భారత్‌లో ఆఫ్రికన్ చీతాల మరణం వెనక మిస్టరీ ఏమిటి?

ఫొటో సోర్స్, CHARL SENEKAL
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్‌లో ఫిబ్రవరి 28న 'పిరోజ్'అనే పేరు ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు #RIPPirouz అంటూ వీడ్కోలు పలికారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పిరోజ్‌ను బతికించుకోలేకపోయారు. కిడ్నీలు పాడై, చనిపోయింది.
పిరోజ్ కిడ్నీలు చెడిపోవడంతో ఇరాన్ సెంట్రల్ వెటర్నరీ హాస్పిటల్‌లో డయాలసిస్ చేయించారు. అప్పటికి దాని వయసు రెండు రోజులు తక్కువ 10 నెలలు.
పిరోజ్ మూడు తోబుట్టువులలో పిరోజ్ మాత్రమే చాలా కాలం జీవించగలిగింది.
గత సంవత్సరం, పిరోజ్ తల్లి నిర్బంధంలో ఉన్నప్పుడు మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది.
తన దేశంలో చీతాలను స్థిరపరచడానికి ఇరాన్ చేసిన మరో విఫల ప్రయత్నం ఇది. అయితే ఒకప్పుడు ఇరాన్‌లో చీతాలు వేలల్లో కనిపించేవి.
మార్చి 27న భారతదేశంలోని కునో జాతీయ పార్క్‌లో సాషా అనే చీతా కూడా కిడ్నీ వైఫల్యంతో మరణించింది.
గత సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనానికి తీసుకువచ్చిన ఎనిమిది నమీబియా చీతాల్లో సాషా ఒకటి.
చీతా 1952లో భారతదేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించారు.
2022 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు.
కొన్ని నెలల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చారు.
కొన్ని వారాల క్రితం ఒక ఆడ చీతా నాలుగు ఆరోగ్యవంతమైన చీతాలకు జన్మనిచ్చింది.
సాషా మార్చి 27న చనిపోగా, ఉదయ్ అనే మరో చీతా ఏప్రిల్ 22న మరణించింది.
ఇప్పుడు కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 22 చీతాలు ఉన్నాయి.
సాషాకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం- నమీబియాలో సాషాకు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు వచ్చింది. సాషా కునో వచ్చినప్పటి నుంచి దాని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అందుకే దాన్ని ఎక్కువగా 'బోమా' క్వారంటీన్ ప్రాంతంలో ఉంచారు. కానీ ఇప్పుడు మరొక మరణం సంభవించింది, ఇది చీతాల మరణానికి కారణం ఆలోచించేలా చేసింది.
ఏప్రిల్ 22 ఆదివారం చీతా ఉదయ్ కునో నేషనల్ పార్క్‌లో అనుమానాస్పదంగా మరణించింది.

ఫొటో సోర్స్, Getty Images
నమీబియా నుంచి ఎనిమిది చీతాలు వచ్చిన తర్వాత, మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి కునోకు తీసుకువచ్చారు. వాటిలో ఆరేళ్ల ఉదయ్ ఒకటి.
మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జేఎస్ చౌహాన్ మాట్లాడుతూ, "మేం రోజూ చీతాలను పరీక్షిస్తాం. శనివారం ఉదయ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు మా బృందం గుర్తించింది.
ఆదివారం బృందం తనిఖీకి వెళ్లినప్పుడు ఉదయ్ బలహీనంగా కనిపించింది. తల వంచుకుని నడుస్తోంది. ఉదయ్ ప్రశాంతంగా ఉన్నపుడు చికిత్స కోసం తీసుకువచ్చాం, కానీ మరణించింది.
"ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టు- ఉదయ్ గుండెపోటుతో మరణించిందని చెబుతోంది. పూర్తి నివేదిక కోసం వేచి ఉన్నాం. దీనిలో రక్త పరీక్ష రిపోర్టు ప్రతిదీ వివరంగా చెబుతుంది" అని జేఎస్ చౌహాన్ తెలిపారు.
నమీబియా నుంచి చీతా సంరక్షణ నిధి డైరెక్టర్ లారీ మార్కర్ బీబీసీకి తాజాగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
"సైంటిస్టులుగా మేం జంతువుల మరణానికి కారణాన్ని గుర్తించగల శవపరీక్ష కోసం చూస్తాం. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే, భవిష్యత్తులో అలాంటి మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, ADRIAN TORDIFFE
మృతికి కారణాలేంటి?
శాస్త్రవేత్తలు, వైద్యుల పరిశోధనల ద్వారా తేలింది ఏంటంటే- చీతాల మరణానికి ప్రధాన కారణం మూత్రపిండాల వైఫల్యం .
అమెరికా ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2014 నుంచి బందీలో ఉన్న 1,967 చీతాలపై పరిశోధన చేసింది.
ఎమిలీ మిచెల్ నేతృత్వంలోని బృందం లోతైన పరిశోధనలో- "బోనులో ఉన్న చీతాల్లో కొన్ని చిన్న వయస్సు నుంచే మూత్రపిండాల వైఫల్యానికి గురవుతున్నాయి. అదే తరువాత ప్రాణాంతకంగా మారింది" అని తేలింది.
బోనులో లేదా నియంత్రిత వాతావరణంలో నివసించే చీతాలు అధిక ఒత్తిడికి గురవుతాయని, అది వాటి మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్ధరించింది.
చీతాల్లో మూత్రపిండాల వైఫల్యం లక్షణాలను ముందుగానే ఎలా గుర్తించాలో 'చీతా కన్జర్వేషన్ ఫండ్' సంస్థ పరిశోధనా పత్రం వివరించింది. తద్వారా వాటికి విజయవంతంగా చికిత్స చేయవచ్చు.

