ఆంధ్రప్రదేశ్: శాసనమండలి ఎన్నికలు ఎందుకు కీలకం, ప్రధాన పార్టీలకు ఇది పరీక్ష కాబోతోందా?

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తూర్పు రాయలసీమ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. అదే సమయంలో విపక్ష పార్టీలు యాత్రలతో దూకుడు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ విడుదలకు గడువు సమీపిస్తోంది.

రాష్ట్రంలో వివిధ కోటాల్లో ఖాళీ అవుతున్న స్థానాలకు మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో సీట్లు పాలక వైఎస్సార్సీపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కానీ, పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో మాత్రం ఆపార్టీకి పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి పదే పదే విమర్శలు వస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి.

సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయలనే లక్ష్యంతో ఇప్పటికే పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్న విపక్షాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్నమైన వైఖరి ప్రదర్సిస్తున్నాయి.

టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. జనసేన పోటీకి దూరంగా ఉంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పీడీఎఫ్ పేరుతో పోటీ చేస్తున్న నేతలకు సీపీఎం, సీపీఐ మద్ధతు ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో, ఈ ఎన్నికల ఫలితాల మీద అందరి దృష్టి పడుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పశ్చిమ రాయలసీమ వైయెస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి

ఐదు స్థానాలు- 17 జిల్లాల్లో కోడ్

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వారిలో ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మరో ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తోంది. అందులో ఇద్దరు పీడీఎఫ్‌కి చెందిన ఎమ్మెల్సీలు.. విఠపు బాలసుబ్రహ్మణ్యం (టీచర్), యండపల్లి శ్రీనివాసరెడ్డి(గ్రాడ్యుయేట్) ఉన్నారు. వారిద్దరూ తూర్పు రాయలసీమగా పిలిచే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పశ్చిమ రాయలసీమగా చెప్పుకునే పూర్వపు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న ఎస్టీయూ నేత కత్తి నరసింహరెడ్డితో పాటుగా అదే ప్రాంతం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న వైఎస్సార్సీపీ నేత వెన్నపూస గోపాలరెడ్డి పదవీకాలం కూడా ముగుస్తోంది. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన పీవీఎన్ మాధవ్ (బీజేపీ) గడువు కూడా ముగుస్తోంది.

ఈ ఐదు స్థానాలకు జరగబోతున్న ఎన్నికలు ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల పరిధిలో జరగబోతున్నాయి. పూర్వపు ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ రాగానే ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలుకాబోతోంది.

విద్యావంతుల ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు

ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిది. పట్టభద్రుల స్థానానికి డిగ్రీ పూర్తిచేసిన వారంతా అర్హులవుతారు. గడువులోగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరిశీలించి ఓటర్ల జాబితాలో చేర్చినట్టు ఈసీ ప్రకటించింది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 9,96,593 మంది ఓటర్లున్నారు.

అత్యధికంగా ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల స్థానంలో ఎక్కువ మంది ఓటర్లున్నారు. ఇక్కడ 3,83,396 మందికి ఓటు హక్కు ఉంది.

ఉపాధ్యాయుల స్థానంలో వరుసగా ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పరిధిలో 26,907 ఓట్లు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల పరిధిలో 27,774 ఓట్లు ఉన్నాయి.

పది లక్షల మంది విద్యావంతుల ఓటర్ల జాబితాపై పలు ఫిర్యాదులు వచ్చాయి. అనర్హులకు డిగ్రీ పట్టాలేకపోయినా ఓటర్ల జాబితాలో చేర్చినట్టు విశాఖ, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా ఈసీకి ఫిర్యాదులు అందాయి.

నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఓటర్లుగా నమోదయినట్టు వచ్చిన ఫిర్యాదులతో ఈసీ పలువురి పేర్లు తొలగించింది. అయినప్పటికీ విశాఖలో అనర్హులను తుది జాబితాలో చేర్చారంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మ ఫిర్యాదు చేశారు.

"ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి. అధికార పార్టీకి చెందిన వారి కాలేజీలో పనిచేస్తున్న అటెండర్ల పేర్లను అర్హత లేకపోయినా చేర్చారు. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశాం. అది పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పీడీఎఫ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్. కోరెడ్ల రమాప్రభ

అధికార పార్టీకి కీలకం...

గతంలో కూడా సాధారణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అధికార టీడీపీకి ఆశాభంగమయింది. దాని ప్రభావం సాధారణ ఎన్నికల మీద కనిపించింది.

ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే, వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న తరుణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాల్లో వైఎస్సార్సీపీ పట్టు సాధించడం అవసరం.

అధికారికంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగుతున్నారు. గతంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు పోటీ చేసిన వారికి మద్ధతు ప్రకటించడమే తప్ప పార్టీ నుంచి నేరుగా పోటీ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రిటైర్ అవుతున్న వెన్నపూస గోపాల్ రెడ్డి, గుంటూరు-కృష్ణా టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న స్నేహలతా రెడ్డి వంటి వారు వైఎస్సార్సీపీ మద్ధతుతో గెలిచారు.

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తీవ్ర నిరసన ఎదురవుతోంది. పీఆర్సీ వంటి అంశాల్లో ఛలో విజయవాడ సందర్భంగా జరిగిన పరిణామాలు అందుకు సాక్షంగా చూడాలి.

