తుర్కియే భూకంపం: ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’

- రచయిత, అలైస్ కడీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తుర్కియే, సిరియా దేశాల్లో సంభవించిన ఘోర భూకంపం వేలాది మందిని బలి తీసుకుంది. మృతుల సంఖ్య 35 వేలు దాటింది. గుండెలను పిండేసే విషాద గాథల మధ్య.. ఎంతో సంతోషాన్నిచ్చే కొన్ని ''అద్భుతాలు'' కూడా జరుగుతున్నాయి. ఇది అలాంటి ఒక మిరకిల్.
నెక్లా కాముజ్ వయసు 33 ఏళ్లు. ఆమె జనవరి 27వ తేదీన తన రెండో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి యాగిజ్ అని పేరు పెట్టారు. అంటే ''ధీశాలి'' అని అర్థం.
సరిగ్గా పది రోజులు గడిచాయి. అప్పుడు సమయం తెల్లవారు జామున 4:17 గంటలైంది. తమ ఇంట్లో నెక్లా తన కుమారుడికి పాలు పడుతూ మెలకువగానే ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లీబిడ్డల మీద ఆకాశం కూలిపడింది. వారిద్దరూ శిథిలాల గుట్టల కింద సజీవంగా సమాధయ్యారు.
దక్షిణ తుర్కియేలోని హటే ప్రావిన్స్‌లో గల సమాందాగ్ పట్టణంలోని ఒక ఐదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో నెక్లా, ఆమె కుటుంబం నివసించేవారు. ఆ ఆధునిక భవంతి చాలా బాగుండేదని నెక్లా చెప్పారు. అందులో భద్రంగా ఉన్నామని ఆమె భావించారు.
భూకంపం ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని.. అడుగడుగునా భవనాలు కుప్పకూలి శిథిలమవుతాయని ఆ ఉదయం ఆమెకు తెలియదు.
''భూకంపం మొదలైనపుడు.. వేరే గదిలో ఉన్న నా భర్త వద్దకు వెళ్లాలనుకున్నాను. ఆయన కూడా నా గదికి రావాలని అనుకున్నారు'' అని నెక్లా చెప్పారు.
''మా మరో కొడుకును తీసుకుని ఆయన నా దగ్గరకు వస్తున్నారు. అంతలో వారి మీద వార్డ్‌రోబ్ విరిగి పడింది. ఇక వాళ్లు కదలలేకపోయారు. భూకంపం పెద్దదయింది. గోడ విరిగి పడింది. గది మొత్తం కంపించిపోతోంది. బిల్డింగ్ అతలాకుతలమైంది. కంపించటం ఆగిపోయింది. అప్పటికే నేను ఒక అంతస్తు కిందికి పడిపోయాను. కానీ నాకు ఆ విషయం తెలియలేదు. వారిని పేరు పెట్టి పిలుస్తూ అరిచాను. కానీ సమాధానం లేదు'' అని వివరించారు.
అలా పడిపోయిన నెక్లా.. తన పది రోజుల పసిగుడ్డును తన ఛాతీ మీద పెట్టుకుని, తన చేతుల్లోనే పట్టుకుని ఉన్నారు. పై నుంచి కూలిన భారీ కాంక్రీట్ స్లాబ్ వారి మీద పడలేదు. వారి పక్కనే పడిపోయిన వార్డ్‌రోబ్ ఆ స్లాబ్‌ను అడ్డుకుని, వారి ప్రాణాలను కాపాడింది.
ఆ తల్లీబిడ్డలు నాలుగు రోజుల పాటు ఆ శిథిలాల గుట్టకింద అలాగే పడి ఉన్నారు.

