వరల్డ్ కప్‌లో టీమిండియాకు తిరుగే లేదా, అన్‌స్టాపబులా?

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్ ఎప్పుడు ఏ వరల్డ్ కప్ టోర్నీలోనూ ఈ స్థాయి ఆధిపత్యం ప్రదర్శించలేదు
    • రచయిత, సురేశ్ మీనన్
    • హోదా, క్రీడా రచయిత

విరాట్ కోహ్లీ మేనియా ఈ వరల్డ్ కప్‌లో బాగా కనిపిస్తోంది. చాలామంది క్రికెట్ అభిమానులు ఈ టోర్నీపై ఆసక్తి చూపడానికి కారణం అదే.

మొదట, కోహ్లీ 49 సెంచరీలు సాధించి సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేస్తాడా? అని ఎదురు చూశారు. కోహ్లీ అది చేసి చూపించాడు.

ఇప్పుడు అతని 50వ సెంచరీపై అందరి దృష్టి పడింది. తర్వాత 51వ సెంచరీ ఎప్పుడు వస్తుంది? ఇలా కోహ్లీపై వారి ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరోవైపు గణాంకాలు మతి పోగొడుతున్నాయి. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డుల్లో భారత ఆటగాళ్లే అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ 49, సచిన్ తెందూల్కర్ 49, రోహిత్ శర్మ 31 సెంచరీలతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

వరల్డ్ కప్-2023లో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను ఆదివారం భారత్ 243 పరుగుల తేడాతో ఓడించింది. వారిని 83 పరుగులకే కట్టడి చేసింది. ఇది ఈ టోర్నీలో భారత్‌కు ఇతర జట్లకు మధ్య తేడాను చూపిస్తుందా? లేదా జట్టులోని 11 మంది ఆటగాళ్లు అత్యున్నత స్థాయి ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుందా? మరో రెండు మ్యాచ్‌ల్లో భారత్ దీన్నే పునరావృతం చేయగలదా?

కోహ్లీ మేనియాలో ఇతర ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు కొట్టుకుపోయి ఉండొచ్చు. దీనికి ఉదాహరణ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనను చెప్పొచ్చు. బుమ్రా ఈ టోర్నీలో 15.53 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు.

అతను సంధించిన 70 శాతం డెలివరీలకు బ్యాట్స్‌మన్ పరుగులు చేయలేకపోయారు. పవర్‌ప్లేలో అతని డాట్ బాల్స్ 83 శాతానికి పెరిగాయి. ఏ బౌలరైనా కలలుగనే ఆట తీరు ఇది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు ఇవ్వకపోవడం బుమ్రా ప్రత్యేకత. మొదటి నుంచే ప్రత్యర్థిని బుమ్రా ఒత్తిడిలోకి నెడతాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్‌ప్రీత్ బుమ్రా 15 సగటుతో ఇప్పటివరకు 15 వికెట్లు పడగొట్టాడు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాట్‌తో ఇదే రకమైన ఆటతీరు కనబరుస్తాడు. పవర్‌ప్లే (మొదటి 10 ఓవర్లు)లో ధాటిగా ఆడతాడు. ఈ వ్యూహం పని చేసింది కూడా. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ పవర్‌ప్లేలో 91 పరుగులు సాధించింది.

రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 40 పరుగులు చేయడంతో ఆరో ఓవర్‌లోనే భారత్ 60 పరుగుల స్కోరును దాటింది. ఇది కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకొని 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడానికి అవసరమైన స్పేస్‌ను ఇచ్చింది.

రోహిత్, శుభ్‌మన్ గిల్ అప్పటి వరకు పవర్‌ప్లేలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా పేరున్న మార్కో జెన్సన్‌పై చెలరేగి ఆడారు.

ఈ వ్యూహ రచన క్రెడిట్ అంతా రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు దక్కుతుంది. ఈ వ్యూహాన్ని మైదానంలో చక్కగా అమలు చేస్తోన్న భారత టాపార్డర్‌ను కూడా ప్రశంసించాలి.

భారత్ ఇప్పుడు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లుగా బహుశా ఏ టోర్నీలోనూ, ఏ వరల్డ్ కప్‌లోనూ చెలరేగలేదు.

సీమర్లు, స్పిన్నర్లు, ఓపెనర్లు, మిడిలార్డర్ ఇలా అందరూ ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా మంచి ఆటతీరును కనబరుస్తున్నారు. ఈ టోర్నీలో భారత్ తరఫున సెంచరీలు, ఒకే మ్యాచ్‌లో అయిదు వికెట్ల ఘనతలు, అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు, కళ్లు చెదిరే క్యాచ్‌లు కనిపిస్తున్నాయి.

