‘ఈసీ’ కోళ్లఫారాలు ఎలా పెడతారు? ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుందా?

ఈసీ కోళ్లఫారం
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడేందుకు, అధిక లాభాలు సాధించడానికి కోళ్ల ఫారం రైతులు అధునాతన టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.

సాధారణంగా ఇనుప జాలీలు ఉండే షెడ్లలో కోడి పిల్లలను పెంచుతుంటారు. అందువల్ల బయటి ఉష్ణోగ్రతల ప్రభావం కోడి పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల మీద పడుతుంది.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే కోడి పిల్లలు దాణా తీసుకోవడం తగ్గిస్తాయి. వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా బాయిలర్స్ బరువు పెరగవు. లేయర్స్ అయితే తక్కువ గుడ్లు పెడతాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూసుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఈసీ కోళ్ల ఫారాలకు ఆదరణ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 500 వరకు ఇలాంటి కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో బాయిలర్స్ కోళ్లను మాత్రమే పెంచుతారు.

ఈసీ కోళ్ల ఫారాలు

మామూలు కోళ్ల ఫారాలకు, వీటికి తేడా ఏమిటి?

మాములు కోళ్ల ఫారాల మాదిరిగా ఇవి ఉండవు. చుట్టూ మూసివేసిన ప్రదేశంలో ఉష్ణోగ్రతలను తగ్గించడం, పెంచడం ద్వారా వాతావరణాన్ని నిరంతరం నియంత్రిస్తుంటారు. దీన్నే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్(ఈసీ) అంటారు.

చిత్తూరు జిల్లా వికోట మండలానికి చెందిన పౌల్ట్రీ రైతు నాగరాజు, ఈసీ పద్ధతిలో కోళ్ల ఫారం ఏర్పాటు చేశారు. ఈ ఫారంలో బయటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉంటే లోపల మాత్రం 27 డిగ్రీలు ఉండేలా చూస్తున్నారు.

‘‘400 అడుగుల పొడవు, 47 అడుగుల వెడల్పు ఉండేలా, అన్ని వైపులా మూసి ఉంచేలా ఈసీ కోళ్ల ఫారం నిర్మించాం. అందులో 25 వేల కోళ్లను పెంచుతున్నాం. వెంటిలేషన్ కోసం 12 ఫ్యాన్లు పెట్టాం. కూలింగ్ కోసం, బయటి నుంచి లోపలకు వచ్చే గాలిని హనీ కోంబ్‌ ద్వారా మళ్లిస్తాం. ఆ హనీ కోంబ్‌ను నీళ్లతో తడుపుతుంటాం. తద్వారా లోపలికి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. చలి కాలంలో హీటర్లు పెట్టి కోళ్లకు వెచ్చదనం ఇచ్చే ఏర్పాటు కూడా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోతే, గ్యాస్ ద్వారా 35 డిగ్రీలకు సెట్ చేస్తాం. చల్లదనం ఎక్కువైనపుడు హీటర్ స్టార్ట్ అవుతుంది. అలా ఉష్ణోగ్రత ఒకేలా ఉండేలా చూస్తాం’’ అని నాగరాజు బీబీసీతో చెప్పారు.

సాధారణంగా ఈసీ కోళ్ల ఫారం షెడ్ పొడవు 360 నుంచి 400 అడుగులు, వెడల్పు 40 నుంచి 46 అడుగులు ఉంటుందని క్లాక్ జీరో అగ్రికల్చర్ ఎండీ నవీన్ తెలిపారు.

ఈసీ టెక్నాలజీ మీద రైతులకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది.

ఈసీ కోళ్ల ఫారాల్లో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అని రెండు రకాలుంటాయి. 25 వేల కోడి పిల్లలకు ఫుల్లీ ఆటోమేటిక్ షెడ్ కావాలని ఆయన తెలిపారు.

ఈసీ కోళ్ల ఫారాలు

ఆటోమేటిక్‌గా తిండి

ఈసీ పౌల్ట్రీ షెడ్‌లో ఫీడ్ వేయడంతోపాటు చాలా పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయని నవీన్ చెబుతున్నారు.

‘‘కోడి పిల్లలు తింటున్న కొద్దీ ఫీడ్ ఆటోమేటిగ్గా వస్తుంటుంది. ఇందుకు ఒకచోట హోపర్‌లో దాణా నింపితే చాలు. నీళ్లు కూడా నిరంతరం వస్తూ ఉంటాయి. వాటర్ మీటర్ ఉంటుంది. దాని ద్వారా నీటి సమాచారం తెలుస్తుంది. ఒక కోడి నీళ్లు తాగడాన్ని బట్టి ఫీడ్ తీసుకుంటుంది. ఈ సిస్టం ద్వారా 35 నుంచి 37 రోజుల మధ్యలో కోళ్లు మనకు అవసరమైన బరువు పెరుగుతాయి’’ అని ఆయన వివరించారు.

