'అదానీ ఒక్కరే ఇన్ని వ్యాపారాలు చేస్తారా?' - పార్లమెంటులో మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ, తోసిపుచ్చిన బీజేపీ

ఫొటో సోర్స్, ANI
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, అదానీ గ్రూపులపై మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోని మొదటి ఇరవై స్థానాల నుంచి పడిపోయారు. నివేదికకు ముందు ఆయన రెండో స్థానంలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీల మధ్య స్నేహబంధాన్ని లోక్‌సభలో ప్రశ్నించారు రాహుల్. కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అనుచితంగా లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. అయితే, అదే సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. లాజిక్ లేకుండా ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఆరోపణలు వస్తే వాదనలతో పాటు ఆధారాలు కూడా సమర్పించాల్సి ఉంటుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి.
ఇక పార్లమెంట్ బయట బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ''రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నిబంధనలను ధిక్కరించి ఎలాంటి రుజువులు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం'' అన్నారు.
అయితే రాహుల్, కేంద్ర ప్రభుత్వంపై దాడిని కొనసాగిస్తూనే భారత్ జోడో యాత్రలో తనను ప్రజలు ఈ ప్రశ్నలు అడిగారని గుర్తుచేసుకున్నారు. భారత్ జోడో యాత్రలో తనకు ఒకే ఒక్క పేరు వినిపించిందని 'అదానీ, అదానీ, అదానీ' అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ-అదానీల స్నేహంపై రాహుల్ ఏమన్నారు?
అదానీ గ్రూప్ ఏ వ్యాపారంలోకి ప్రవేశించినా తప్పకుండా విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ, "అదానీ ఇంతకుముందు ఒకటి లేదా రెండు వ్యాపారాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎనిమిది-పది రంగాలలో పనిచేస్తున్నారు. ఇందులో విమానాశ్రయం, డేటా సెంటర్, సిమెంట్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, పునరుత్పాదక, మీడియా, పోర్టులు ఉన్నాయి.
2014లో అదానీ నికర ఆస్తుల విలువ 8 బిలియన్ డాలర్లు. 2022లో అది 140 బిలియన్ డాలర్లుగా ఎలా మారింది?'' అని రాహుల్ ప్రధానిని ప్రశ్నించారు. "2014లో అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 609వ స్థానంలో ఉన్నారు. ఆ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. మ్యాజిక్ జరిగింది, రెండో స్థానానికి చేరుకున్నారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
గౌతమ్ అదానీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో కూర్చున్న ఒక ఫొటోను రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూపిస్తూ రాహుల్ గాంధీ 'యే దేఖియే రిష్తా, యే రిష్తా హై (ఈ బంధం చూడండి)' అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య ఈ బంధం మొదలైందని రాహుల్ గాంధీ వాదించారు.
''భారతదేశ వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ప్రధానితో భుజం, భుజం కలిపి పనిచేశారు, మద్దతు ఇచ్చారు. ఇది జోక్ కాదు. ఆయన (గౌతమ్ అదానీ) ప్రధానికి విధేయుడిగా ఉన్నారు'' అని రాహుల్ అన్నారు.
మోదీకి వైబ్రెంట్ గుజరాత్ ఆలోచనలో గౌతమ్ అదానీ సాయపడ్డారని, దీంతో ఆయనకు ఈయన అండగా నిలిచారన్నారు రాహుల్. దాని ఫలితంగానే గౌతమ్ అదానీ వ్యాపారం అభివృద్ధి చెందిందని ఆరోపించారు.'ప్రధాని దిల్లీకి రాగానే అసలు మ్యాజిక్ మొదలవుతుంది, 2014లో మ్యాజిక్ మొదలైంది, 2014లో 609వ స్థానంలో ఉండేవారు, కొన్నేళ్లలో రెండో స్థానానికి వచ్చారు'' అని రాహుల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అదానీ కోసం రూల్స్ మార్చారు
గౌతమ్ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో ఎయిర్‌పోర్టు పనులకు సంబంధించి అనుభవం ఉన్న కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వాలనే నిబంధన పెట్టారని, అయితే, అదానీ విషయంలో నిబంధనలను మార్చి ఆరు విమానాశ్రయాలను అప్పగించారన్నారు.
ముంబయి విమానాశ్రయం గతంలో జీవీకే వద్ద ఉండేదని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలను ప్రయోగించి వారిపై ఒత్తిడి తెచ్చి ఆ విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
"ఈ రోజు అదానీ తన విమానాశ్రయం నుంచి భారతదేశం 24 శాతం విమాన ట్రాఫిక్‌ను, 31 శాతం సరుకులను క్లియర్ చేశారు. భారత ప్రభుత్వం ఆయనకు ఈ పని ఇచ్చింది" అన్నారు రాహుల్. అదానీ గ్రూప్ డ్రోన్‌లను తయారు చేసే పని గతంలో ఎన్నడూ చేయలేదని, అయితే, నేడు చేస్తున్నారని ఈ డ్రోన్‌లను భారత సైన్యం ఉపయోగిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ చిన్న ఆయుధాల నుంచి స్నిపర్ రైఫిల్స్ వరకు తయారు చేస్తున్నారని, భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య రక్షణ సంబంధాలను అదానీకి ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
ప్రజల సొమ్మును అదానీ గ్రూపులో ఎందుకు పెట్టారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆ దేశం నుంచి అదానీ కాంట్రాక్టులు పొందడం ప్రారంభిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. "ప్రధానమంత్రి ఆస్ట్రేలియాకు వెళతారు, మాయాజాలం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీకి బిలియన్ డాలర్ల రుణాన్ని అందజేస్తుంది" అని రాహుల్ విమర్శించారు."మోదీ మొదటి బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు విద్యుత్తు విక్రయించాలని నిర్ణయించారు. కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ అదానీతో 25 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. అదానీకి 1,500 మెగావాట్లు విద్యుత్ ఒప్పందం" అని చెప్పారు.
విండ్ పవర్ ప్రాజెక్టు అదానీకి ఇవ్వాలని అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది భారత విదేశాంగ విధానం కాదని, అదానీ విదేశాంగ విధానమని రాహుల్ మండిపడ్డారు.అదానీ గ్రూప్‌కు సాయం చేసేందుకు ప్రభుత్వం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల సొమ్మును వారి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్‌బీఐ రూ. 27 వేల కోట్లు, పీఎన్‌బీ రూ. 7 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5,500 కోట్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని రాహుల్ అన్నారు. ఎల్‌ఐసీ ఎక్స్‌పోజర్ రూ. 36,000 కోట్లు, మూడు కోట్ల ఎస్‌బీఐ, ఇతర పీఎస్‌యూ బ్యాంకు ఖాతాదారుల సొమ్ము అదానీకి చేరుతోందని ఆరోపించారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఉటంకిస్తూ షెల్ కంపెనీలు భారత్‌కు వేల కోట్ల రూపాయలను పంపుతున్నాయని ఆరోపణలు గుప్పించారు.
ప్రధానికి రాహుల్ సంధించిన ప్రశ్నలేంటి?
విదేశీ పర్యటనలకు ప్రధాని, గౌతమ్ అదానీ కలిసి ఎన్నిసార్లు వెళ్లారు?ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత అదానీ ఎన్నిసార్లు ఆ దేశాలకు వెళ్లారు?ప్రధాని వెళ్లిన వెంటనే అదానీ అక్కడికి ఎన్నిసార్లు వెళ్లారు?ప్రధాని పర్యటన తర్వాత గౌతమ్ అదానీకి కాంట్రాక్టులు ఇచ్చిన దేశాలు ఎన్ని?గత 20 ఏళ్లలో అదానీ బీజేపీకి ఎంత డబ్బు ఇచ్చారు?ఎలక్టోరల్ బాండ్లలో అదానీ ఎంత డబ్బు ఇచ్చారు?

