విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఇది తగ్గాలంటే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
సూర్యరశ్మి నుంచి విటమిన్ డి లభిస్తుంది అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ దేశ జనాభాలో దాదాపు ఎనభై శాతం మందికి (మహిళల్లో దాదాపు తొంభై శాతం) విటమిన్ డి లోపం ఎందుకు ఉంది?
విటమిన్ డి ఉత్పత్తి అనేది సూర్యరశ్మి మన చర్మం మీద పడినప్పుడు మొదలయ్యి, కాలేయంలో కొనసాగి, మూత్ర పిండాలలో పూర్తి అవుతుంది. విటమిన్ డీ లోపం ఉండకూడదు అంటే, ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి.
మరి ఈ విటమిన్ సమస్య ఎలా వస్తోంది? దీనికి పరిష్కారం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
విటమిన్ డి ఎలా అందుతుంది?
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది. ఈ సమయంలో 15 నిమిషాలు ఎండ మన శరీరానికి తగలాలి.
ఒంటిని పూర్తిగా కప్పే బట్టలు వేసుకుంటే, మన చర్మానికి సూర్యరశ్మి తగలదు. సన్‌స్క్రీన్ లోషన్ రాసుకున్నా చర్మం లోపలికి విటమిన్ డి వెళ్ళదు.
ఊబకాయం ఉన్న వాళ్లలోనూ విటమిన్ డి ఉత్పత్తి సరిగ్గా జరగదు. మన చర్మంలో ఉండే మెలనోసైట్లు (చర్మ రంగుకు బాధ్యత వహించే మెలనిన్ తయారు చేసేవి) సూర్యరశ్మిలోని యూవీ కిరణాలను తీసుకోవడం వల్ల, విటమిన్ డి ఉత్పత్తి అవ్వకుండా చేస్తాయి. అందుకే మన దేశంలో, ఎంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ విటమిన్ డీ లోపం అంత అధికంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ఆహారం తీసుకోవాలి?
కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్ లాంటివి వీటిలో ఉంటాయి.
మన దేశంలో శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉండటమూ విటమిన్ డి లోపానికి ఒక కారణం.
కొన్ని రకాల శోషణ లోపాల వల్ల, విటమిన్ డి లోపం ఉండే అవకాశము ఉంది. ఉదాహరణకు, సెలియాక్ డిసీజ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD), సిస్టిక్ ఫైబ్రోసిస్ మొదలైన సమస్యలు దీనిలో ఉన్నాయి.
మరోవైపు సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు, అది సరిగ్గా అబ్జార్బ్ అయినప్పుడు మాత్రమే విటమిన్ డి ఉత్పత్తి సాధ్యపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మద్యపానం కూడా..
మన దేశంలో మద్యపానం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. మద్యం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది. అందుకే ఎంతో మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దెబ్బతిన్న కాలేయంలో విటమిన్ డీ ఉత్పత్తి జరగదు.
మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. మధుమేహంతోపాటు అనాలోచితంగా వాడే నొప్పుల మాత్రలు, ఇతర అశాస్త్రీయ మందులు, బీపీ, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రపిండాల సమస్యలు పెరుగుతుంటాయి.
భారత దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి మూత్ర పిండాల సమస్యలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూత్ర పిండాలు సరిగ్గా పని చేయని వారిలోనూ విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు.
ఊబకాయం, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలతో బాధిపడేవారిలోనూ విటమిన్ డి సరిగా ఉత్పత్తి కాదు. అందుకే మన దేశంలో విటమిన్ డీ లోపం అనేది ఎనభై శాతానికి పైన ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
గర్భంతో ఉన్న తల్లికి విటమిన్ డి లోపం ఉంటే, పుట్టే పిల్లలకు ఆ లోపం ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుల్లో విటమిన్ డి లోపాన్ని సవరించకపోతే, ఎముకలు, కండరాలు బలహీన పడి, దాని ప్రభావం జీవిత కాలం ఉండే అవకాశం ఉంది.
విటమిన్ డి లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఇవీ..
చిన్న పిల్లల్లో అయితే విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యను రికెట్స్ ( Rickets) అంటారు. దాని వల్ల, ఎదిగే పిల్లల్లో, కాళ్ళు వంకర అవ్వడం (Bow legs), పుర్రె సొట్ట పడడం (bossing of skull), యముకల గూడులో వైకల్యాలు, ఎముకలు తేలికగా విరగడం, ఎదుగుదలలో లోపాలు, కండరాలు బలం లేకుండా ఉండడం, కండరాలు, యముకల్లో నొప్పులు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
పెద్ద వారిలో విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమలేసియా (osteomalacia) అనే సమస్య కలుగుతుంది. అందులో భాగంగా, మన ఆహారంలోని కాల్షియం శోషణ లోపంతో, యముకలు తేలికగా విరగడం, కండరాలు, కీళ్లు, యముకల్లో నొప్పులు, బలహీనమైన దంతాలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి.
అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఉన్న వారు, ఆలస్యం చేయకుండా ఒక సారి రక్త పరీక్ష చేసి విటమిన్ డి స్థాయి ఎంత ఉందో తెలుసుకుంటే, దాన్ని బట్టి ఇంజెక్షన్ రూపంలో కానీ, నోటి ద్వారా గాని మందులతో దాన్ని సరిచేసుకోవాలి.
వీలయితే లోపాలను నివారించాలి, లేదంటే విటమిన్ డీని మందు రూపంలో తీసుకోవాలి. లేకపోతే, శరీర సామర్థ్యం తగ్గి, అనారోగ్యంతో జీవితంలోని ఆనందాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















