దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వరుస భూప్రకంపనలు భారీ భూకంపానికి సంకేతమా? భూకంపం వస్తే దిల్లీ తట్టుకోగలదా?

ఫొటో సోర్స్, facebook/nationalcenterforseismology
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లోని దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి మే 3 మధ్య వచ్చిన 7 భూప్రకంపనలను నేషనల్ సెంటర్ ఆఫ్ సెసిమాలజీ రికార్డు చేసింది.
వీటిలో ఏ ప్రకంపనల తీవ్రత కూడా రిక్టర్ స్కేలు మీద 4 దాటలేదు. 5 కంటే తక్కువ తీవ్రతతో వచ్చే భూప్రకంపనల వల్ల పెద్ద నష్టం ఉండదని నిపుణులు బలంగా నమ్ముతున్నారు.
దీంతో రెండు ప్రశ్నలు కచ్చితంగా వస్తున్నాయి. దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో భూప్రకంపనల ముప్పు నిజంగా పెరుగుతోందా. భవిష్యత్తులో ఇది చాలా ఆందోళనకరమైన అంశం కాబోతోందా?
వీటికి సమాధానాలు తెలుసుకునే ముందు అసలు భారత్‌లో భూకంపాలు వచ్చే అవకాశం ఏమేరకు ఉంది అనేది మొదట తెలుసుకోవాలి.
భూకంప నిపుణుల అంచనాల ప్రకారం భారత్‌లోని దాదాపు 59 శాతం భూభాగాన్ని భూకంపాలు వచ్చే ప్రాంతంగా వర్గీకరించారు.
ప్రపంచంలోని మిగతా దేశాల్లోలాగే భారత్‌లో కూడా గుర్తించిన కొన్ని జోన్లను బట్టి ఏ భాగాల్లో సెసిమిక్ కార్యకలాపాలు(భూమి పొరల్లో జరిగే భౌగోళిక కదలికలు) ఎక్కువగా ఉంటాయి, ఏ భాగాల్లో తక్కువగా ఉంటాయి తెలుస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
భూకంపం వచ్చే ప్రాంతాలు ఎలా గుర్తిస్తారు?
నిపుణులు ఇది గుర్తించేందుకు ఒక పద్ధతిని కనుగొన్నారు. భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను ఐదు సెసిమిక్ జోన్లుగా విభజించారు. జోన్-1లో భూకంపాలు వచ్చే అవకాశాలు అతి తక్కువగా ఉంటే, జోన్-5లో అది వచ్చే అవకాశం చాలా తీవ్రంగా ఉంటుంది.
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం సెసిమిక్ జోన్-4 కిందికి వస్తుంది. అందుకే ఉత్తర భారతదేశంలోని ఈ ప్రాంతంలో సెసిమిక్ కార్యకాలాపాలు ఎక్కువగా ఉంటాయి.
సెసిమిక్ జోన్-4లో ఉన్న దేశంలోని అన్ని పెద్ద నగరాలతో పోలిస్తే దిల్లీలో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశంలోని ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు కూడా సెసిమిక్ జోన్-3 శ్రేణిలో ఉన్నాయి.
యురేషియా లాంటి టెక్టానిక్ ప్లేట్లు కలవడం వల్ల ఏర్పడిన హిమాలయాలకు దగ్గరగా ఉండడం కూడా దిల్లీకి సమస్యగా మారిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే భూమి అడుగున ప్లేట్ల కదలికల ప్రభావం దానిపై ఉంటుందని అంటున్నారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మహేశ్ టాండన్ దిల్లీలో భూకంపాలతోపాటూ బలహీనంగా ఉండే భవనాల నుంచి కూడా ప్రమాదం ఉందని చెబుతున్నారు.
“మా అంచనా ప్రకారం దిల్లీలోని 70-80 శాతం భవనాలను సగటు కంటే పెద్ద భూ ప్రకంపనలు వస్తే తట్టుకునేలా డిజైన్ చేయలేదు. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా యమునా నది తూర్పు, పశ్చిమ తీరాల దగ్గర భవనాలు పెరుగుతుండడం చాలా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఎక్కువ భవనాలను కట్టే ముందు అక్కడి మట్టి గట్టిదనం గురించి పరీక్షలేవీ చేయలేదు” అన్నారు.
దిల్లీలో 100 లేదా అంతకు మించి జనాభా నివసిస్తున్న అన్ని భవనాలపై, అవి నిర్ణీత కేటగిరీ భూకంపాలను తట్టుకోగలవని స్పష్టంగా సూచించాలని భారత సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం ఆదేశేంచింది. అయితే, ఇప్పటివరకూ అలాంటివేమీ జరిగినట్లు కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తులో భారీ భూకంపం ముప్పు
“దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో జనసాంద్రత ఎక్కువగా ఉండడం కూడా ఒక సమస్య. కోటిన్నరకు పైగా జనాభా ఉన్న దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లక్షల భవనాలు దశాబ్దాల పాతవి అయిపోయాయి. ఇక కాలనీలన్నీ పక్కపక్కనే ఉన్నాయి. దిల్లీ, ఉత్తర భారతదేశం అంతటా చిన్న చిన్న ప్రకంపనలు లేదా ఆఫ్టర్ షాక్స్ వస్తూనే ఉంటాయి. కానీ రాబోయే ఐదేళ్లలో కచ్చితంగా పెద్ద భూకంపాలు కూడా వస్తుంటాయి. అందుకే ఇది ఆందోళనకరం” అని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయినా దిల్లీకి కాస్త దూరంలోనే ఉన్న పానిపత్ ప్రాంతం దగ్గర భూగర్భంలో ఫాల్ట్ లైన్ ఉంది. దానివల్ల భవిష్యత్తులో ఇక్కడ ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.
