తుర్కియే భూకంపం: 15 ఇళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు.. అంతా అపార్ట్‌మెంట్ కింద సమాధయ్యారు

తుర్కియే భూకంపం
    • రచయిత, ఆలిస్ కడ్డీ
    • హోదా, ఇస్కెందరున్, తుర్కియే

దక్షిణ తుర్కియేలోని ఒక అపార్ట్‌మెంట్ శిథిలాల మీద ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన కిటికీ. ఆ కిటికీ తలుపుకి సీతాకోకచిలుకల బొమ్మలతో ఉన్న ఒక పరదా కట్టి ఉంది. ఈ పరదా చల్లటి గాలికి ఎగురుతూ ఉంది.

''అది 'సెయిడా' గది''

భూకంపానికి ముందు 19 ఏళ్ల సెయిడా ఒకాన్ ఆ కిటికీ, పరదాల గుండా ఇస్కెందరున్ నగరంలోని తమ వీధిని చూసేది.

ప్రస్తుతం ఆమె స్నేహితురాలు దామ్లా తన కుటుంబంతో కలిసి కుప్పకూలిన అపార్ట్‌మెంట్ బ్లాక్ వద్ద సెయిడాకి ఏమీ కాకూడదని కోరుకుంటూ ఉంది. సహాయక సిబ్బంది, కుక్కలు శిథిలాల కిందనున్న వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

దామ్లాకి ఆరేళ్లు, సెయిడాకు ఎనిమిదేళ్లున్నప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. పక్కపక్కన ఇళ్లే. వారు చాలా సన్నిహితులు. ఇటీవల చేసిన షాపింగ్‌లో వారిద్దరు కలిసే ఈ కిటికీ పరదాలను కొనుక్కున్నారు.

''మాకిద్దరికీ సీతాకోకచిలుకలంటే ఎంతో ఇష్టం'' అని దామ్లా ఏడుస్తూ అన్నారు. తన కోసం తన సోదరితో కలిసి సెయిడా ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుక సందర్భంగా తీసుకున్న ఫోటోను తన ఫోన్‌లో చూపించారు.

సెయిడా అపార్ట్‌మెంట్ బ్లాక్ పేరు ఓర్కాన్. ఇస్కెందరున్‌ మధ్యలో చిన్న చిన్న బాల్కనీలతో ఉన్న భవనాల మధ్యలో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ భవనాలన్నింటికి గ్రౌండ్ ఫ్లోర్‌లో దుకాణాలే ఉంటాయి.

సోమవారం ఉదయం 4.17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు, సెయిడా ఓర్కాన్‌లోని ఇతర నివాసితులతో పాటు నిద్రలో ఉన్నారు.

ఈ భూకంప ధాటికి ఈ బ్లాక్ పేకమేడలా కుప్పకూలింది.

దక్షిణ తుర్కియేలో చాలా భవంతుల పరిస్థితి కూడా ఇదే. కానీ, ఇది ఓర్కాన్ కథనం. సెయిడా, ఆమె కుటుంబంతో పాటు 14 ఇతర ఫ్లాట్లకు చెందిన వారు దీనిలో ఉన్నారు.

భూకంపం వచ్చిన తర్వాత కుప్పకూలిన ఓర్కాన్ భవంతి వద్దకు ఆ నివాసితుల స్నేహితులు, కుటుంబాలు వచ్చాయి. తమ వాళ్లు బయట పడాలని వారు కోరుకుంటున్నారు. తమ సన్నిహితులను గుర్తుకు చేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

ఒక రోజుకి పైబడి తవ్వకాలు జరిపిన తర్వాత శిథిలాల కింద నుంచి సెయిడా పక్కింటి వ్యక్తుల్లో ఒకరిని బుధవారం వెలికితీశారు.

