గాఫ్ ఐలాండ్: ఈ అందమైన ద్వీపంలో పని చేయడానికి మనిషి కావాలంట.. జీతం 22 లక్షలు

గాఫ్ ద్వీపం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆంటోనెట్ రాడ్‌ఫోర్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపంలో 13 నెలల పాటు పనిచేసే మనిషి కోసం బ్రిటిష్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ వెతుకుతోంది.

దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలోని బ్రిటిష్ భూభాగమైన గాఫ్ ఐలాండ్‌ ద్వీపంలో శాశ్వత జనాభా ఉండదు.

ఆఫ్రికా భూభాగానికి ఈ ఐలాండ్ దాదాపు 2,400 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ విమానాశ్రయం లేదు. గాఫ్ ద్వీపానికి వెళ్లాలంటే దక్షిణాఫ్రికా నుంచి ఏడు రోజుల పడవ ప్రయాణం చేయాలి.

ప్రస్తుతం గాఫ్‌లో పనిచేస్తున్న రెబెక్కా గుడ్‌విల్, లూసీ డార్మన్ ఈ మార్గం ద్వారానే అక్కడికి వెళ్లారు.

అక్కడ ఫుల్ టైమ్ పనిచేసే ఏడుగురు ఉద్యోగుల్లో వీరు కూడా భాగమే. గాఫ్‌ ద్వీపాన్ని తమ ఇల్లుగా వారు చెప్పుకుంటారు. ఆ ద్వీపంలో 80 లక్షల పక్షులు ఉన్నాయి.

గ్యాఫ్ ఐలాండ్

ఫొటో సోర్స్, ANTJE STEINFURTH

రాయల్ సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్(ఆర్ఎస్‌పీబీ) కోసం రెబెక్కా, లూసీ పనిచేస్తారు.

గాఫ్‌ ద్వీపానికి వెళ్లడానికి ముందు అంటార్కిటికాలో లూసీ, స్కాట్లాండ్‌లోని ఆర్‌ఎస్‌పీబీలో రెబెక్కా పనిచేశారు.

సెప్టెంబర్ చివరకు అక్కడ రెబెక్కా పని ముగుస్తుంది.

అందుకే మరో కొత్త ఫీల్డ్ ఆఫీసర్ కోసం ఆర్‌ఎస్‌పీబీ వెదుకుతోంది.

ఏడాదికి రూ. 20 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య (25,000-27,000 డాలర్లు) జీతం ఇస్తామని చెబుతోంది.

ఏడాదికి 26 రోజుల సెలవులు ఉంటాయి. నిబంధనలకు లోబడి పింఛను, జీవిత బీమా కూడా ఉంటాయి.

ఈ ఉద్యోగంలో భాగంగా తరచూ చాలా రోజుల పాటు సముద్రపు పక్షి జాతులను ట్రాకింగ్ చేయాల్సి ఉంటుంది. సవాలుగా నిలిచే మారుమూల సబ్ అంటార్కిటిక్ వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి బాగా అలవాటు పడాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో సైన్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన అనుభవం ఉండాలి. వాటితోపాటు వన్యప్రాణి సంరక్షణ, పర్యవేక్షణలో క్షేత్రస్థాయి అనుభం ఉండాలి.

కఠినమైన వాతావరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఏడాది పాటు తాజా ఆహారం తినే భాగ్యం ఉండబోదని అభ్యర్థులను రెబెక్కా, లూసీ హెచ్చరిస్తున్నారు.

‘‘బ్రిటిషర్లమైన నేను, రెబెక్కా వానలకు అలవాటు పడిపోతాం అని అనుకున్నాం. కానీ, ఇక్కడ తీవ్రస్థాయిలో వానలు పడతాయి. మేం రోరింగ్ ఫార్టీస్ అని పిలిచే బలమైన శీతల గాలుల ప్రభావానికి అంచుల్లో ఉన్నాం. ఇక్కడ విపరీతమైన వాతావరణం ఉంటుంది’’ అని లూసీ చెప్పారు.

రోరింగ్ ఫార్టీస్ అనేవి భూమధ్యరేఖకు 40, 50 ఉత్తర అక్షాంశాల మధ్య వీచే బలమైన శీతల గాలులు.

గాఫ్ ఐలాండ్

ఫొటో సోర్స్, LUCY DORMAN

మీకు అత్యంత దగ్గరగా ఉండే దేశమే వేల మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మీరేం తింటారు, కాబట్టి ప్యాకింగ్ భోజనం, ఫ్రోజెన్ భోజనం తినడానికి సిద్ధమై ఇక్కడికి రండి అని రెబెక్కా, లూసీ చెప్పారు.

‘‘మేం ఇక్కడికి వచ్చే ముందు కూడా వారు మమ్మల్ని ఆహారం గురించే హెచ్చరించారు. ఆహారం దొరక్కపోవడం, తాజా ఆహారం లేకపోవడం ఇక్కడ సాధారణ విషయాలు’’ అని లూసీ తెలిపారు.

