భారతదేశంలో పదేళ్లలో 984 పులులు ఎందుకు చనిపోయాయి.. పర్యావరణ సమస్యలే కారణమా

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, శుభగుణం కణ్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) గణాంకాల ప్రకారం 2021లో భారతదేశంలో మొత్తం 127 పులులు చనిపోయాయి.
గత ఏడాది డిసెంబర్ 29న మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఒక పులి చనిపోయింది. 30న మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో ఒక పులిని చంపేశారు.
మధ్యప్రదేశ్‌లో పులుల మరణాలు అత్యధికంగా ఉన్నాయి. డిసెంబర్ చివరి వారంలో మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో మరో ఆడపులి చనిపోయింది. దానికి విషం ఇచ్చి చంపారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పీటీఐ వెల్లడించింది.
గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పులులకు 2021 అత్యంత ఘోరమైన సంవత్సరంగా తేలింది.
దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఎన్‌టీసీఏ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. నిఘా గస్తీని పెంచడం, వేటగాళ్లను పట్టుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అభయారణ్యాల వెలుపల 30 శాతం పులులు
భారతదేశంలో పులులు చనిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. దిండోరిలో మరణించిన ఆడపులికి విషం ఇచ్చి ఉండవచ్చన్న విషయాన్ని ఆయన కొట్టిపారేశారు.
"పులుల భద్రతకు నిరంతర పర్యవేక్షణ, నిఘా ఉన్నాయి. చాలామంది వేటగాళ్లను అరెస్ట్ చేశారు కూడా. అయితే, దేశంలోని 30 శాతం పులులు అభయారణ్యాలకు బయట ఉన్నాయి" అని ఆయన తెలిపారు.
భారతదేశంలో పులుల మరణాల సంఖ్య సుమారు 5 శాతం ఉందని వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న ఏజేటీ జాన్ సింగ్ అన్నారు.
మధ్య భారతదేశంలో అడవి పందులను నిరోధించడానికి అమర్చిన విద్యుత్ వైర్లలో చిక్కుకుని పులులు కూడా చనిపోతున్నాయి. ఎలక్ట్రికల్ కేబుల్స్ వాడకంపై నియంత్రణ అవసరం. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలల్లో కూడా పులులు చిక్కుకుంటున్నాయని ఆయన చెప్పారు.
"పశువులను చంపినందుకు పులులకు విషం పెట్టి చంపడం సర్వసాధారణం. ఈ ఆచారం గోవాలో ఎక్కువగా ఉంది. పశువులను చంపుతున్నాయన్న కోపంతో పులులకు విషం పెట్టి చంపేస్తారు. అందుకే ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు" అని జాన్ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పులులకు ఉపయోగపడని పచ్చని ఎడారులు
2012లో భారతదేశంలో 88 పులులను చంపారని గణాంకాలు చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో 2021 మినహా, 2016, 2017లలో అత్యధిక సంఖ్యలో పులులను చంపారు.
2016లో 121 పులులు చనిపోగా, 2017లో 117 పులులు చనిపోయాయి. ఆ తరువాత 2020లో 106 పులులను చంపారు.
2021లో మొత్తం 127 పులులు చనిపోయాయి. వీటిలో 15 పిల్లలు (వాటి పిల్లలు), 12 ఏళ్ల కన్నా చిన్న వయసు పులులు ఉన్నాయి.
పులుల మరణాలకు ప్రధాన కారణాలను తెలుసుకునేందుకు తమిళనాడులో పులులపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ కుమారగురుతో బీబీసీ మాట్లాడింది.
"రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ పులుల సంరక్షణ అథారిటీతో మరింత డేటాను పంచుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.
"పులుల మరణాలకు ప్రధాన కారణాలు సరైన ఆహారం, ఆవాసం దొరకపోవడం, పర్యావరణ ప్రమాణాలు లేకపోవడం. పులులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటి చుట్టూ అవి వేటాడగల జంతువులు తగిన సంఖ్యలో ఉండటం అవసరం.
వాటి చుట్టూ ఉన్న వాతావరణంలో లాంటానా కమారా, యుపటోరియం గ్లాండులోసమ్, ప్రోసోపిస్ జులిఫ్లోరా, పార్థినియం మొదలైన ఇన్వాసివ్ ఎగ్జాటిక్ మొక్కలు అధికంగా ఉన్నాయి. గడ్డిలో ఇవి గరిష్టంగా ఏడు అడుగుల ఎత్తు పెరుగుతాయి.
