తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
- తుర్కియే, సిరియా భూకంపంలో 5,000 మందికి పైగా మృతి
- ఫిబ్రవరి 6న తెల్లవారుజామున తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం
- తుర్కియేలోనే 3381 మంది మరణించినట్టు విపత్తు నిర్వహణ విభాగం వెల్లడి
- భూకంపం వల్ల ఇరు దేశాల్లో 15 వేల మందికి పైగా గాయాలు
- ఆస్తులకు తీవ్ర నష్టం, పేక మేడల్లా కుప్పకూలిన భవనాలు, ఎటు చూసినా బాధితుల ఆర్తనాదాలు
- మెడికల్ సప్లయిస్, డాగ్ స్క్వాడ్, డ్రిల్ మెషిన్ వంటి ముఖ్యమైన పరికరాలను తుర్కియేకు పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
తుర్కియే, సిరియాలలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా హృదయ విదారకర దృశ్యాలే. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమల్ని కాపాడాలంటూ వాయిస్ మెసేజ్‌లను పంపుతున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో భారత్‌తో సహా చాలా దేశాలు తుర్కియే, సిరియాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
భారీ భూకంపం తర్వాత ఆ దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షం, మంచు సహాయక చర్యలకు ఆటంకంగా నిలుస్తున్నాయి.
భూకంపం వల్ల పేకమేడల్లా కూలిన భవంతుల కింద ప్రజలు సమాధయ్యారు. చాలా మంది శిథిలాల కిందనే చిక్కుకుపోయి కాపాడాలంటూ కేకలు వేస్తున్నారు.
మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అంచనావేస్తోంది. తుర్కియేకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం సహాయక చర్యలకు అవసరమైన అన్ని రకాల వస్తువులను పంపింది.
ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
భారత సాయానికి తాము ఎంతో రుణపడి ఉంటామని తుర్కియే అంబాసిడర్ ఫిరత్ సునెల్ తెలిపారు. కష్టకాలంలో స్నేహితుడు మాత్రమే సాయం చేయగలడని అన్నారు.
ఈ ప్రకృతి విలయ తాండవాన్ని చూసిన చాలా మంది ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మరోవైపు సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Photo by ERDEM SAHIN/EPA-EFE/REX/Shutterstock
తుర్కియే, సిరియాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన దేశాలు
- 65 దేశాలకు చెందిన 2600 మందికి పైగా సహాయక సిబ్బంది తమకు సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు తుర్కియే ఎమర్జెన్సీ ఏజెన్సీ ఏఎఫ్‌ఏడీ తెలిపింది.
- శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి, చికిత్స అందించేందుకు తుర్కియేలో 629 క్రేన్లు, 360 వాహనాలను వాడుతున్నారు.
- ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా దుప్పట్లు, 41 వేలకు పైగా ఫ్యామిలీ టెంట్స్ అందించారు.
- భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు వంట సామాగ్రిని పంపిస్తున్నారు.
- భూకంపం వల్ల వేలాది భవంతులు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ప్రజలు ఈ భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితులయ్యారు.
- సిరియాకు సాయం చేసేందుకు ఇరాన్, ఇరాక్‌లు కూడా ముందుకు వచ్చాయి.
సిరియాలో కొన్ని నగరాలు భయంకరమైన వినాశనాన్ని ఎదుర్కొన్నాయి. చాలా మంది ప్రజలు ఈ బాధను తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. సాయం కోసం కేకలు వేస్తున్నారు. కానీ, వారిని కాపాడేందుకు అక్కడ ఎవరూ లేకపోవడం మరింత బాధాకరంగా మారింది.
దశాబ్దానికి పైగా కొనసాగిన యుద్ధం వల్ల ఇప్పటికే తీవ్ర వినాశనాన్ని చవిచూసింది ఆ ప్రాంతం.
ఇలాంటి పరిస్థితుల్లో, భూకంపం సంభవించడం ఆ ప్రాంత ప్రజలకు మరింత దారుణమైన పరిస్థితులను, బాధను కలిగిస్తోంది.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాలు
భూకంపం సంభవించిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాలు, వీడియోలు ఎన్నో బయటికి వస్తున్నాయి.
కొందరు ప్రత్యక్ష సాక్షులతో బీబీసీ మాట్లాడింది. వారేం చెప్పారో మనం కింద చూద్దాం..
