బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా? - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత ఝాననే
- హోదా, బీబీసీ ప్రతినిధి, లఖ్‌నవూ
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రెజ్లర్ల ధర్నా మొదలై నెల రోజులు దాటింది. మహిళా కుస్తీ యోధులతో వివాదం కారణంగా అందరి దృష్టి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పడింది. ఇంతకూ ఎవరీ బ్రిజ్ భూషణ్ సింగ్?
బ్రిజ్ భూషణ్ సింగ్‌కు 50కి పైగా పాఠశాలలు, కళాశాలలు ఉన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
‘కాపీయింగ్ మాఫియా’ అనే ఆరోపణలు కూడా ఈయనపై ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఈయనపై అనేక కేసులున్నాయి.
పన్నెండేళ్లుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు బ్రిజ్ భూషణ్ సింగ్.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
బ్రిజ్ భూషణ్ విద్యాసామ్రాజ్యం
ఉత్తరప్రదేశ్‌లోని దేవీపాటన్ ప్రాంతంలోని గోండా, బహ్రైచ్, బలరాంపూర్, శ్రావస్తి జిల్లాల్లో బ్రిజ్ భూషణ్ సింగ్‌కు 60కి పైగా డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి.
బ్రిజ్ భూషణ్ సింగ్ సొంతంగా 60 విద్యా సంస్థలు నెలకొల్పారని ఆయనకు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్న బలరాంపూర్ బీజేపీ ఎమ్మెల్యే పల్టు రామ్ తెలిపారు.
“ఈ ప్రాంతం విద్యకు కేంద్రంగా మారడంతో బిహార్, పూర్వాంచల్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు చదువుకోవడానికి వస్తారు. అలా పూర్వాంచల్ ప్రాంతంతో వారికి ఎంతో అనుబంధం ఉంది” అని పల్టు రామ్ చెప్పారు.
‘బ్రిజ్ భూషణ్ సాంకేతిక విద్య, ఒకేషనల్ విద్యా సంస్థలు స్థాపించారు. నర్సింగ్, బీపీఈడీ, బీఎడ్, పాలిటెక్నిక్, లా వంటి అన్ని రకాల కోర్సులు వాటిలో ఉన్నాయి’ అని పల్టు రామ్ చెప్పారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ స్థాపించిన మొదటి కళాశాల నందిని నగర్ మహావిద్యాలయం. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో బ్రిజ్ భూషణ్ సింగ్‌కి చెందిన రెండు డజన్లకి పైగా కళాశాలల వివరాలు ఉన్నాయి.
ఒక్క నందిని నగర్ మహా విద్యాలయంలోనే 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, కొన్ని వందల మంది అక్కడ పని చేస్తున్నారని గోండాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జానకి శరణ్ ద్వివేది తెలిపారు.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
“బ్రిజ్ భూషణ్ సింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్లందరూ పనిచేస్తారు. బూత్ స్థాయిలో ఆయన ఎన్నికల నిర్వహణ చాలా పటిష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కడి నుంచి పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారు” అని ద్వివేది చెప్పారు.
“ఈ కళాశాలలు బినామీ పేర్ల మీద ఉంటాయి. కొన్ని ఆయన కొడుకులు, మేనల్లుళ్లు, కోడళ్ల పేరిట ఉండగా, మరికొన్ని భార్య పేరు మీద ఉంటాయి. ఒక గొడుగులో ఎన్నో చువ్వలు ఉన్నట్టు, వీళ్లంతా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే గొడుగులో అంతర్భాగం. ఈ కళాశాలలన్నింటీనీ స్థాపించింది మాత్రం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగే'' అని ఆయన చెప్పారు.
“గోండాలో నందిని నగర్ మహా విద్యాలయం స్థాపించిన తర్వాత బ్రిజ్ భూషణ్ సింగ్ క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారు. కేవలం దేవీపాటన్ ప్రాంతంలోనే కాకుండా అయోధ్య, బస్తీ ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలను విస్తరించారు'' అని బలరాంపూర్ ఎమ్మెల్యే పల్టు రామ్ తెలిపారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణల గురించి నందిని నగర్ కళాశాల విద్యార్థులను అడిగినప్పుడు, “నేతాజీ జిందాబాద్'' అని నినాదాలు చేశారు.
