టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

టర్కీ భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

టర్కీలో తీవ్ర భూకంపం వల్ల 20 మంది మృతిచెందారని, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.

ఈ భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఎలాజిగ్ ప్రావిన్సులోని సివిరిస్ పట్టణం మధ్యలో వచ్చిన ఈ భూకంపంతో చాలా భవనాలు కుప్పకూలాయి.

ప్రకంపనలు రాగానే భవనాల్లో ఉంటున్న వారు వీధుల్లోకి పరుగులు తీశారు.

ఈ ప్రకంపనల ప్రభావం టర్కీ పొరుకునే ఉన్న సిరియా, లెబనాన్, ఇరాన్ వరకూ కనిపించింది.

శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.55కు వచ్చాయి.

Presentational grey line
News image
Presentational grey line

టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ(ఏఎఫ్ఏడీ) వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.

400కు పైగా రెస్క్యూ బృందాలు నిరాశ్రయుల కోసం గుడారాలు, ఇతర సహాయ సామగ్రి తీసుకుని భూకంప ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరాయి.

టర్కీలో భూకంపాలు సర్వసాధారణం. 1999లో ఇజ్మిత్ నగరంలో వచ్చిన భారీ భూకంపంలో 17 వేల మంది మృతిచెందారు.

టర్కీ భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఎలాజిగ్ ప్రావిన్సులో 8 మంది, మలాట్యా ప్రావిన్సులో ఆరుగురు మృతి చెందారని ఆయా ప్రావిన్సుల గవర్నర్లు చెప్పారు.

కూలిన భవనాల్లో ఉన్నవారిని కాపాడేందుకు అత్యవసర సేవల బృందాలు వేగంగా చర్యలు తీసుకుంటూ ఉండడం టీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది.

"ఇది చాలా భయంకరం. ఫర్నిచర్ మా పైన పడిపోయింది. మేం వెంటనే బయటకు పరుగులు తీశాం" అని ఎలాజిగ్‌సో నివసించే 47 ఏళ్ల మెలహత్ కాన్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.

టర్కీ భూకంపం

భూకంపం వచ్చిన ప్రాంతం రాజధాని అంకారాకు 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు తెలీడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

భూకంప ప్రభావిత ప్రాంతాలకు అధికారులు పడకలు, దుప్పట్లు పంపించారు. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తరచూ సున్నాకు దిగువకు పడిపోతుంటాయి.

సివిరిస్ పట్టణంలో 4 వేల మంది ఉంటారు. హజార్ సరస్సు ఒడ్డున ఉండే ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)