భూకంపంలో శిథిలాల కింద చిక్కుకుంటే.. ప్రాణాలను కాపాడుకోవటం ఎలా

భూకంపం

ఫొటో సోర్స్, UMIT BEKTAS / REUTERS

    • రచయిత, కాగిల్ కసపోగ్లు
    • హోదా, బీబీసీ న్యూస్

తుర్కియే, సిరియాలలో 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిన ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సమయం మించిపోతోంది.

మనుషులు చిక్కుకున్నట్లుగా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలోనూ గాలింపు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాలను తొలగించి వాటి కింద ఎవరైనా ఉన్నారేమోనని ప్రయత్నిస్తున్నాయి.

అయితే, ఇలా శిథిలాల కింద ఎంతసేపు ప్రాణాలతో జీవించగలం?

ఈ ప్రశ్నకు సమాధానం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు బీబీసీతో చెప్పారు. అసలు ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నారు? గాలి, నీరు అందుబాటులో ఉన్నాయా? చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది? ఆ చిక్కుకున్న వ్యక్తి ఆరోగ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? లాంటి అంశాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించారు.

సాధారణంగా చాలా సమయాల్లోనే 24 గంటల్లోనే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, కాపాడేందుకు చాలా ఎక్కువ సమయం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

విపత్తు సంభవించిన తర్వాత, ఐదు నుంచి ఏడు రోజుల వరకు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఐక్యరాజ్యసమితి బృందాలు సహాయక చర్యలు చేపడతాయి. ఒకటి లేదా రెండు రోజులుగా బతికుండే వ్యక్తులెవరూ కనిపించకపోతే ఇక సహాయక చర్యలను నిలిపివేస్తారు.

శిథిలాల కింద ప్రాణాలతో జీవించడంలో ఏ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

భూకంపం

ఫొటో సోర్స్, EPA

అవగాహన, సంసిద్ధత

భూకంపం ఎప్పుడు వస్తుంది? లేదా ఈ భవనం ఎప్పుడు కూలుతుంది? లాంటి అంశాలను కచ్చితంగా కనిపెట్టలేనప్పుడు విపత్కర పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మీరు ముందే, శిథిలాలు పైన పడకుండా, గాలి వచ్చే ప్రాంతాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

‘‘ఏదైనా బలమైన టేబుల్ కిందకు వెళ్లి నేలకు దగ్గరగా కాళ్లు, చేతులు ముడుచుకొని కూర్చుంటే పైనుంచి పడే వస్తువులు మీద పడకుండా ఉంటాయి’’అని తుర్కిష్ సెర్చ్ అండ్ రెస్క్యూ అసోసియేషన్ ఏకేయూటీ కోఆర్డినేటర్ మారట్ హరూన్ ఆంగోరెన్ చెప్పారు.

‘‘అత్యవసర సమయాల్లో ఏం చేయాలనే అంశాలపై అవగాహన, శిక్షణ ఇక్కడ చాలా ముఖ్యం. ఆ శిథిలాల కింద ఎన్ని రోజులు బతికి ఉంటామనే విషయాన్ని ఇవే నిర్ధారిస్తాయి’’అని ఆయన చెప్పారు.

మరోవైపు అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ జెట్రి రెజ్మి వివరించారు.

‘‘డెస్కు లేదా టేబుల్ కింద దాక్కుంటే ప్రాణాలతో బయటపడే అవకాశాలు పెరుగుతాయి. పరిస్థితులు ఒక్కోచోట ఒక్కోలా ఉండొచ్చు. కానీ, మనం ముందే సంసిద్ధంగా ఉంటే ఆ విపత్కర పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవచ్చు’’అని ఆమె తెలిపారు.

భూకంపం

ఫొటో సోర్స్, EPA

గాలి.. నీరు..