“ఆయన మా గార్డియన్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేదల పెన్నిధి. మా జీవితాంతం మేం ఆయనతోనే ఉంటాం” అని బలరాంపూర్‌కి చెందిన విద్యార్థి సోనూ తివారి అన్నారు.
బ్రిజ్ భూషణ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్నట్టుగానే భావిస్తారని బిహార్‌కి చెందిన ప్రవేశ్ యాదవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ani
‘ఆయన మా దేవుడు..’
“ఈ కళాశాలలలో ఖర్చు తక్కువ. సౌకర్యాలు బాగుంటాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా కశ్మీర్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, నేపాల్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ లా, వ్యవసాయ శాస్త్రం చదువుకోవడానికి వస్తారు.” అని ప్రవేశ్ యాదవ్ తెలిపారు.
తమ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఎన్నికల సమయంలో బ్రిజ్ భూషణ్ సింగ్ వాడుకుంటారనే వాదనలను సోనూ తివారి కొట్టిపారేశారు.
“తమ తరఫున ఎన్నికల ప్రచారం చేయమని కళాశాల విద్యార్థులను వాళ్లు ఎప్పుడూ పిలవరు. ఆయనతో అనుబంధం ఉందనుకునే వాళ్లు తమంతట తామే ప్రచారానికి వెళ్తారు” అని తివారి చెప్పారు.
“నేతాజీ మా గుండెల్లో ఉంటారు. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం అని తేలితే మాత్రం ఈ మహిళా రెజ్లర్లను క్రీడల నుంచి బహిష్కరించాలి. వారికి వచ్చిన పతకాలను కూడా వెనక్కి తీసుకోవాలి. బ్రిజ్ భూషణ్ కేవలం ఈ ప్రాంతానికే నాయకుడు కాదు. బిహార్ మొత్తానికి ఆయన నాయకుడు” అని బిహార్‌లోని ఆరా జిల్లాకి చెందిన ఓంకార్ సింగ్ అన్నారు.
“నేతాజీ మా దేవుడు. ఆయన నా గుండెల్లో ఉంటారు. ఆయన బిహార్ నుంచి పోటీ చేసినా కూడా గెలుస్తారు.'' అని ఆరా జిల్లాకే చెందిన విశ్వజిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఆయన బ్రిజ్ భూషణ్ కళాశాలలోనే చదువుతున్నారు.
'కాపీయింగ్ మాఫియా ఆరోపణలు'
2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గోండాలో జరిగిన ఒక ప్రచార సభలో పరీక్షల్లో కాపీయింగ్ గురించి మాట్లాడారు.
“గోండాలో మాస్ కాపీయింగ్ వ్యాపారం నడుస్తోంది. ఒక్కో పరీక్షకు ఒక్కో రేటు. రోజుకి 2 వేలు, 3 వేలు, 5 వేలు వసూలు చేస్తున్నారు. మ్యాథ్స్ పరీక్ష అయితే ఒక రేటు, సైన్స్ అయితే మరో రేటు. ఇక్కడ అలాగే జరుగుతుందో లేదో మీరే చెప్పండి'' అంటూ అప్పటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు.
''అవును, అలాగే జరుగుతోంది'' అంటూ ఆ ర్యాలీకి వచ్చిన జనం కూడా సమాధానమిచ్చారు. “ఈ వ్యవస్థను నిర్మూలించాలా, లేదా” అని మోదీ అడిగిన ప్రశ్నకు “అవును నిర్మూలించాలి” అని జవాబిచ్చారు.
“ఈ మోసానికి అడ్డుకట్ట వేయాలా? లేదా?” అని అడిగితే “ వేయాల్సిందే” అన్నారు.
''ఈ కాపీయింగ్ దందా భవిష్యత్తు తరాలను నాశనం చేస్తోంది. ఈ దందాని ఆపాలి. విద్యా రంగంలో జరుగుతున్న ఈ దందా సమాజాన్ని, ముందు తరాలను నాశనం చేస్తోంది.'' అని మోదీ అప్పట్లో అన్నారు.
కాపీయింగ్ విషయంపైనే మోదీ ఐదు నిమిషాలు మాట్లాడారు.

