‘బాహుబలి కప్ప’:దీన్ని బతికించుకోడానికి ప్రకృతి ప్రేమికులు ఎలా పోరాడుతున్నారు?

ఫొటో సోర్స్, JEANNE D'ARC PETNGA
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్
ఈ కప్ప మొదటిసారి తారసపడ్డప్పుడు సెడ్రిక్ ఫాగ్వాన్ దాన్ని అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. అంతకుముందెప్పుడూ అంత పెద్ద కప్పను ఆయన చూడలేదు.
ప్రపంచంలో జీవించి ఉన్న కప్పజాతుల్లో అతి పెద్ద కప్ప ఇది. ఇది దాదాపు ఒక పిల్లి అంత సైజు పెరుగుతుంది. అయితే, ఇప్పుడు ఈ జాతి అంతరించిపోయే దశలో ఉంది.
దీనిని చేతుల్లో పట్టుకుని ఎత్తితే.. అప్పుడే పుట్టిన మానవ శిశువును ఎత్తి పట్టుకున్నట్లే ఉంటుందని ఆయన చెప్తున్నారు.
సెడ్రిక్ ఫాగ్వాన్ కామెరూన్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ కార్యకర్త. ఒక రెస్క్యూ మిషన్‌లో పని చేస్తున్న సమయంలో ఆయనకు ఈ కప్ప కనిపించింది. దాని అందానికి, ఠీవికి ముగ్ధుడైపోయారు.
ఈ జాతి కప్పను పరిరక్షించటం కోసం పోరాడటానికి ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.
‘‘ఈ కప్ప జాతి ప్రపంచంలోనే అతి పెద్దదని, విశిష్టమైనదని తెలిసిన తర్వాత ఇలాంటిది ప్రపంచంలో మరోచోట కనిపించదని నాకు అర్ధమైంది. దీనిని చూసినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది’’ అంటున్నారాయన.

ఫొటో సోర్స్, CEDRICK FOGWAN
‘‘ఈ కప్ప తమ ప్రాంతంలో ఉండటం ఒక వరమని ఈ ప్రాంతంలోని ప్రజలు చెప్తారు. దీనికి వారు ఒక సాంస్కృతిక విలువ ఇస్తున్నారు’’ అని తెలిపారు.
కామెరూన్‌లో, ఈక్వెటోరియల్ గినియాలో ఆహారం కోసం, పెంపుడు జంతువుల వ్యాపారం కోసం ఈ బాహుబలి కప్పను దశాబ్దాల తరబడి విపరీతంగా వేటాడారు.
నదులు, ప్రవాహాల వెంట వీటి ఆవాసం వేగంగా ధ్వంసమైపోయింది. ఇప్పుడు దీనిని అంతరించిపోయే జీవజాతుల అధికారిక జాబితా ‘రెడ్ లిస్ట్’లో చేర్చారు.
ఈ కప్ప గురించి సైన్స్ పరిశోధకులకు పెద్దగా తెలియదు. అంతేకాదు కామెరూన్‌లో సైతం స్థానిక ప్రజలకు పర్యావరణంలో ఈ కప్ప విలువ ఏమిటనేది తెలియదు. పంటలను దెబ్బతీసే కీటకాలను వేటాడి తినటం వంటి మేలు వీటి వల్ల జరుగుతుంది.
ఈ నేపథ్యంలో సెడ్రిక్ ఫాగ్వాన్ ఈ కప్పల జాతిని పరిరక్షించేందుకు నడుం కట్టారు. ఇప్పటివరకూ ఈ కప్పలను వేటాడిన వేటగాళ్లనే వీటి సంరక్షణ కోసం సిటిజన్ సైంటిస్టులుగా ఉపయోగించుకోవాలన్నది ఈ కన్జర్వేషన్ టీం ప్రణాళికలో భాగం.

ఫొటో సోర్స్, JEANNE D'ARC PETNGA
ఈ కప్పలను వేటాడం మానేసి, అవి ఎక్కడైనా ఎదురైనపుడు దాని వివరాలను నమోదు చేయాల్సిందిగా స్థానిక వేటగాళ్లను ఒప్పించేందుకు ఈ బృందం ప్రయత్నిస్తోంది.
వారికి ప్రత్నామ్నాయ ఆహార వనరులను అందించటం కోసం స్థానిక బృందాలతో నత్తల సాగు చేపట్టేందుకు కూడా వీరు ప్రయత్నిస్తున్నారు.
ఈ సంరక్షణ కృషి ఫలించటం మొదలైంది. ఈ భారీకప్ప మౌంట్ ఎన్‌లోనాకో రిజర్వులోని కొత్త నదుల్లో మళ్లీ కనిపిస్తోంది.
తన పొరుగింటి వ్యక్తి ఒక భారీ కప్పను పట్టుకొచ్చాడని ఒక మాజీ వేటగాడు రిపోర్ట్ చేయటం.. ఈ సంరక్షణ ప్రాజెక్టులో ఒక మలుపు.
ఆ వ్యక్తి నుంచి కప్పను రక్షించి, తిరిగి అడవిలో వదిలిపెట్టడంలో సెడ్రిక్ సఫలమయ్యారు.
‘‘ఈ కప్ప చిరకాలం జీవిస్తుందని.. ఇది మేం చిరకాలం గర్వపడేలా చేస్తుందని నేను నమ్ముతున్నా’’ అన్నారాయన.
ఈ బాహుబలి కప్పను సంరక్షించే ప్రాజెక్టుకు ఫానా అండ్ ఫ్లోరా ఇంటర్నేషనల్, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీలు మద్దతు అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














