తెలంగాణ: వికారాబాద్‌లో జరిగింది శివుని చుట్టూ చోటు చేసుకున్న ఘర్షణేనా? బీబీసీ కవరేజీలో బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాలివే...

వికారాబాద్

శివుణ్ణి అవమానించారంటూ శివ స్వాములు ఒక వ్యక్తిని కొడుతోన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో కొందరు శివ మాల వేసుకున్న వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులను కొట్టడం, ఇద్దరు పోలీసులు వారిని అడ్డుకోవడం కనిపించింది. వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ ఘటన జరిగింది.

స్టేషన్లో మాట్లాడటానికి వచ్చిన వారు అక్కడే ఉన్న నరేశ్ అనే వ్యక్తిని కొట్టారు. కాపాడటానికి వెళ్లిన ప్రేమ్ అనే వ్యక్తినీ కొట్టారు. అతని వంటినిండా గోర్లతో గీట్లు పడ్డాయి. మాల వేసుకున్న వారే రాయితో కూడా కొట్టారు. మరికొందరు మాల వేసుకున్న వారు ఆ రాయి కింద పారేయించారు. ఆ దెబ్బలకు నరేశ్ రెండు మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతణ్ణి కొట్టడానికి శివ స్వాములు చెప్పిన కారణం, సదరు నరేశ్ అనే వ్యక్తి శివుణ్ణీ, శివ మాలనీ, శివ స్వాములనూ తిట్టాడని..

దీనిపై క్షేత్ర స్థాయిలో కవరేజీకి వెళ్లిన బీబీసీకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పైకి శివుణ్ణి తిట్టారు అనేది ప్రచారం అయినా అసలు వాస్తవం వేరే ఉందని తెలుస్తోంది.

యాలాల మండలంలోని దేవనూరు గ్రామంలో ఎస్సీలు (మాల, మాదిగ), బీసీలు (ముదిరాజ్, ఈడిగ, గౌడ ఇతరులు) ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్యా కొంత కాలంగా వివాదం ప్రారంభం అయింది. ఆ గ్రామంలో రోడ్డుపక్కన బస్టాండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహం పెట్టుకోవాలని ఎస్సీల కోరిక. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వారికి అంబేడ్కర్ విగ్రహాన్ని ఉచితంగా అందించారు. ఆ విగ్రహం ఊరిలోకి వచ్చాక, విగ్రహం కోసం పునాదులు తవ్వారు. అప్పటి నుంచీ మొదలైంది ఊరిలో గొడవ.

''ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం ఎలా పెడతారో చూద్దాం'' అనే తరహాలో కొందరు బీసీ యువత వ్యాఖ్యానించడంతో, ఎస్సీ వర్గం వారు, సదరు బీసీ యువతతో చర్చలు జరిపారు. క్షమాపణలు గొడవ సద్దుమణిగింది.

అంబేడ్కర్

ఆ తరువాత మరో గొడవ జరిగింది

''ఆ మరునాడు బస్టాప్ దగ్గర ఆటోలో కూర్చున్న కొందరు దళిత యువకులు అంబేడ్కర్ పాటలు వింటున్నారు. అటుగా వెళుతోన్న కొందరు బీసీలు ఆ పాటలు విన్నారు. ఈ కొడుకులకు ఎక్కువైంది అంటూ కామెంట్ చేశారు. ఆ మాటలు విన్న ఎస్సీలు వారిని ఆపి ప్రశ్నించారు. అది గొడవగా మారింది. ఎస్సీలు, బీసీలు రెండు వైపుల వాళ్లూ అక్కడకు వెళ్లారు.

ఆ గొడవలో బీసీల తరపున శివ మాల వేసుకున్న నరేంద్ర వచ్చారు. ఎస్సీల తరపున నరేశ్ వెళ్లారు. ఆ గొడవ సర్దే క్రమంలో శివ మాల వేసుకున్న నరేంద్ర తాను మాల వేసుకున్న విషయం కూడా మర్చిపోయి బూతులు మాట్లాడాడు. దీంతో నరేశ్ వెంటనే స్పందించి, మాల వేసుకుని బూతులు మాట్లాడుతున్నావు, నువ్వేం స్వామివి అంటూ నెట్టాడు. ఆ తరువాత గొడవ సద్దుమణిగింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పి వెళ్లారు. కానీ నరేంద్ర మాత్రం మాల వేసుకున్న తనను అవమానించారంటూ, ఏకంగా శివుణ్ణే అవమానించారంటూ కేసు పెట్టాడు. మా ఎస్సీల మీద కోపంతో కులం కాకుండా మతం కోణం తెచ్చారు. అసలు మా అన్న శివుణ్ణి ఏమీ అనలేదు. శివమాల వేసుకున్న వ్యక్తి బూతులు మాట్లాడాడు కాబట్టే స్పందించాడు.'' అంటూ తమ వాదన వినిపించారు దెబ్బలు తిన్న నరేశ్ తమ్ముడు రవి.