శిథిలాల కింద జీవితం
శిథిలాల కింద తన పైజామాలో పడివున్న నెక్లాకు ఏమీ కనిపించటం లేదు. అంతా చిమ్మచీకటి కమ్మేసి ఉంది. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఆమె తన ఇతర ఇంద్రియాలపై ఆధారపడ్డారు.
యాగీజ్ ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాడని తెలుసుకున్నారు. అది ఆమెకు ఊరటనిచ్చింది.
శిథిలాలు కూలినపుడు రేగిన ధూళి కారణంగా ఆమె మొదట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కొంతసేపటికి ఆ ధూళి అణిగిపోయిందని ఆమె చెప్పారు. చుట్టూ శిథిలాలు పోగుపడి ఉండటంతో వెచ్చగా ఉంది.
ఆమెకు తన కింద పిల్లల బొమ్మలు ఉన్నట్లు అనిపించింది. కానీ అవేమిటో చూసి, పక్కకు జరపితే కాస్త సౌకర్యంగా ఉంటుందనిపించింది. కానీ ఏమాత్రం కదలటానికి వీలులేని పరిస్థితిలో ఇరుక్కుని ఉన్నారు.
పక్కన వార్డ్‌రోబ్, తన కొడుకు మృదువైన చర్మం, వారు ధరించిన దుస్తులు తప్పితే.. అంతా కాంక్రీటు, శిధిలాలు మాత్రమే ఆమె స్పర్శకు తెలిశాయి.
ఎక్కడో దూరంగా మనుషుల గొంతు ఆమెకు వినిపిస్తోంది. సహాయం కోసం అరవడానికి ప్రయత్నించారు. వార్డ్‌రోబ్ మీద చేత్తో కొట్టి శబ్దం చేయాలని చూశారు.
''ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా నా మాట వినిపిస్తోందా?'' అని ఆమె అరిచారు.
ఫలితం లేకపోవటంతో.. తన పక్కనే చేతికి అందిన చిన్న చిన్న రాళ్లు తీసి వాటిని వార్డ్‌రోబ్ కేసి కొట్టారు. అలా చేస్తే ఇంకాస్త గట్టి శబ్దం వస్తుందని, బయట ఉన్నవారికి వినిపిస్తుందని ఆశించారు. తన పైన ఉన్న కాంక్రీటును ఆ రాళ్లతో కొడితే అది కూలి తమ మీద పడుతుందని ఆమె భయపడ్డారు.
ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఎవరూ బదులు పలకలేదు.
ఇక ఎవరూ రారేమోనని నెక్లా అనుకున్నారు.
''నేను భయంతో వణికిపోయను'' అని చెప్పారు.
పసివాడికి పాలుపడుతూ...
ఆ శిథిలాల కింద చిమ్మ చీకట్లో.. పగలు, రాత్రి అనే తేడా నెక్లాకు తెలియకుండా పోయింది.
అది ఆమె ఊహించిన జీవితం కాదు.
''బిడ్డ పుట్టినపుడు మనం చాలా చాలా ప్లాన్ చేస్తాం. కానీ అకస్మాత్తుగా ఆ బిడ్డతో సహా శిథిలాల కింద చిక్కుకుపోతే ఎలా ఉంటుంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల్లో కూడా యాగీజ్ బాగోగులు చూసుకోవాలని ఆమెకు తెలుసు. ఆ ఇరుకు ప్రదేశంలోనే తన బిడ్డకు ఆమె పాలు ఇవ్వగలిగారు.
ఆమెకు తాగటానికి నీళ్లు లేవు. తిండి సంగతి ఇక చెప్పనవసరం లేదు. ఆకలిదప్పులకు తాళలేక.. తన చనుబాలు తానే తాగటానికి ప్రయత్నించారు. కానీ అది కూడా సాధ్యంకాలేదు.
నెక్లా తన పైన డ్రిల్ చేస్తున్న శబ్దాలు, అడుగుల శబ్దాలు, సన్నని గొంతులు వినగలుగుతున్నారు. కానీ అవి చాలా లీలగా, ఎక్కడో దూరంగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది.
ఆ శబ్దాలు తనకు దగ్గరగా వచ్చే వరకూ ఆగాలని, అప్పుడు కేకలు వేయటం కోసం తన శక్తిని దాచుకోవాలని, అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉండాలని నెక్లా నిర్ణయించుకున్నారు.
ఆమె నిరంతరం తన కుటుంబం గురించి ఆలోచించారు. తన ఛాతీ మీద ఉన్న తన బిడ్డ గురించి ఆలోచించారు. అవే శిథిలాల్లో ఎక్కడో పడిపోయిన తన భర్త గురించి, మరో కొడుకు గురించి ఆలోచించారు.
ఈ భూకంపంలో తన మిగతా ఆత్మీయుల పరిస్థితి ఎలా ఉందోనని కూడా ఆందోళన చెందారు.
ఆ శిథిలాల నుండి తాను బయటపడతానని నెక్లా అనుకోలేదు. అయితే యాగిజ్ తనతో ఉండటంతో ఆమెలో ఆశ అడుగంటలేదు.
ఆ పసివాడు ఎక్కువ సమయం నిద్రపోయేవాడు. బిడ్డ మేల్కొని ఏడ్చినప్పుడు.. స్థిమితపడే వరకూ ఆమె మౌనంగా అతడికి చనుబాలు పట్టేవారు.