అయితే, పులికి ఆహారం కాగల జంతువులు ఈ గడ్డి మొక్కలను తినవు. అందుచేత అవి ఈ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోతాయి. దాంతో పులులకు సరైన ఎర దొరకట్లేదు. వాటి చుట్టూ పచ్చని ఎడారి తయారవుతోంది" అని కుమారగురు వివరించారు.
జన్యు లోపాలు
పులి పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ప్రధానంగా జన్యు లోపాలే కారణమని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. అందువల్ల పులుల పరిధి కూడా తగ్గుతోంది.
ఉదాహరణకు, సత్యమంగళం నుంచి ముదుమలైకి, బందీపూర్ నుంచి నాగర్‌కోయిల్‌కు వెళ్లే పులుల మార్గం సత్యమంగళం వద్ద మూసుకుపోయింది. అలాంటప్పుడు, అవి వేరే అడవులకు మకాం మార్చలేవు. ఇలా చిక్కుకున్న జీవులను 'బాటిల్‌నెక్ పాపులేషన్' అంటారు.
ఇలా ఒకే చోట చిక్కుకుపోయిన పులులు తమలో తాము సంతానోత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఇతర అడవులలో ఉన్న పులులతో వాటికి సంపర్కం ఉండదు. అందువల్ల జన్యు బదిలీ జరగదు.
జన్యుపరంగా ఇది చెడు పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తరువాత తరం పులులు బలహీనంగా పుట్టే అవకాశాలు ఎక్కువ.
మగ, ఆడ పులులు రెండూ బలహీనంగా ఉంటే వాటికి పుట్టే పిల్లలకు మరింత హాని కలగవచ్చు. సరిగ్గా నడవలేకపోవడం, పాలు తాగకపోవడం, పోషకాహార లోపం, ఇంఫెక్షన బారిన పడడం మొదలైన సమస్యలన్నీ వస్తాయి. వీటి వల్ల యవ్వనానికి ముందే అవి చనిపోతాయి.
ఒకవేళ పిల్లలు బలంగా పుట్టినా, తల్లి బలహీనంగా ఉండడం వల్ల వేటగాడికి దొరికిపోతే, ఆ పిల్లలకు వేట, మనుగడ వ్యూహాలు నేర్పించేవారు ఎవరూ ఉండరు.
తల్లి లేక, వేట తెలియకపోతే అవి బతకడం కష్టం. బలహీనంగా ఉండే పులి పిల్లలను అడవి కుక్కలు కూడా చంపి తినగలవు.
ఇది పులుల సమస్య మాత్రమే కాదు. వన్యప్రాణుల నివాసాలను నాశనం చేయడం వల్ల అన్ని రకాల జంతువులూ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
అడవుల గుండా వెళ్లే రహదారులను రాత్రిళ్లు కొన్ని గంటల పాటు మూసివేస్తే జంతువులకు ఉపశమనం లభిస్తుంది.
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఇందుకు ఉదాహరణ. రాత్రిపూట అడవిలోకి మనుషులు ప్రవేశించకుండా నిషేధం విధించడంతో అక్కడ పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.
అయితే, ఇది తాత్కాలిక ప్రయత్నమేనని, ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవడమే శాశ్వత పరిష్కారమని కుమారగురు అన్నారు.
పిల్లలకు మాతృ భాష నేర్పినట్టే, చిన్న వయసు నుంచి పర్యావరణం పట్ల కూడా అవగాహన కలిగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
'984 పులులు చనిపోయాయి'
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాల ప్రకారం, 2012 నుంచి 2021 వరకు దేశంలో మొత్తం 984 పులులు చనిపోయాయి.
మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 244 పులులు చనిపోయాయి. ఆ తరువాత మహారాష్ట్రలో 168, కర్ణాటకలో 138, ఉత్తరాఖండ్‌లో 96, తమిళనాడులో 66, అసోంలో 66 పులులు చనిపోయాయి.
వీటిలో 417 పులులవి సహజ మరణాలు. 193 పులులను మనుషులు చంపారు. 2019లో 22 పులులు, 2020లో 73 పులుల మరణానికి కారణాలు ఇంతవరకూ స్పష్టం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- అంతుచిక్కని మరణాలు... వేల పక్షులు అక్కడే ఎందుకు చనిపోయాయి?
- అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయం
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా
- భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
- చనిపోయిన జింక కడుపులో 7 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
- సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది... తన జాతి అంతరించి పోకుండా కాపాడింది
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