ఫొటో సోర్స్, AFP
చీతాలు ఎలా అలవాటు పడతాయి?
వాతావరణానికి అలవాటు పడేందుకు మధ్యప్రదేశ్‌లోని 1.15 లక్షల హెక్టార్ల కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయడానికి ముందు, ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయస్సు గల చీతాలను ఒక నెల పాటు క్వారంటీన్ జోన్‌లో ఉంచారు.
తదుపరి దశలో ఈ చీతాలను క్వారంటీన్ జోన్ వెలుపల నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంచారు. తద్వారా అవి అడవి జంతువులు, వేట మొదలైన వాటికి అలవాటు పడతాయి.
నమీబియా నుంచి ఎనిమిది చీతాలను, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. వీటిలో 18 చీతాలు ప్రస్తుతం బతికి ఉన్నాయి. భారతదేశానికి వచ్చే చీతాలను అభయారణ్యాలకు తీసుకువెళ్లారు. అక్కడ వాటి పెంపకం సరిగ్గా జరిగింది.
దక్షిణాఫ్రికాలో అలాంటి అభయారణ్యాలు దాదాపు 50 ఉన్నాయి. వీటిలో 500 పెద్ద చీతాలు ఉన్నాయి.
"మేం ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం. అంతా బాగుంటుందని ఆశిస్తున్నాం" అని చీతా కన్జర్వేషన్ ఫండ్ డైరెక్టర్ లారీ మార్కర్ నమీబియా నుంచి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
" సింహాలు, లెపర్డ్ లేని చోట ఇతర జంతువుల చుట్టూ చీతాలు పెరిగాయి. అవి తమ నివాసాలను కూడా భారతదేశంలోనే స్థిరపరుస్తాయి. వాటికి కొంచెం సమయం ఇవ్వండి, అంతే" అని అంటున్నారు.
ఈ చీతాలను స్థిరపరచడానికి కునో నేషనల్ పార్క్ చాలా అనుకూలంగా ఉంటుందని లారీ మార్కర్ బృందం గుర్తించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు.
"నేనే మొదట చీతాలతో భారతదేశానికి వచ్చాను. అన్ని ప్రమాణాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి." అని అంటున్నారు లారీ.

ఫొటో సోర్స్, ADRIAN TORDIFFE
ప్రపంచంలో ఎన్ని చీతాలు ఉన్నాయి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,000 చీతాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానాలో ఉన్నాయి.
1950లలో చీతా అంతరించిపోయినట్లు భారతదేశం ప్రకటించింది.ఆ సమయంలో దేశంలో ఒక్క చీతా కూడా లేదు.
ఇంత పెద్ద మాంసాహార జంతువును ఒక ఖండం నుంచి మరో ఖండం అడవుల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి.
అడవి చీతాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయడం చాలా సవాలుతో కూడుకున్నదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చీతాలు మనుషులు, బోనులకు దగ్గరగా ఉండటం వల్ల ఒత్తిడికి గురవుతాయి.
దేశానికి సెప్టెంబర్‌లో చీతాల తరలింపు మొదలైనప్పటినుంచి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత కునోలో నాలుగు ఆరోగ్యకరమైన చీతాలు కూడా జన్మించాయి.
చీతాల గురించి ఆసక్తికరమైన విషయాలు
చీతాలు పులులు, సింహాలు లేదా లెపర్డ్స్లా గర్జించవు.
అలాంటి శబ్దాలు చేయడానికి వాటి గొంతులో ఎముకలు లేవు. అవి పిల్లిలా తక్కువ శబ్దాలు చేస్తాయి. కొన్నిసార్లు పక్షుల్లా శబ్దాలు చేస్తాయి.
చీతా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జీవి. కానీ ఎక్కువ దూరం వరకు వేగంగా పరిగెత్తలేదు. సాధారణంగా 300 మీటర్ల కంటే ఎక్కువ దూరం వేగంగా పరిగెత్తలేదు.
చీతాలు మిగిలిన పిల్లి జాతుల మాదిరిగానే చాలా కాలం నీరసంగా గడుపుతాయి.
స్పీడ్ పరంగా చీతాలు స్పోర్ట్స్ కార్ల కంటే వేగంగా ఉంటాయి.
చీతాకు 90 కి.మీ/గంట వేగాన్ని అందుకోవడానికి మూడు సెకన్ల సమయం పడుతుంది.
చీతా శరీరంపై మచ్చల గుర్తులు దాని గుర్తింపు.
చీతా పిల్లి జాతికి చెందిన ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే అది రాత్రిపూట వేటాడదు.
చీతా కళ్ల కింద ఉండే నల్లటి చారలు, కన్నీళ్లు లాగా కనిపిస్తాయి. అవి బలమైన సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి, తద్వారా అవి ప్రకాశవంతమైన ఎండలో కూడా స్పష్టంగా చూడగలవు.
ఇవి కూడా చదవండి:
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- డిబ్రూగఢ్ జైలు: అమృత్‌పాల్ సింగ్‌ను బంధించిన ఈ కారాగారం ఎలా ఉంటుంది?
- హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్‌లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?
- స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














