డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రీతి రాజేశ్వరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు చాలామంది ఉపయోగిస్తున్నవస్తువుల్లో డియోడరెంట్ ఒకటి.
చెమటవల్ల శరీరం నుంచి చెడువాసన రాకుండా.. రోజంతా తాజాగా ఉంచుతుంది. డియోడరెంట్‌లో రసాయనాలు.. చెమటలో బాక్టీరియా వృద్ధిచెందకుండా చేస్తాయి.
రకరకాల సువాసనలతో మనసు దోచుకునే రకరకాల డియోడరెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
వీటిలో ఏరోసల్ డియోడరెంట్ అంటే స్ప్రే చేసే డియోడరెంట్. రోల్ ఆన్, స్టిక్స్.. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి.
ఎలా వాడాలి?
స్నానం చేశాక తడిలేకుండా తుడుచుకున్న చర్మంపై డియోడరెంట్ స్టిక్ లేదా రోల్ ఆన్ వాడితే దాన్ని 2 లేదా 3 సార్లు రాయాలి.
ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే డియోడరెంట్ స్ర్పేని శరీరానికి కనీసం 10నుంచి 15 సెంటీమీటర్లు దూరంలో ఉంచి స్ప్రే చేయాలని కాస్మొటిక్స్ నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి చాలా దగ్గరగా, లేదా మరీ దూరంగా ఉంచి స్ప్రే చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు.
ఎలా వాడకూడదు?
డియోడరెంట్లను దుస్తులపై స్ర్పే చెయ్యకూడదు. శరీరంపై స్ప్రే చేసుకున్నతర్వాత నిద్ర పోవడం కూడా మంచిది కాదు.
ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ.. తరచూ ఇలా చేస్తే శరీరంపై ఉన్న డియోడరెంట్‌లో ఉండే రసాయనాలు చర్మానికి హాని చేసే అవకాశముంది.
బాడీ స్ప్రేల మాదిరిగా డియోడరెంట్ స్ర్పేలను వాడకూడదు. రెండూ వేర్వేరు.
బాడీ స్ప్రే కి డియోడరెంట్‌కి తేడా
డియోడరెంట్లు యాంటీ మైక్రోబియల్. అంటే చర్మం విసర్జించిన చెమటలోని సూక్ష్మ జీవులను చంపేస్తాయి.
బాడీ స్ప్రే లు సువాసన కలిగించే నూనెలతో తయారు చేస్తారు. ఇవి పెర్ఫ్యూమ్ లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.
ఇవి రాసుకున్నవారితో పాటు, వారి చుట్టుపక్కల సువాసనలు వెదజల్లుతాయి.
శరీరంపై డియోడరెంట్ స్ప్రే చేసుకున్న తర్వాత దుస్తులపై బాడీ స్ప్రేని ఉపయోగించవచ్చు.

ఫొటో సోర్స్, FAMILY PHOTO
ప్రాణాంతకమా?
అవును. ఇటీవల బ్రిటన్‌లో 14 ఏళ్ల జార్జియా గ్రీన్ అనే అమ్మాయి తన బెడ్రూమ్‌లో డియోడరెంట్ స్ప్రే పీల్చడం వల్ల గుండెపోటుతో చనిపోయింది.
బ్రిటన్‌లో 2001 నుంచి 2020 మధ్య మొత్తం 11 మంది ఇలా డియోడరెంట్ కారణంగా చనిపోయినట్లు 'ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటిస్టిక్స్' రిపోర్ట్ చెబుతోంది.
2000 - 2008 మధ్యకాలంలో చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల కంటే గ్లూ, డియోడరెంట్ వంటి వాటిలో ఉండే ఏరోసల్ పీల్చి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారని యూకె డ్రగ్ సలహా సంస్థ- టాక్ టు ఫ్రాంక్ తెలిపింది.
వీరిలో ఎక్కువమంది 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలే.