తుర్కియే భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

పడిపోయిన గోడల నుంచి తామ సెయిడాతో మాట్లాడినట్టు అక్కడి నివాసితులు, బయటపడ్డ వారు చెప్పారు. తాను బాగానే ఉన్నట్లు సెయిడా చెప్పినట్టు వాళ్లు తెలిపారు. కానీ, శుక్రవారం వరకు ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు.

వరుసగా మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న ఓర్కాన్ దగ్గరకు తాము వెళ్లాలం. రక్షించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆస్పత్రులన్ని బాధితులతో నిండిపోతున్నాయి.

కేవలం ముగ్గురు వ్యక్తులు బతికి బయటపడ్డారని సహాయక సిబ్బంది, చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మిగతా వారి పరిస్థితి తెలియలేదన్నారు.

ఓర్కాన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే వారు ఎంతో కలివిడిగా ఉండే కమ్యూనిటీ అని అక్కడికి వచ్చిన వారు చెప్పారు. టీ లేదా తుర్కియేలో దొరికే స్ట్రాంగ్ కాఫీ తాగేందుకు ఒకరి ఇంటికి మరోకరు వెళ్తుండేవారని అన్నారు.

ఓర్కాన్‌ అపార్ట్‌మెంట్ వాసులకు, ఆ వీధిలోని ఇతర భవనాల వారికి వాట్సాప్‌ గ్రూప్‌లు ఉండేవి. వారు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ''ఇదెలా ఉండేదంటే, ఈ వారం మీ ఇంటికి, వచ్చే వారం మా ఇంటికి'' ఇలా ఉండేదని ఒక స్థానిక వ్యక్తి చెప్పారు. ''ఇది తుర్కిష్ విధానం'' అని అన్నారు.

ఇరుగుపొరుగు వారు ఎలా ఉండేవారు అని అడిగినప్పుడు, దామ్లా అంకుల్ ఎమ్రుల్లా తన స్థానిక గ్రోసరీ దుకాణానికి పరిగెత్తుకు వెళ్లి, తన రెండు చేతులని కలిపి గట్టిగా పట్టుకుని, ''ఇలా ఉండేది, '' అని అన్నారు.

తుర్కియే భూకంపం

ఓర్కాన్ అపార్ట్‌మెంట్ ఎన్నో దశాబ్దాల కాలం నాటిది. ''నాకు 50 ఏళ్లు ఇప్పుడు. నా స్కూల్‌కి వెళ్లొచ్చిన రోజులు నాకింకా గుర్తున్నాయి'' అని ఒక వ్యక్తి అన్నారు.

భూకంపం వచ్చినప్పుడు ఓర్కాన్‌లోని భవంతులు పేకమేడల్లా కూలిపోయాయని అక్కడి స్థానికులు చెప్పారు. మరోవైపు ఇతర భవంతులకు చెందిన వారు క్షేమంగా బయటపడ్డారు. వారు బాధతో, కాస్త ఉపశమనంతో మాట్లాడుతున్నారు.

ఓర్కాన్లో నివసించే చాలా మంది తనకు తెలుసని స్థానిక వైద్య సిబ్బంది కన్సు తెలిపారు. భూకంపం వచ్చిన తర్వాత, తన ఇంటిని వదిలి, సెయిడా స్ట్రీట్‌కి వెళ్లే మార్గంలో ఒక మూలకి పరిగెత్తినట్టు చెప్పారు.

ఆ వరుసలోని అన్ని భవంతులు ఇప్పుడు చెత్తాచెదారంగా కుప్పకూలిపోయి ఉన్నాయి. నివాసితులకు చెందిన కొన్ని ఆనవాళ్లను మాత్రమే సహాయక సిబ్బంది గుర్తించారు.

చిరిగిపోయిన ఖురాన్, పగిలిపోయిన వైట్ ఓవెన్, ఎరుపు అంచుగల గడియారం, దానిలో ఆగిపోయిన సమయం వంటి వాటిని శిథిలాల కింద గుర్తించారు.