‘‘నేను బాగా మిస్ అవుతున్నది ఏంటంటే కరకరలాడే క్యారెట్‌, తాజా ఆపిల్‌ తినలేకపోవడం. ఇక్కడ అంత తాజా ఆహారం దొరకదు. అంతే తప్ప మరొకటి లేదు’’ అని లూసీ అన్నారు.

తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటే వాటి విత్తనాల వల్ల అవి మళ్లీ మొలకెత్తి మొక్కలుగా ఈ ద్వీపం అంతా విస్తరించే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిల్వ ఆహారమే దొరుకుతుంది.

‘‘ఒక ఫ్రీజర్‌లో ఫ్రోజెన్ కూరగాయలు, మరొక దాంట్లో ఫ్రోజెన్ మాంసం ఉంటుంది. డబ్బాల్లో నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు తినాల్సి ఉంటుంది’’ అని రెబెక్కా చెప్పారు.

‘‘రెండు వారాల టేకోవర్ సమయంలో సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని మాకు ఇస్తారు. దాంతోనే ఏడాదంతా బతకాల్సి ఉంటుంది’’ అన్నారు.

టేకోవర్ సమయం ఏడాదిలో ఒకసారి సెప్టెంబర్ నెలలో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో గాఫ్‌లోని కొందరు ఉద్యోగులు తిరిగి వెళ్లిపోతారు. కొత్త ఉద్యోగులు చేరతారు.

గాఫ్ ఐలాండ్

ఫొటో సోర్స్, REBEKAH GOODWILL

సామాజికంగా ఒంటరి అవుతారా?

‘‘స్కాట్లాండ్‌లో పనిచేసినప్పటి కంటే ఇక్కడే నేను ఎక్కువగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నట్లుగా భావిస్తున్నా’’ అని రెబెక్కా చెప్పారు. బేస్‌లోని ఇంటర్నెట్ వల్ల అందరికీ అందుబాటులో ఉంటున్నామన్నారు. సవాలుగా నిలిచే సమయాల్లో ఇక్కడి సహోద్యోగులు అండగా ఉంటారని తెలిపారు.

‘‘ఇది చాలా మంచి కమ్యూనిటీ. మేమంతా మా కథలను ఒకరితో ఒకరం చెప్పుకుంటాం. ఒకరి నుంచి ఒకరం చాలా విషయాలు నేర్చుకుంటాం. కఠిన సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు’’ అని రెబెక్కా చెప్పారు.

ఆర్‌ఎస్‌పీబీ ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ సైన్స్ టీమ్‌లో భాగంగా అంతరించే ప్రమాదంలో ఉన్న అట్లాంటిక్ పసుపు రంగు ముక్కు ఉండే ఆల్బట్రాస్, అట్లాంటిక్ పెట్రెల్, మ్యాక్‌గిల్లీవ్రీ ప్రియాన్ లాంటి పక్షుల కదలికలను లూసీ, రెబెక్కా ట్రాక్ చేస్తారు.

పగటి సమయంలో వారు వాటర్‌ప్రూఫ్ జాకెట్లు, ట్రౌజర్లు, వెల్లింగ్టన్ బూట్లు ధరించి పక్షుల జాడ వెదుక్కుంటూ ఫీల్డ్‌లో తిరుగుతారు.

ద్వీపంలోని కోడిపిల్లల డేటాను వారు సేకరిస్తున్నారు.

‘‘ఇక్కడి ఎలుకలు సముద్రపు పక్షి జాతులను తినడం మొదలుపెట్టాయి. వాటిని తినే జంతువులు ఈ ద్వీపంలో లేవు. కాబట్టి అవి కోడిపిల్లలకు చాలా ప్రమాదకరంగా మారాయి’’ అని లూసీ చెప్పారు.

2017-18లో కోడిపిల్లల పట్ల ఎలుకలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇక్కడి ట్రిస్టాన్ అల్బట్రాస్ కోడిపిల్లల్లో కేవలం 21 శాతం మాత్రమే బతికాయి. అంతరించిపోతున్న పెట్రెల్ జాతికి చెందిన మ్యాక్‌గిల్లీవ్రీ ప్రియాన్ పిల్లల్లో ఒక్కటి కూడా బతకలేదు.

19వ శతాబ్దంలో సెయిలర్ల వల్ల గాఫ్ ద్వీపంలోకి ఎలుకలు వచ్చి ఉంటాయని ఆర్‌ఎస్‌పీబీ అనుమానిస్తోంది. వాటిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ, వాటిని ద్వీపం నుంచి పూర్తిగా తరిమికొట్టలేకపోయారు.

పక్షులు, ఎలుకలు, ఫ్రోజెన్ ఆహారంతో పాటు మనోహరమైన గాఫ్ ద్వీపంలో ఏడాది పాటు పనిచేయడానికి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగియనుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)