‘నవీన్‌ను చంపేసి, తల నరికి, గుండెను బయటకు తీశాను...’ పోలీసుల రిమాండ్ రిపోర్టులో హరిహరకృష్ణ నేరాంగీకారం

నవీన్ (ఎడమ), హరిహరకృష్ణ (కుడి) ఒకప్పుడు మిత్రులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నవీన్ (ఎడమ), హరిహరకృష్ణ (కుడి) ఒకప్పుడు మిత్రులు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(నోట్: ఈ వార్తలో కలవరపరిచే అంశాలున్నాయి.)

‘‘17వ తేదీ సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో నేను, నవీన్ రమాదేవి పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లే రోడ్డులోకి వెళ్లాము. అక్కడ రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రదేశంలోకి నవీన్‌ను తీసుకెళ్లాను. ‘నేను, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు కదా.. మళ్లీ తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు’ అని అడిగా.

ఆమెను నేనే ప్రేమిస్తున్నాను.. నువ్వు మరిచిపో అంటూ నవీన్ ముందుగా నన్ను చేతులతో కొట్టాడు. నేను అతన్ని చంపాలనే ఉద్దేశంతో నా చేతులతో బలంగా కొట్టాను. తర్వాత ఇద్దరం కొట్టుకున్నాం. నవీన్‌ను కింద పడేసి.. అతనిపై కూర్చుని గొంతు పిసికి చంపేశాను.

నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడతావా.. అని కోపంతో ముందుగా నవీన్ బట్టలు మొత్తం విప్పేసి నా బ్యాగులో తెచ్చుకున్న కత్తితో తలని నరికి మొండెం నుంచి వేరు చేశాను. తర్వాత ఛాతీ భాగములో అడ్డంగా కోసి గుండెను బయటకు తీశాను. అతని మర్మంగాన్ని కోశాను. రెండు చేతి వేళ్లను నరికివేశాను. తర్వాత శవాన్ని చెట్ల పొద్దల్లోకి ఈడ్చుకెళ్లి ఎవరికీ కనిపించకుండా పడేశాను’’ అంటూ నిందితుడు హరిహర కృష్ణ చెప్పినట్లుగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో రాశారు.

హైదరాబాద్ శివారులో సంచలనం రేపిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు హయత్‌నగర్ కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. హత్యకు గల కారణాలు, హత్య చేసిన తీరుపై హరిహరకృష్ణ చెప్పినట్లుగా రిపోర్టులో పొలీసులు ప్రస్తావించారు.

ఈ కేసులో హరిహరకృష్ణపై ఐపీసీ 302, 201 సెక్షన్లతో పాటు.. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3(2) తదితర సెక్షన్లు పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి.స్వామి చెప్పారు.

రిమాండ్ రిపోర్ట్
హతుడు నవీన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హతుడు నవీన్

‘అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే..’

తాను ప్రేమించిన యువతితో చనువుగా ఉంటున్నాడని హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్‌ను అతడి స్నేహితుడు హరిహరకృష్ణ ఈ నెల 17వ తేదీ రాత్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంటర్ నుంచి తాను, నవీన్ స్నేహితులమని, గతంలో ఒక అమ్మాయిని నవీన్ ఇష్టపడ్డాడని హరికృష్ణ చెప్పాడు. ఆ అమ్మాయితో 9 నెలల కిందట నవీన్ సరిగా మాట్లాడటం లేదని తెలుసుకుని.. తాను ప్రపోజ్ చేశానని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకొందని తెలిపాడు. తాను ప్రేమించిన అమ్మాయితో నవీన్ చనువుగా ఉంటున్నాడనే కారణంతోనే అతన్ని చంపాలని నిర్ణయించుకున్నట్లు హరికృష్ణ స్టేట్‌మెంట్ ఇచ్చాడని పోలీసులు నివేదికలో స్పష్టం చేశారు. పోలీసుల రిపోర్టును బీబీసీ సేకరించింది.

నవీన్‌ను హత్య చేయడానికి మూడు నెలల నుంచే ప్లాన్ వేసుకున్నట్లు హరి హరకృష్ణ చెప్పాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఇందుకు మలక్‌పేటలోని ఓ షాపింగ్ మాల్ లో రూ. 200 పెట్టి కత్తి, మెడికల్ షాపులో రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నట్లు హరిహర కృష్ణ తెలిపాడని వివరించారు. జనవరి 16న ఇంటర్ స్నేహితులందరం కలుసుకుందామని అనుకున్నామని, ఆ రోజునే నవీన్ చంపాలని అనుకున్నానని, కానీ కుదరలేదని హరిహర కృష్ణ తన స్టేట్ మెంట్లో చెప్పాడు.

‘‘ఫిబ్రవరి 17న హైదరాబాద్‌ వస్తున్నట్లు నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. మధ్యాహ్న సమయంలో ఎల్బీనగర్లో అతన్ని తీసుకుని జీవన్ అనే మరో స్నేహితుడితో కలిసి నాగోలులోని హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వచ్చాం.