''ఆ మరునాడు వాట్సప్ గ్రూపుల్లో మా అన్న నరేశ్ ఫోటోను, నరేంద్ర వైరల్ చేశాడు. శివుణ్ణి అవమానించారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు మా అన్నను స్టేషన్ కు పిలిస్తే వెళ్లాం. అప్పుడే అక్కడకు చేరుకున్న శివ స్వాములు స్టేషన్ లోపల ఉన్న మా అన్నను పోలీసుల ముందే బయటకు తీసుకొచ్చి కొట్టారు.'' అంటూ వివరించారు రవి.

వాస్తవానికి ఎస్సీల మీద కక్షతో నేరుగా ఏం చేయలేక, ఇలా మతం కోణం తెచ్చారని ఆరోపిస్తున్నారు కుల నిర్మూలన పోరాట సమితి వారు. గొడవ జరిగిన గ్రామంలో ఈ సంస్థ ప్రతినిధులు పర్యటించారు. వారు నరేశ్ తప్పు లేదని చెబుతున్నారు.

వికారాబాద్

కుల గొడవను మత చిచ్చుగా మార్చారా?

''ఆటోలో పాటల వ్యవహారం గొడవ సర్దుమణిగాకే అసలు పథకం తయారు అయింది. జనవరి 31వ తేదీన స్వాములు భిక్ష తీసుకునే సమయంలో ఒక సమావేశం జరిపారు. తనకు జరిగిన అవమానానికి శివ స్వాములు అంతా కలిసి రావాలని నరేంద్ర కోరాడు. నిజానికి చాలా మంది శివ స్వాములు కూడా దానికి ఒప్పుకోలేదు. చివరకు వారందరినీ ఒప్పించిన నరేశ్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడే అసలు గొడవ అయింది. చాలా దారుణంగా కొట్టారు, గోర్లతో రక్కారు. నాకు తెలిసి శివ స్వాములు అయితే ఇలా చేయరు. అసలు నరేశ్ హిందూ దేవుళ్లను ఏమీ అనలేదు. అంబేడ్కర్ విషయంలో గొడవను, కులం పరంగా బలం ఉండదనీ, మతంపరంగా మార్చారు'' అంటూ బీబీసీతో చెప్పారు కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్.

''అంతమంది ఎస్సీలు ఉన్న గ్రామంలో ఇప్పటి వరకూ అంబేడ్కర్ విగ్రహం లేదు. మొదటిసారి వారు అంబేడ్కర్ విగ్రహం పెట్టాలనుకున్నారు. అది బీసీలకు నచ్చలేదు. ఆ ఊరిలో బీసీలు సంఘంగా ఏర్పడి ఎస్సీలను చెఱువులో చేపలు కూడా పట్టుకోనివ్వడం లేదు. ఇలా చాలా అంతరాలు ఉన్నాయి అక్కడ. దీంతో బీసీలు వారిపై అక్కసు పెంచుకున్నారు.'' అంటూ ఊరి నేపథ్యం వివరించారు అభినవ్.

నరేశ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసి కొట్టిన నరేంద్రపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు చెప్పారు అభిరామ్. గతంలో ముస్లింల పండుగల సందర్భంపై ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముస్లింలు పాతే పీర్ల పండుగ జెండాలు పీకేసారని కేసు కూడా నమోదు అయింది. నరేంద్రపై గతంలో పీర్ల పండుగ జెండాలు పీకేసిన కేసు ఉన్నట్టు పోలీసులు కూడా బీబీసీతో ధృవీకరించారు.

''నరేశ్ శివ స్వామిని తోసింది వాస్తవం. వాళ్లిద్దరీ మధ్య గొడవ జరిగిందీ వాస్తవం. కానీ నరేశ్ శివుణ్ని ఏమీ అనలేదు. శివస్వామిని తోశాడు. వాళ్లిద్దరూ పరస్పరం తిట్టుకుని ఉండొచ్చు కూడా. కానీ అది మాల వేసుకున్న వ్యక్తిని అవమానించినదాన్ని దేవుణ్ణే అవమానించారంటూ టర్న్ అయి వీడియో వైరల్ అయిపోయింది'' అంటూ బీబీసీతో అన్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి.

జెండాలు దేవనూరు

దళితుల ఆలయ ప్రవేశంపై

ఆ గ్రామంలో కుల వివక్ష ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీబీసీ గ్రామంలో పర్యటించినప్పుడు, బీసీ వర్గానికి చెందిన శివ స్వాములు, నరేంద్ర తరపున వాదన వినిపించడానికి అక్కడ ఎవరూ ముందుకు రాలేదు. అయితే వారి సంభాషణల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

''ఆ ఎస్సీలు వచ్చి ఆంజనేయ స్వామిని ముట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నారు. శివుడికి పూజలు చేసేస్తున్నారు. ఏమన్నా అంటే మీరు మనుషులే మేమూ మనుషులమే అంటున్నారు. మీ రక్తం, మా రక్తం ఒకటే అంటున్నారు. ఏం అనగలం ఇక?'' అంటూ వ్యాఖ్యానించారు ఒక బీసీ వ్యక్తి. దళితుల దేవాలయ ప్రవేశంపై అతని ఆవేదన ఇది. ఆ ఊరిలో కులపరమైన వెనుకబాటకు ఇది ఒక సంకేతం.