బీర్‌ను, స్టఫ్ట్‌ను పెప్పర్లను ఎక్కువగా ప్రేమించే ఒక స్విమ్మింగ్ ఔత్సాహికుడైన తన తాత కోసం, ఆ భవంతి పక్కన నివసించే ఒక వ్యక్తి శిథిలాల వద్దకు చేరుకుని సెయిడా కర్టెన్లను తొలగించి చూడగా, అక్కడ ఒక ఫోన్‌ను దొరికింది.

అది ఇప్పటికీ పనిచేస్తుంది. ఆ ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్‌గా తన తాత నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది. ఆ ఫోటో చూసి ఈ వ్యక్తి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది.

తుర్కియే భూకంపం

మొదటి అంతస్తు: 'ఆమె సమాధానం చెప్పలేదు'

ఈ అపార్ట్‌మెంట్ బ్లాక్‌ మొదటి అంతస్తులో 63 ఏళ్ల సెహ్వార్‌, మాట్లాడలేని తన కూతురు దేర్యాతో కలిసి నివసిస్తున్నారు. వారిద్దరూ చాలా వరకు కలిసే ఉండేవారని కొనసాగుతున్న సహాయక చర్యల వద్దకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు చెప్పారు. తన కూతుర్ని సెహ్వార్ చాలా జాగ్రత్తగా చూసుకునే వారన్నారు.

''ఒకవేళ ఆమె బతికి బయటపడ్డా, ఎవరైనా ఉన్నారా అని అరుస్తున్న మాటలను ఆమె విన్నా కూడా దేర్యా సమాధానం చెప్పలేకపోతుంది'' అని శిథిలాలకు రెండు గంటల దూరంలో నివాసముంటున్న ఆమె సోదరి దేనిజ్ చెప్పారు.

ఆ భవంతిలో మరోవైపు అదే అంతస్తులో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ బెర్క్ నివసించే వారు.

ఎప్పుడూ కోకా కోలా తాగుతూ కనిపించేవాడని, ప్రతి రోజూ లీటర్ల కొద్ది తాను తాగాల్సి ఉందని జోక్ చేసే వాడని మరో వ్యక్తి చెప్పారు.

ఆయన గురించి మాట్లాడిన చాలా మంది కూడా, ఆ గ్రాడ్యుయేట్ ఎంతో తెలివైన వాడని, కలివిడిగా ఉండేవాడని, చూడటానికి కూడా చాలా అందంగా ఉండేవాడని గుర్తుకు చేసుకున్నారు.

భూకంపం వచ్చిన తర్వాత తన తల్లితో కలిసి భవంతి శిథిలాల తాను చిక్కుకుపోయాడని బెర్క్ సోదరుడు దోకుకాన్ అన్నారు. అధికారిక సహాయక చర్యలతో తాను చాలా విసిగిపోయాయని, తొమ్మిది గంటలకు పైగా శిథిలాల కిందనున్న వారికోసం వేచిచూసినట్టు తెలిపారు.

తన ఈ ఎదురుచూపులపై మరింత మాట్లాడేందుకు ఆయన అంగీకరించలేదు. ఇంకా తన సోదరుడు కనిపించడం లేదన్నారు.

భూకంపం వచ్చిన ఇంట్లో లేని సమయంలో తన సోదరుడికి ఫోన్ చేసిన తర్వాత బెర్క్‌ను కాపాడినట్టు పొరుగింటి వారు చెబుతున్నారు. కానీ బెర్క్ మాత్రం కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ''నేను నా కాలు గురించి అసలు బాధపడటం లేదు. నా కొడుకు శిథిలాల కిందనే చిక్కుకుపోయాడు'' అని డాక్టర్లతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుర్కియే భూకంపం

రెండవ అంతస్తు : 'ఒకరికొకరు లేకుండా వారు నివసించలేరు'

ఈ భవనంలో రెండవ అంతస్తులో ఒక తల్లి కూతురు నివసించే వారు. వారు 64 ఏళ్ల హాటిస్, 33 ఏళ్ల దేర్యా.

