మహిళా రెజ్లర్ల‌కు లైంగిక వేధింపులు: తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు

వినేశ్ ఫోగట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫోగట్
    • రచయిత, జాహ్నవి మూలె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియా, ఇతరులు దిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన రెండో విడత నిరసన నెల రోజులు పూర్తిచేసుకొంది.

తొలుత జనవరిలో ఆందోళనకు దిగిన వీరు మూడు నెలల తర్వాత తిరిగి ఏప్రిల్ 23న నిరసన చేపట్టారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజ్లర్లు 2023 జనవరిలో బ్రిజ్ భూషణ్‌ మీద ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 28న ఆయన మీద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది.

రెజ్లర్ల నిరసన

ఫొటో సోర్స్, ANI

1. అసలేం జరిగింది? ఎప్పుడు మొదలైంది?

బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహిళా రెజ్లర్లను ‘‘లైంగిక వేధిస్తున్నారంటూ’’ వినేశ్ ఫొగట్ ఈ ఏడాది జనవరి 18న దిల్లీలో నిరసనకు దిగారు. ఎముకలు కొరికే చలిలో జంతర్ మంతర్ వద్ద కూర్చుని ఆమె నిరసన తెలిపారు.

సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియా, ఇతర క్రీడాకారులు వినేశ్ ఫొగట్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.

‘‘బ్రిజ్ భూషణ్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ’’ కనీసం పది మంది మహిళా రెజ్లర్లు తనతో చెప్పారని వినేశ్ ఫొగట్ చెబుతున్నారు. 2012 నుంచి 2022 వరకూ పదేళ్లలో చాలు సార్లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్నారు.

భద్రతా కారణాల రీత్యా లైంగిక దోపిడీకి గురైన యువతుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితుల్లో ఒక మైనర్ బాలిక కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆటను కూడా తప్పుదోవ పట్టిస్తోందని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.

''భారత మహిళా రెజ్లర్లకు చాలా కాలంగా ఫిజియోథెరపిస్ట్ లేరు. అలాంటి పరిస్థితుల్లో, నలుగురు మహిళా రెజ్లర్లకి మహిళా ఫిజియోథెరపిస్ట్ ముఖ్యమా? లేక అధ్యక్షుడి గేమ్స్ విలేజ్‌కి వెళ్లడం ముఖ్యమా?'' అని వినేశ్ ఫొగట్ జనవరిలో నిరసన సందర్భంగా వ్యాఖ్యానించారు.

తమను కూడా మానసికంగా వేధించారని, నిరసన తెలిపినందుకు చంపేస్తామని బెదిరించారని బజ్‌రంగ్, వినేశ్ ఆరోపించారు.

అయితే, మహిళా రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేస్తున్నారు. బీబీసీతో ఆయన మాట్లాడారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఫొటో సోర్స్, Brij Bhushan Sharan Singh/Facebook

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

2. రెజ్లర్ల డిమాండ్లు ఏంటి?

  • బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి
  • ఆయన్ను అధికారిక పదవుల నుంచి తొలగించాలి
  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలి.

3. విచారణ కమిటీ ఏర్పాటు

రెజ్లర్ల ఆరోపణల మీద అంతర్జాతీయ స్థాయిలో కథనాలు రావడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్‌ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జనవరి 23న ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది.

కమిటీ సభ్యులు:

చైర్‌పర్స్: మేరీకోమ్ (బాక్సర్)

యోగేశ్వర్ దత్(రెజ్లర్)

బబిత ఫోగట్(రెజ్లర్)

తృప్తి ముర్గుండే(బ్యాడ్మింటన్)

రాధికా శ్రీమన్ (వెటరన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్)

రాజేష్ రాజగోపాలన్‌ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ మాజీ సీఈవో)

4.విచారణలో ఏం తేలింది?

బ్రిజ్ భూషణ్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ గడువును తర్వాత పొడిగించారు.

విచారణ పూర్తి చేసిన కమిటీ ఏప్రిల్ మొదటి వారంలో తన నివేదికను అందజేసింది.

అయితే విచారణ కమిటీ అందజేసిన నివేదికలోని విషయాలు నేటికీ బయటికి రాలేదు.

మహిళా రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

5.ఎఫ్‌ఐఆర్ నమోదు

ఆ తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ 21న రెజ్లర్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. తాము స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రెజ్లర్లు చెబుతున్నారు.

దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద మళ్లీ నిరసనకు దిగారు.

రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మైనర్ బాలికకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సుప్రీం ఆదేశాలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

తమ లక్ష్యం న్యాయమని, కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదంటున్నారు రెజ్లర్లు. తమకు న్యాయం జరిగే వరకూ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు.

ప్రధాని మోదీతో పీటీ ఉష

ఫొటో సోర్స్, P T Usha/Facebook

6.ఒలింపిక్ అసోసియేషన్ ఏమంటోంది?

క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ నియామించడానికి కొద్దిరోజుల ముందు, ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఏడుగురు సభ్యులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అయితే, ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్యానెల్ విచారణకు క్రీడాకారులెవరూ హాజరుకాలేదు. క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలోనూ ఐఓఏ కమిటీలో ఉన్న వారిలో కొందరు ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

రెజ్లర్లు మళ్లీ నిరసనకు దిగడంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల నిర్వహణకు అడ్‌హక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏకు లేఖ రాసింది.

దీంతో ఏప్రిల్ 27న ఐఓఏ అడ్‌హక్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ భూపేందర్ సింగ్ బజ్వా, షూటింగ్ కోచ్ సుమ శిరుర్ సభ్యులుగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా, క్రీడాకారుల చర్యలను ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష తప్పుబట్టారు. క్రీడాకారులు క్రమశిక్షణ పాటించాలని ఆమె అన్నారు.

''వాళ్లు మా వద్దకు రాకుండా నేరుగా వీధుల్లో నిరసనలకు దిగారు. అలాంటి ప్రవర్తన ఆటలకు మంచిది కాదు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీ ఉంది. అథ్లెట్స్ కమిషన్ కూడా ఉంది. వీధికెక్కకముందు తమ వద్దకు రావాల్సింది. కానీ, వాళ్లు ఐఓఏను సంప్రదించలేదు'' ఆమె అని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

7. ఎవరెవరు స్పందించారు?

దేశంలోని పలువురు ప్రముఖ క్రీడాకారులు లైంగిక వేధింపుల వివాదంపై స్పందిస్తున్నారు. రెజ్లర్లకు మద్దతుగా సోషల్ మీడియాలో తమ గళం వినిపిస్తున్నారు.

ఒలింపిక్‌ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా, మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వంటి వారు వారిలో ఉన్నారు.

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు తెలిపారు. ‘‘లైంగిక వేధింపుల ఆరోపణల మీద విచారణ చేపట్టి, న్యాయం చేయాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న రెజ్లర్లు, మరీముఖ్యంగా హరియాణాకు చెందిన సత్యవ్రత్, అన్షు మలిక్, మహవీర్ ఫొగట్ తదితరులు మహిళా రెజ్లర్ల నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు.

అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ శరణ్ సింగ్ సొంత రాష్ట్రం యూపీ రెజ్లర్లు మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)