ఫొటో సోర్స్, BRIJBHUSHANSHARAN
గోండాకి చెందిన రవి ప్రకాష్ పాండే ఓ న్యాయవాది. బ్రిజ్ భూషణ్‌కి వ్యతిరేకంగా ఆయన దిల్లీ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఆయన బీజేపీ మాజీ కార్యకర్త కూడా. 2017లో జరిగిన ర్యాలీలో కాపీయింగ్ గురించి మోదీ చేసిన ప్రసంగం ఆయనకు ఇంకా గుర్తుంది.
“ఆ రోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో బ్రిజ్ భూషణ్ సింగ్ కాపీయింగ్ మాఫియా అని చెప్పకనే చెప్పారు” అని రవిప్రకాష్ అన్నారు.
ఈ మాఫియా బ్రిజ్ భూషణ్ కాకుండా ఇంకెవరైనా అయ్యే అవకాశం ఉందా? అని అడిగినప్పుడు, “ఆయనకి 58 కళాశాలలు ఉన్నాయి. అదొక పరిశ్రమ. ఆయన విద్యాసంస్థల్లో చేరండి. సర్టిఫికెట్స్‌తో తిరిగి వెళ్లండి. అలా ఉంటుంది పరిస్థితి'' అని ఆయన చెప్పారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్ష గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
మిమ్మల్ని కాపీయింగ్ మాఫియా అని అంటున్నారని ప్రశ్నించినప్పుడు.. “ఈ రోజు రాష్ట్రంలో కాపీయింగ్ మాఫియా అనే ఒక వాతావరణం ఉంది. ఎవరి దగ్గరైనా ఎక్కువ కాలేజీలు ఉంటే వాళ్లను కాపీయింగ్ మాఫియా అంటారు. అయితే, కాపీయింగ్ జరుగుతున్నది నిజమే.'' అని 2022లో ఒక ఇంటర్వ్యూలో బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
“కాపీయింగ్ మాఫియా మేం కాదు. ములాయం సింగ్ ఓ కాపీయింగ్ మాఫియా. కాపీయింగ్ వల్లే మా విద్యా సంస్థలు నడుస్తున్నట్టైతే ఇప్పటికీ మా విద్యా సంస్థల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఎందుకు చదువుతున్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే, ప్రైవేటు రంగంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు మా దగ్గర మాత్రమే ఉన్నారు కాబట్టి. మాకు 50 స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి.” అని బ్రిజ్ భూషణ్ సింగ్ చెప్పారు.
కాపీయింగ్ మాఫియా గురించి నందిని కళాశాల విద్యార్థి ప్రవేశ్ యాదవ్‌ని ప్రశ్నించాం. “అలాంటిదేమీ లేదు. గోండా లాంటి ప్రాంతంలో బ్రిజ్ భూషణ్ సింగ్ వాళ్లు విద్యను అందిస్తున్నారు. అందుకే వాళ్లకి చాలా కాలేజీలు ఉన్నాయి. అయితే, వాళ్లను కాపీయింగ్ మాఫియా అని ఎందుకు అనుకుంటున్నారో అంతుపట్టడం లేదు.” అని ప్రవేశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
గోండాలో బీజేపీ వర్సెస్ బ్రిజ్ భూషణ్‌గా మారిందా?
గోండాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో బ్రిజ్ భూషణ్ సింగ్‌కి మంచి ఇమేజ్ ఉందని, ఆయనకు బీజేపీపై ఆధారపడాల్సిన అవసరం లేదన్న మాటలు గోండా పరిసర ప్రాంతాల్లో వినిపించాయి.
ఆ ప్రాంతంలో వాళ్ల ప్రాబల్యాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు యూపీ స్థానిక సంస్థల ఎన్నికల రోజు బీబీసీ బృందం గోండాలోనే ఉంది.
బ్రిజ్ భూషణ్ స్వస్థలమైన నవాబ్‌గంజ్ పురపాలక సంఘ అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సత్యేంద్ర కుమార్ సింగ్ ఫ్లెక్సీల్లో బ్రిజ్ భూషణ్ సింగ్ బొమ్మలు కనిపించాయి.
అవి చూస్తే బీజేపీకి అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి సత్యేంద్ర కుమార్ సింగ్‌కి బ్రిజ్ భూషణ్ బాహాటంగానే మద్దతు ఇచ్చినట్లు అర్థమవుతోంది.
అయితే, సత్యేంద్ర కుమార్ సింగ్ మాత్రం మరోలా చెప్పారు.