వారు అచ్చం టామ్ అండ్ జెర్రీ మాదిరిగానే ఉండేవారని ఆ కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు చెప్పారు.

''ఒకరు ఒకటి చేస్తే, మరొకరు మరోటి చేసేవారు. కానీ, ఒకరికొకరు లేకుండా అసలు బతకలేరు'' అని ఆ బంధువు చెప్పారు. ఇప్పటికీ వారు కొంచెం దూరంలోనే ఉండొచ్చన్నారు.

దేర్యా తండ్రి, హాటిస్ మాజీ భర్త మెవ్లుట్ ప్రతి రోజూ వారి గురించి ఏదైనా తెలుస్తుందేమోనని వేచిచూస్తున్నారు.

తన కూతురు చాలా అందంగా ఉండేదని ఆయన గుర్తుకు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. తన జీవితాన్ని పూర్తిగా గడిపేదని తలుచుకుంటూ తన చేతుల్లో ముఖాన్ని దాచుకుని బాధపడ్డారు.

తన పని ప్రదేశంలో సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే తన ఉద్యోగమని దేర్యా జాబ్ గురించి ఆయన చెప్పారు.

అంటే ఎమర్జెన్సీ సమయంలో ''ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి'' అనే విషయాల గురించి తనకు తెలుసన్నారు.

తన కూతురు సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంచిన ఆయన, ఈ భవంతి కింద చిక్కుకున్న వారిని, తన తల్లిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆమె కచ్చితంగా సాయపడుతూ ఉండొచ్చని తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తన కూతురు బతికి వస్తుందని ఆశతో ఉన్నారు.

తుర్కియే భూకంపం

మూడవ అంతస్తు: 'సెయిడా మళ్లీ నవ్వుతూ తిరిగొస్తుంది'

ఈ భవనంలో మూడవ అంతస్తులో సెయిడా ఆమె తల్లి, తండ్రితో కలిసి ఉండేవారు. ఆమె పెద్దక్క ప్రస్తుతం ఇంటికి సమీపంలో వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. భూకంపం తర్వాత ఓర్కాన్‌కు తన సోదరి తరలి వచ్చినప్పుడు, ఆమె స్పృహ తప్పిపడిపోయినట్టు చుట్టుపక్కల వారు చెప్పారు.

ఆమె అమ్మమ్మతాత వాళ్లు కూడా ఈ వీధి చివర్లోనే నివసిస్తున్నారన్నారు. వారి భవనం కూడా భూకంపం ధాటికి పూర్తిగా కుప్పకూలిపోయిందని చెప్పారు.

వారు చాలా సన్నిహిత కుటుంబమని, వారు చూడచక్కని జంట అని బంధువులు అభివర్ణించారు.

సెయిడా తండ్రి సెంగిజ్‌కి విడిభాగాల దుకాణం ఉండేది. ఆమె తల్లి ఇప్పటికే తన జీవితంలో ఇద్దరు సోదరీమణులను కోల్పోయారు. శిథిలాల కింద నుంచి తాను బయటపడిన తర్వాత, తన తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టు తెలిస్తే ఆమె పరిస్థితి ఏమటని కుటుంబ సభ్యుల భయపడుతున్నారు.

ఈ వీధిలోకి వచ్చిన కొద్ది సమయంలోనే సెయిడా ఈ కమ్యూనిటీలో చాలా ఫేమస్ అయ్యారు.

ఆమె గురించి తలుచుకున్న సెయిడా స్నేహితుల ముఖాల్లో ఏదో తెలియని వెలుగు కనిపించింది. సెయిడా కోసం ఆమె ప్రస్తుత, పాత బాయ్‌ఫ్రెండ్ ఇద్దరూ వెతుకుతున్నారు.

