భారత్ పురాతన స్మార్ట్‌ఫుడ్‌ ఎలా సూపర్‌ఫుడ్‌గా మారుతోంది?

మిల్లెట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చారుకేసి రామదురై
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కర్రల పొయ్యికి ఎదురుగా చీర కట్టుకొని కూర్చున్న ఆమె సజ్జల(పెర్ల్ మిల్లెట్)తో చేసిన ఒక రొట్టెపై నెయ్యి రాసి నా చేతికి ఇచ్చారు. దీనితోపాటుగా సెనగపిండితో చేసిన రుచికరమైన కూర కూడా పెట్టారు. నేను నాగ్‌పుర్‌లోని ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాను. అది మంచి శీతాకాలం. ఆ రుచికరమైన సజ్జ రొట్టి నా బొజ్జలో కాస్త వేడినింపింది.

మిల్లెట్లను నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా అంతగా సారవంతంకాని నేలల్లో ఎక్కువగా పండిస్తుంటారు. వీటిని జావతో మొదలుపెట్టి బియ్యానికి ప్రత్యామ్నాయంగా, రొట్టెలు చేసుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు.

ఒకప్పుడు భారతీయ వంటల్లో ఇవి తప్పకుండా ఉండేవి. కానీ, క్రమంగా వీటి స్థానాన్ని వరి, గోదుమలు ఆక్రమించాయి. అయితే, మళ్లీ నేడు భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్ల వాడకం ఎక్కువవుతోంది. అందుకే 2023ను ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’’గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

దీన్ని ప్రకటించేందుకు డిసెంబరు 2022లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ క్యూ డాంగ్యూ మాట్లాడుతూ మిల్లెట్ల పోషక విలువలు, వీటి సాగు వల్ల చిన్నచిన్న రైతుల జీవితాల్లో వస్తున్నా మార్పులు, ఆహార భద్రత సమస్యకు పరిష్కారం, సుస్థిర అభివృద్ధి గురించి చెప్పారు.

ఇది దక్షిణార్ధ గోళంలో ప్రజలకు శుభవార్తగా చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్‌తోపాటు కొన్ని ఆఫ్రికా దేశాల్లో శతాబ్దాలకు ముందు నుంచే వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో చాలా రకాలను చైనా నుంచి 5,000 క్రితం ప్రపంచంలో చాలా ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.

నేడు భారత్‌లో దాదాపు తొమ్మిది రకాల చిరుధాన్యాలను పంపడిస్తున్నారు. జొన్నలు (సోర్ఘమ్), రాగులు (ఫింగర్ మిల్లెట్), సామలు (లిటిల్ మిల్లెట్), అరికెలు (కోడో మిల్లెట్), కొర్రలు (ఫాక్స్‌టెయిల్ మిల్లెట్), ఊదలు (బన్యార్డ్ మిల్లెట్) లాంటివి వీటిలో ఉన్నాయి.

వీటిలో రంగు, పరిమాణం, లోపల పిండి పదార్థంలో కాస్త తేడాలు ఉండొచ్చు. అయితే, పోషక విలువల్లో ఇవి దాదాపు ఒకేలా ఉంటాయి. వీటికి స్థానిక భాషల్లో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.

మిల్లెట్లు

ఫొటో సోర్స్, pixelfusion3d/Getty Images

హరిత విప్లవంతో..

1960ల్లో హరిత విప్లవం తర్వాత మిల్లెట్ల వినియోగంలో చాలా మార్పులు వచ్చాయి. హైబ్రిడ్, అధిక దిగుబడి ఇచ్చే వండగాలతో గోదుమ, వరి దిగుబడి ఇక్కడ విపరీతంగా పెరిగింది. దీంతో దేశం ఆహార ధాన్యాల కొరత నుంచి ఎగుమతి చేసే స్థాయికి వెళ్లింది. దీంతో ప్రాసెస్ చేసిన బియ్యం, గోదుమల ముందు మిల్లెట్లు కాస్త వెనుకబడ్డాయి.

అయితే, అప్పటికీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండేది. రాగి ముద్ద, జొన్న రొట్టె లాంటి వంటకాలను తక్కువ ఖర్చుతోనే వండుకోవచ్చు. పైగా వీటితో కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.

అయితే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసవెళ్లే వారికి మిల్లెట్లు మరింత మేలు చేసేవి. ముఖ్యంగా శీతాకాలంలో చలి నుంచి శరీరాన్ని కాస్త వేడిగా ఉంచేందుకు వీరికి జొన్నలు తోడ్పడేవి. వీటితో రోగ నిరోధక వ్యవస్థ కూడా పటిష్ఠం అవుతుంది. మరోవైపు ఎక్కువ దూరం వెళ్లాల్సినప్పుడు బలం కోసం ఎనర్జీ పుష్కలంగా ఉండే రాగి ముద్దలను తీసుకునేవారు.

