రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?

రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

భారత్‌లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం.

అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు. అసలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలే చేయరు.

కానీ, రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణ వాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్రరక్త కణాలలోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

రక్తహీనత వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం, ఆయాసం, గుండె దడ, కాళ్ళ వాపులు లాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు.

రోగనిరోధక శక్తి తక్కువ అవ్వడం వల్ల, ఏదైనా ఆరోగ్య సమస్య కలిగితే, మిగతా వారి కన్నా రక్తహీతన బాధితులు ఎక్కువ ఇబ్బంది పడతారు. గుండె మీద ఒత్తిడి పెరిగి, గుండె వాపు కలిగి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

రక్త హీనత ఉన్న మహిళలు గర్భం దాల్చినపుడు, బిడ్డ తక్కువ బరువుతో పుడుతుంది. మరోవైపు కాన్పు తర్వాత చాలా నీరసంగా అయ్యి ఇబ్బంది పడుతుంటారు. చాలా సార్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే, ఒకసారి ఎక్కించిన రక్తం కేవలం 4 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ లోపు మన శరీరంలో రక్త కణాల ఉత్పత్తి మెరుగు పడేలా చేయగలగాలి. లేదంటే తరుచూ రక్తం ఎక్కించే అవసరం, ఆ పైన, దాని వల్ల అనేక ఇతర ఇబ్బందులు కలుగుతాయి.

‘‘సరిగ్గా తినదు కాబట్టి ఎప్పుడూ రక్తం తక్కువ ఉంటుంది’’అనేది మనం తరుచూ వినే మాట. నిజానికి తినకపోవడం వల్ల రక్తహీనత ఉండదు. రక్త హీనత వల్ల ఆకలి ఉండదు, కాబట్టి తినరు.

‘‘బియ్యం తింటుంది, బల్పాలు, లేక చాక్ పీసులు తింటుంది కాబట్టి రక్తం తగ్గిపోతుంది’’అని కూడా అంటుంటారు. నిజానికి రక్త హీనత వల్ల, అలాంటివి తినాలి (PICA) అనిపిస్తూ ఉంటుంది.

రక్తహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు. సులువుగా అర్థం అవ్వడానికి వాటికి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

రక్త హీనత ఎందుకు వస్తుంది?

అధిక రక్తస్రావం

  • మహిళల్లో నెలసరిలో ఎక్కువ రక్త స్రావం అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. అది థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్య వల్ల, లేక గర్భసంచిలో గడ్డలు (fibroids) వంటి ఇతర సమస్యల వల్ల అవ్వవచ్చు.
  • కాన్పు సంబంధిత రక్త స్రావం ఎక్కువ అవడం.
  • పేగులలో రక్త స్రావం అవ్వడం. ముఖ్యంగా మన దేశంలో నులి పురుగుల సమస్య అధికంగా ఉంది. అందుకే ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉచిత నులి పురుగుల మందుల పంపిణీ చేస్తోంది. ఆరు నెలలకు ఒక్క సారి, ఒక్క టాబ్లెట్ వేసుకోవడం మంచిది.
  • యాక్సిడెంట్స్ లేక ఏవైనా గాయాల వల్ల రక్త స్రావం జరగడం.
  • కడుపులో ఏదైనా అల్సర్ లేక క్యాన్సర్ ఉండడం వల్ల, నెమ్మదిగా రక్తం తగ్గిపోవడం.
  • అధికంగా మద్యం సేవించడం లేక, ఏదైనా ఇతర కారణాల వల్ల, కాలేయం (లివర్ ) పాడయిన వారికి, కడుపులో రక్తనాళాలు ఉబ్బిపోయి ఉంటాయి. అవి చిట్లినట్టయిటే, ఒక్క సారిగా రక్త స్రావం అయ్యి, రక్తం వాంతులు అయ్యే అవకాశం ఉంది.
రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