ఫొటో సోర్స్, Ekrem Imamoglu
కలా? నిజమా?
నెక్లా తన బిడ్డతో సహా శిథిలాల కింద చిక్కుకుపోయి 90 గంటలు దాటిపోయింది. అంటే దాదాపు నాలుగు రోజులైపోయింది. అప్పుడు కుక్కలు మొరుగుతున్న శబ్దం ఆమెకు వినిపించింది. అది నిజమేనా, కలలో వినిపిస్తోందా అని అనుకున్నారామె.
కుక్కలు మొరగటంతో పాటు.. ఆ వెనుకే కొన్ని గొంతులు కూడా ఆమెకు వినిపించాయి.
''మీరు బాగానే ఉన్నారా? 'అవును' అని చెప్పాలంటే ఒక్కసారి దేనితోనైనా కొడుతూ శబ్దం చేయి'' అని ఒక వ్యక్తి శిథిలాలలోకి అరుస్తూ చెప్పాడు.
''మీరు ఏ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు?'' అని కూడా అడిగారు.
ఆమె ఆచూకీ బయటి వారికి తెలిసింది.
ఆమె చేతుల్లో పసిబిడ్డ యాగీజ్ ఉన్నందున.. ఆమెను గుర్తించడానికి సహాయ బృందం ఆ శిథిలాలను చాలా జాగ్రత్తగా తవ్వారు.
ఆమె చుట్టూ ఉన్న చీకటిని చీల్చుకుంటూ వచ్చిన టార్చ్ లైట్ వెలుతురు ఆమె కళ్లలో మెరిసింది.
ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సహాయ సిబ్బంది ఆ తల్లీబిడ్డలను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. యాగిజ్ వయస్సు ఎంత అని వాళ్లు అడిగారు. నెక్లా ఖచ్చితంగా చెప్పలేకపోయింది. భూకంపం వచ్చేటప్పటికి అతడి వయసు 10 రోజులని మాత్రమే ఆమెకు గుర్తుంది. తాను ఎన్ని రోజులు ఆ శిథిలాల కింద ఉన్నానో ఆమెకు తెలియలేదు.
ఆమె యాగీజ్‌ను సహాయ సిబ్బంది చేతులకు అందించారు. ఆ తర్వాత, నెక్లాను స్ట్రెచర్ మీదకు ఎక్కించారు. చుట్టూ చాలా పెద్ద గుంపు గుండా ఆమెను తీసుకెళ్లారు. వారిలో తనకు తెలిసిన ముఖాలేవీ ఆమెకు కనిపించలేదు.
ఆమెను అంబులెన్స్‌లోకి ఎప్పించే సమయానికి.. తన మరో కొడుకును కూడా రక్షించారన్న విషయం ఆమెకు తెలిసింది. దీంతో నెక్లా మరికొంత ఊరటపొందారు.

‘నా బిడ్డకు ఆ భయం గుర్తుండకూడదు’
నెక్లాను ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను పలకరించారు. ఆమె భర్త ఇర్ఫాన్‌ను, మూడేళ్ల కుమారుడు యిగిత్ కెరీమ్‌ను శిథిలాల నుండి రక్షించారని వారు చెప్పారు.
కానీ వారి కాళ్లకు, పాదాలకు తీవ్ర గాయాలయ్యాయని, వారు అదానా ప్రావిన్స్‌లోని ఆసుపత్రిలో వారికి చికిత్స చేస్తున్నారని తెలిపారు.
విశేషమేమిటంటే.. తల్లీబిడ్డలైన నెక్లా, యాగిజ్‌లకు ఎటువంటి తీవ్ర శారీరక గాయాలు కాలేదు. వారిని 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉంచి డిశ్చార్జ్ చేశారు.
నెక్లాకు తిరిగి వెళ్లడానికి ఇప్పుడు ఇల్లు లేదు. ఒక కుటుంబ సభ్యుడు ఆమెను చెక్కలు, టార్పాలిన్‌తో వేసిన తాత్కాలిక గుడారానికి తిరిగి తీసుకువచ్చాడు. అక్కడ మొత్తం 13 మంది ఉన్నారు. వాళ్లందరూ ఇళ్లు కోల్పోయిన వారే.
ఆ టెంట్‌లో.. కుటుంబ సభ్యులు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. చిన్న పొయ్యి మీద కాఫీ తయారు చేసుకుంటూ, చదరంగం ఆడుకుంటూ, భూకంపంలో అనుభవాలను కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు.
నెక్లా తన భయానక అనుభవం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. యాగీజ్ వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని ఆమె అన్నారు.
''నా బిడ్డ దీన్నితట్టుకోగలిగేంత బలంగా ఉండకపోతే.. నేను కూడా ఉండేదానిని కాదు'' అని ఆమె చెప్పారు.
ఆమె తన కొడుకు విషయంలో ఒకటో కోరుకుంటున్నారు. అతడికి మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని.
''అతడు పొత్తిళ్ల బిడ్డ కావటం వల్ల.. అతడికి ఇదేదీ గుర్తుండదు. అది నాకు సంతోషిన్నిస్తోంది'' అన్నారామె.
నెక్లాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ముఖంలో నవ్వు విరిసింది. హాస్పిటల్ బెడ్ మీద నుండి ఇర్ఫాన్, యిగిత్ కెరీమ్ నవ్వుతూ చేతులు ఊపుతున్నారు.
''ఓయ్ యోధుడా. నా కొడుకా. ఎలా ఉన్నావు?'' అని ఇర్ఫాన్ ఆ ఫోన్ స్క్రీన్ మీద తన కొడుకును అడుగుతున్నారు.
అదనపు సమాచారం: ఎమ్రా బులుట్

ఇవి కూడా చదవండి:
- 'చనిపోయిన వ్యక్తి'ని కోర్టుకు తెచ్చి 14 ఏళ్ల శిక్ష వేయించిన అత్యాచార బాధితురాలి తల్లి, అసలేం జరిగింది?
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?
- ఎంఎన్ఆర్ఈజీఏ: 'ఈ పథకం వల్లే ఇల్లు నడుస్తోంది, ఇది కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటో తెలీదు'
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