“బ్రిజ్ భూషణ్ సింగ్ ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నారు. మేమంతా ఆయన పిల్లల్లాంటి వాళ్లం. ఇది ఆయన ఇలాఖా. వాళ్లు ఈ ప్రాంతానికి గార్డియన్స్. అందుకే ఫ్లెక్సీలపై ఫొటోలు వేశాం. అంతేకానీ బీజేపీ ఎంపీగా కాదు. ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే 110 శాతం బ్రిజ్ భూషణ్ సింగ్ కారణం. ఆయన నాకు దేవుడు” అని సత్యేంద్ర సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
యూపీ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థి జనార్ధన్ సింగ్ తన గెలుపు గురించి భయపడ్డారు. “గోండా రాజకీయాలు కాస్త వేరే. నేను ఎక్కువగా ఏమీ చెప్పలేను. కానీ, ఇక్కడ కొంచెం భయానక వాతావరణమైతే ఉంది” అని ఆయన అన్నారు.
బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా సత్యేంద్ర కుమార్ సింగ్‌కి మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడాలని సీనియర్ జర్నలిస్ట్ ద్వివేదిని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు.
“సత్యేంద్ర కుమార్ సింగ్ బ్రిజ్ భూషణ్ సింగ్ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే, ఇప్పుడు వాళ్లు దిల్లీలో మహిళా రెజ్లర్ల నిరసనలతో ఒత్తిడిలో ఉన్నారు. అందువల్లే కొత్త పార్టీ పెట్టేందుకు సరైన సమయం కాదని భావించి ఉండొచ్చు.
పురపాలక సంఘాల ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా బ్రిజ్ భూషణ్ తన అభ్యర్థులను నిలబెడతాడు. దాని ద్వారా ఇక్కడ తాను అనుకున్నదే జరుగుతుందని సంకేతాలు పంపినట్టే. ఒకవేళ తాను అనుకున్నట్లు జరగకపోతే, తమ దారి తాము చూసుకోగలమని పరోక్షంగా చెప్పినట్టే.” అని ద్వివేది చెప్పారు.
అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సత్యేంద్ర కుమార్ సింగ్ 5,100 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి జనార్ధన్ సింగ్‌కి కేవలం 150 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
బ్రిజ్ భూషణ్ బంధువులపై భూ ఆక్రమణల ఆరోపణలు
నాజుల్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రెండు నెలల క్రితం బ్రిజ్ భూషణ్ సింగ్ మేనల్లుడు, మరికొందరిపై ఫిర్యాదు చేసినట్టు స్థానిక న్యాయవాది రవి ప్రకాష్ పాండే చెబుతున్నారు.
తాను ఫిర్యాదు చేసిన తరువాతే ప్రభుత్వం బుల్డోజర్లకు పని చెప్పిందని ఆయన అంటున్నారు.
గత ఫిబ్రవరిలో బ్రిజ్ భూషణ్ మేనల్లుడు సుమిత్ సింగ్, మరో 8 మందిపై గోండా పోలీసులు కేసు నమోదు చేశారు. గోండాలోని సివిల్ లైన్స్‌లో మూడెకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణతో పాటు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆక్రమిత భూమిలో కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేశారు.
గోండాలో భూ మాఫియాకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం వల్లే చర్యలు తీసుకున్నారని న్యాయవాది రవి ప్రకాష్ తెలిపారు.
ఈ ఆక్రమణ విషయం ఎప్పుడైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లిందో, అప్పుడు కేసులు నమోదయ్యాయని, బుల్డోజర్లు కదిలాయని, 50 కోట్ల రూపాయల విలువైన భూమి అక్రమార్కుల కబ్జా నుంచి బయటపడిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
హత్యాయత్నం ఆరోపణలు
బ్రిజ్ భూషణ్‌పై 2023 జనవరిలో మొదటిసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వీడియో ఒకటి వైరలైంది.
“నా జీవితంలో ఒకటే హత్య చేశాను. జనాలు ఏం మాట్లాడుకున్నా ఫర్వాలేదు. కానీ నేను చేసింది మాత్రం ఒక్క హత్యే. రవీందర్‌ని ఎవడైతే కాల్చి చంపాడో, వాడి వీపుపై తుపాకీ పెట్టాను. చంపాడు, చచ్చాడు'' అని బ్రిజ్ భూషణ్ మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.
