లక్షలాదిగా ఆక్టోపస్‌‌ల సాగుకు ప్రణాళిక.. బీబీసీకి లభించిన రహస్య పత్రాలు ఏం చెప్తున్నాయి?

ఆక్టోపస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే తొలి ఆక్టోపస్ ఫామ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

బీబీసీ చూసిన రహస్య పత్రాల ప్రకారం, ఆహార అవసరాల కోసం స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్స్‌లో ప్రతీ ఏటా లక్షలాది ఆక్టోపస్‌లను ఈ ఫామ్‌లో పెంచుతారు.

ఆక్టోపస్‌లను ఇలా సాగు పద్ధతిలో ఎప్పుడూ పెంచలేదు.

తెలివైన జీవులుగా పేరున్న ఆక్టోపస్‌లను మాంసం కోసం సాగు చేయాలన్న ప్రణాళికలపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్టోపస్‌లకు నష్టం జరుగుతుందనే వీరి ఆరోపణలను ఈ ఫామ్ ఏర్పాటు ప్రణాళికలను రచించిన స్పానిష్ బహుళజాతి సంస్థ ‘నుయెవా పెస్కానోవా’ ఖండించింది.

ఆక్టోపస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆక్టోపస్

ఈ ఫామ్‌ ఏర్పాటు ప్రణాళికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన పత్రాలను ‘‘యూరోగ్రూప్ ఫర్ యానిమల్స్’’ అనే జంతు సంరక్షక సంస్థ, బీబీసీకి ఇచ్చింది.

ఫామ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను నుయెవా పెస్కానోవా, కానరీ ఐలాండ్స్ ఫిషింగ్ జనరల్ డైరెక్టరేట్‌కు పంపించింది.

దీనిపై స్పందించాల్సిందిగా బీబీసీ కోరగా నుయెవా సంస్థ నుంచి ఎలాంటి జవాబు రాలేదు.

సముద్రంలో కుండలు, ఉచ్చులను ఉపయోగించి పట్టుకున్న ఆక్టోపస్‌లను ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాల కోసం ఉపయోగిస్తారు.

ఆసియా, లాటిన్ అమెరికాతో పాటు మధ్యదరా ప్రాంతంలో వీటిని తింటారు.

నియంత్రిత పద్ధతుల్లో ఆక్టోపస్‌ల సంతానోత్పత్తిని పెంచే రహస్యాన్ని కనుగొనేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది చాలా కష్టమైన పని. దీనికోసం అత్యంత భద్రమైన నియంత్రిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, ఈ పనిలో శాస్త్రీయపరమైన పురోగతిని సాధించినట్లు 2019లో నుయెవా పెస్కానోవా ప్రకటించింది.

అక్టోపస్‌లను విపరీత సంఖ్యలో సాగు చేసే ఈ పద్ధతిపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది.

ఆ విధానాన్ని మొదలుపెట్టక ముందే దానిపై నిషేధం విధించాలని వాషింగ్టన్ చట్టసభ సభ్యులు ప్రతిపాదనలు చేశారు.

ప్రపంచంలోనే తొలిసారిగా ఆక్టోపస్‌ల సాగు

ఫొటో సోర్స్, Gerardo G. Mourín - [email protected]

సాధారణంగా చీకటిలో ఉండే ఒంటరి జీవులైన ఆక్టోపస్‌లను ఒక స్థిరమైన వెలుతురులో ఇతర ఆక్టోపస్‌లతో కలిపి ట్యాంకుల్లో పెంచాలని నుయెవా పెస్కానోవా ప్రణాళికలు రచించింది.

గ్రాన్ కనారియాలోని పోర్ట్ ఆఫ్ లాస్ పల్మాస్‌లో రెండు అంతస్థుల భవనంలో 1000 కమ్యూనల్ ట్యాంకుల్లో వీటిని పెంచాలని అనుకుంటున్నారు.