సెయిడా చాలా ఆలోచనపరురాలని చెబుతున్నారు. దామ్లాతో కలిసి చదువుకునేందుకు ఈ ఏడాది ఇస్తాంబుల్ యూనివర్సిటీలో సీటు దక్కించుకునేందుకు ఎంతో శ్రమించిందన్నారు.

తనకి కాఫీ తాగడమంటే చాలా ఇష్టమని దామ్లా చెప్పారు. తన తెల్లటి రంగు ఫోక్స్‌వాగన్ కారులో స్నేహితులను బయటికి తీసుకెళ్లేదని కూడా దామ్లా గుర్తుకు చేసుకున్నారు.

కుప్పకూలిన ఈ భవనానికి కొద్ది మీటర్ల దూరంలో ఈ కారు పార్క్ చేసి ఉంది. కారు విండ్‌షీల్డ్ పూర్తిగా ముక్కలైంది. లోపలున్న రెడ్ లైటర్‌ను మనం చూడొచ్చు.

గదిలో ఒక పెద్ద మెషినరీ పడిపోయినట్టు శబ్దం వినిపించి, సీతాకోకచిలుకలతో ఉన్న కర్టెన్లు శిథిలాల్లోకి కూరుకుపోవడంతో, సెయిడా గది కిటికీలోంచి చూస్తూ లోపల ఎవరైనా ఉన్నారా? అని సహాయక సిబ్బంది అడిగారు.

సెయిడా సురక్షితంగా తిరిగి వస్తుందని, ఆమె మళ్లీ నవ్వుతుందని దామ్లా అంటున్నారు.

వీడియో క్యాప్షన్, కొనసాగుతున్న సహాయక చర్యలు..

నాలుగవ అంతస్తు : 'ఎంత కాలం నేను శిథిలాల కిందనే ఉన్నాను?'

భవనం దగ్గర్లో సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతంలో ఉన్న సమయంలో ఆయా కుటుంబాలు, వారి స్నేహితుల గురించి తాము చాలా తెలుసుకున్నాం. ఒక బాధితురాల్ని కూడా శిథిలాల కింద నుంచి సహాయక సిబ్బంది రక్షించారు.

ఆమె 50 ఏళ్ల ఫెర్డానే. సింగిల్ మదర్. ఈ కమ్యూనిటీలో ఆమె అందరికీ ఇష్టం.

సెయిడాతో తాను మాట్లాడినట్టు ఆమె చెప్పారు.

ఆమె చాలా గాయాలు పాలైందని, తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు సహాయక సిబ్బంది చెప్పారు. ఆమె కొడుకు కూడా అదే ఆస్పత్రిలో ఆమె పక్కనే చికిత్స పొందుతున్నారు.

ఆమెను బయటికి తీసి ఆస్పత్రిలో చేర్చిన తర్వాత, ఎంత కాలం పాటు తాను శిథిలాల కిందనున్నాని ఆమె ఒక సిబ్బందిని అడిగారు.

''మూడు రోజులు అమ్మ'' అని ఆమె కొడుకు సమాధానమిచ్చారు. ఆరు రోజుల పాటు తాను శిథిలాల కిందనున్నానని భావిస్తున్నారు.

ఆ సహాయక చర్యలు కొనసాగే వద్ద వేచిచూస్తున్న కుటుంబాలకు, మరింత మంది బతుకుతారని ఆశించవద్దని సహాయక సిబ్బంది చెబుతున్నారు.

ఎవరైనా బతికుంటే, అది అద్భుతమేనని అంటున్నారు.

ఈ వార్త రాసిన కొద్ది సేపటి తర్వాత సెయిడా మృతదేహాన్ని సహాయక సిబ్బంది కనుగొన్నారు. ఆమె తల్లి, తండ్రి కూడా మరణించారు. ఇస్కెందరున్‌లో వారికి అంత్యక్రియలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)