శిథిలమైన భవనం కింద చిక్కుకున్నప్పుడు ప్రాణాలతో జీవించాలంటే గాలి, నీరు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. అయితే, ఇక్కడ మనకు తగిలే గాయాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తస్రావం అవుతూ ఉంటే 24 గంటల కంటే ఎక్కువ సేపు ప్రాణాలతో మనుగడ సాగించడం కష్టం.

‘‘తీవ్రమైన గాయాలు కాలేదు, గాలి కూడా అందుబాటులో ఉంది అనుకోండి. వెంటనే శరీరానికి నీరు అందేలా చూసుకోవాలి’’అని నిపుణులు సూచిస్తున్నారు.

‘‘నీరు లేదా ఆక్సిజన్ అందకపోతే ప్రాణాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం’’అని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ ఎడ్వర్డ్ మూన్ చెప్పారు.

‘‘రోజు మన శరీరం నుంచి 1.2 లీటర్ల వరకు నీరు బయటకు వెళ్లిపోతుంటుంది. మూత్రం, చెమట, శ్వాస, తేమ ఇలా చాలా రూపాల్లో నీరు బయటకు వెళ్తుంది. ఎనిమిది కంటే ఎక్కువ లీటర్ల నీరు శరీరం నుంచి బయటకు వెళ్లిందంటే పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతున్నట్లే’’అని ఆయన వివరించారు.

అయితే, నీరు లేకపోయినప్పటికీ, మూడు నుంచి ఏడు రోజులు ప్రాణాలతో జీవించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

భూకంపం

ఫొటో సోర్స్, Reuters

గాయాల తీవ్రత..

తలకు బలమైన గాయం కావడం లేదా ఏమైనా ఇతర తీవ్రమైన గాయాలు తగిలితే, విపత్తు తర్వాత రోజు వరకు ప్రాణాలతో నిలబడటం కాస్త కష్టం.

అసలు దెబ్బ ఏ స్థాయిలో తగిలిందో ముందు మనం అంచనా వేసుకోవాలని డాక్టర్ రెజ్మి చెప్పారు.

‘‘వెన్నుపాము, తల లేదా ఛాతీపై తీవ్రమైన గాయాలైతే వెంటనే వారికి అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాణాలతో బయటపడటం కష్టం అవుతుంది. రక్తస్రావం కావడం, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతోనూ మరణ ముప్పు పెరుగుతుంది’’అని ఆమె వివరించారు.

‘‘ఒక్కోసారి శిథిలాల నుంచి బయటపడినప్పటికీ ‘క్రష్ సిండ్రోమ్’ వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. ముఖ్యంగా భూకంపాల సమయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంది. శిథిలాల ఒత్తిడి వల్ల శరీరంలో కండాలు తీవ్రమైన ఒత్తిడికి గురై విషపదార్థాలు ఉత్పత్తి చేస్తాయి. శిథిలాలను తొలగించినప్పటికీ, ఆ విష పదార్థాలు శరీరం మొత్తం వ్యాపిస్తాయి. అవి ప్రాణాంతకంగా మారుతాయి’’అని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఐదు వేలు దాటిన తుర్కియే సిరియా భూకంపం మృతుల సంఖ్య.

చుట్టుపక్కల వాతావరణం..

శిథిలాల కింద ప్రాణాలతో జీవించడంలో చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం టర్కీలోని కఠినమైన శీతాకాలం పరిస్థితులను మరింత తీవ్రం చేస్తోందని ప్రొఫెసర్ మూన్ చెప్పారు.

‘‘దాదాపు మైనస్ 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వరకు శరీరం తట్టుకోగలదు. ఉష్ణోగ్రతలు అంతకంటే పడిపోయినప్పుడు, పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది’’అని ఆయన వివరించారు.

అలా ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడం మొదలవుతాయి. దీన్నే హైపోథెర్మియా అంటారు.

‘‘హైపోథెర్మియా ఎంత వేగంగా తీవ్రం అవుతుంది అనేది చుట్టుపక్కల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’అని ఆయన వివరించారు.