''నా జీవితంలో ఇలాంటి భూకంపాన్ని నేనెప్పుడూ చూడలేదు. మేము నిమిషం పాటు అటు ఇటూ ఊగుతూనే ఉన్నాం. అపార్ట్‌మెంట్ షేక్ అవ్వడం ప్రారంభమైన తర్వాత, ఇక నా కుటుంబం బతకదని అనిపించింది. ఈ భూకంపంలో మేమందరం మరణిస్తాం అనుకున్నాను'' అని తుర్కియేలోని అదానా నగరానికి చెందిన నివాసి నిలోఫర్ అస్లాన్ చెప్పారు.
''నేను ఇది భూకంపం అని చెప్పాను. దగ్గరికి రండి, కనీసం అందరం ఒకే దగ్గర కలిసి చనిపోదాం అని అన్నాను. ఆ సమయంలో నాకు అలాగే అనిపించింది'' అని నిలోఫర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఈ సమయంలో మంచు కూడా కురుస్తోంది. ప్రతి ఒక్కరూ వీధుల్లోనే ఉన్నారు. అసలేం చేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. భూకంపం వల్ల మా కళ్ల ముందే భవంతుల కిటికీలు పగిలిపోయాయి'' అని తుర్కియేలోని మాలాతియాలో నివసించే 25 ఏళ్ల ఓజ్‌గుల్ కొనాక్చి చెప్పారు.
''మేము ఒకరినొకరం చూసుకున్నాం. నీవు దూకుతున్నావా? అని అడిగాను. ల్యాంప్ వైపు చూశాం. అది కింద పడిపోతుంది. మా మూడేళ్ల మేనల్లుడు రూమ్‌లోకి రాగానే మేం సోఫాలోంచి కిందకు దూకేశాం'' అని కొనాక్చి తెలిపారు.
తాము ఎంతో ఆందోళనకు గురయ్యామని సిరియా రాజధాని డమాస్కస్‌లోని సమర్ అన్నారు.

ఫొటో సోర్స్, MY
భూకంప తీవ్రతపై సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్న ప్రజలు
తుర్కియే, సిరియాల్లో భూకంపం వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులను ఫోటోలు, వీడియోల రూపంలో ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భూకంపం వల్ల ప్రభావితమైన ఎంతో మంది ప్రజలతో బీబీసీ తుర్కియే సర్వీస్ మాట్లాడింది. ఇలాంటి భూకంపాన్ని తామెప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారు.
ప్రజలు షేర్ చేసిన ఈ వీడియోలను చూసిన తర్వాత భూకంప తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భూకంపం తర్వాత ఆ ప్రాంతం ఎంత దారుణంగా మారిందో ఆకాశం నుంచి తీసిన ఈ ఫోటోలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
భూకంపం రావడానికి కారణాలేంటి?
భూమి ఉపరితలం వేర్వేరు పలకలతో రూపొందినదై ఉంటుంది. ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి.
ఇవి తరచుగా కదలుతుంటాయి. కానీ, కొన్నిసార్లు పక్క పక్కనే ఉండే పలకల అంచులు ఒకదానితో మరొకటి తగిలి ఆగిపోతుంటాయి. మరొకవైపు పలకలు కదలడానికి ప్రయత్నిస్తుంటాయి. అందువల్ల అంచుల వల్ల ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.
అలా ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినప్పుడు ఒక పలక మీదకు మరొక పలక చేరడం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలో భూమి పొరలు కదులుతాయి. అలా ఆకస్మిక కదలికల కారణంగా పుట్టే తరంగాలతో భూమి కంపిస్తుంది.
తుర్కియేలో సంభవించిన భూకంపంలో అరేబియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్‌పైకి చేరింది.
గతంలో సంభవించిన చాలా తీవ్రమైన భూకంపాలకు భూ ఉపరితంలోని పలకల మధ్య రాపిడి కారణమైంది.

ఇవి కూడా చదవండి:
- ట్రాన్స్‌జెండర్ జంటకు బిడ్డ పుట్టబోతోంది... వైరల్‌గా మారిన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది... మరి లాభపడింది ఎవరు?
- ఆంధ్రప్రదేశ్: శాసనమండలి ఎన్నికలు ఎందుకు కీలకం, ప్రధాన పార్టీలకు ఇది పరీక్ష కాబోతోందా?
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