అమెరికాలో ప్రతి ఏటా 100 నుంచి 200 మంది పిల్లలు ఇన్హెలెంట్స్ అంటే హానికారక రసాయనాలను పీల్చడం వల్ల చనిపోతున్నారని మేయో క్లినిక్ ఒక రిపోర్ట్‌లో తెలిపింది.
ఇండియాలో డియోడరెంట్ల మార్కెట్
మన దేశంలో డియోడరెంట్ల మార్కెట్ గ్యాస్, నాన్ గ్యాస్ ఉత్పాదనలు అంటే స్ప్రేలు, స్టిక్స్, రోల్ ఆన్స్ ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది.
డియోడరెంట్ స్ర్పేలు గ్యాస్‌తో నిండి ఏరోసల్ రూపంలో ఉంటాయి. జీఐఐ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం డియోడరెంట్స్ మార్కెట్ మరో ఐదేళ్ల పాటు 15 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని అంచనా వేశారు.
కార్పొరేట్ రంగంలో మహిళా ఉద్యోగులు పెరగడంతో గత కొన్నేళ్లలో పురుషుల డియోడరెంట్స్ కంటే మహళల డియోడరెంట్ల అమ్మకం పెరిగింది.
భారత్‌లో ప్రతి ఏటా దాదాపు 130 కోట్ల రూపాయల డియోడరెంట్లు అమ్ముడవుతున్నాయని అంచనా.
డియోడరెంట్ల వాడకం మంచిదేనా?
డియోడరెంట్ స్ప్రే వాడిన తర్వాత కొందరిలో ఎలర్జిక్ రియాక్షన్స్ కనిపిస్తాయి. ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
మరికొందరిలో దురద, దద్దుర్లు వంటి చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని హైదరాబాద్ ఒస్మానియా ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతిభా లక్ష్మి తెలిపారు.
కొన్నిసార్లు చిన్నపాటి స్కిన్ అలర్జీగా మొదలై ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా దారితీయవచ్చని ఆమె చెప్పారు.
వీటిలోని రసాయనాల ప్రభావం ఎక్కువ కాబట్టి.. ఇవి చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలని ఆమె సూచించారు.

డియోడరెంట్లలో ఏముంటుంది?
డియోడరెంట్లో పారాబెన్, ఆల్కహాల్, సువాసన తైలాలు ఉంటాయి. కొన్ని డియోడరెంట్‌లో దాదాపు 50శాతం వరకూ ఉండే హానికారక రసాయనం ప్రొపిలీన్ గ్లైకోల్.
ఈ రసాయనం నాడీ వ్యవస్థపైన, గుండె, కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సున్నితమైన చర్మం గలవారిలో ఇది మరింత ప్రమాదకరం.
రెండు శాతం కంటే తక్కువ ప్రొపిలీన్ గ్లైకోల్ ఉన్న ఉత్పత్తులు వాడడం శ్రేయస్కరం.
తరచుగా వాడే యాంటీ పెర్‌స్పిరెంట్లలోని అల్యూమినియం మహిళల రొమ్ములో పేరుకుపోయి, క్యాన్సర్‌కు దారితీస్తుందని కొందరు వాదిస్తున్నప్పటికీ వాటికి పూర్తి ఆధారాలు ఇంకా లభించలేదు.
డియోడరెంట్లతో జాగ్రత్త!
పిల్లలు వీటిని పీల్చితే స్పృహ తప్పి పోవడం, మూర్చ, తలనొప్పి, వాంతులు, ఊపిరాడకపోవడం, కొన్నిసార్లు గుండెజబ్బులతో చనిపోయే ప్రమాదం కూడా ఉంది.
సౌందర్య సాధనాలుగా ఉపయోగించే డియోడరెంట్లను పూర్తి అవగాహనతో వినియోగించుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి:
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
- ఏడాదిన్నర కిందట అడవిలో తప్పిపోయిన పసివాడు.. తిరిగి తల్లి ఒడికి చేరాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











