ఎంఎన్‌ఆర్‌ఈజీఏ: 'ఈ పథకం వల్లే ఇల్లు నడుస్తోంది, ఇది కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటో తెలీదు'

ఉపాధి హామీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆనంద్ దత్
    • హోదా, బీబీసీ కోసం

ఝార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాకు చెందిన బనారసి నగేసియాకు 4 ఎకరాల భూమి ఉంది. 2018లో ఆయన భార్య అనారోగ్యం పాలవడంతో మూడెకరాల భూమిని తనఖా పెట్టాల్సి వచ్చింది. దానికి రూ. 30 వేలు వచ్చాయి. తనఖా పెట్టిన భూమిని విడిపించుకోవడానికి డబ్బులు సరిపోక, పనికోసం కేరళ వెళ్లారు. అక్కడ పైనాపిల్ తోటల్లో కూలి పనికి చేరారు.

ఇంతలో కరోనా మహమ్మారి రావడం, లాక్‌డౌన్ రావడంతో నగేసియా ఇంటికి తిరిగొచ్చారు. అక్కడ ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద కూలిపని దొరికింది. ఆ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చారు. అయితే, గత రెండేళ్లుగా ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద వేతనాలు అందడం లేదు.

"ఎంఎన్‌ఆర్‌ఈజీఏలో ఒక్కోసారి నెల, రెండు నెలలు ఆలస్యంగా డబ్బులు చేతికి వస్తాయి. ఇప్పటివరకు నా భూమిని విడిపించుకోలేకపోయాను. వారంలో ఏదో ఒకరోజు వేతనం ఇస్తారు. దాంతో, ఎలాగోలా ఇల్లు నెట్టుకొస్తున్నాం" అని నగేసియా బీబీసీతో చెప్పారు.

ఝార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా చంపా పంచాయతీకి చెందిన గులాబ్ దేవికి ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని దొరుకుతోంది. ఆ డబ్బుతోనే ఆమె కూతురు, కొడుకు స్కూల్లో చదువుతున్నారు.

"డబ్బులు ఆలస్యంగా వస్తాయి. కానీ, దాని ఆధారంగానే ఇల్లు నడుస్తోంది. ఇది కూడా లేకపోతే పిల్లల చదువు, ఇల్లు గడవడం చాలా కష్టం" అన్నారామె.

గులాబ్ దేవి

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

ఫొటో క్యాప్షన్, గులాబ్ దేవి

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్‌లో కోత

దేశవ్యాప్తంగా ఈ కార్మికుల కష్టాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) కోసం మొత్తం రూ. 60,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో సవరించిన బడ్జెట్ రూ. 89,000 కోట్ల కంటే దాదాపు 34 శాతం తక్కువ.

వరుసగా మూడేళ్ల నుంచి ఎంఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్ తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. 2021-22లో 34 శాతం, 2022-23లో 25.5 శాతం తగ్గించింది.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ వైఫల్యానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అంటున్నారు. కానీ, ఇదే ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ చితికిపోకుండా కాపాడిందని కూడా ఆయనే అన్నారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏలో బడ్జెట్ కోత వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

బడ్జెట్ తరువాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, "ఎంఎన్‌ఆర్‌ఈజీఏ డిమాండ్ ఆధారంగా నడిచే పథకం. డిమాండ్ పెరిగితే బడ్జెట్ కేటాయింపు పెంచవచ్చు. రాష్ట్రాల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తే, అప్పుడు మేం పార్లమెంటు నుంచి సప్లిమెంటరీ డిమాండ్ చేయవచ్చు" అని అన్నారు.

ఆమె వాదనలో కొంత నిజం లేకపోలేదు. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 73,000 కోట్లు కేటాయించారు. తరువాత రూ. 89,400 కోట్లకు సవరించారు. వాస్తవంలో రూ. 98,468 కోట్లు ఖర్చు చేశారు.

కానీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకంపై పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు మాత్రం దీనికి డిమాండ్‌తో ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతున్నారు. ఒక సంవత్సరంలో వేతనాలు ఇవ్వకపోతే, అవి మరుసటి సంవత్సరానికి బదిలీ అవుతాయి కాబట్టి ఆ ఏడాదిలో ఖర్చు పెరిగినట్టు కనిపిస్తుందన్నది వారి వాదన.

