ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్

ఫొటో సోర్స్, ZIYA PAVAL/INSTAGRAM
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ హిందీ, బెంగళూరు
బిడ్డకు జన్మనిచ్చేందుకు హార్మోన్ చికిత్సను ఆపుకున్న భారతీయ ట్రాన్స్‌జెండర్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. కొన్ని కారణాల వల్ల నెల రోజుల ముందే జహాద్‌కు డెలివరీ చేయాల్సి వచ్చింది.
ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం జహాద్ బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా బీబీసీకి తెలిపారు. అయితే పుట్టిన బిడ్డ లింగం, పేరు వివరాలను వారు వెల్లడించలేదు.
అంతకు ముందు వీరి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కేరళలో నివసించే 21 ఏళ్ల జియా పావల్, 23 ఏళ్ల జహాద్‌లు తమ లింగ మార్పిడి సమయంలో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, ZIYA PAVAL/INSTAGRAM
అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారిన పావల్ తాను తల్లి కావాలని ఎల్లప్పుడూ కోరుకునేది.
అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారిన జహాద్ గర్భం దాల్చాడు.
కొద్ది రోజుల ముందు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ను షేర్ చేసిన ఈ జంటకు సోషల్ మీడియా పేజీల్లో శుభాకాంక్షలు వెల్లివెత్తాయి.
''ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా కుటుంబానికి అర్హులు'' అని ఫోటోలు షేర్ చేసిన పావల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ట్రాన్స్‌జెండర్ నటి ఎస్ నేఘా కామెంట్ చేశారు.
''మా అనుభవం భారత్‌లో చాలా అరుదు. ఇప్పటి వరకు మనకు తెలిసి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తల్లిదండ్రులైన వారు ఎవరూ లేరు'' అని పావల్, జహాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, ZIYA PAVAL / INSTAGRAM
ఇంటి నుంచి పారిపోయి...
భారత్‌లో 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్ ప్రజలున్నారని అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ట్రాన్స్‌జెండర్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇతర ప్రజలు పొందే హక్కులన్ని ట్రాన్స్‌జెండర్లకు వర్తిస్తాయని 2014లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అయినప్పటికీ, ఇంకా విద్య, వైద్య సౌకర్యాలు పొందడంలో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు పక్షపాత ధోరణిని ఎదుర్కొంటూ, నిందలను కూడా భరించాల్సి వస్తుంది.
బిడ్డ కోసం మీరిద్దరూ కలిశారా? అని అడిగినప్పుడు జియా నవ్వుతూ 'లేదు, మేం ప్రేమలో పడ్డాం' అన్నారు.
వీరు ఇద్దరు కొన్ని కారణాల వల్ల తమ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. మూడేళ్ళ కిందట వారు తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.
''నేను సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు అనుమతించే వారే కాదు'' అని పావల్ చెప్పారు. ''నా తల్లిదండ్రులకు చాలా పట్టింపులు ఎక్కువ. నా జుట్టును ఎప్పుడూ కత్తిరిస్తూ ఉండేవారు. దీంతో, నేను డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లలేకపోయేదాన్ని'' అని చెప్పారు
యూత్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తాను ఇంటి నుంచి పారిపోయానని, ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్లలేదని పావల్ చెప్పారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సెంటర్‌లో తాను నాట్యం నేర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కోజికోడ్ జిల్లాలోని విద్యార్థులకు నాట్యం నేర్పుతున్నారు పావల్.
జహాద్ తిరువనంతపురం నగరంలోని మత్స్యకారుల కమ్యూనిటీలో ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. అకౌంటెంట్‌గా శిక్షణ తీసుకున్న జహాద్, ప్రస్తుతం ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు.
తాను ట్రాన్స్‌జెండర్ తెలిసిన తర్వాత, జహాద్ ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. జహాద్ గర్భం దాల్చిన తర్వాత, ఆయన కుటుంబం ఆ జంటను ఆశీర్వదించింది. వారికి జహాద్ కుటుంబం అండగా నిలుస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో జహాద్‌కు వారెంతో సాయపడుతున్నట్టు పావల్ చెప్పారు.
తొలుత ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటికి చెప్పొద్దని చెప్పిన జహాద్ తల్లి అనుమతితో గత వారమే వారు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో ఈ శుభవార్తను ప్రకటించారు.
అయితే, పావల్ కుటుంబం మాత్రం ఇంకా తనని అంగీకరించడం లేదు.

ఫొటో సోర్స్, ZIYA PAVAL/INSTAGRAM
హార్మోన్ థెరపీ ఆపేశారు...
ఏడాదిన్నర క్రితమే తాము బిడ్డను కనాలని నిర్ణయించుకున్నామని, ఆ సమయంలో ఇద్దరం తమ లింగ మార్పిడిలో వివిధ రకాల దశల్లో ఉన్నట్లు పావల్ బీబీసీకి తెలిపారు.
అప్పటికీ జహాద్ గర్భాశయం, అండాశయాలు తొలగించలేదు. దీంతో, డాక్టర్ల సూచన మేరకు ఈ జంట తమ హార్మోన్ థెరపీని ఆపేసుకుని, బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.
ఈ జంటకు చికిత్స ఇస్తున్న డాక్టర్లు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు.
''ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, సెక్స్ హర్మోన్ థెరపీని వారు కొనసాగించుకోవచ్చు'' అని పలువురు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు చికిత్స అందించిన బెంగళూరు నగరంలోని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ మహేశ్ డీఎం అన్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత, తాము మరింత పని చేయాల్సి ఉంటుందని ఈ జంట చెప్పింది.
జీవనం సాగించాలంటే చాలా కష్టమని, మరింత మంది విద్యార్థులకు తాను డ్యాన్స్ క్లాస్‌లు తీసుకుంటానని పావల్ అన్నారు.
బిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలలకు జహాద్ కూడా తన పనికి వెళ్తాడని, తాను బేబీని చూసుకుంటానని చెప్పారు.
వారి ప్రెగ్నెన్సీని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కూడా సంతోషంగా ఆహ్వానించిందని ఈ జంట తెలిపింది.
'అవును, మా కమ్యూనిటీలో, బయట ప్రపంచంలో మూసపోత పద్ధతులను నమ్మే వారు కొందరుంటారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి బేబీని కనలేరని వారు అనుకుంటూ ఉంటారు'' అని పావల్ అన్నారు. అదంతా తాము పట్టించుకోమని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- బిల్లా, రంగా ఎవరు... వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది?
- అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది... మరి లాభపడింది ఎవరు?
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- తుర్కియే-సిరియా భూకంపం: 4,300 దాటిన మృతుల సంఖ్య... కొనసాగుతున్న సహాయక చర్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









