గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...

గుజరాత్

ఫొటో సోర్స్, SANKET SIDANA

ఫొటో క్యాప్షన్, పోలీసుల కథనం ప్రకారం హంతకుడు ఈ ట్రక్ ఉపయోగించాడు
    • రచయిత, భార్గవ్ పారీఖ్
    • హోదా, బీబీసీ గుజరాతీ కోసం

గుజరాత్‌లోని మెహసానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు మర్డర్‌లు చేసిన హంతకుడిని ఓ మినీ ట్రక్కు మీద రాసిన అక్షరాలు పట్టించాయి. ఇద్దరినీ ఒకేలా హత్య చేశానని నిందితుడు యోగేష్ పటేల్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.

మేనమామను హత్య చేసి రెండున్నరేళ్లయినా పట్టుబడకపోవడంతో.. అతడు తన బావను కూడా హత్య చేశాడు. కానీ, ఈ సారి ఆ హత్యకు ఉపయోగించిన మినీ ట్రక్కుపై రాసిన అక్షరాల ఆధారంగా పోలీసులు కూపీ లాగితే దొరికిపోయాడు యోగేష్ పటేల్.

పోలీసుల విచారణలో నిందితుడు యోగేష్ పటేల్‌ మాట్లాడుతూ.. ''మాకు గిఫ్ట్‌ షాప్‌ ఉంది. అందులో నేను పగలు, రాత్రి పని చేసేవాడిని. కానీ, మామయ్య నాపై దొంగతనం నేరం మోపాడు. నన్ను సామాజికంగా బహిష్కరించారు. దానివల్ల నేను పని చేసుకోలేకుండా అయిపోయాను. రెండున్నర సంవత్సరాల క్రితం నేను పగతో మామయ్యను చంపాను. దానిని ప్రమాదంగా చిత్రీకరించాను. నన్ను పట్టుకోకపోవడంతో నా కజిన్‌ను కూడా అదే విధంగా చంపాను" అని అన్నాడు.

థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ కేసు ఆశ్చర్యం కలిగిస్తుంది. మెహసానాలోని నాని కడి రోడ్డులోని బంగ్లాలాంటి ఇంట్లో ఉంటున్న నిందితుడు యోగేష్ ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదు. తాను చేసింది సరైనదేనని అంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వ్యక్తులతో బీబీసీ గుజరాతీ మాట్లాడి దాని వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది.

గుజరాత్

ఫొటో సోర్స్, Getty Images

హత్యకు కారణం ఏమిటి?

పోలీసులు, కస్డడీలో ఉన్న నిందితుడు యోగేష్ పటేల్‌తో మాట్లాడటం ద్వారా బీబీసీ గుజరాతీ హత్య, దాని కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది. యోగేష్ పటేల్ మాట్లాడుతూ, ''మాకు ఉమ్మడి ఆస్తి ఉంది. మేం మామ జాదవ్‌ పటేల్‌తో కలిసి కొంత భూమిని అమ్మి కడిలో గిఫ్ట్ షాప్ ప్రారంభించాం. దుకాణం బాగానే ఉండేది. 2017లో మా మామ రిటైర్ అయ్యారు. నా కజిన్ విజయ్ వ్యాపారంలో చేరారు. సంత్రామ్ కాంప్లెక్స్‌లోనూ మాకు షాప్ ఉంది. అయితే, షాప్‌లో దొంగతనం చేశానని విజయ్ నాపై ఆరోపణలు చేశాడు. మామయ్య నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు'' అని వివరించారు.

యోగేష్ పటేల్ తన మామ, కజిన్‌తో గొడవను వివరిస్తూ "నేను నా వాటా అడిగాను, కానీ, వారు దుకాణం ఖర్చు, నా స్థితిని చూసి డబ్బు ఇవ్వలేదు. వారి వద్ద ఎక్కువ డబ్బు ఉంది. సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దాంతో నాకు కోపం వచ్చింది" అన్నారు.

యోగేష్ పటేల్ వాదన ప్రకారం ఆయన తన మామ భాగస్వామ్యంతో ఒక దుకాణాన్ని ప్రారంభించాడు. దీని మార్కెట్ విలువ సుమారు కోటి ఉంటుంది. అయితే, యోగేష్ వాటా కింద రావాల్సిన రూ. 60 లక్షలకు బదులుగా కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చేలా మాట్లాడారు. ఆపై అక్కడి నుంచి కుటుంబాన్ని కూడా ఖాళీ చేయించారు.