"ప్రతి సంవత్సరం ప్రకటించే బడ్జెట్‌లో ఎక్కువ భాగం గత సంవత్సరం వేతనాలపై ఖర్చు అవుతోంది. అందువల్ల ఆ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వచ్చేసరికల్లా బడ్జెట్ మొత్తం ఖర్చు అయిపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆ ఏడాది ఖర్చులన్నిటికీ సరిపోయేంత పెంచుకోలేం" అని ఐఐటీ దిల్లీలోని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రితికా ఖేడా బీబీసీతో అన్నారు.

దోరాయీ హెంబ్రం

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

ఫొటో క్యాప్షన్, దోరాయీ హెంబ్రం

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఎందుకు ముఖ్యం?

2006లో ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో జెనాగడియా అనే గ్రామంలో ఎన్ఆర్ఈజీఏ (అప్పటి పేరు) పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన జావేద్ అలీని అప్పట్లో ఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుల నాయకుడిగా చేశారు.

"జెనాగడియాలో ఐదు చెరువులు, 12 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ఈ చెక్‌డ్యామ్‌లు, చెరువుల చుట్టూ దాదాపు 1500 బీఘాల (ఒక బీఘా సుమారు 17452 చదరపు అడుగులు) వ్యవసాయ భూములు ఉన్నాయి. 2007కి ముందు నీటి వనరులు లేక మేం గోదుమలను పండించలేదు. కానీ, 2009 తరువాత మేమెప్పుడూ బియ్యం, గోదుమపిండి బయటి నుంచి కొనుక్కోలేదు అంటే చెరువులు, చెక్‌డ్యామ్‌ల వల్ల ఎంత మార్పు వచ్చిందో మీరే ఆలోచించండి" అన్నారు జావేద్ అలీ.

జావేద్ అలీ కూతురు రజీనా బీబీ కూడా ఎన్ఆర్ఈజీఏ కింద కూలి పనిచేశారు. నాలుగేళ్ల క్రితం ఆమెకు పెళ్లి చేసి పంపించినప్పుడు, అప్పగింతల సమయంలో రూ. 16,000 విలువైన మంచం, రూ. 12,000 విలువైన అల్మారా, రూ. 20,000 నగదు కూడా ఇచ్చారు.

ఇప్పటి పరిస్థితి చూస్తే, ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా జిల్లాకు చెందిన దోరాయీ హెంబ్రం ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుడు. ఆయనకు 14 రోజుల వేతనాలు అందలేదు.

"నాకు ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురూ చదువుకుంటున్నారు. కొన్ని రోజులుగా వాళ్లు ట్యూషన్‌కు వెళ్లలేకపోతున్నారు. ఎందుకంటే వారు ఫీజులు కట్టలేదు" అని దోరాయీ చెప్పారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకంలో డబ్బులు తగ్గుతున్నాయన్న సంగతి వారికి తెలీదు. ఇదిలాగే కొనసాగితే, పిల్లలని తీసుకుని వేరే రాష్ట్రం వెళ్లిపోతానని దోరాయీ చెప్పారు.

ఉపాధి హామీ

ఫొటో సోర్స్, Getty Images

బడ్జెట్ కోతపై ప్రశ్నలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కార్మికులకు అతిపెద్ద మద్దతుగా నిలిచిన ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకంలో డబ్బు ఎందుకు తగ్గిస్తున్నారన్న అన్న ప్రశ్న రాకమానదు.

"ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదు. వీళ్లు ధనికులకు మరింత డబ్బు సమకూర్చాలనుకుంటున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం. అయినా సరే, ప్రభుత్వం రేషన్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకాల్లో కోత పెట్టిందంటే, వాళ్లు ఓట్లు గురించి కూడా పట్టించుకోవడం లేదన్నమాట. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పెద్ద పాత్ర పోషించింది. గ్రామస్థుల చేతిలో డబ్బులు ఉంటే వాళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది మొత్తం ఆర్థికవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాగూ పరిశ్రమలు స్థాపించట్లేదు. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ వలనే ఈ ప్రాంతాల్లో మార్కెట్ నడుస్తోంది. ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభంతో, ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నా ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ఇక్కడి గ్రామాలను నిలబెడ్డింది. పెద్ద పెద్ద ఆర్థికవేత్తలందరూ ఈ వాస్తవాన్ని అంగీకరించారు కూడా" అన్నారు ఎంఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్ సమితితో కలిసి పనిచేస్తున్న నిఖిల్ డే. ఎన్‌ఆర్‌ఈజీఏ ముసాయిదా తయారుచేయడంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్ సమితి కీలక పాత్ర పోషించింది.

