టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా? ఆయన కథతో రవితేజ సినిమా మీద స్టువర్టుపురం ప్రజలకు ఆందోళన ఎందుకు?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
రాబిన్ హుడ్ గురించి తెలుసు కదా. బాగా డబ్బున్న వారిని కొల్లగొట్టి, ఆ సంపదను పేదలకు పంచే వారిని ప్రధానాంశంగా తీసుకుని ఇంగ్లిష్‌లో కథలు ఉన్నాయి. సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి.
హాలీవుడ్ సినిమాలతో రాబిన్ హుడ్ పేరు పాపులర్ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే ఓ దొంగను కూడా టైగర్ అని, ఆంధ్రా రాబిన్ హుడ్ అని కొందరు చెబుతారు.
ఇప్పుడు ఏకంగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో ప్రముఖ నటుడు రవితేజ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోంది.

టైగర్ నాగేశ్వర రావు అసలు కథేంటి?
పోలీస్ రికార్డుల ప్రకారం నాటి స్టువర్టుపురంలో పలువురు పేరు మోసిన దొంగల్లో గరిక నాగేశ్వర రావు ఒకరు. ఆయన మీద అనేక కేసులుండేవి. పలు దొంగతనాల్లో కీలక పాత్రధారి. ఓ దొంగల ముఠాకి నాయకుడని కూడా చెప్తారు.
1980 మార్చి 24న ఆయన పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పటికే పలుమార్లు ఆయన పోలీసుల బారి నుంచి తప్పించుకున్నారు. చివరకు మార్చి 23న రాత్రి ఓ మహిళతో ఉండగా ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆ ఎన్‌కౌంటర్‌లో 24వ తేదీన ఆయన మరణించినట్టు పోలీసులు ప్రకటించారు.
నాగేశ్వరరావుకు 27 ఏళ్ల వయసులోనే జనంలో గుర్తింపు వచ్చింది. అందుకు కారణం ఆయన చేసిన కార్యక్రమాలేనని నాగేశ్వరరావు సోదరుడు ప్రభాకర్ రావు అంటున్నారు.
"మా తండ్రి ముందు నుంచే మాకు దొంగతనాల వారసత్వం ఉంది. అనేక దొంగతనాలు, దోపిడీలు చేశాం. మా తమ్ముడు నాగేశ్వరరావు కూడా చాలా సమర్థవంతంగా వాటిలో పాల్గొనేవాడు. కానీ సంపాదించినదంతా అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. అవసరమైన వాళ్లకు ఇచ్చేసేవాడు. మేమంతా కలిసి దోపిడీ చేసినా తను అందరికీ ఇచ్చేసేవాడు. తను దొంగతనాలకు రాకముందు నేను కొన్న రెండు ఎకరాల భూమి తప్ప, ఆ తర్వాత ఏమీ మిగుల్చుకోలేకపోవడానికి అదే కారణం" అంటూ ప్రభాకర్ రావు వివరించారు.
ప్రస్తుతం స్టువర్టుపురంలోనే ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్న ప్రభాకర్ రావు తాము చేసిన దొంగతనాల్లో సంపాదించేది లక్షల్లో ఉంటుందని, దానిని దాచుకోవాలనే ఆలోచన తమ తమ్ముడికి ఉండేది కాదని బీబీసీతో చెప్పారు.
ప్రజలకు పంచడం వల్లనే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అందరూ సహకరించేవారని, చివరకు పట్టుబడినప్పుడు కాల్చేసిన తర్వాత కూడా ప్రజాగ్రహం కనిపించిందని అన్నారు.

బనగానపల్లె దోపిడీతో సంచలనం
ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న బనగానపల్లెలో 1974లో ఒక బ్యాంక్ దోపిడి జరిగింది. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ బ్యాంకును దొంగలు దోచుకున్నారు. నగదు, భారీగా నగలు అపహరించారు. అప్పట్లో ఈ దోపిడీ విలువ రూ. 35 లక్షలు ఉంటుందని ప్రకటించారు.
అర్ధరాత్రి పూట బ్యాంకులో చొరబడి, సిబ్బందిని చితకబాది మొత్తం సంపదను స్వాహా చేసిన ఘటన దేశమంతా చర్చనీయాంశం అయింది.
"బనగానపల్లె దోపిడీలో మొత్తం పది మంది ముఠా సభ్యులం పాల్గొన్నాం. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అర్ధరాత్రి బ్యాంకు వెనుకవైపు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళాం. సేఫ్‌ను పగలగొట్టి, దానిని స్మశానవాటికకు తీసుకెళ్లాం. 14 కిలోల బంగారం, రూ. 50,000 నగదు అందులో ఉంది. అక్కడి నుంచి తెచ్చిన తర్వాత ముఠా సభ్యులమంతా పంచుకోకముందే పోలీసులు మా గ్రామాన్ని చుట్టుముట్టారు. అయినా నాగేశ్వరరావు తప్పించుకున్నాడు. నేను మాత్రం లొంగిపోయాను" అంటూ ప్రభాకర్ రావు బీబీసీకి తెలిపారు.
ఈ కేసులో కూడా పోలీసులకు దొరక్కుండా నాగేశ్వరరావు తప్పించుకోవడం ప్రజల్లో అతనికి మరింత గుర్తింపు తీసుకురాగా, పోలీసులకు ఆగ్రహాన్ని కలిగించింది.