హత్య గురించి యోగేష్ మాట్లాడుతూ, ''మా మేనమామ జాదవ్‌ రోజూ సాయంత్రం కాలువ సమీపంలో వాకింగ్‌కు వెళ్లేవాడు. రెండున్నరేళ్ల క్రితం (2020లో) మినీ ట్రక్కుతో యాక్సిడెంట్ చేసి చంపేశాను.సంఘటనకు ఎటువంటి ఆధారాలు లేవు. గుర్తు తెలియని డ్రైవర్‌పై ప్రమాదవశాత్తు మృతి కేసు నమోదు చేశారు. తర్వాత కేసు క్లోజ్ అయింది'' అని అన్నారు.

గుజరాత్

ఫొటో సోర్స్, SANKET SIDANA

ఫొటో క్యాప్షన్, జాదవ్‌జీ పటేల్

అనుమానం ఎక్కడ కలిగింది?

మేనమామ హత్య తర్వాత కూడా పట్టుబడకపోవడంతో యోగేష్ ధైర్యంగా ఉన్నాడు. యోగేష్ మాట్లాడుతూ, ''అప్పట్లో మా కజిన్ విజయ్ నాపై సాక్ష్యాలు సేకరించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఏమీ దొరకలేదు. విజయ్ కూడా నా వాటా చెల్లించకపోవడంతో చివరకు జనవరి 24న మామయ్య తరహాలో చంపడానికి ఓ మినీ వాహనం తీసుకున్నా. దానితో ఢీకొట్టి హత్య చేయాలని ప్లాన్ చేశా. కానీ, ఈసారి పట్టుబడ్డా" అని వివరించారు.

ఈ కేసులో నిందితులను పోలీసులు ఎలా గుర్తించారనే దానిపై మెహసానా డిప్యూటీ ఎస్పీ ఆర్‌ఐ దేశాయ్ మాట్లాడారు. "కొన్ని రోజుల క్రితం కడిలోని గిఫ్ట్ షాపును రాత్రి మూసివేసి మోటార్‌సైకిల్‌‌పై విజయ్ పటేల్ ఇంటికి వెళుతుండగా కొత్త కడి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు విజయ్‌ని ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఆయన మృతి చెందాడు. తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా కేసు నమోదు చేశాం.

అయితే, తమ కుటుంబంలో తక్కువ వ్యవధిలో ఇలాంటి ప్రమాదంలోనే ఇద్దరు చనిపోయారని ఆయన కుటుంబీకులు గుర్తుచేశారు. ఇది ప్రమాదం కాదని, హత్య అని వారు ఆరోపించారు. మేం సాంకేతికంగా విచారణ ప్రారంభించాం. యోగేశ్ ఐదు లక్షల సుఫారీ ఇచ్చి విజయ్‌ని చంపించాడని దర్యాప్తులో తేలింది. మృతుడి బావ యోగేష్‌తో పాటు బనస్కాంత ప్రాంతంలో కురు గ్రామాల్లోని ముగ్గురిని అరెస్టు చేశాం'' అని వివరించారు.

गुजरात

ఫొటో సోర్స్, SANKET SIDANA

ఫొటో క్యాప్షన్, విజయ్ పటేల్

పోలీసులు కేసును ఎలా ఛేదించారు?

కదీనా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎన్.కె. ఆర్. పటేల్ మాట్లాడుతూ, " విజయ్ హత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో మేం ఆ దిశగా దర్యాప్తు సాగించాం. సంఘటన స్థలంలో మోటారు సైకిల్ పడిన తీరు చూసి, ఇది సాధారణ ప్రమాదం కాదని మేం కూడా భావించాం. మేం వెంటనే ఫోరెన్సిక్ బృందం సాయం తీసుకున్నాం. మోటార్ సైకిల్ పడి, రైడర్ తలకు బలమైన గాయాలు అయ్యే విధంగా ఢీకొన్నట్లు గుర్తించాం. వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించాం. అప్పుడు మాకు నంబర్ ప్లేట్ లేని మినీ ట్రక్ కనిపించింది. ఈ మినీ ట్రక్ మాకు అనుమానాస్పదంగా అనిపించింది. నంబర్ ప్లేట్ లేని మినీ ట్రక్కును కనుగొనడం గడ్డివాములో సూది వెతకడం లాంటిది" అని పటేల్ స్పష్టంచేశారు.

"వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం అనేక మినీ ట్రక్కులు కడిన మార్కెట్‌ మీదుగా రాకపోకలు సాగించడమే ఇందుకు కారణం. మేం ట్రక్కు రంగును జాగ్రత్తగా పరిశీలించాం, దాని వెనుక భాగంలో అన్ష్, జయేష్ అనే రెండు పేర్లతో కూడిన చిత్రాలు కనిపించాయి. దీంతో ట్రక్కు యజమాని గుజరాత్‌కు చెందినవాడని గుర్తించాం. జయేష్ అనే పేరు గుజరాత్‌లో సాధారణ పేరు. ట్రక్కులపై పువ్వులు, కొమ్మల నమూనాను చిత్రించడాన్ని మేం గమనించాం. ప్రధానంగా బనస్కాంత నుంచి వచ్చే ట్రక్కులపై 'స్పీడ్', 'కిలోమీటర్లు' అని ఆంగ్లంలో రాయడం చాలా సాధారణం.

