తుర్కియే, సిరియా భూకంపం: ఈ పిల్లల పేర్లేమిటో, వారి తల్లిదండ్రులెవరో తెలీదు..ఏం చేయాలి?

- రచయిత, టామ్ బాట్‌మన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తుర్కియేలోని అదానా సిటీ ఆస్పత్రిలో అమాయకంగా మంచంపై పడుకున్న పసిపిల్లలకు వాళ్లు ఏం కోల్పోయారో తెలీదు.
ఆరు నెలల పసిపాపకు డాక్టర్లు సీసాతో పాలు పడుతున్నారు. ఆ పాప అమ్మ, నాన్న జాడ దొరకలేదు.
ఇలాంటి పిల్లలు వందల్లో ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు చనిపోయారు లేదా వాళ్ల జాడ దొరకలేదు.
భూకంపం ఆ పసిపాపల ఇళ్లను కూల్చేసింది. వాళ్ల పుట్టుపూర్వోత్తరాలను కూడా చెరిపేసింది.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఒక పాప చేయి పట్టుకుని చూస్తున్నారు డాక్టర్ నుర్సా కెస్కిన్. ఆ పాప చేతికి కట్టిన బ్యాండ్‌పై "అనానిమస్" అని రాసి ఉంది. అంటే పేరు లేని వ్యక్తి అని.
ఆ పాపకు చాలా ఫ్రాక్చర్లు అయ్యాయి. ఒక కన్ను నల్లగా అయిపోయింది. ముఖంపై చాలా గాయాలు ఉన్నాయి. కానీ, ఆ పసిబిడ్డ పక్కకు మొహం తిప్పి నవ్వుతోంది.
"ఈ పాప ఎక్కడ దొరికిందో, ఇక్కడకు ఎలా వచ్చి చేరిందో మాకు తెలుసు. కానీ, ఆ పాప అడ్రస్ ఏంటో తెలీదు. ఎవరి బిడ్డో తెలీదు. పాప తల్లిదండ్రుల కోసం ఇంకా వెతుకుతున్నాం" అని డాక్టర్ కెస్కిన్ చెప్పారు.
వేరు వేరు ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన పిల్లలను కూడా అదానా సిటీ ఆస్పత్రికే తీసుకొచ్చారు. ఈ ఆస్పత్రి భూకంపానికి తట్టుకుని పడిపోకుండా ఉంది. అందుకే, ఎక్కువమంది పిల్లలను ఇక్కడ చేరుస్తున్నారు.
చుట్టుపక్కల చాలా ఆస్పత్రులు, క్లినిక్కులు పడిపోయాయి లేదా బాగా దెబ్బతిన్నాయి. దాంతో అదానా ప్రధాన సహాయక కేంద్రంగా మారింది.
ఇస్కెందరున్‌లోని ఒక ఆస్పత్రి మెటర్నిటీ వార్డు నుంచి చాలామంది నవజాత శిశువులను ఇక్కడకు తీసుకొచ్చారు. భూకంపం తాకిడికి ఆ ఆస్పత్రి బాగా దెబ్బతింది.
భూకంపం వచ్చిన ప్రాంతాల నుంచి 260కి పైగా పసిపిల్లలను రక్షించామని, వారి తల్లిదండ్రులెవరో ఇప్పటివరకూ తెలియలేదని తుర్కియే ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది లోలోపలకు వెళ్లి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

'పిల్లలు షాక్‌లో ఉన్నారు'
అదానా అస్పత్రి భూకంప బాధితులుతో నిండిపోయి ఉంది. కొందరు ట్రాలీల మీద ఉన్నారు. మరి కొందరిని ఎమర్జెన్సీ వార్డులో దుప్పట్లలో చుట్టిపెట్టారు. సర్జరీ వార్డ్ కూడా గాయల పాలైన పిల్లలతో నిండిపోయింది.
అక్కడ మంచంపై ఒక అయిదారేళ్ల పాప పడుకుని ఉంది. నిద్రపోతోంది. డ్రిప్స్ ద్వారా మందులు ఎక్కిస్తున్నారు. ఆ పాప తలకు బలమైన గాయాలు తగిలాయని, శరీరంపై చాలా ఫ్రాక్చర్లు ఉన్నాయని ఆస్పత్రిసిబ్బంది చెప్పారు. ఆ పాప తన పేరేమిటో చెప్పలేకపోయిందని వారు వెల్లడించారు.
"పాప కేవలం సైగలు చేస్తోంది. కళ్లతో చూసి మేం చెప్పింది అర్థం చేసుకుంటోంది. మాట్లాడడం లేదు" అని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఇల్క్‌నూర్ బన్లిసెసుర్ చెప్పారు.
"పిల్లలు షాక్‌లో ఉన్నారు. ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కొంతమందికి వాళ్ల పేర్లు తెలుసు. కానీ, చెప్పలేకపోతున్నారు. కొన్నాళ్లు చికిత్స అవసరం. షాక్‌లోంచి బయటపడ్డాక, అప్పుడు మళ్లీ వాళ్ల చేత మాట్లాడించాలి" అని ఆమె వివరించారు.
ఈ పిల్లల అడ్రస్ కనిపెట్టేందుకు ఆరోగ్య అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ, శిథిలాలు తప్ప ఏమీ కనిపించడంలేదు. కనీసం 100 మంది పేరు లేని పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
తుర్కియే సోషల్ మీడియాలో.. తప్పిపోయిన పిల్లల ఫొటోలు, భూకంపం వచ్చినప్పుడు వాళ్లు ఏ భవనంలో ఏ అంతస్థులో ఉన్నారో ఆ వివరాలు పొస్ట్ చేస్తున్నారు. ఆ పిల్లలను సహాయక సిబ్బంది రక్షిస్తారని ఆశిస్తున్నారు.
బతికి బయటపడినవారు తమ బంధువుల గురించి, వారి పిల్లల గురించి వెతుకుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వారిని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అదానా ఆస్పత్రికి క్షతగాత్రులను తీసుకొస్తూనే ఉన్నారు. వాళ్లంతా షాక్‌లో ఉన్నారు. క్షీణించిపోయారు.

ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నవారే.
డాక్టర్ కెస్కిన్ కూడా తన బంధువులను కోల్పోయారు. భూకంపం తరువాత కూడా ప్రకంపనలు వస్తుండడంతో ఆమె తన పిల్లలతో పాటు అదానా ఆస్పత్రిలోనే తలదాచుకుంటున్నారు.
"నేను బానే ఉన్నాను. బాగుండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ చేరుతున్న పిల్లలకు మా అవసరం ఉంది" అన్నారు డాక్టర్ కెస్కిన్.
"నా పిల్లలూ, నేను తప్పించుకున్నాం. దేవుడికి కృతజ్ఞతలు. ఏ తల్లికీ బిడ్డను పోగొట్టుకోవడం కంటే పెద్ద కష్టం ఉండదు" అన్నారామె.
ఈ భూకంపం ఎందరో పిల్లలను ఊరు పేరులేని వాళ్లను చేసింది. ఇది మరింత విషాదం.

ఇవి కూడా చదవండి:
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భోగాపురం ఎయిర్‌పోర్టు: నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారా... గ్రామస్తులు ఏమంటున్నారు...
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