రహస్య పత్రాల ప్రకారం, ఆక్టోపస్‌లను మైనస్ 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే కంటైనర్లలో ఉంచడం ద్వారా చంపుతారు.

ఆక్టోపస్‌లను గతంలో ఎప్పుడూ వాణిజ్య ప్రయోజనాల కోసం ఇలా సాగు చేయనందున ప్రస్తుతం వాటి సంక్షేమానికి సంబంధించిన ఎలాంటి నిబంధనలు అమల్లో లేవు.

ఇలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చేపలను వధించే పద్ధతిని ‘ఐస్ స్లర్రీ’ అని పిలుస్తారు. ఐస్ స్లర్రీ పద్ధతి నెమ్మదైన, ఒత్తిడితో కూడిన మరణాన్ని కలగజేస్తుందని అధ్యయనాలు తెలిపాయి.

అది చేపల సంక్షేమానికి చేటు చేస్తుందని జంతు ఆరోగ్యం కోసం పనిచేసే ప్రపంచ సంస్థ చెప్పింది.

టెస్కో, మోరిసన్స్‌లతో సహా కొన్ని సూపర్ మార్కెట్లు ఇప్పటికే ఐస్‌ను ఉపయోగించి వధించిన చేపల అమ్మకాల నుంచి తప్పుకున్నారు.

‘‘వాటిని ఐస్‌ను ఉపయోగించి నెమ్మదిగా చంపడం అనేది చాలా క్రూరమైన అంశం. దాన్ని ఆమోదించకూడదు’’ అని డార్ట్‌మౌత్ యూనివర్సిటీ న్యూరాలజిస్ట్, ప్రొఫెసర్ పీటర్ సే అన్నారు.

అమెరికా, దక్షిణ కొరియా వంటి ప్రీమియం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఏడాదికి 3,000 టన్నుల ఆక్టోపస్‌లను ఉత్పత్తి చేయాలని నుయెవా పెస్కానోవా ఆశిస్తోంది.

ఇది దాదాపు ఒక మిలియన్ జంతువులకు సమానం అవుతుందని, ట్యాంకులోని ఒక క్యూబిక్ మీటర్ స్థలంలో 10 నుంచి 15 ఆక్టోపస్‌లను పెంచుతారని పెస్కానోవా ప్రణాళికలను చదివిన కంపాషన్ ఇన్ వరల్డ్ ఫార్మింగ్ (సీఐడబ్ల్యూఎఫ్) అనే ప్రచార సంస్థ చెప్పింది.

తమ విధానంలో ఆక్టోపస్ మరణాల రేటు 10 నుంచి 15 శాతం ఉంటుందని నుయెవా పెస్కానోవా తన డాక్యుమెంటేషన్‌లో అంచనా వేసింది.

ఆక్టోపస్ ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

బాధ, ఆనందాన్ని అనుభవించే జీవులు

ఆక్టోపస్‌లు బాధ, ఆనందాన్ని కనబరిచే జీవులని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ జొనాథన్ బిర్చ్ చెప్పారు. ఆయన 300లకు పైగా శాస్త్రీయ అధ్యయనాల సమీక్షలకు నాయకత్వం వహించారు.

ఈ లక్షణమే వాటిని ‘‘తెలివైన జీవులుగా’’ పరిగణించేలా చేసిందని చెప్పారు.

అత్యన్నత స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ ఆక్టోపస్‌లను సాగు చేయడం అసాధ్యమైన పని అని, ‘ఐస్ స్లర్రీ’ మరణాలను ఆమోదించకూడదని ప్రొఫెసర్ బిర్చ్, ఆయన సహ రచయితలు నమ్ముతారు.

‘‘పెద్ద సంఖ్యలో ఆక్టోపస్‌లను తక్కువ ప్రదేశంలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, సంఘర్షణ పెరిగి అత్యధిక మరణాల రేటుకు దారి తీస్తుంది. ఏ రకమైన సాగులో అయినా 10 నుంచి 15 శాతం మరణాల రేటు ఆమోదయోగ్యం కాదు’’ అని వారు అన్నారు.

బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో నుయెవా పెస్కానోవా ఇలా చెప్పింది. ‘‘మా ఫామ్‌లలో ఆక్టోపస్‌లు లేదా మరే ఇతర జీవుల సాగులో అయినా అత్యున్నత స్థాయి సంక్షేమ పద్ధతులు పాటిస్తామని హామీ ఇస్తున్నాం. జంతువులకు బాధ లేదా నొప్పి లేకుండా వాటిని వధించే పద్ధతులు పాటిస్తాం’’ అని పేర్కొంది.

ఆక్టోపస్

ఫొటో సోర్స్, Getty Images

ఫామ్‌లలో ఆక్టోపస్‌లకు పారిశ్రామికంగా చేపల నుంచి తయారు చేసిన పొడి ఆహారాన్ని అందిస్తామని నుయెవా చెప్పింది.

ట్యాంకుల్లో సముద్రపు నీటిని నింపుతామని, ఆక్టోపస్‌ల జీవితంలోని వివిధ దశల్లో వాటిని ఉంచడానికి వివిధ పరిమాణాలున్న ట్యాంకులను వాడతామని, నీటి ఉష్ణోగ్రత, లవణీయతను సునిశితంగా నియంత్రిస్తామని పేర్కొంది.

ఉత్తర స్పెయిన్‌లోని గలిసీయాలో ఉన్న పెస్కానోవా బయోమరైన్ సెంటర్ అనే పరిశోధనా కేంద్రం నుంచి 70 మగ, 30 ఆడ ఆక్టోపస్‌లను తీసుకుంటామని చెప్పింది.

ఫామ్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని సీఐడబ్ల్యూఎఫ్‌కు చెందిన ఎలీనా లారా, కానరీ ఐలాండ్స్ అధికారులను కోరారు.

ఈ ఫామ్ వల్ల తెలివైన, చేతనత్వం ఉన్న అక్టోపస్‌లు అనవసరమైన బాధల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.

ఆక్టోపస్‌ల సంక్షేమం ఆందోళనలు

ఫొటో సోర్స్, Animal Rebellion

ఆక్టోపస్‌ల సంక్షేమంతో పాటు, ఫామ్‌లో నుంచి వెలువడే వ్యర్థపు నీటిని తిరిగి సముద్రంలోకి విడుదల చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి సీఐడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అక్టోపస్‌లు వ్యర్థాలుగా నైట్రోజన్, పాస్పరస్‌లను ఉత్పత్తి చేస్తాయి.

‘‘ప్లాంట్‌లోకి వచ్చే నీటితో పాటు, ప్లాంట్ నుంచి బయటకు వచ్చే నీరును కూడా ఫిల్టర్ చేస్తాం. కాబట్టి దాని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని బీబీసీతో నుయెవా పెస్కానోవా చెప్పింది.

ప్రతీ ఏడాది 3,50,000 టన్నుల ఆక్టోపస్‌లను పట్టుకుంటున్నారు. 1950లో పట్టుబడిన అక్టోపస్‌ల సంఖ్య కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.

స్థిరమైన దిగుబడి కోసం అక్వాకల్చర్ సరైన పరిష్కారం. భవిష్యత్‌లో ఆక్టోపస్‌ జాతుల పునరుద్ధరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని నుయెవా వ్యాఖ్యానించింది.

అక్టోపస్‌ల సాగు ద్వారా భవిష్యత్‌లో వాటి ధర తగ్గుతుందని, కొత్త మార్కెట్ల ఏర్పాటుకు దారి తీస్తుందని కొందరు నమ్ముతున్నారు.

అక్టోపస్‌ల సాగులో అత్యత్తమ, మెరుగైన విధానాలకు కట్టుబడి ఉన్నామని బీబీసీతో నుయెవా చెప్పింది.

దీనిపై స్పందించాల్సిందిగా గ్రాన్ కనారియా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)