సూరజ్ సింగ్ సమాజవాది పార్టీ నేత. ఆయన బాబాయి పండిత్ సింగ్ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో మంత్రి. ఏ రవీందర్ గురించైతే తాను హత్య చేశానని వీడియోలో బ్రిజ్ భూషణ్ సింగ్ చెప్పారో, ఆయన కొడుకే సూరజ్ సింగ్. రవీందర్ సింగ్ తన స్నేహితుడని బ్రిజ్ భూషణ్ చెబుతుంటారు.
ఈ ఘటన జరిగిన మూడు దశాబ్దాల తరువాత బ్రిజ్ భూషణ్ సింగ్ “తమకి అతిపెద్ద రాజకీయ శత్రువు” అని రవీందర్ సింగ్ కొడుకు, సమాజ్‌వాదీ పార్టీ నేత సూరజ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, SHUBHAM VERMA
టాడా కింద కేసు...
1993లో తన బాబాయి, మాజీ మంత్రి పండిత్ సింగ్‌పై హత్యాయత్నం కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిందితుడని సూరజ్ చెప్పారు. తన తండ్రి హత్య జరిగిన పదేళ్ల తర్వాత ఈ ఘటన జరిగింది.
''శరీరంలో 21 బుల్లెట్లు ఉన్నాయి. అప్పుడు ములాయం సింగ్ ముఖ్యమంత్రి. బుల్లెట్లు దిగిన 20 నిమిషాల్లోనే మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ హెలికాప్టర్ పంపించారు.'' అని సూరజ్ సింగ్ తెలిపారు.
అప్పుడు పండిత్ సింగ్ బతికిపోయారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. పండిత్ సింగ్‌పై హత్యాయత్నం కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పోయిన సంవత్సరం డిసెంబర్‌లో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సూరజ్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై టాడా కేసు గురించి దిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వివేక్ వర్ష్ణే గుర్తు చేశారు. దావూద్ ఇబ్రాహీం అనుచరులు నలుగురికి ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై 1997లో టాడా కేసు నమోదైందని చెప్పారు.
అప్పుడు బ్రిజ్ భూషణ్ ఆర్నెళ్ల పాటు తీహార్ జైలులో ఉన్నారని, ఆయనపై టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కింద కేసు నమోదైందని వివేక్ చెప్పారు.
దావూద్ ఇబ్రహీం అనుచరులు నలుగురికి ఆశ్రయం ఇచ్చారనేది బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఆరోపణ.
సుబాష్ సింగ్ ఠాకూర్, జయేంద్ర (భాయ్) ఠాకూర్, పరేష్ మోహన్ దేశాయ్, గరికపాటి శ్యామ్ కిశోర్‌లకు దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆశ్రయం కల్పించారనేది ఆరోపణ. ఈ నలుగురు ముంబయిలోని జేజే ఆస్పత్రి కాల్పుల కేసులో నిందితులు.
ఆ సమయంలో వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బ్రిజ్ భూషణ్ సింగ్ కూడా బీజేపీ ఎంపీగా ఉన్నారు.
“బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నమోదైన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అదనపు సెషన్స్ న్యాయమూర్తి శివ్ నారాయణ్ ధింగ్రా ఆ కేసును కొట్టేశారు” అని వివేక్ వివరించారు.
“ ఈ కేసులో విచారణ సరిగ్గా చేయలేదని, సరైన ఆధారాలు సేకరించలేదని సీబీఐని న్యాయమూర్తి మందలించారు. అందువల్ల బ్రిజ్ భూషణ్ ఈ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు'' అని వివేక్ వివరించారు.
బ్రిజ్ భూషణ్ 2019 లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయనపై నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హత్యాయత్నం కేసు, దోపిడీ, ప్రభుత్వ అధికారిపై దాడి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేసులున్నాయి.
“1998 లోక్‌సభ ఎన్నికల సమయంలో బ్రిజ్ భూషణ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భార్య కేత్కీ సింగ్‌ని బీజేపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు.'' అని జర్నలిస్ట్ ద్వివేది చెప్పారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ చరిత్ర తెలుసుకుంటూ మేము గోండాలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాం. ఆయన సొంతూరు పక్కనే ఈ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్‌లో వేలాడదీసిన హిస్టరీ షీటర్స్ జాబితాలో బ్రిజ్ భూషణ్ పేరు రాసి ఉంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బ్రిజ్ భూషణ్ సింగ్‌పై 1987లో హిస్టరీ షీట్ తెరిచారు. 38 కేసుల్లో ఆయనకు సంబంధమున్నట్లు అందులో ఉంది.