అదే వేసవిలో అయితే, చుట్టుపక్కల మరింత వేడిగా ఉంటే, శరీరంలో నీటి స్థాయిలు వేగంగా పడిపోతాయి. దీంతో బతికి బట్టకట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: 'శిథిలాల మధ్య నా కుటుంబ సభ్యులు చూస్తుండగానే చనిపోయారు'

మానసికంగా దృఢంగా

ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. అయితే, మనం ఎలాగైనా జీవించాలని గట్టి పట్టుదలతో ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

‘‘భయం అనేది సహజం. కానీ, మనం భయపడకూడదు. మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడే కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలం’’అని ఆంగోరెన్ వివరించారు.

‘‘ముఖ్యంగా భయాన్ని అధిగమించి మనపై మనకు నియంత్రణ తెచ్చుకోవాలి. ‘నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నాను, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకునే మార్గాన్ని వెతకాలి’అని మనమే మనకు ప్రేరణ ఇచ్చుకోవాలి. ఫలితంగా మనలో భయం తగ్గుతుంది. దీంతో చాలా ఎనర్జీని మనం ఆదా చేసుకోవచ్చు’’అని ఆంగోరెన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో భూకంపం: ‘2001 విధ్వంసం గుర్తొచ్చింది’

అద్భుత కథలు..

1995లో దక్షిణ కొరియాలో భూకంపం అనంతరం పది రోజుల తర్వాత శిథిలాల నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం వర్షపు నీటిని తాగుతూ, కార్డ్‌బోర్డు బాక్సుని తింటూ ఆయన ప్రాణాలు కాపాడుకున్నారు. తన మెదడు యాక్టివ్‌గా ఉండేందుకు ఒక చిన్నపిల్లల బొమ్మతో ఆ శిథిలాల కింద ఆయన ఆటలు ఆడారు.

ఇలానే మే 2013లో బంగ్లాదేశ్‌లో శిథిలాల కింద నుంచి ఒక మహిళను రక్షించారు. అయితే, అప్పటికే ఆ భవనం కుప్పకూలి 17 రోజులైంది.

‘‘సహాయక సిబ్బంది గొంతు నాకు రోజూ వినిపించేది. చుట్టుపక్కల శిథిలాలను నేను కర్రతో కొట్టేదాన్ని. అలా అక్కడ నేను బతికే ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నించేదాన్ని’’అని ఆమె చెప్పారు.

‘’15 రోజులపాటు ఎండిపోయిన ఆహారాన్ని తిసుకున్నాను. కానీ, చివరి రెండు రోజులు నీరు తప్పా ఏమీ దొరకలేదు’’అని ఆమె వివరించారు.

జనవరి 2010లో హైతీలో వచ్చిన భూకంపం వల్ల 2,20,000 మంది మరణించారు. అయితే, ఒక దుకాణం శిథిలాల కింద ఒక వ్యక్తి 12 రోజులపాటు ప్రాణాలతో గడిపారు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా శిథిలాల కింద 27 రోజులు గడిపినట్లు వార్తలు వచ్చాయి.

2005 అక్టోబరులో పాకిస్తాన్‌లోని భూకంపం వచ్చిన రెండు నెలల తర్వాత 40 ఏళ్ల మహిళను ఆమె వంట గది శిథిలాల కింద నుంచి బయటకు తీశారు.

ఆమెకు కండరాలు పట్టేశాయి. సరిగా నడవలేకపోయారు. ఆమె మాట్లాడటం కూడా కష్టమైంది. ‘‘మెదట్లో ఆమె చనిపోయిందని మేం అనుకున్నాం. కానీ, బయటకు తీస్తున్నప్పుడు ఆమె కళ్లు తెరిచారు’’అని బీబీసీతో ఆమె బంధువు ఒకరు అప్పట్లో చెప్పారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)