ఆ తర్వాత జీవన్ ఇంటికి వెళ్లిపోగా.. రాత్రి వరకు షాపింగ్ చేసుకుని వేర్వేరు ప్రదేశాలకు తిరిగాం. రాత్రికి నవీన్ నల్గొండలోని హాస్టల్‌కు వెళతానని అడగడంతో అతన్ని వెంట పెట్టుకుని బైకుపై బయల్దేరాం. పెద్ద అంబర్‌పేట వద్ద ఓ వైన్లో ఆల్కహాల్ కొని తాగాం. తర్వాత బండిపై బయల్దేరాం.

ఆల్కహాల్ తాగి ఆ సమయంలో అంత దూరం వెళ్లడం మంచిది కాదని చెప్పాను. రామోజీ ఫిలిం సిటీ వద్ద యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చాం. అమ్మాయి ముఖ్యమైన విషయం చెప్పాలని రమాదేవి పబ్లిక్ స్కూల్ వద్ద పొద్దల్లోకి నవీన్ ను తీసుకెళ్లి చంపాను’’ అని హరికృష్ణ చెప్పాడని రిమాండ్ రిపోర్టు రాశారు.

రిమాండ్ రిపోర్ట్

‘నవీన్‌ను చంపానని అమ్మాయికి చెప్పా’

నవీన్‌ను చంపిన విషయం ఇద్దరికి చెప్పినట్లు హరిహరకృష్ణ స్టేట్‌మెంట్‌లో పోలీసులు ప్రస్తావించారు. ఒకరు అతని స్నేహితుడు కాగా.. మరొకరు ప్రేమించిన అమ్మాయి అని పోలీసులు చెబుతున్నారు.

‘‘నవీన్‌ను చంపిన తర్వాత హత్యకు వాడిన కత్తిని, నవీన్ బట్టలు, సెల్ ఫోన్ పగులగొట్టి నాతో తెచ్చుకున్న బ్యాగులో వేసుకున్నా. బ్రహ్మణపల్లికి వెళ్లి నవీన్ తల, ప్యాంట్, కత్తి, సెల్ ఫోన్‌లను రోడ్డు పక్కన పడేశాను. నవీన్ షర్ట్, బనియన్ రాజీవ్ గ్రహకల్ప వద్ద పొద్దల్లో పడేశాను’’ అని హరిహర కృష్ణ చెప్పాడని పోలీసులు వివరించారు.

తర్వాత అక్కడే ఉన్న స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి స్నానం చేసి.. అతనికి జరిగిన విషయం చెప్పాడు. హసన్ భయపడి పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. పొద్దున్నే వెళ్లి లొంగిపోతానని చెప్పా. మరుసటి రోజు (అంటే 18వ తేదీ) ఉదయం అక్కడి నుంచి వెళ్లి నా బట్టలు సాగర్ కాంప్లెక్స్ వద్ద చెత్త కుప్పలో పడేశాను. నేను ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేయడంతో రోడ్డు మీదకు వచ్చింది. నవీన్‌ను చంపినట్లు చెప్పాను. ఆమె భయపడి నన్ను తిట్టి మందలించింది. తర్వాత వరంగల్‌లో మా నాన్న దగ్గరికి వెళ్లాను’’ అని హరిహర కృష్ణ చెప్పాడు.

ఘటన ప్రదేశంలో గ్లౌజులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఘటన ప్రదేశంలో గ్లౌజులు

తర్వాత హరికృష్ణ ఏం చేశాడు.. ఎక్కడికెళ్లాడు..?

హత్య తర్వాత వివిధ ప్రాంతాలకు తిరిగినట్లు హరిహరకృష్ణ చెప్పినట్లు రిమాండు రిపోర్టులో పోలీసులు రాశారు. నవీన్ వాళ్ల మామ ఫోన్ చేసి నవీన్ కనిపించడం లేదని అడిగితే.. తనకు తెలియదని చెప్పానని హరికృష్ణ చెప్పాడు. గంజాయి తాగవద్దు అంటే నవీన్ నాతో గొడవపడి వెళ్లి పోయాడని చెప్పినట్లు తెలిపాడు.

21వ తేదీన ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తున్నట్లు నవీన్ వాళ్ల మామ ఫోన్ చేశాడు. అప్పడు కూడా తనకు తెలియదని చెప్పానని హరిహరకృష్ణ పోలీసులకు చెప్పాడు.

‘‘నాకు భయం వేసి ఫోన్ ఇంట్లో పెట్టి కోదాడ వెళ్లా. అక్కడ బండి పెట్టి విజయవాడ, ఖమ్మం, వైజాగ్, ఇతర ప్రదేశాలలో తిరిగాను. 23న కోదాడ వచ్చి బండి తీసుకుని వరంగల్ వెళ్లి హత్య గురించి నాన్నకు చెప్పాను. నన్ను మందలించి పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు.

అక్కడి నుంచి వచ్చేసి నవీన్ తల, బట్టలు, ఇతర శరీర భాగాలు పడేసిన చోటకు వెళ్లి వాటిని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని తీసుకువచ్చాను. మొండెం పడేసిన చోటకు తీసుకెళ్లి.. శరీర భాగాలన్నీ వేసి కాల్చేశాను. అప్పటికే శరీర భాగాలన్నీ కుళ్లిపోయాయి. తర్వాత 24న మధ్యాహ్నం 3 గంటలకు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాను’’ అని హరిహరకృష్ణ చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, నవీన్ మర్గర్ కేస్:రిమాండ్ రిపోర్టులో ఏముంది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)