2019 లోక్‌సభ ఎన్నికల వేళ బ్రిజ్ భూషణ్ సింగ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో నాలుగు కేసుల గురించి మాత్రమే ప్రస్తావించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు, మాజీ మంత్రి పండిత్ సింగ్‌పై హత్యాయత్నం కేసుల్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. అయితే, ఈ తీర్పును ఇప్పుడు కోర్టులో సవాల్ చేశారు.
యోగి, బీజేపీతో సంబంధాలెలా ఉన్నాయి?
''బ్రిజ్ భూషణ్ సింగ్ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు. లఖ్‌నవూలో ఉన్నప్పటికీ ఆయన్ను కలవడం కుదరకపోవడంతో తిరిగి వచ్చేశారని విన్నాను'' అని జర్నలిస్ట్ ద్వివేది చెప్పారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌కి సన్నిహితుడు, బలరాంపూర్ ఎమ్మెల్యే పల్టు రామ్ 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మొదటిసారి మంత్రి అయ్యారు. యోగి ఆదిత్యనాథ్, బ్రిజ్ భూషణ్ సింగ్ వల్లే మంత్రి అయ్యానని పల్టు రామ్ కృతజ్ఞతలు తెలిపారు.
బ్రిజ్ భూషణ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ చాలా కాలం లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయని పల్టు రామ్ తెలిపారు.
“యోగి ఆదిత్యనాథ్, బ్రిజ్ భూషణ్ సింగ్ మధ్య చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ చాలా కాలం ఎంపీలుగా ఉన్నారు. వాళ్లిద్దరినీ నేను చాలా సార్లు కలిశా. వారి ఆశీర్వాదాలు తీసుకున్నా. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది” అని ఎమ్మెల్యే చెప్పారు.
అయితే, సీనియర్ జర్నలిస్ట్ ద్వివేది భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రితో సంబంధాలు అంత బాగున్నట్లు కనిపించడం లేదు. అందరూ అలాగే చర్చించుకుంటున్నారు.'' అని ద్వివేది అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితులలో బ్రిజ్ భూషణ్‌పై బీజేపీ అంత సానుకూలంగా లేదని కొందరు అంటుంటే, ఇంత గొడవ జరుగుతున్నా బ్రిజ్ భూషణ్‌పై కనీసం చర్యలు తీసుకోకపోవడం పార్టీ ఆయనతోనే ఉందనడానికి నిదర్శనమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
“ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అవధ్ రీజియన్‌లోని పార్లమెంట్ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన సమావేశంలో బ్రిజ్ భూషణ్ కూడా పాల్గొన్నారు. తన అభిప్రాయం చెప్పమన్నప్పుడు తాను వ్యక్తిగతంగా కలిసి చెబుతానన్నారని, అయితే ప్రత్యేకంగా కలిసేందుకు బ్రిజ్ భూషణ్‌కి సమయం ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు.'' అని ద్వివేది చెప్పారు.
అయితే ఆ విషయం అంతటితో ముగిసిపోలేదు. ముఖ్యమంత్రి పాల్గొన్న ఒక సమావేశంలో ఆయన ఒక మాట చెప్పారు. ''నేను అందరితో కలిసిపోయే మనిషిని. వాడుకుని వదిలేయడానికి నేనేం తివాచీని కాను'' అన్నారు.
“తనకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే పార్టీతో ఉండాల్సిన అవసరం తనకి లేదని ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే బహిరంగ సభలో బ్రిజ్ భూషణ్ బహిరంగంగానే చెప్పారు.” అని ద్వివేది తెలిపారు.

ఫొటో సోర్స్, @BRIJBHUSHANSHARAN
గోండా-బలరాంపూర్‌లో నమ్మకమైన సైన్యం
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక దోపిడీ ఆరోపణలు వచ్చినప్పటికీ అటు బీజేపీ జాతీయ నేతలు కానీ, ఇటు రాష్ట్ర నేతలు కానీ ఎవరూ ఆయనకు మద్దతుగా నిలవలేదు. అయితే, ఆయన అనుచరులు మాత్రం బహిరంగంగానే మద్దతుగా మాట్లాడుతున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు పల్టు రామ్, అజయ్ సింగ్ వంటి వారు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
రిజర్వ్ నియోజకవర్గం బలరాంపూర్ నుంచి పల్టురామ్ బీజేపీ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. గోండా జిల్లాలోని కల్నల్‌గంజ్ నుంచి అజయ్ సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రెజ్లర్ల ఆందోళనలు కాంగ్రెస్ కుట్రలో భాగమని పల్టురామ్ చెబుతున్నారు. ''గౌరవనీయులైన బ్రిజ్ భూషణ్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు.” అని పల్టు రామ్ అన్నారు.
