నరేంద్ర మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పని చేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్

ఫొటో సోర్స్, @TelanganaCMO
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారని, కానీ ఆయన ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.
ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు.
అదానీ సంస్థలకు చెందిన రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని, ఇందులో చాలా బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయన్నారు. అదానీ గ్రూప్ విషయం గురించి కనీసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. దేశంలో పెట్టుబడులు పెట్టే వారు ఇవన్నీ చూస్తారని అన్నారు.
అన్ని రంగాల్లోనూ దేశం తీవ్రంగా నష్టపోయిందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తం 192 దేశాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ర్యాంకు 139గా ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే మన ఆర్థిక వ్యవస్థ ర్యాంకునే తక్కువగా ఉందని చెప్పారు.
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే పరిమితమయ్యారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
నెహ్రూ తర్వాత ఆగమైన భారత్, ఈ రోజు వరకు మళ్లీ బాగుపడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
''నేడు భారత్ లక్ష్యం ఏమటి? ఎటు వైపు భారత్ వెళ్తోంది? లక్ష్యం లేని సమాజం ఎటు వైపు వెళ్తుంది?'' అని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘బీబీసీని బ్యాన్ చేయాలంటారా? ఇదేం ప్రజాస్వామ్యం?’
‘‘గోద్రాపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని బ్యాన్ చేశారు. అంతేకాక భారత్‌లో బీబీసీ ఛానల్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదన్నారు.
ఎల్‌ఐసీని అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన పెడుతూ, లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పజెబుతున్నారని విమర్శించారు. అంతులేని ప్రైవేటైజేషన్ చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ అని, ఇదొక నమ్మకం అన్నారు.
‘‘యూపీఏ హయాంలో గ్రోత్ రేటు మోదీ హయాంలో సగానికి పడిపోయింది’’
కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటే, మోదీ వచ్చాక 5.8 శాతానికి పడిపోయిందన్నారు. యూపీఏ హయాంలో గ్రోత్ రేటు 24 శాతం ఎక్కువని అన్నారు. మోదీ హయాంలో ఇది సగానికి సగం పడిపోయిందన్నారు.
ఎగుమతులు పెంచకుండా దేశ అభివృద్ధి పెంచడమంటే అర్థరహితమన్నారు.
మోదీ ఏం మాట్లాడకుండానే అంతా జరిగిపోతుందన్నారు. కేంద్రం తీరుతో తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు.
‘‘జనాభా లెక్కలపై బీజేపీ భయపడుతోంది’’
140 ఏళ్లలో ఎప్పుడూ ఆగని జనాభా గణన, ప్రస్తుతం ఆగిందన్నారు. అది వస్తేనే దేశ పరిస్థితి తెలుస్తుందన్నారు.
''జనాభా గణన లేకుండా పరిపాలన ఎలా చేస్తారు? జనాభా సంగతి తేలితే బీజేపీ బండారం బయటపడుతుందని భయపడుతోంది. దీనిపై పార్లమెంట్‌లో చర్చజరగలి'' అని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశంలో నీటి కోసం యుద్ధాలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ఏటా 50 వేల టీఎంసీల నీరు వృద్ధాగా పోతోందన్నారు.
''భారత భూభాగం 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే 83 కోట్ల ఎకరాలు. విస్తీర్ణంలో అమెరికా మనకన్నా రెండున్నర రెట్లు, చైనా ఒకటిన్నర అధికంగా ఉంటాయి. కానీ వాటితో పోలిస్తే భారత్‌లోనే అత్యధికంగా అంటే 41 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది'' అని చెప్పారు.
‘‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్’’
''మూడు అద్భుతమైన వాతావరణాలు కలిగి ఉన్న దేశం. ప్రపంచానికే గొప్ప ఫుడ్ చెయిన్‌ను మనం సృష్టించగలం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి అభివృద్ధి చేయొచ్చు. అందుకే మా నినాదం అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్'' అన్నారు.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసి ఇప్పటికి 20 ఏళ్లు దాటిందని, కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకావడం లేదన్నారు.
40 వేల టీఎంసీలుంటే దేశంలో నీళ్ల యుద్ధాలు జరగవన్నారు. దేశమంతా సుభిక్షమవుతుందన్నారు. భారత్‌లో నీటి కొరతనే ఉండదన్నారు. దీని కోసం విశ్వ గురువులే అవసరం లేదని, దేశ గురువులుంటే చాలని అన్నారు.
''దేశానికి కొత్త ఇరిగేషన్ పాలసీ కావాలి. దీన్ని కాంగ్రెస్, బీజేపీ చేయలేకపోయింది. మా పార్టీ అధికారంలోకి వచ్చి కచ్చితంగా కొత్త ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చి ప్రతి ఎకరానికి, ఐదారేళ్ల లోపల దేశంలో ప్రతి ఇంటికి నీటిని అందిస్తాం'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









