చీతాలు వచ్చేశాయ్.. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్న మరో 12 చీతాలు

చీతాలు

ఫొటో సోర్స్, @narendramodi

దక్షిణాఫ్రికా నుంచి భారతదేశంలోని మధ్యప్రదేశ్‌కు మరో 12 చీతాలు చేరుకున్నాయి.

గత ఏడాది నమీబియా నుంచి 8 చీతాలను మధ్యప్రదేశ్ తీసుకువచ్చారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 20 చీతాలను ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకువచ్చినట్లయింది.

ఈ చీతాలను తీసుకువచ్చిన భారత వాయుసేనకు చెందిన కార్గో విమానం (బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్).. శనివారం ఉదయం గ్వాలియర్ విమానాశ్రయానికి చేరుకుంది.

అక్కడి నుంచి కునో నేషనల్ పార్కుకు చీతాలను తరలిస్తారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మొరేనా, శివపూర్ జిల్లాల్లో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది.

చీతాలను తీసుకొచ్చిన విమానం

ఫొటో సోర్స్, Twitter/PTI

ఫొటో క్యాప్షన్, చీతాలను తీసుకొచ్చిన విమానం

ఈ చీతాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమార్‌లు జాతీయ పార్కులోకి విడుదల చేస్తారు.

చీతాల రాక పట్ల సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. వీటితో రాష్ట్రంలో, దేశంలో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరిందన్నారు.

ఇంతకుముందు నమీబియా నుంచి వచ్చిన చీతాలను.. గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్కులోకి విడుదల చేశారు.

చీతాలతో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, @narendramodi

భారత భూభాగంలో తిరుగాడిన ఆసియా చీతాలు 1940వ దశకం చివర్లో అంతరించిపోయాయి.

విపరీతంగా వేడాటం, ఆవాస ప్రాంతాలు తరిగిపోవటం వల్ల దేశంలో ఆసియా చీతాలు అంతర్ధానమయ్యాయని నిపుణులు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో.. ఆసియా చీతాలకు భిన్నమైన ప్రజాతి అయిన ఆఫ్రికా చీతాలను 'ప్రయోగాత్మక పరిశీలన' ప్రాతిపదికన భారతదేశానికి తీసుకురావటానికి సుప్రీంకోర్టు 2020లో అనుమతి ఇచ్చింది. వీటిని విడిచిపెట్టే ప్రాంతాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్దేశించింది.

దీంతో రాబోయే దశాబ్ద కాలంలో దేశంలో మళ్లీ చీతాలను ప్రవేశపెట్టే ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇందులో భాగంగా 2022లో నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు 8 చీతాలను తీసుకువచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గత జనవరిలో దక్షిణాఫ్రికాతో చేసుకున్న ఒప్పందం మేరకు.. తాజాగా మరో 12 చీతాలు వచ్చాయి. ఐదు ఆడ చీతాలు, ఏడు మగ చీతాలను శనివారం నాడు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు.

ఇంతకుముందు నమీబియా నుంచి వచ్చిన చీతాలకు ఇప్పుడు వచ్చిన చీతాలు కూడా తోడవుతాయి.

ఈ చీతాలను తొలుత క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో ఉంచుతామని కునో నేషనల్ పార్క్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ చెప్పారు.

భారతదేశ చట్టాల ప్రకారం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జంతువులను, అవి దేశంలోకి వచ్చాక నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలి.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 12 చీతాలు.. గత ఏడాది జూలై నుంచి ఆ దేశంలో క్వారంటైన్‌లో ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఒప్పందం ఖరారు కావటం ఆలస్యం కావటంతో వాటి తరలింపులో జాప్యం జరిగింది.

చీతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ చీతాలను ఇంత సుదీర్ఘ కాలం పాటు క్వారంటైన్‌లో ఉంచటం పట్ల వన్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా ఉంచటం వాటి ఆరోగ్యం మీద, దృఢత్వం మీద ప్రభావం చూపుతుందని చెప్తున్నారు.

దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టటానికి భారతదేశం 1950ల నుంచీ ప్రయత్నాలు చేస్తోంది. 1970లలో ఇరాన్ నుంచి చీతాలను తీసుకురావటానికి ప్రయత్నించారు. అయితే ఇరాన్ షా పదవీచ్యుతుడు కావటంతో ఆ చర్చలు ఆగిపోయాయి.

చీతాలను తిరిగి ప్రవేశపెట్టటం వల్ల స్థానిక ఆర్థికవ్యవస్థలు బలోపేతమవుతాయని, పులులకు అనువైన పర్యావరణం పునరుద్ధరణ జరుగుతుందని ఈ ప్రాజెక్టు మద్దతుదారులు చెప్తున్నారు.

అయితే జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకు స్థానచలనం చేయటం వల్ల ఎల్లప్పుడూ సమస్యలు కూడా ఉంటాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కునో నేషనల్ పార్కులోకి ఈ చీతాలను విడుదల చేయటం.. వీటికి హాని కలిగించవచ్చునని హెచ్చరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, చీతాలు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేస్తున్నాయిలా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)