‘బ్రిజ్ భూషణ్ మాకు తండ్రి లాంటి వారు. ఆయన మాకు మొదటి నుంచీ తెలుసు. మహిళా రెజ్లర్ల ఆరోపణలు నిరాధారం. బ్రిజ్ భూషణ్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పన్నిన కుట్ర ఇది. పూర్వాంచల్ ప్రాంతంలో మా నాయకుడికి ఉన్నంత స్థాయి, గౌరవం ఉన్న నాయకులు ఇంకొకరు లేరు”, అని ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు.
విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి తాను బ్రిజ్ భూషణ్ సింగ్ పేరు వింటున్నానని, ఆయన మద్దతుతోనే రాజకీయంగా ఎదిగామని, 2021లో మంత్రిని కూడా అయ్యానని పల్టు రామ్ అన్నారు.
రాజకీయాల్లో తనలా నిర్లక్ష్యానికి గురైన వారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారందరినీ కలుపుకొని పార్టీతో పాటు తమను కూడా వెలుగులోకి తీసుకొచ్చారని పల్టురామ్ చెప్పారు.
“ఆయన గతంలో బలరాంపూర్ ఎంపీగా పనిచేశారు. ఇప్పటికీ నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలకి వస్తూ పోతూ ఉంటారు. ఎక్కడైనా ఆయన జీవితకాలం ఉండేలా సంబంధాలు ఏర్పరుచుకుంటారు” అని ఎమ్మెల్యే అన్నారు.

ఫొటో సోర్స్, @BRIJBHUSHANSHARAN
క్రాస్ ఓటింగ్ ఆరోపణలు
అణు ఒప్పందానికి సంబంధించి 2008లో పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో సమాజ్‌వాదీ పార్టీ అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో కొంతమంది బీజేపీ సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.
“అప్పటి నుంచే బ్రిజ్ భూషణ్ సింగ్‌కి నాటి యూపీఏ ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించిందని చెబుతారు. ఇప్పటికీ అదే కేటగిరీ కొనసాగుతోంది'' అని ద్వివేది తెలిపారు.
తాను క్రాస్ ఓటింగ్ చేశానని ఒక వీడియో ఇంటర్వ్యూలో బ్రిజ్ భూషణ్ సింగ్ ఒప్పుకున్నారు. అయితే, పార్టీలో విభేదాలే అందుకు కారణమని చెప్పుకొచ్చారు.
2017 గోవా ఎన్నికల్లో మనోహర్ పారికర్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, ఆ వ్యవహారాలు చూసుకునే బాధ్యతలను బీజేపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కి అప్పగించింది.
ఒక ప్రైవేటు విమానం ఇచ్చి, గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్, ఆయన సన్నిహితులైన మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే బాధ్యతను బ్రిజ్ భూషణ్‌కి అప్పగించారు. బ్రిజ్ భూషణ్ ఆ పనిలో విజయం సాధించటంతో పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు.
విజయ్ సర్దేశాయ్ ప్రోగ్రెసివ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ గోవా అధ్యక్షుడు కూడా. రెజ్లింగ్ నేపథ్యం ఉండడంతో బ్రిజ్ భూషణ్‌కి విజయ్ సర్దేశాయ్‌తో స్నేహ సంబంధాలున్నాయి.
ఒక్క గోవా మాత్రమే కాదు. బ్రిజ్ భూషణ్‌కి మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఏప్రిల్‌లో శిందే, ఫడ్నవీస్ అయోధ్య వచ్చినప్పుడు వాళ్లతో సన్నిహితంగా తిరుగుతూ కనిపించారు.
తనపై వచ్చిన ఆరోపణల గురించి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివరణ తెలుసుకునేందుకు బీబీసీ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే, ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