సీపీఎఫ్, డీఏల విషయంలో కూడా అసంతృప్తి వెల్లడవుతోంది. నెలా నెలా ఒకటో తేదీన వేతనాలు ఇచ్చేలా చట్టం చేయాలని ఉద్యోగ సంఘాలు గవర్నర్‌కు విన్నవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం విస్మరించిందనేది వాస్తవం" అని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) నాయకుడు ఎం రమేష్ అన్నారు.

"పాలకపక్షం మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. టీచర్లు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. కనీసం మా గొంతు విప్పేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. అందుకే టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా అర్బన్ ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారన్నది కీలకంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో 'వై నాట్ 175' అంటున్న వైఎస్సార్సీపీ అధినేతకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే ప్రతికూలత తప్పదనే విషయం తెలియకపోదు. కాబట్టి ఎలాంటి వ్యూహాలతో వెళతారన్నది ఆసక్తికరం.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఉత్తరాంధ్ర సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్

మొదలయిన ప్రచారం, తాయిలాల పంపిణీ కూడా..

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థులకు ఓటర్లు తమకు నచ్చిన క్రమంలో ఒకటి, రెండు, మూడు ఇలా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, ఓటర్లంతా ఒకేచోట ఉండే అవకాశం లేదు. కాబట్టి పోటీ చేసేందుకు పార్టీలు, అభ్యర్థులు ఏడాది ముందు నుంచే సన్నాహాలు చేస్తుంటారు. ఓటర్ల జాబితా వచ్చిన దగ్గర నుంచి, ఆయా ప్రాంతాల్లో ఓటర్లతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందుకు అనుగుణంగానే నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ప్రచారం, తాయిలాల పంపిణీ కూడా జరుగుతోంది.

సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం పంచినట్టే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో కూడా గిఫ్టులు, కొన్ని సార్లు డబ్బు పంపిణీ జరుగుతుంది.

ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ ప్రచారం సాగిస్తూనే, ఓటర్లను నేరుగా కలిసే అవకాశం లేనందున ఆన్ లైన్ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

"రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. మెగా డీఎస్సీ అంటూ ఊరించింది. కానీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్ అంటూ ఒక్కసారి ప్రకటన చేసినా, పోస్టులు లేవు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. అధికార పార్టీ తమను మోసగించిందని భావిస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పాఠం చెబుతారు" అంటూ డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన జగన్, తన హయంలో మేం ప్రత్యేక హోదా కోసం బస్సుయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారంటూ ఆయన విమర్శించారు.

అధికార దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పూనుకున్నా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని అభిప్రాయపడ్డారు.

అధికార దుర్వినియోగం అంటూ వస్తున్న ఆరోపణలను వైఎస్సార్సీపీ పశ్చిమ రాయలసీమ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండించారు.

"సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వలంటీర్లతో కలిపి 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని, అదే తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని" ధీమా వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఫొటో సోర్స్, FACEBOOK

ప్రధాన పార్టీలు నేరుగానే..

ఉపాధ్యాయ స్థానాల కన్నా పట్టభద్రుల స్థానాల మీద ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పీడీఎఫ్ తరుపున కూడా అటు టీచర్, ఇటు గ్రాడ్యుయేట్ సీట్లకు పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర సంఘాలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి.

ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో తమ రెండు సిట్టింగ్ సీట్లను గెలుచుకుంటామని పీడీఎఫ్ ధీమా వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్ర సీటు మీద కూడా ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో తమ ఎమ్మెల్సీలు చేసిన పోరాటాలను ప్రచారం చేస్తోంది.

వైఎస్సార్సీపీ నేత వెన్నపూస గోపాల్ రెడ్డి స్థానంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో ఆయన తనయుడు రవీంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. దాంతో పాటుగా మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లో తమదే గెలుపు అంటోంది ఆ పార్టీ. జగన్ ప్రభుత్వ పనితీరుకి ప్రజల్లో ఉన్న ఆదరణ గెలిపిస్తుందని వారు చెబుతున్నారు.

టీడీపీ కూడా మూడు గ్రాడ్యుయేట్ సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. అధికార పార్టీ హవాకి అడ్డుకట్ట వేయగలమని చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న తరుణంలో ఈసారి తమ పార్టీకి విజయం ఖాయమని భావిస్తోంది.

బీజేపీ కూడా సిట్టింగ్ సీటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నిలబెట్టుకోవడంతో పాటుగా మిగిలిన రెండు చోట్లా విజయం కోసం వ్యూహం రచిస్తోంది. కేంద్రలో మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకుంటామని అంటోంది.

ప్రధాన పార్టీలన్నీ ప్రత్యక్షంగా తలపడుతున్న ఈ ఎన్నికలకు జనసేన దూరంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఎవరికీ మద్ధతు కూడా ప్రకటించలేదు. యువతలో ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల మీద దృష్టిపెట్టినట్టు కనిపించడం లేదు.

గట్టి పోరు సాగే అవకాశం ఉన్న ఈ స్థానాల్లో వచ్చే నెలలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దాంతో విద్యావంతుల తీర్పు ఎలా ఉండోబోతోంది, దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఏమేరకు ఉంటుందన్నది కీలకాంశంగా మారింది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)