ప్రముఖ ఆర్థికవేత్త జాన్ డ్రెజ్ మాట్లాడుతూ, "ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలు, పిల్లల పోషకాహార పథకాలు, ప్రసూతి ప్రయోజనాల వంటి ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలను ఈ ఏడాది బడ్జెట్ మళ్లీ బలహీనపరిచింది. ఈ పథకాలన్నింటికీ కేటాయింపులు తగ్గాయి" అన్నారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ గణాంకాలు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 ఫిబ్రవరి 2 వరకు దేశవ్యాప్తంగా 15,06,76,709 మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు. అంటే, వీరందరికీ ఈ సమయంలోచేతిలో పని ఉంది.

దేశవ్యాప్తంగా, రిజిస్టర్ చేసుకున్నా మొత్తాం కార్మికుల సంఖ్య 29,72,36,647. వేతనాల విషయంలో హరియాణాలో గరిష్టంగా రోజుకు రూ. 331 అందిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పంగా రూ.204 ఇస్తున్నారు. ఝార్ఖండ్‌లో రూ. 201 వేతనం ఉంది కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 27 రూపాయలు ఇస్తోంది.

ఒడిశాలో కూలీ రూ.222 కానీ, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 104 అందిస్తోంది.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ

ఫొటో సోర్స్, ANAND DUTT/BBC

బడ్జెట్ కోత ప్రభావం ఎలా ఉంటుంది?

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్ తగ్గితే కూలీ పనులు బాగా తగ్గిపోతాయి. చాలామందికి పని దొరకదు.

"ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద 45 శాతం మాత్రమే పని పొందుతున్నారు. భారతదేశంలోని 50 శాతం గిరిజనులు ఆకలితో చనిపోతున్నారని ఇటీవల యూఎన్ నివేదిక తెలిపింది. ఇప్పుడు ఎంఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్ ఇంకా తగ్గితే ఈ ప్రభావం గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. వలసలు విపరీతంగా పెరుగుతాయి. దానివల్ల నగరాల్లో కార్మికులు చౌకగా అందుబాటులో ఉంటారు. ఇది నేరుగా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఝార్ఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త జేమ్స్ హెరాంజ్ అన్నారు. ఆయన ఎంఎన్‌ఆర్‌ఈజీఏ వాచ్ అనే సంస్థ కన్వీనర్ కూడా.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద 2022-23లో ఒక కుటుంబానికి 42.85 రోజుల పని మాత్రమే దొరికింది. అయితే కూలీలకు 100 రోజుల పనిని కల్పిస్తామని ఎంఎన్‌ఆర్‌ఈజీఏ హామీ ఇచ్చింది. ఇప్పుడు బడ్జెట్‌ మరింత తగ్గితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం 20 రోజుల పని మాత్రమే దొరుకుతుంది.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ

ఫొటో సోర్స్, ANAND DUTTA/BBC

దీనివల్ల ఎంతమంది ప్రభావితం అవుతారు?

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద 262 స్కీములు ఉన్నాయి. ఈ జాబితా నుంచి రాష్ట్రాలు తమకు కావలసిన స్కీములను ఎన్నుకోవచ్చు.

ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా కుటుంబాలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఒక కూలీ ముగ్గురు కుటుంబ సభ్యులను పొషించాలనుకుంటే, 45 కోట్లకు పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితం కానున్నారు.

ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. దిగువ తరగతి ప్రజలు అప్పులో కూరుకుపోయే ముప్పు ఉంది.

విమర్శలు

కేంద్ర ప్రభుత్వ తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విమర్శించారు. 100 రోజుల పని పథకానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే తమ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్) ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

"బడ్జెట్ కోతతో మొదలెట్టి క్రమంగా ఈ పథకాన్ని పూర్తిగా మూసివేయడానికి ప్రభుత్వం నేపథ్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పుడు కార్మికులందరికీ యాప్‌లో హాజరు తప్పనిసరి చేశారు. అయితే ఆ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కూలీలకు స్మార్ట్‌ఫోన్లు లేవు. సాంకేతిక పరిజ్ఞానం గానీ అందులో శిక్షణగానీ లేదు. సర్వర్ వైఫల్యాలు, ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌లు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. దీనివల్ల ఈ పథకంలో కూలీల పనిదినాలు తక్కువ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ బడ్జెట్ తగ్గించడానికి ప్రభుత్వానికి ఇది ఒక సాకుగా దొరికింది" అన్నారు జేమ్స్ హెరాంజ్.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి: