World Octopus Day: చేతిలో చేయివేస్తే చాలు పిల్లలు పుట్టేస్తాయి.. ఆక్టోపస్‌ల గురించి 10 ఆసక్తికర విశేషాలు

ఫొటో సోర్స్, Getty Images
మెదడులోని నాడీ కణాలు శరీరం మొత్తం ఉండే ఆక్టోపస్‌లు అద్భుతమైన జీవులు. కొన్నిసార్లు ఉల్లాసంగా, మరికొన్నిసార్లు ఉత్సాహంగా, ఇంకొన్నిసార్లు జగడాలాడుతూ కనిపించే ఈ జీవుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం.
అసలు ఈ జీవులు ఎలా పరిణామక్రమం చెందాయో తన ఆడియో బుక్ ‘‘అదర్ మైండ్స్: ద ఆక్టోపస్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ లైఫ్’’లో ఫిలాసఫర్, స్కూబా డైవర్ పీటర్ గాడ్‌ఫ్రే స్మిత్ వివరించారు.
వెన్నెముక లేకుండా హాయిగా జీవించే ఆక్టోపస్‌ల పది విశేషాలు మీ కోసం..

ఫొటో సోర్స్, Getty Images
1. ఆక్టోపస్‌లు చాలా తెలివైనవి, కానీ..
ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దదిగా ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయి.
తెలివి, నాడీకణాల విషయాలు శునకాలతో మనం ఆక్టోపస్‌లను పోల్చొచ్చు.
అయితే, శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్‌లలో ఎక్కువ నాడీకణాలు ‘‘టెంటకల్స్’’ అంటే చేతుల్లో ఉంటాయి. నిజానికి మెదడులో కంటే వాటి టెంటకల్స్‌లోనే రెట్టింపు సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి.
ఆక్టోపస్ టెంటక్స్‌లోని ప్రతి బొడిపె మీద దాదాపు 10,000 నాడీకణాలు ఉంటాయి. ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
2. ఆక్టోపస్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వొచ్చు..
కొన్ని పనులు చేయగలిగేలా ఆక్టోపస్‌లకు మనం ప్రత్యేక శిక్షణ ఇవ్వొచ్చని గత 70ఏళ్ల పరిశోధనలు చెబుతున్నాయి.
ఒక పరిశోధనలో శార్డైన్ చేప ముక్క కోసం ఒక చిన్న బరువును ఎత్తేలా ఆక్టోపస్‌లకు శిక్షణ ఇవ్వొచ్చని పరిశోధకులు నిరూపించారు.
ఇది కొంచెం కష్టమైన పని. కానీ, పావురాలు, ఇతర జీవుల కంటే ఆక్టోపస్‌లు కాస్త త్వరగా నేర్చుకోగలవు.

ఫొటో సోర్స్, Getty Images
3. బాగా కొట్లాడతాయి
పైన చెప్పుకున్న చిన్నచిన్న బరువులు ఎత్తే అధ్యయనంలో మూడు ఆక్టోపస్‌లు పాల్గొన్నాయి. వీటి పేర్లు ఆల్బర్ట్, బెర్ట్రామ్, చార్లెస్. ఈ పరిశోధనలో ఆల్బర్ట్, బెర్ట్రామ్ చక్కగా మళ్లీమళ్లీ బరువును ఎత్తగలిగాయి. కానీ, చార్లెస్ మాత్రం అక్కడి లెవర్‌ను విరగ్గొట్టింది.
అంతేకాదు, అక్కడ అధ్యయనం నిర్వహించే వారిపైకి నీళ్లను కూడా ఉమ్మేది!
ఇలా ఆక్టోపస్‌లు దురుసుగా ప్రవర్తిస్తాయని కొన్ని అక్వేరియాల నిర్వాహకులు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా బల్బులపైకి నీళ్లు చిమ్మి ఆవి ఆరిపోయేలా చేయడం లేదా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తుంటాయి.
న్యూజీలాండ్‌లో ఓటాగో యూనివర్సిటీ ఇలా అల్లరి చేసిన ఒక ఆక్టోపస్‌ను మళ్లీ నీటిలోకి వదిలిపెట్టేసింది.

ఫొటో సోర్స్, Getty Images
4. మనుషులను గుర్తుపడతాయి
న్యూజీలాండ్‌లోని అక్వేరియంలో ఆక్టోపస్‌లు లైట్‌లు ఆపేసిన ల్యాబ్‌లోనే.. ఒక ఎంప్లాయి అంటే ఒక ఆక్టోపస్‌కు అసలు పడేది కాదు.
ఆమె అటువైపుగా వచ్చిన ప్రతిసారీ, ఆ ఆక్టోపస్ ఆమెపైకి నీళ్లు చిమ్మేది.

ఫొటో సోర్స్, Getty Images
5. ఆడుకోవడమంటే ఇష్టం
కొట్లాడటం, దురుసుగా ప్రవర్తించడం లాంటి అంశాలను పక్కన పెడితే, అవి సరదాగా ఆటలు కూడా ఆడగలవు.
ల్యాబ్‌లలోని తమ ట్యాంకులలో చిన్నచిన్న డబ్బాలను వేస్తే, వాటిని ట్యాంకు గోడలకు కొడుతూ ఆక్టోపస్‌లు ఆడుకుంటాయి. మరోవైపు నీటి ప్రవాహం దగ్గరా ఇవి ఆడుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
6. చేతిలో చేయివేసి పిల్లలు పుట్టిస్తాయి..
ఆక్టోపస్‌లలోని చాలా జాతుల్లో అవి మగవో లేదా ఆడవో తెలియాలంటే.. టెంటకల్స్‌ను చూడాలి. మూడో టెంటకల్స్ కింద చిన్న గొయ్యి కనిపిస్తుంది.
టెంటకల్ కింద గొయ్యి లాంటి నిర్మాణం ఉందంటే అది మగది. సంభోగ సమయంలో దీన్ని ఆక్టోపస్ ఉపయోగిస్తుంది. ఈ టెంటకల్ చాచి ఆడ ఆక్టోపస్ టెంటకల్‌వైపు పంపిస్తుంది. దాన్ని ఆడ ఆక్టోపస్ స్వీకరిస్తే, ఆ రంధ్రం గుండా వీర్యం బయటకు వచ్చి, ఆడ ఆక్టోపస్ టెంటకల్‌లోకి వెళ్తుంది.
ఈ వీర్యాన్ని ఆడ ఆక్టోపస్‌లు నిల్వ చేసుకుంటాయి. ఆ తర్వాత అండాలు ఫలదీకరణం చేసుకునేందుకు వీటిని ఉపయోగించుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
7. హై-ఫై ఇస్తాయి
ఆక్టోపస్‌లు కదులుతున్నప్పుడు మనం గమనిస్తే, ఒక ఆక్టోపస్ తన టెంటకల్స్‌తో మరో ఆక్టోపస్ టెంటకల్స్‌పై కొడుతుంది.
ఈ సంభాషణలు హై-ఫైలు లాంటివని ప్రొఫెసర్ స్టెఫాన్ లింక్విస్ట్ చెప్పారు. ఒక ఆక్టోపస్ మరొకదాన్ని గుర్తుపట్టేందుకు ఇది సహాయపడుతుందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
8. గుండె ఒకటి కాదు..
ఒక ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి!
నీలం-పచ్చ రంగులోని రక్తాన్ని ఈ గుండెలు శరీరం మొత్తానికి ప్రసరించేలా చేస్తాయి.
ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు ఐరన్‌కు బదులుగా ఇవి కాపర్‌ను ఉపయోగిస్తాయి. ఐరన్ వల్లే మన రక్తం ఎర్రగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
9. భయపెడతాయి కూడా..
ఆక్టోపస్‌లు తమ రంగు, ఆకారాన్ని మార్చుకోగలవు.
కోపంతో ఉండే మగ ఆక్టోపస్‌లు దాడికి ముందు ముదురు రంగులోకి మారుతాయి. తమ టెంటకల్స్‌ను సాగదీస్తూ పరిమాణాన్ని కూడా పెంచుకుంటాయి.
శరీర ప్రధాన భాగానికి చుట్టూ ఉండే పైపొరలు కూడా ఉబ్బేలా చేస్తాయి. దీన్ని ‘‘నోస్‌ఫెరాటు పోజ్’’గా పిలుస్తారు. దీన్నే కొందరు వాంపైర్ పోజ్ అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
10. ఎముకలు లేకపోవడంతో
తన కళ్ల పరిమాణంలో ఉండే రంధ్రం సాయంతో ఆక్టోపస్‌లు అన్నింటినీ లోపలకు లాక్కుంటాయి. ఆకారాన్ని కూడా తమకు నచ్చినట్లు మార్చుకుంటాయి.
ఇంత పరిమాణం ఉండేటప్పటికీ ఎముకలు లేదా కవచం లాంటివేమీ దీనికి ఉండవు. ఒక్కోసారి ఇతర జీవుల దాడికి ఇవి అనువుగా మారిపోతుంటాయి. అదే సమయంలో ఎముకలు లేకపోవడంతో చిన్న రంధ్రాల్లో దూరి మెరుగ్గా తమను తాము కాపాడుకోగలుగుతాయి.
బీబీసీ రేడియో 4 కథనం..
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