ఫొటో సోర్స్, SANSADTV
రాహుల్ విమర్శలపై బీజేపీ స్పందనేంటి?
లోక్‌సభలో రాహుల్ గాంధీ మోదీపై ఆరోపణలు చేస్తున్న సమయంలో పలువురు బీజేపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. రాహుల్ గాంధీ ప్రధానిపై హేతుబద్ధత లేకుండా దూషిస్తున్నారని, ఆయన అలా ఎలా మాట్లాడుతారని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు వాదించారు. ఆరోపణలు చేస్తే వాదనలతో కూడిన రుజువులు సమర్పించాలని, కేవలం ఆరోపణలు చేయడం వల్ల ఫలితం ఉండదని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
జార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 'దొంగతనం, దూషణల ఉదాహరణ చూడాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే చూడాలి' అని విమర్శించారు.
2010 ఆగస్టులో ఆస్ట్రేలియాలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి కోల్ మైన్ టెండర్ ఇచ్చిందని నిషికాంత్ దుబే గుర్తుచేశారు. రాహుల్ గాంధీ మాదిరిగానే రాజస్థాన్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, ఊమెన్ చాందీ, కమల్‌నాథ్‌లతో అదానీ సంబంధాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పరిస్థితి వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్‌కి వెళ్లినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో అశోక్ గెహ్లాట్‌తో పాటు అదానీ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు దూబే.మరోవైపు కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలను బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. తమకు నచ్చిన వ్యక్తులకు కాంగ్రెస్ 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులు ఇచ్చిందని, దీంతో దేశానికి రూ.1,96,000 కోట్ల నష్టం వాటిల్లిందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
''బోఫోర్స్‌లో రాహుల్‌గాంధీ తండ్రిపైనే ఆరోపణలు ఉన్నాయి. నిందితులను తరిమికొట్టే పని జరిగింది. అవినీతికి పాల్పడిన వారిని ఆదరించిన చరిత్ర మీ కుటుంబానికి ఉంది'' అన్నారు రవిశంకర్.

ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