సత్లాసన్‌లోని తెల్‌గఢ్ ప్రాంతం నుంచి వచ్చిన మినీ ట్రక్కులపై ఈ రకమైన రచనలకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మేం తెల్‌గఢ్, చుట్టుపక్కల ప్రాంతాల వాహనాలకు రంగులు వేసే పెయింటర్లను వెతికాం. గ్రామం చిన్నది కాబట్టి, ఈ మినీ ట్రక్కును చిత్రించిన పెయింటర్‌ని మేం త్వరగా గుర్తించాం. అతని ద్వారా మేం ట్రక్కు యజమానిని గుర్తించాం. ప్రమాదం జరిగిన రోజు అతను ట్రక్కును కదీనాకు చెందిన యోగేష్ పటేల్‌కు రోజుకు రూ.1,500 అద్దెకు ఇచ్చాడని యజమాని చెప్పాడు'' అని వివరించారు.

గుజరాత్

ఫొటో సోర్స్, SANKET SIDANA

ఫొటో క్యాప్షన్, మేహసాణా డిప్యూటీ ఎస్పీ ఆర్.ఐ. దేశాయి

సీసీటీవీ లేకపోవడంతో దొరకలేదు

ఇన్‌స్పెక్టర్ ఎన్.కె. ఆర్. పటేల్, మాట్లాడుతూ, " యోగేష్ ఫోన్ లొకేషన్ మారి అనే గ్రామంలో గుర్తించాం. అతను ఆ సమయంలో మారి, సమీపంలోని దధ్నా గ్రామానికి చెందిన రాజ్‌దీప్ సింగ్, రాజుభా ఝలాతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు యోగేష్ పటేల్‌పై నిఘా ఉంచి మరోవైపు రాజ్‌దీప్‌సింగ్‌, రాజుభాను పట్టుకున్నాం. ఆ రాత్రి రెడ్ కలర్ మోటార్‌సైకిల్‌ వ్యక్తిని చంపేందుకు రూ 5. లక్షలు తీసుకున్నామని వాళ్లు ఒప్పుకున్నారు. ఈ వాస్తవాల ఆధారంగా మేం యోగేష్‌ను అరెస్టు చేశాం. వారందరినీ ముఖాముఖిగా విచారించాం. యోగేష్ తన మామను కాల్వ దగ్గర తన లారీ నంబర్ ప్లేట్‌పై స్టిక్కర్ వేసి ఢీకొట్టి చంపాడు. అయితే, కాలువ దగ్గర సీసీటీవీలు లేకపోవడంతో రెండున్నరేళ్లుగా పట్టుకోలేకపోయారు. విజయ్‌ను చంపేందుకు కూడా యోగేష్ అదే ఉపాయం ప్రయోగించాడు. ఈసారి అతను పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు'' అని అన్నారు.

కదీనా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎన్. పటేల్

ఫొటో సోర్స్, SANKET SIDANA

ఫొటో క్యాప్షన్, కదీనా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎన్. పటేల్

"నా భర్త విజయ్ చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు. కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం లేదు. మామగారి హత్యకు వ్యతిరేకంగా సాక్ష్యం వెతకడానికి నా భర్త చాలా ప్రయత్నించాడు. కానీ, ఆ లారీ నంబర్ ప్లేట్ ఎవరికీ కనిపించలేదు. కాబట్టి కేసు రుజువు కాలేదు. కానీ ప్రమాదంలో నా భర్త మరణించిన తీరు, నాకు, నా సోదరుడికి అనుమానం కలిగింది, అతన్ని ఎవరో చంపారని అనుకున్నాం. అయితే, హంతకుడు మా కుటుంబానికి చెందినవాడేనని, ఇలా జరుగుతుందని అనుకోలేదు." అని విజయ్ భార్య భూమి పటేల్ బీబీసీ గుజరాతీతో ఫోన్‌లో మాట్లాడుతూ వివరించారు.

కుట్ర పూరిత హత్య కేసులో నిందితుడు యోగేష్ పటేల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. యోగేష్ పటేల్‌కు తండ్రి, భార్య ఉన్నారు. వారు ఈ కేసుపై బీబీసీతో మాట్లాడటానికి నిరాకరించారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)