జైలు నుంచి పరారీ
అప్పటికే పలు కేసుల్లో ఉన్న ప్రభాకర్ రావు ముఠాలో, 1970 సమయంలో నాగేశ్వర రావు చేరాడు. దాదాపు 15 ఏళ్ల పాటు అనేక పెద్ద పెద్ద దొంగతనాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ దోపిడీలు సాగించినా పోలీసు కాల్పుల నుంచి కూడా తప్పించుకోవడంతో నాగేశ్వర రావుని టైగర్ అంటూ ఆయన అనుచరులు కొనియాడడం మొదలెట్టారు.
కొన్నిసార్లు పోలీసులకు చిక్కినా చాకచక్యంగా వారి చెర నుంచి బయటపడడంతో నాగేశ్వరరావు చాలా సమర్థుడనే ప్రచారం సాగింది.
"1976 ప్రాంతంలో తమిళనాడులో అరెస్ట్ అయ్యాం. మా ఇద్దరిని వేర్వేరు జైళ్లలో పెట్టారు. కోర్టులో హాజరుకావడం కోసం కలిశాం. నేను జైల్లో ఉండలేనని తప్పించుకుంటానని చెప్పాడు. చెప్పినట్టుగానే సెంట్రీల మీద దాడి చేసి పరారయ్యాడు. అప్పుడే తమిళనాడు పోలీసులు మీ వాడు నిజంగా టైగరే అని నాతో అన్నారు" అని ప్రభాకర్ రావు ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
స్టువర్టుపురం పేరు మారు మోగేలా...

1980వ దశకం వరకు స్టువర్టుపురం, గజదొంగలకు ఆవాసంగా ఉండేది. పలు ముఠాలుగా ఏర్పడి స్టువర్టుపురం వాసులు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవారు. స్టువర్టుపురం దొంగలు పడ్డారంటే సర్వం దోచుకుపోతారనే ఆందోళన చాలామందిలో ఉండేది.
నిజానికి స్టువర్టుపురం అనేది వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి 1874లో చేసిన సెటిల్‌మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామం. దాంతో ఎక్కడ ఏ నేరం జరిగినా ఆ ఊరి వారి మీద అనుమానాలు కలిగేవి.
1911 నుంచి 1914 మధ్య వివిధ నేరాలతో సంబంధాలున్న వారిని సమీకరించి స్టువర్టుపురం పేరుతో వారికి నివాసాలు ఏర్పాటు చేశారు. 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరుతో ఈ గ్రామం ఏర్పాటైంది.
ఉపాధిలేక దొంగలుగా మారి, ఎక్కువ నేరాలకు పాల్పడిన వారంతా ఒకే చోట ఉంటే నిఘా ఉంచేందుకు వీలుగా ఉంటుందని ఇలాంటి ఏర్పాట్లు చేశారు.
టైగర్ నాగేశ్వరరావు తెరమీదకు వచ్చిన తర్వాత తన అనుచరులతో కలిసి చేసిన నేరాల కారణంగా స్టువర్టుపురం పేరు మారుమోగింది. పోలీసులకు కూడా సవాలుగా పరిణమించింది. దాంతో అనేక ప్రయత్నాలు చేసి వారిలో మార్పు తీసుకురావాలనే యత్నాలు అన్ని వైపుల నుంచి జరిగాయి.

అన్న మారినా, తమ్ముడు మాత్రం...
తొలుత బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మతం ద్వారా దొంగతనాలకు పాల్పడకుండా నియంత్రించేందుకు కొంత ప్రయత్నం జరిగింది. కానీ, అది పూర్తి ఫలితాలనివ్వలేదని వరుసగా ప్రతీ తరంలోనూ నేరస్తులు కనిపించడం స్పష్టం చేస్తుంది.
దాంతో పోలీసులు, ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా రంగంలో దిగాయి. ముఖ్యంగా నాస్తిక కేంద్రం నిర్వాహకులు హేమలత, ఆమె భర్త లవణం వంటి వారి కృషి కొందరిలో పరివర్తనకు దారి తీసింది. సంస్కార్ పేరుతో వారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా చేసిన ప్రయత్నాలు నేటితరంలో వచ్చిన మార్పుని చాటి చెబుతున్నాయి.
బనగానపల్లె వంటి భారీ దోపిడీల తర్వాత 1970ల నుంచే స్టువర్టుపురంలో తమ ప్రయత్నాలు ప్రారంభించిన హేమలత, ఆమె భర్త లవణం వంటి వారి పట్ల ప్రభాకర్ రావు తదితరులకు నమ్మకం పెరిగింది.
జైలులో ఉండగానే వారితో కలుస్తూ ఉత్తరాల ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వారికి భూమి, ఇతర సౌకర్యాలు కల్పించి జీవనభృతి కల్పించడానికి చేసిన ప్రయత్నాలు కొంత మేర ఫలించాయని స్టువర్టుపరం చరిత్రపై పరిశోధన చేసిన కొంపల్లి సుందర్ అన్నారు.
‘‘హేమలత, లవణం అలుపెరగని శ్రమ స్టువర్టుపురంలో మార్పునకు కారణమైంది. మొదట ప్రభాకర్‌రావు తో పాటుగా నాగేశ్వరరావు కూడా కొంత పరివర్తన చెందుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ సమాజం నుంచి అదే విధమైన స్పందన కనిపించలేదు. గతంలో చేసిన నేరాలు, నాగేశ్వరరావు త్వరగా జనజీవన స్రవంతిలో కలిసే ప్రయత్నాలకు ఆటంకంగా మారాయి. చివరకు మళ్లీ నేరాల వైపు మళ్లాడు. అవే ఆఖరికి అతను పోలీసుల కాల్పుల్లో చిక్కుకోవడానికి కారణమయ్యాయి’’ అంటూ ఆయన బీబీసీకి వివరించారు.
స్టువర్టుపురం గ్రామంలో హేమలతా లవణం పేరుతో ఒక ద్వారం కూడా నిర్మించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మానిన గాయాన్ని రేపొద్దు...
స్టువర్టుపురం పేరుతో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. దొంగతనాల నేపథ్యంలో వాటిని చిత్రీకరించారు. మరోవైపు దొంగల బయోగ్రఫీని తెరకెక్కించే బాలీవుడ్ సంస్కృతిని ఇప్పుడు టాలీవుడ్ కూడా అందిపుచ్చుకుని టైగర్ నాగేశ్వరరావు పేరుతో సినిమాకు సిద్ధమయ్యారు. వంశీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగేశ్వరరావు కథను సినిమాగా రూపొందిస్తున్న తరుణంలో స్టువర్టుపురం వాసుల నుంచి బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
"సినిమా యూనిట్ వాళ్లు నాతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ సినిమాలో అవసరం రీత్యా కొన్నింటిని చొప్పించే అవకాశం ఉంటుంది. కానీ చరిత్రను వక్రీకరించకూడదని ఆశిస్తున్నా" అని ప్రభాకర్ రావు బీబీసీతో చెప్పారు.
"మేం చదువుకున్నప్పుడు స్టువర్టుపురం అంటే మమ్మల్ని తేడాగా చూసేవారు. తప్పుడు అభిప్రాయంతో ఉండేవారు. ఇప్పుడిప్పుడే అది తగ్గుతోంది. ఊరిలో చాలా మార్పులు వచ్చాయి. ఉన్నత విద్య అభ్యసించి పలు పెద్ద స్థానాల్లో స్థిరపడిన వారున్నారు. ఇప్పుడు మళ్లీ స్టువర్టుపురం పాత పుండు రేపి, కొత్త తరం మీద కూడా ఆనాటి మచ్చపడకుండా చూడండి. మా పిల్లలను కూడా అందరూ అనుమానించే పరిస్థితి ఉండకూడదు" అంటూ ఆ గ్రామానికి చెందిన శారద అనే మహిళ అన్నారు.
ప్రస్తుతం తాను చెన్నైలో ఐటీ రంగంలో పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. ఇలాంటి సినిమాల మూలంగా అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆమె బీబీసీ వద్ద ఆందోళన వ్యక్తంచేశారు.
1990వ దశకం వరకూ దొంగలకు ఆవాసంగా ఉన్న స్టువర్టుపురం గ్రామంలో తర్వాత పరిస్థితులు మారాయి. విద్యాధికులుగా మారిన యువత ఉద్యోగాల్లో స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారు. స్టువర్టుపురంలో ఇప్పుడు నేరాలు తగ్గిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
- ‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’
- BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
- దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