ఉదయం వీటిని ఆహారంగా తీసుకునే రైతులు రోజంతా హాయిగా పొలం పనులు చేయడాన్ని నేటికీ మనం చూడొచ్చు.

నాకు సజ్జ రొట్టి ఇచ్చిన ఆమె లాంటి వారికి తరతరాల నుంచి ఈ రొట్టెలను ఎలా వండుతున్నారో బాగా తెలుసు. నిజానికి వీరే మిల్లెట్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు.

మిల్లెట్లు

ఫొటో సోర్స్, Millet Project

పోషకాలు పుష్కలంగా..

నేడు భారత్‌లోని దాదాపు అన్నీచోట్లా మిల్లెట్లతో చేకూరే ప్రయోజనాలను గుర్తించడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు.

‘‘ఆధునికీకరణతోపాటు సులువైన మార్గాల వెంట పడటంతో మేం అద్భుతమైన మిల్లెట్లను పట్టించుకోవడం మానేశాం. వీటితో మన ముందుతరాలు అద్భుతమైన వంటకాలు వండేవి. కానీ, నేడు భారతీయుల్లో చాలా మందిని మధుమేహం పీడిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ ఆ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. గోదుమ, వరి కోసం మనం వాటిని పక్కన పెట్టేశాం. మళ్లీ ఇప్పుడు వాటిని ఆహారంలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’అని ఏళ్లపాటు మిల్లెట్ల వాడకంపై ప్రచారం చేస్తున్న మను చంద్ర వెంచర్స్ వ్యవస్థాపకుడు, షెఫ్ మను చంద్ర చెప్పారు.

‘‘మిల్లెట్లలో గ్లూటెన్ ఉండదు. అంతేకాదు ఐరన్, కాల్షియం స్థాయిలు గోదుమ, వరి కంటే ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కట్టడి చేయడంలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి’’అని ముంబయికి చెందిన న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ అమిత గాద్రే చెప్పారు.

‘‘ఉదాహరణకు ఒక వంద గ్రాముల రాగిలో 344 గ్రా. కాల్షియం ఉంటుంది. అదే వరి, గోదుమలలో 33 గ్రా. మాత్రమే ఉంటుంది’’అని అమిత వివరించారు.

మిల్లెట్ల సాగుతో రైతులకూ చాలా మేలు జరుగుతుందని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్, కాలిఫోర్నియా బెర్కెలీ యూనివర్సిటీ మిల్లెట్ ప్రొజెక్ట్ ఫౌండర్ అమృత హజారా వివరించారు.

‘‘వీటి సాగుకు ఎక్కువ నీరు, ఎరువులు అవసరం లేదు. పొడిబారిన ప్రాంతాల్లోనూ వీటిని విరివిగా పెంచొచ్చు. అసలు ఏమీ పండవని భావించే నేలల్లోనూ మిల్లెట్లను సాగు చేయొచ్చు’’అని ఆమె చెప్పారు.

‘‘వీటిని పండించడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. రెండు పంటల మధ్య అంతర పంటగా కూడా వీటిని వేయొచ్చు. వీటితో నేలలో పోషక విలువలు కూడా పెరుగుతాయి’’అని అమృత వివరించారు.

మిల్లెట్లు

ఫొటో సోర్స్, Toast & Tonic

మరోవైపు దశాబ్ద కాలం నుంచి మిల్లెట్ల సాగు, వినియోగాన్ని భారత ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ వస్తోంది. వీటిని ‘‘కోర్స్ గ్రైన్స్’’కు బదులుగా ‘‘న్యూట్రీసెరెల్స్’’గా పిలవడం మొదలుపెట్టారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రాచుర్యం కల్పించేందుకు దౌత్యపరంగా ప్రభుత్వం కృషిచేస్తోంది. మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్‌ను హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోంది.

నేడు దాదాపు అన్ని వర్గాల్లోనూ మళ్లీ ఈ చిరుధాన్యాల వాడకం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాస్త ధనిక వర్గాల ప్రజలు క్వినోవా లాంటి చిరుధాన్యాలను తీసుకుంటే, అల్పాదాయ వర్గాలు కూడా మెరుగ్గా తమ భోజనాల్లో మిల్లెట్లకు చోటు కల్పిస్తున్నారు.

మరోవైపు ప్రముఖ రెస్టారెంట్లలోనూ మెనూల్లో మిల్లెట్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ముంబయిలోని ద బాంబే క్యాంటీన్‌ను తీసుకుంటే ఇక్కడ బార్లీ, సామలతో చేసిన వంటకాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జొన్నలు, రాగులు, కొర్రలు, అరెకలు కూడా కనిపిస్తున్నాయి. దగ్గర్లోని నూన్ రెస్టారెంట్‌లో మిల్లెట్ దోశ, సోవమ్‌లో సామల మిఠాయి, రాగి ప్యాన్‌కేక్‌లు కూడా విక్రయిస్తున్నారు.

