మ్యూచువల్ ఫండ్స్‌: ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలి?

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్‌: ఎక్కువ లాభాలు రావాలంటే ఏం చేయాలి?
    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

పర్సనల్ ఫైనాన్స్ ముఖ్య సూత్రాలలో దీర్ఘకాల ప్రణాళిక ముఖ్యమైనది.

టర్మ్ ఇన్స్యూరెన్స్ నుంచి పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్ దాకా అన్ని ఆర్థిక లక్ష్యాలను దీర్ఘకాల ప్రణాళికతో సాధించవచ్చు అనేది పర్సనల్ ఫైనాన్స్ సూత్రీకరణ.

ఎక్కువ కాలం మదుపు చేయడం ద్వారా వివిధ మదుపు మార్గాల్లో సహజంగా ఉండే నష్టభయాన్ని అధిగమించవచ్చు.

వారెన్ బఫెట్, రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా లాంటి ప్రముఖ మదుపరులు కూడా దీర్ఘకాల ప్రణాళిక ఎంత ముఖ్యమో అనేకసార్లు వివరించారు.

ఈ ఆర్థిక లక్ష్యాల కోసం పీపీఎఫ్ లాంటి మదుపు మార్గాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

మ్యూచువల్ ఫండ్స్ గత దశాబ్ద కాలంలో ఎందరో కొత్త మదుపరులను ఆకర్షించిన మదుపు మార్గం.

మ్యూచువల్ ఫండ్స్‌తో దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను అందుకోవడం కష్టమని ఒక వాదన వినిపిస్తోంది. అదే సమయంలో పదేళ్ల కంటే ఎక్కువ రోజులు మదుపు చేసినవారు నష్టపోయే అవకాశం లేదనే వాదనా ఉంది. స్మాల్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ విషయంలో ఈ వాదప్రతివాదనలు తీవ్రంగా ఉన్నాయి.

ఈ వాదప్రతివాదనలు పక్కనపెడితే, మ్యూచువల్ ఫండ్స్ పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం.

మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ అనుసంధానమైన నష్టభయాన్ని తగ్గించడానికి సృష్టించిన ఒక మదుపు మార్గం.

నేరుగా వివిధ షేర్లు కొనకుండా కొన్ని కంపెనీల షేర్లను కలిపి కొనే వెసులుబాటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లభిస్తుంది. ఒక కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నా ఆ నష్టం ఇంకో కంపెనీ షేర్ల వల్ల తగ్గుతుంది.

ఎలాంటి కంపెనీ షేర్లు కొనాలి అని నిర్ణయించే బాధ్యత ఫండ్ మేనేజర్ మీద ఉంటుంది. నిపుణుడైన ఫండ్ మేనేజర్ మదుపరుల తరఫున ఒక పోర్ట్ ఫోలియో నిర్మించి దాని బాగోగులు చూసుకుంటారు. స్థూలంగా ఇదీ మ్యూచువల్ ఫండ్స్ పనిచేసే విధానం.

మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్

వార్షిక ఆదాయం ఆధారంగా చిన్న కంపెనీలలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, వాటి కంటే కొంత పెద్ద కంపెనీలలో మదుపు చేసే ఫండ్స్ మిడ్ క్యాప్ అని, పెద్ద కంపెనీలలో మదుపు చేసే ఫండ్స్ లార్జ్ క్యాప్ అని వర్గీకరణ ఉంది.

అలానే కంపెనీలు పనిచేసే రంగాల (బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వగైరా) ఆధారంగా కూడా ఒక వర్గీకరణ ఉంది.

ఇవి కాక ఫండ్ మేనేజర్ లేకుండా ఏదో ఒక సూచీ ఆధారంగా మదుపు చేసే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి.

కింద ఇచ్చిన పట్టిక వివిధ సూచీలు గత పదిహేనేళ్లలో ఎంత వృద్ధి చెందాయో తెలుపుతుంది.

మ్యూచువల్ ఫండ్స్ రాబడి

పై పట్టికలో గమనించాల్సిన ముఖ్య విషయాలు:

1. బులియన్ మిగిలిన సూచీలతో పోలిస్తే ఎక్కువగా పెరుగుతూ ఉంది. కానీ బులియన్ మీద అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిస్క్ ఎక్కువ.

2. అన్ని సూచీలలో వార్షిక వృద్ధి కాల పరిమితితో పాటు పెరుగుతూ ఉంది. అంటే ఇండెక్స్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేసిన వారికీ గణనీయమైన లాభం దక్కిందని చెప్పాలి.

3. పదిహేనేళ్ల కాలానికి చూస్తే అన్ని సూచీలు పీపీఎఫ్ లాంటి మదుపు మార్గాల కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

కింద ఇచ్చిన పట్టిక వివిధ రంగాల సూచీలు ఎంత వృద్ధి చెందాయో తెలుపుతుంది.

మ్యూచువల్ ఫండ్స్

పై పట్టిక నుంచి గమనించాల్సిన ముఖ్య విషయాలు:

1. బ్యాంక్ ఇండెక్స్, ఎఫ్.ఎం.సి.జి. ఇండెక్స్ పనితీరు మిగిలిన సూచీల కంటే చాలా మెరుగ్గా ఉంది.

2. దీర్ఘకాలంలో అన్ని సూచీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. అంటే ఈ సూచీల ఆధారంగా మదుపు చేస్తే తగిన వృద్ధిని చూసే అవకాశం ఉండేది.

పైన ఇచ్చిన రెండు పట్టికల నుంచీ గమనించాల్సిన విషయం ఏమంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలం మదుపు చేయడం వల్ల తగిన ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు. కానీ ఈ వాదనకు వ్యతిరేకంగా మరొక వాదన ఉంది.

మనీ కంట్రోల్ వెబ్ సైట్ నుంచి తీసుకున్న ఈ పట్టికలో వివిధ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక వృద్ధి మూడు, ఐదు, పదేళ్లకు ఇచ్చారు.

మ్యూచువల్ ఫండ్స్

పై పట్టికలో చూస్తే అన్ని ప్రధాన స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా మూడేళ్ల కాలపరిమితిలో ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

కానీ ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే వార్షిక వృద్ధి ఒక సాపేక్షమైన సూచీ తప్ప నిర్ధిష్టమైన సంఖ్య కాదు.

అందువల్ల మొదటి మూడు సంవత్సరాలలో కనిపిస్తున్న వృద్ధి అంతా తక్కువ సంఖ్య ఆధారంగా గణించిన శాతం.

కాబట్టి ఈ అధిక వృద్ధి అంతా లెక్కించే విధానం వల్ల కనిపిస్తున్నదే తప్ప ఎక్కువ కాలం కొనసాగే సంఖ్య కాదు.

ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను అధిగమించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే, అవుననే నిర్ణయానికి రావాలి.

పైన చెప్పిన గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను అందుకునే అవకాశం మెరుగ్గా ఉంది.

గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్ లాంటి మదుపు మార్గాల కంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంతో మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)