గ్రామంలో ఎస్సీల్లో హిందువులతో పాటూ, క్రైస్తవుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి.

ఈ కేసులో రెండు వర్గాలూ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ''30వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నా మిత్రుడు బోయిన శ్రీనివాస్ ని కొడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్లాను. వెళ్లి గొడవ ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన వారెవరు శివ స్వాములను ఏమనవద్దు అంటూ ఏమీ అనలేదు. కానీ మెట్ల నరేష్ అనే వ్యక్తి మాత్రం నేను శివ స్వామినని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నాపై చేయి చేసుకొని నన్ను దుర్భాషలాడాడు. నీది మాలన అంటూ శివ స్వామిని ఆ పరమేశ్వరుని నిందించాడు. శివమాలను అవమానపరిచాడు నా కాలర్ పట్టుకుని. అప్పుడు ఐదుగురు స్వాములు సాక్ష్యం చూశారు. శివమాలను అవమానించి నన్ను బూతులు తిట్టిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మనవి. నాకు జరిగిన అవమానానికి చుట్టుపక్కల గ్రామాల్లో శివ స్వాములు సాయంగా వచ్చారు.'' అంటూ నరేశ్ పై ఫిర్యాదు చేశారు నరేంద్ర.

నరేశ్‌పై శివస్వాముల దాడి

''ఆ ఫిర్యాదు విచారణలో ఉండగా శివ స్వాముల సుమారు వందమంది లక్ష్మణ రామణపురం క్రాస్ రోడ్ లో రాస్తారోకో చేశారు. అదే సమయంలో మెట్ల నరేష్ యాలాలకు వచ్చిన విషయం తెలుసుకున్న శివ స్వాములు, మెట్ల నరేష్ పై దాడి చేసి కొట్టారు. ఈ విషయంలో నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై నరేష్ పై కేసు నమోదు చేశారు. శివ స్వాములను అవమానించినందుకు నరేష్ పై కేసు పెట్టాం. నరేశ్ పై దాడి చేసినందకు నరేంద్ర సహా ఇతరులపై కూడా కేసు పెట్టాం.'' అని తాండూరు పోలీసులు ఒక ప్రకటనలో చెప్పారు.

బోడక నరేందర్, నాగేందర్, బోడక గణేశ్అరవింద్ గౌడ్, వడ్డే శివ కుమార్, వడ్ల మోహన చారి, నీటూరి వెంకటేశ్, జక్కేపల్లి బుగ్గప్ప, తోపే బాలరాజు తొమ్మిది మంది నరేశ్ పై దాడి చేసిన వారిలో ఉన్నారు.

మరోవైపు అటు శివస్వాములు, వివిధ హిందూ సంఘాల వారూ రాస్తారోకో చేశారు. అటు నరేశ్ కి న్యాయం చేయాలంటూ కుల నిర్మూలన పోరాట సమితి వారూ, ఇతర దళిత సంఘాల వారూ తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

వికారాబాద్

అసలు ట్విస్ట్

దీనిపై పోలీసులు విచారణలో ఆసక్తికర విషయాలు తెలిసాయి.

''ధర్నా చేస్తోన్న శివ స్వాములను నరేశ్ పై దాడి చేయాలనే దిశగా ప్రేరేపించింది మురళీకృష్ణ గౌడ్ అనే వ్యక్తి. అతని మాటలు విని దేవనూరు యువకులు, శివ స్వాములు రెచ్చిపోయి నరేశ్ ని కొట్టారు. దాడి చేసిన నరేంద్ర సహా ఇతర యువకులను విచారించినప్పుడు ఇదే తేలింది.

నరేశ్ పై దాడి చేసిన స్వాములు నరేంద్ర, నరేంద్ర గౌడ్, అరవింద్ గౌడ్, శివ కుమార్, గణేశ్ లకు మురళీకృష్ణే తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. వాళ్లనూ అరెస్టు చేశాం, వారిని ప్రోత్సహించి, పోలీసుల నుంచి దాచిపెట్టిన మురళీకృష్ణ గౌడ్ ను కూడా అరెస్టు చేశాం.'' అని మీడియాతో చెప్పారు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్.

అటు దేవనూరు గ్రామంలో ఆటో దగ్గర జరిగిన గొడవ కేసులో భాగంగా దెబ్బలు తిన్న మెట్ల నరేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నరేశ్ ని కొట్టాలని రెచ్చగొట్టిన మురళీకృష్ణ గౌడ్ తో పాటూ దాడి చేసిన శివ స్వాములు ప్రస్తుతం పరిగి సబ్ జైలులో ఉన్నారు.

''కొంతమంది తమ స్వార్థం రెచ్చగొడితే కుల, మత గొడవల్లోకి దూరిపోవద్దు. దాని వల్ల మీ జీవితం నాశనం అవుతుందంటూ'' యువకులకు హితవు చెప్పారు స్థానిక డీఎస్పీ శేఖర్ గౌడ్.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)