ఈసీ కోళ్ల ఫారాలు

ఈసీ టెక్నాలజీ ఉపయోగాలు

ఈసీ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలున్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు, ఈ టెక్నాలజీని అందించే సంస్థలు చెప్పిన సమాచారం ప్రకారం...

  • ఈసీ కోళ్ల ఫారాలలో కోళ్లు బాగా ఎదుగుతాయి.
  • మాములు కోళ్ల ఫారాలతో పోలిస్తే పెద్దగా మనుషులు అవసరం లేదు. మామూలు కోళ్ల ఫారాలకు ఆరుగురు లేదా ఏడుగురు అవసరమైతే, ఈసీ కోళ్ల ఫారాలను ఒకరు లేదా ఇద్దరితో మేనేజ్ చేయొచ్చు.
  • ఒక సాధారణ కోళ్ల ఫారంలో 10 వేల కోళ్లను పెంచుతారు. కానీ ఈసీ కోళ్ల ఫారంలో 25 వేల కోళ్లను పెంచవచ్చు.
  • కోళ్లకు ఎలాంటి వ్యాధులూ రాకుండా ఉండటంతోపాటు ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.
  • సాధారణ కోళ్ల ఫారాలలో 45 నుంచి 50 రోజుల వరకూ కోళ్లు తగినంత బరువు పెరగవు. ఈసీ షెడ్లలో 32 నుంచి 37 రోజుల్లోపే కోళ్లు రెండు కిలోలకు పైన 100, 200 గ్రాములు పెరుగుతాయి.
  • నిర్వహణ వ్యయం తగ్గడం వల్ల సాధారణ కోళ్ల ఫారాలతో పోలిస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి.
  • ‘‘మా షెడ్డుకు 25 వేల కోళ్ల కెపాసిటీ ఉంది. దీన్ని భార్యాభర్త లేదా ఒక్క మనిషి ఉన్నా చూసుకోవచ్చు. ఇందులో పెద్దగా మనం చేయాల్సిన పని ఉండదు’’ అని నాగరాజు అన్నారు.
  • మామూలు షెడ్లలో కోడి పిల్లలు చనిపోవడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అది ఉండదు. దాణా కూడా వృథా కాదు. షెడ్ అంతా సెన్సార్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది.
  • సాధారణ కోళ్ల ఫారాలలో ఏడాదికి 5 బ్యాచులను తీయగలిగితే ఈసీ కోళ్ల ఫారాలలో 7 బ్యాచులను తీయొచ్చు.

సాధారణంగా కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన వస్తుంది. అందువల్ల వాటిని జనావాసాలకు దూరంగా నిర్మిస్తారు.

ఈసీ కోళ్ల ఫారాల నుంచి దుర్గంధం దాదాపు రాదని పూతలపట్టు మండలంలోని తిరుమలయ్యగారి పల్లెకు చెందిన పౌల్ట్రీ రైతు శేషాద్రి నాయుడు చెబుతున్నారు.

ఈసీ కోళ్ల ఫారాలు

ఖర్చు ఎంత?

వీకోటలో ఒక షెడ్ నిర్మించిన నాగరాజు, మరో మూడు నాలుగు ఈసీ కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. 25 వేల కెపాసిటీ ఉన్న వీకోటలోని షెడ్డును నిర్మించడానికి రూ.50 లక్షలు, మెషినరీకి రూ.40 లక్షలు, విద్యుత్‌ సరఫరా కోసం రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.

సొంత భూమి ఉన్న రైతులు ఈసీ కోళ్ల ఫారం పెట్టుకోవడానికి ప్రాజెక్టు వ్యయంలో 70-80 శాతం వరకు బ్యాంకులు రుణంగా ఇస్తాయని శేషాద్రినాయుడు చెప్పారు. ఈ రుణాల మీద వడ్డీ 9 నుంచి 10 శాతం మధ్య ఉంటుంది.

రూ.కోటి నుంచి 1.2 కోట్ల రూపాయలతో షెడ్డును ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

‘‘మొదట పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు రుణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. తొలుత పెట్టుబడి ఎక్కువగా అనిపించినా పెట్టిన డబ్బును రెండు మూడు సంవత్సరాల్లో తిరిగి రాబట్టుకోవచ్చు. అనుభవం సంపాదించే కొద్దీ పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. మొదటి షెడ్డుకు మాకు రూ.1.85 కోట్లు అయింది. రెండో షెడ్డుకు ఇది రూ.1.2 కోట్లకు తగ్గింది. మొదటి షెడ్ వేసిన అనుభవంతో రెండో షెడ్‌లో ఖర్చులు తగ్గాయి’’ అని శేషాద్రినాయుడు వివరించారు.

ఈసీ కోళ్ల ఫారం

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయం ఎంత?