వరల్డ్‌కప్‌లో బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్‌లతో కూడిన బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ దళం, అత్యంత ప్రభావవంతమైన స్పిన్ జంట రవీంద్ర జడేజా (లెఫ్టార్మర్, ఫింగర్ స్పిన్నర్), కుల్దీప్ యాదవ్‌ (రిస్ట్ స్పిన్నర్)లతో సమన్వయం చేసుకుంటూ మెరుగ్గా రాణిస్తోంది. సొంతగడ్డపై ఆడే ప్రపంచకప్‌లో ఇంతకుమించి అడగలేం.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు

ముంబయిలో సెమీఫైనల్స్‌ ఆడాల్సి ఉండగా ఆందోళన కలిగించే అంశాలు జట్టు ముందు రెండు ఉన్నాయి. మొదటిది...భారత జట్టు అయిదుగురు బౌలర్లతోనే ఆడుతుంది. రెండోది, హోరాహోరీ ఉత్కంఠభరిత మ్యాచ్‌ ఈ టోర్నీలో భారత్‌కు ఇప్పటివరకు ఎదురు కాలేదు.

కానీ, ఇదొక ప్రత్యేకమైన బౌలింగ్ యూనిట్. ఈ అయిదుగురిలో ప్రతీ ఒక్కరూ మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. కేవలం పరుగులను కట్టడి చేయడమే తమ బాధ్యత అని వీరిలో ఏ ఒక్కరూ భావించరు. ఇలా జట్టులో అయిదుగురూ వికెట్లు పడగొట్టే బౌలర్లు ఉన్నప్పుడు, మ్యాచ్‌లో ఏ ఒక్క బౌలరో విఫలమైతే జట్టుకు ఇబ్బంది ఎదురయ్యే ప్రసక్తే ఉండదు. త్వరలోనే దీని గురించి మనకు తెలుస్తుంది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆరంభంలోనే 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు తప్ప, మిగతా మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్ ఎప్పుడూ ఒత్తిడిలో పడలేదు.

కోహ్లీ ఆట ముగిసిందంటూ ఇటీవల గట్టిగా అరిచి గీపెట్టినవారే, ఇప్పుడు కోహ్లీ నెక్ట్స్ సెంచరీ చేయాలంటూ గట్టిగా ప్రోత్సహిస్తున్నారు.

గాయాల పాలైన ఆటగాళ్లు సరైన సమయంలో కోలుకోవడం, ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు తిరిగి గాడిన పడటంతో టీమిండియా దృఢంగా మారింది.

ఇక్కడ షమీని ఉదాహరణగా చూద్దాం. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 7 సగటుతో 16 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు నాలుగో నంబర్ స్థానంలో స్థిరపడ్డాడు. అయితే, చీలమండ గాయంతో వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని టీమిండియా భర్తీ చేయలేకపోయింది.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీమిండియా ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో షమీకి చోటు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు షమీ 16 వికెట్లు తీశాడు

ఇక క్లోజ్ మ్యాచ్‌లు జరగట్లేదనే విషయానికొస్తే, చాలా బాగా ఆడుతున్నందుకు జట్టును నిందించలేం.

నాకౌట్ గేమ్‌ల వరకు ప్రపంచకప్‌లు టీమ్ ఈవెంట్‌లు. తర్వాత, వ్యక్తిగతంగా మంచి స్కోరు సాధించాలన్న కోరికలు వరల్డ్ కప్‌ను గెలవాలనే కలను చెదరగొట్టగలవు.

2003 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే జరిగింది. ఆ టోర్నీలో వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గిన తర్వాత ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది.

ఫైనల్లో రికీ పాంటింగ్ 121 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 140 పరుగులు సాధించాడు.

ఇలాంటి ఆటతీరుకు ముందుగానే మీరు ఎలాంటి ప్రణాళికలు రచించలేరు. ఆ బ్యాట్స్‌మన్ తనంతట తానుగా అవుటవ్వాలని ప్రార్థించడం తప్పా.

మైక్ టైసన్ చెప్పినట్లుగా మూతిపై పంచ్ పడేంతవరకు ప్రతీ ఒక్కరికీ ఒక ప్లాన్ ఉంటుంది.

‘‘మేం మా వ్యూహాలను అమలు చేస్తుండగా, వాటిని చిత్తు చేస్తూ ఎవరైనా మాపై అద్భుతంగా ఆడి మమ్మల్ని ఓడిస్తే, మేం వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతాం’’ అని ఇటీవల ద్రవిడ్ అన్నారు.

( ఈ కథనం రాసిన సురేశ్ మీనన్ క్రీడా రచయిత. సచిన్ తెందూల్కర్, బిషన్ సింగ్ బేడీలపై పుస్తకాలు రాశారు. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)