బెంగళూరులోనూ మిల్లెట్ కిచిడీ, రాగి పిజ్జాలు చాలా చోట్ల అమ్ముతున్నారు. ముంబయి, బెంగళూరుల్లో ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన టోస్ట్ అండ్ టానిక్ రెస్టారెంట్లలోనూ మిల్లెట్ రుచులను ఆస్వాదించొచ్చు.

మిల్లెట్లు

ఫొటో సోర్స్, Toast & Tonic

కొత్త రుచులు కావాల్సిందేనా?

అయితే, ‘‘మిల్లెట్లను కొత్త తరాలకు చేరువ చేయాలంటే కొత్త పద్ధతుల్లో వారికి వడ్డించాల్సి ఉంటుంది. పాత వంటకాలు వారికి అంతగా నచ్చకపోవచ్చు’’అని చంద్ర అంటున్నారు.

మిల్లెట్ కంపెనీలు టాటా సోల్‌ఫుల్, స్లర్ప్ ఫార్మ్స్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. కొత్తకొత్త చిరుతిండ్లు, చిప్స్, చక్కీలు, నూడుల్స్, ప్యాన్‌కేక్ మిక్స్, బ్రేక్‌ఫాస్ట్ రెసెపీలను వారు తీసుకొని వస్తున్నారు.

‘‘అమెరికాలో ఒక దశాబ్దం క్రితం క్వినోవా తింటున్నప్పుడు, అసలు భారత మిల్లెట్లతో ఎందుకు కొత్తగా ప్రయత్నించకూడదు? అనే ప్రశ్న నాలో పుట్టింది’’అని టాటా సోల్‌ఫుల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ పరమేశ్వరన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, రాయలసీమలో కొరియా రుచులు

సంతులిత ఆహారం కోసం..

మిల్లెట్లతో మన భోజనం ప్లేటులోనూ భిన్నత్వం ఉట్టిపడుతుందని గాద్రే చెప్పారు. సంతులిత ఆహారం కోసం వరి, గోదులతోపాటు మిల్లెట్ల కూడా కలుపుకోవాలని ఆమె సూచిస్తున్నారు.

మరికొంతమంది పోషకాహార నిపుణులు కూడా వీరి అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘భారత్‌ వంటకాల్లో ఉట్టిపడే భిన్నత్వానికి మిల్లెట్లు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటితో మనకు కావాల్సిన ఫైబర్ అందుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. పైగా భిన్న రకాల రుచులను మనం ఆస్వాదించొచ్చు’’అని న్యూట్రీషనిస్టు నందిత అయ్యర్ చెప్పారు.

నేడు మిల్లెట్లతో తయారుచేసిన బీర్‌లను కూడా చాలా ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

‘‘మా దగ్గర ఎప్పుడూ ఒక మిల్లెట్ బీర్ అందుబాటులో ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త బీర్‌ను మేం తయారుచేస్తుంటాం. ప్రస్తుతం మేం జొన్నలతో ఒక కొత్త బీర్ తయారుచేస్తున్నాం. అన్ని విధానాలుగా మా బీర్ స్థానికంగానే కనిపించాలి. దీనికి అవసరమైనవన్నీ స్థానికంగానే సేకరించాలి. ఈ జొన్నల బీర్‌కు అవసరమైనవన్నీ పుణెలోనే పండిస్తాం’’అని పుణెకు చెందిన గ్రేట్ స్టేట్ ఏల్‌వర్క్స్‌కు చెందిన నకుల్ భోస్లే చెప్పారు.

వీడియో క్యాప్షన్, లండన్ చేరేనాటికి పటేల్ దంపతుల చేతిలో కేవలం 12 పౌండ్లున్నాయి.

‘‘మిల్లెట్ బీర్ అంటే అందరికీ గ్లూటెన్ ఫ్రీగా కనిపిస్తుంది. మాకు మాత్రం ఇది స్థానిక రైతులతో కలిసి పనిచేయడం లాంటిది’’అని ఆయన వివరించారు.

మరోవైపు మిల్లెట్స్‌ కేవలం తినేవారికే కాదు, రైతులకు, పర్యావరణానికీ మేలు చేస్తాయని పరమేశ్వరన్ వివరించారు. ‘‘వాతావరణ మార్పుల కట్టడికి ఇది నా వంతుగా నేను చేస్తున్న ప్రయత్నం. ఇది కేవలం సూపర్ ఫుడ్ కాదు.. స్మార్ట్ ఫుడ్’’అని ఆయన చెప్పారు.

ఇప్పటికే మిల్లెట్ల ఉత్పత్తి, ఎగుమతిల్లో ప్రపంచంలో భారత్ మొదటి వరుసలో ఉంది. ఈ సంవత్సరాన్ని మిల్లెట్ ఏడాదిగా గుర్తించడంతో ఇక్కడి రైతులకు చాలా మేలు జరిగే అవకాశముంది. ఇక వినియోగదారుల విషయానికి వస్తే, ఒకప్పటి సంప్రదాయం నేడు మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)