ఈసీ కోళ్ల ఫారాల ద్వారా రైతులకు ఏడాదికి గరిష్ఠంగా రూ.42 లక్షల వరకు ఆదాయం వస్తుందని బారామతి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కుప్పం బ్రాంచ్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఒకసారి షెడ్ నిర్మించిన తరువాత విద్యుత్ తప్ప వేరే ఖర్చులు ఏమీ ఉండవని ఆయన తెలిపారు.

‘‘రైతులు షెడ్ నిర్మించిన తరువాత పెంచడానికి కావాల్సిన కోడి పిల్లలను కంపెనీలే ఇస్తాయి. వాటికి దాణాతోపాటు వ్యాధులకు అయ్యే ఖర్చును కూడా ఆ కంపెనీలే భరిస్తాయి. రోజూ పర్యవేక్షణకు ఒక సూపర్‌వైజర్‌ను కూడా నియమిస్తాం.

కంపెనీలు ఇచ్చే కోడి పిల్లలను జాగ్రత్తగా 35 నుంచి 37 రోజులు పెంచితే చాలు. తగిన బరువుకు చేరుకోగానే పెంచినందుకు రైతులకు కమిషన్ చెల్లించి కోళ్లను మేం తీసుకుంటాం. ఒక బ్యాచ్‌కు 25 వేల కోళ్లు ఉంటాయి. అంటే 50 నుంచి 52 టన్నులు ఉంటాయి. రైతుకు కేజీకి రూ.14 ఇస్తాం. ఆ లెక్కన చూస్తే రైతుకు రూ. 7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు వస్తుంది. రైతుకు ఒక బ్యాచ్‌కు రూ.2 లక్షల పెట్టుబడి పోను, రూ. 6 లక్షల వరకు లాభం ఉంటుంది. అలా సంవత్సరానికి 7 బ్యాచుల లెక్కన రూ.42 లక్షలు ప్రాఫిట్ వస్తుంది’’ అని భరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇతర కోళ్లఫారాల్లో పెరిగే కోళ్ల మాదిరే ఈసీ కోళ్లఫారాల్లోని కోళ్ల మార్కెటింగ్ ఉంటుందని ఆయన చెప్పారు.

దాదాపు రెండేళ్లుగా ఈసీ కోళ్లఫారం నడుపుతున్న శేషాద్రినాయుడిని తన ఆదాయం తీరు గురించి బీబీసీ అడిగింది.

తనకు ఏడాదికి సగటున రూ.35 లక్షల లాభం వస్తున్నట్లు ఆయన చెప్పారు.

‘‘నేను సంవత్సరానికి 7 బ్యాచ్‌లు తీస్తాను. ఒక బ్యాచుకు సుమారు రూ.7.5 లక్షలు వస్తుంది. అయ్యే ఖర్చు రూ.1.5 లక్ష. సగటున రూ.5 లక్షలకు తగ్గకుండా లాభం వస్తుంది. అలా ఏడాదికి సగటున రూ.35 లక్షలు వస్తాయి. పెంచినందుకు ఒక కోడికి రూ.25 కమిషన్ ఇస్తారు. అంటే కేజీకి రూ.11 నుంచి రూ.12 పడుతుంది. కోడికి రూ.28, రూ.29 వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.

కోళ్లఫారం

ఎలాంటి సదుపాయాలు ఉండాలి?

ఈసీ కోళ్ల ఫారం పెట్టాలంటే అనువైన ప్రదేశంతోపాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలని నవీన్ చెబుతున్నారు.

‘‘400X46 అడుగుల షెడ్‌కు 35 హెచ్‌పీ పవర్ కావాలి. అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో వెంటిలేషన్ బాగా ఉంటుంది. కాబట్టి అక్కడ తక్కువ ఫ్యాన్స్ సరిపోతాయి. విద్యుత్ అవసరం కూడా తగ్గుతుంది.

సముద్ర మట్టానికి భూమి ఎంత ఎత్తులో ఉంది, నీటి లభ్యత ఎలా ఉంది, విద్యుత్ సరఫరా ఎలా ఉంటుంది లాంటి వివరాలు తెలుసుకోవాలి.

నిరంతరం కరెంట్ కావాలి కాబట్టి, కరెంటు పోతే తనంతట తానే ఆన్ అయ్యే జనరేటర్ బ్యాకప్ కచ్చితంగా ఉండాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం, టెంపరేచర్ పెరగడం వంటివి జరిగితే హెచ్చరించే అలారం ఉంటుంది’’ అని ఆయన తెలిపారు.

సాధ్యమైనంత తక్కువ దాణా తిని ఎక్కువ బరువు పెరిగేలా కోళ్ల జన్యువుల్లో నిరంతరం మార్పులు చేస్తూ ఉంటారని, అందువల్ల వాటికి తగిన ఉపశమనం లభించాలంటే ఈసీ కోళ్ల ఫారాలు అందుకు సరైనవని నవీన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)