొటో సోర్స్, Getty Images

గిల్‌క్రిస్ట్‌ను దాటిన శ్రేయస్ అయ్యర్

ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ప్రపంచ కప్ నాకౌట్ దశలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. కేవలం 67 బంతుల్లోనే వంద పరుగులు చేశాడు.

2007 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

నాకౌట్‌లో టాప్ స్కోర్

గెలుపో, ఓటమో తేల్చుకోవాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌‌‌తో చెలరేగిన టీమిండియా అత్యధిక పరుగుల రికార్డును కూడా సొంతం చేసుకుంది.

ప్రపంచ కప్ మ్యాచ్‌లలో నాకౌట్ దశలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసి న్యూజీలాండ్‌ను ఓడించడమే కాకుండా, న్యూజీలాండ్ రికార్డును కూడా చెరిపేసింది టీమిండియా.

2015 వరల్డ్ కప్‌ క్వార్టర్ ఫైనల్స్‌లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసింది న్యూజీలాండ్.

మొహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫస్ట్ ఇండియన్ బౌలర్

బంతితో చెలరేగిన మొహమ్మద్ షమీ ఏడు వికెట్లు కూల్చి న్యూజీలాండ్‌కు సెమీఫైనల్స్‌‌లో ఓటమి రుచిచూపించాడు. కేవలం 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

ప్రపంచ కప్‌ నాకౌట్ మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు షమీ.

అలాగే, వరల్డ్ కప్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. గతంలో మూడుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ప్రపంచ కప్‌లోనే మూడుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గానూ చరిత్రకెక్కాడీ స్వింగ్ సుల్తాన్. ప్రపంచ కప్‌లో 19 మ్యాచ్‌లలో 50 వికెట్ల మైలురాయి దాటిన మిచెల్ స్టార్క్ రికార్డును అధిగమించాడు షమీ. కేవలం 17 మ్యాచ్‌లలోనే 54 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)