రక్త కణాల ఉత్పత్తి తగ్గడం

  • తినే ఆహారంలో సరిపడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ లేక శరీరంలో విటమిన్ బీ12 స్థాయిలు తగ్గిపోయి రక్త కణాల ఉత్పత్తి సరిపడా/ సరిగ్గా జరగదు.
  • కొన్ని పేగులకు సంబంధించిన సమస్యలలో (ఉదరకుహర వ్యాధి), రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన లవణాలు (ఐరన్) రక్తం లోకి (శోషణ లోపం వల్ల) అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల, రక్తహీనత కలుగవచ్చు.
  • ఏదైనా దీర్ఘ కాలిక జబ్బులు ఉండడం వల్ల.
  • మూత్ర పిండాలు సరిగ్గా లేకపోవడం/ పని చేయకపోవడం వల్ల (erythropoietin లోపం వల్ల).
  • రక్త కణాల ఉత్పత్తి జరగవలసిన మూలుగు ఎముక(bone marrow)లో లోపం వల్ల..
  • గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు అవసరం అయినంతగా రక్త కణాల ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.
రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

రక్త కణాలు ఎక్కువగా నాశనం అవ్వడం:

  • ప్రధాన కారణం 'మలేరియా' (మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది) వంటి కొన్ని ఇన్ఫెక్షన్లు.
  • కొన్ని రకాల మందుల/ చికిత్స వల్ల రక్త కణాలు త్వరగా నాశనం అవుతుంటాయి.
  • జన్యు పరమైన కొన్ని సమస్యల్లో (hemoglobinopathies), రక్త కణాల తయారీ సరిగ్గా ఉండక, తేలిగ్గా దెబ్బతింటూ ఉంటాయి.
  • కొన్ని రకాల రోగ నిరోధక శక్తి సమస్యల వల్ల మన శరీర కణాలే మన రక్త కణాలను చంపేస్తుంటాయి.
  • ప్లీహము (spleen) పెరగడం వల్ల, రక్త కణాలు అన్ని అందులో నాశనం అయ్యే అవకాశం ఉంది.
రక్తహీనత

ఫొటో సోర్స్, Getty Images

కారణాలను తెలుసుకొని, వాటికి తగిన చికిత్స తీసుకుంటేనే, ఈ మసస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తాత్కాలికంగా రక్తం పెరిగే మందులు వేసుకుంటూ ఉండడం, లేక, రక్తం ఎక్కించుకోవడం అనేది అన్ని సందర్భాలలో సరయిన పరిష్కారం కాదు.

కాబట్టి, రక్త హీనత సాధారణ సమస్యగా కొట్టి పడేయకుండా, దాని వెనుక గల కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేయాలి.

ఆయాసం వస్తుంది అంటే, ఎందుకు అనే ప్రశ్న..

రక్త హీనత ఉంది.. అంటే, ఎందుకు అనే ప్రశ్న..

ఐరన్ లోపం వల్ల.. అంటే.. అది ఎందుకు.. అనే ప్రశ్న..

ఇలా.. లక్షణాలను కాకుండా, కారణాలను తెలుసుకొని, వాటిని తొలిగించే ప్రయత్నం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.

వీడియో క్యాప్షన్, మనకు వచ్చిన జ్వరం డెంగీ అని ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

మగవారిలో మరింత అప్రమత్తం.!

రక్త హీనత ఆడవారిలో సహజం. నెల సరి ఎక్కువ అవుతుందా, లేక ఆహారంలో సరిపడా పోషకాలు తీసుకోవడం లేదా అని ఆలోచించాలి. మందులు వాడుకోవాలి. కానీ, అది మగ వారిలో కనిపిస్తే కచ్చితంగా కారణం కోసం వెతకాలి.

50 సంవత్సరాల వయసు దాటిన మగవారిలో రక్తహీనతకు గల ఒక ముఖ్య కారణం, కడుపులో క్యాన్సర్. అందుకే, మగ వారిలో రక్త హీనత ఉంటే, తప్పకుండా కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఎండోస్కోపీ, అవసరమైతే కొలనోస్కోపీ చేయవలసి ఉంటుంది. అలాంటి వారికి కొద్ది రోజులు ఆలస్యం చేసినా పరిస్థితి చెయ్యి జారీ పోయే ప్రమాదం ఉంది.

మద్యం బాగా తాగే వారిలో అయితే విటమిన్ బీ12 లోపం వల్ల, బీపీ, షుగర్ వంటి ఏదైనా దీర్ఘ కాలిగ జబ్బులతో బాధ పడుతున్న వారిలో అయితే, మూత్రపిండాల సమస్యల వల్ల, రక హీనత కలిగే అవకాశముంటుంది.

అన్ని సందర్భాల్లో కారణం కచ్చితంగా తెలియక పోవచ్చు. కానీ, తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది.

(రచయిత వైద్యురాలు)

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)