“ఏదైనా ఒక పెద్ద భూకంపం వచ్చే సమయం, ప్రాంతం, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత ఎంతుండచ్చు అనేది ముందే ఊహించి చెప్పలేం” అని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ టెక్నాలజీ చీఫ్ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ కాల్‌చంద్ జైన్ అంటున్నారు.
“కానీ మనం ఒక విషయం చెప్పచ్చు. దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో సెసిమిక్ కార్యకలాపాలు వరుసగా జరుగుతున్నాయి. అవి ఏదైనా పెద్ద భూకంపం రావడానికి కారణం కావచ్చు” అని ఆయన చెప్పారు.
ఏదైనా ఒక పెద్ద భూకంపం రేంజ్ 250 నుంచి 350 కిలోమీటర్ల వరకూ ఉండచ్చు అనేది భూకంపం, సెసిమిక్ జోన్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం.
ఉదాహరణకు 2001లో గుజరాత్ భుజ్‌లో వచ్చిన భూకంపం వల్ల దానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లో కూడా భారీ స్థాయి విధ్వంసం జరిగింది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గత 300 ఏళ్ల భూకంప చరిత్రను గమనిస్తే అత్యంత ఎక్కువ విధ్వంసం సృష్టించిన భూకంపం 1720 జులై 15న వచ్చిందని చెబుతారు.

దిల్లీలో 1720లో భారీ భూకంపం
భూకంపాలకు సంబంధించి ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాస్ పాండే తన అధ్యయనంలో ఆ విషయం ప్రస్తావించారు.
ఆయన అందులో “1720లో భూకంప తీవ్రత గురించి 1833లో ప్రచురించిన ‘ద ఓల్డ్ హామ్స్ కాటలాగ్ ఆఫ్ ఇండియన్ ఎర్త్ క్వేక్స్’ లో ఉంది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.5-7.0 మధ్య ఉంది. ఆ భూకంపం వల్ల పాత దిల్లీ, ఇప్పటి న్యూ దిల్లీ ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. భూకంపం వచ్చిన తర్వాత ఐదు నెలల వరకూ తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి” అన్నారు.
డాక్టర్ ప్రభాస్ పాండే అందులోనే “20వ శతాబ్దం విషయానికి వస్తే 1905లో కాంగ్డా, 1991లో ఉత్తర కాశి, 1999లో చమోలీలో వచ్చిన భూకంపాలు ఉత్తర భారతదేశంలో పెద్దవిగా చెప్పవచ్చు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా ఒకే సమయంలో అనిపించిన ప్రకంపనలకు భూమి మధ్యలో జరిగే కార్యకలాపాలకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది” అన్నారు.
భూకంపం లాంటి పకృతి విపత్తును ఎదుర్కోడానికి దిల్లీ ఎంత సిద్ధంగా ఉంది అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, REUTERS
భూకంపమే వస్తే?
ఇంతకు ముందుతో పోలిస్తే, ఇప్పుడు భారత్ అలాంటి ఏ విపత్తునైనా సమర్థంగా ఎదుర్కోగలదని సార్క్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ భావిస్తున్నారు.
“చూడండి. భయాలు కేవలం అంచనాలపై ఆధారపడి ఉంటాయి. మనం లాతూర్‌లో వచ్చిన భూకంపాన్నే గమనిస్తే, కచ్చితంగా దిల్లీలోని ఎన్నో భవనాలు అసురక్షితంగా ఉన్నాయని చెప్పచ్చు. కానీ చాలా ప్రాంతాల్లో అవి సురక్షితంగా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి పౌరుడూ అలాంటి ప్రమాదం గురించి అప్రమత్తంగా ఉండాలి అనేది చాలా ముఖ్యం. నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రభుత్వం కూడా ప్రయత్నించాలి” అన్నారు.
దిల్లీలో అలాంటి వేల భవనాలకు రెట్రోఫిల్లింగ్, అంటే భూకంపాన్ని తట్టుకోగలిగేలా మరమ్మతులు చేయడం చాలా అవసరం అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లోని అనుమితా రాయ్ చౌధరి భావిస్తున్నారు.
“భారత్‌లో చాలా భాగాల్లో భవనాలు భూమిలో కుంగుతున్నాయనే వార్తలు వస్తూనే ఉంటాయి. అది కూడా భూకంపాలు లాంటివి లేకుండానే. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం ఇప్పటికే యమునా నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది. అంటే పెద్ద భూకంపాన్ని తట్టుకునే సామర్థ్యం అక్కడి భవనాలకు తక్కువగా ఉంటుంది. పాత భవనాలకు పూర్తిగా మరమ్మతులు చేయాలి. కొత్త భవనాలన్నింటినీ కనీసం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని తట్టుకోగలిగేలా నిర్మించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








