అబ్దుల్లాపూర్ మెట్-నవీన్ మర్డర్ కేసు: హత్య జరిగిన తీరుపై ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కాపీని హయత్ నగర్ కోర్టుకు సమర్పించారు. అందులో ఏముందంటే....
‘‘దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న సమయంలో నవీన్, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. వివిధ ప్రదేశాలకు తిరిగారు.
నవీన్‌కు, యువతికి మధ్య గొడవలు జరిగి రెండేళ్ల కిందట వీరిద్దరూ విడిపోయారు. ఈ సమయంలో హరిహరకృష్ణ అడ్వాంటేజీ తీసుకుని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఒప్పుకున్నట్లు హరిహరకృష్ణ చెప్పాడు.
తర్వాత నవీన్, ఆ అమ్మాయికి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండేవాడు. దీంతో హరిహరకృష్ణ నవీన్‌పై కక్ష పెంచుకున్నాడు. అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు’’ అని హయత్ నగర్ కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్ కాపీలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రాశారు.
ఈ విషయాలను లొంగిపోయిన సమయంలో హరిహరకృష్ణ చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
నేనావత్ నవీన్ హత్య కేసులో ఇంకా అనేక విషయాలను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో రాశారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో రాసిన విషయాలను బీబీసీ సేకరించింది.
ఇందులో నవీన్‌ను హరిహరకృష్ణ ఎంత కిరాతకంగా హత్య చేశాడో రాశారు. ఆ విషయాలన్నీ హరిహరకృష్ణనే చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
‘‘ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం నవీన్‌ను నల్గొండ ఎంజీ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల నుంచి హరిహరకృష్ణ పిలిపించాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఇద్దరూ కలుసుకున్నారు.
తర్వాత రాత్రి అయిపోగానే కాలేజీ హాస్టల్‌కు వెళతానని నవీన్ చెప్పడంతో టీఎస్ 07 జేడీ 0244 నంబరు గల బైక్‌పై ఇద్దరూ బయల్దేరారు.
పెద్ద అంబర్‌పేట రమాదేవి పబ్లిక్ స్కూల్ సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు రాశారు.

ఫొటో సోర్స్, UGC
‘‘గుండెను కోసి బయటకు తీశాడు’’
హత్య జరిగిన తీరును ఎఫ్‌ఐఆర్‌లో ఇలా రాసుకొచ్చారు. ‘‘ముందస్తు ప్రణాళిక ప్రకారమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడు. ముందుగా గొంతు నులిమి చంపాడు.
తర్వాత కత్తితో మెడ కోసి తలను మొండెం నుంచి వేరు చేశాడు. శరీరంలోని ప్రైవేటు భాగాల(మర్మంగాల)ను కోశాడు. నవీన్ శరీరం నుంచి గుండెను బయటకు తీశాడు. చేతి వేళ్లను కూడా కట్ చేసి తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.’’ అని పేర్కొన్నారు.
కేసు విషయంపై పోలీసు అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు.
‘‘ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలున్న పేరాల హరిహరకృష్ణ స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. అతని నుంచి సేకరించిన సమాచారంతోనే కేసులో మరిన్ని వివరాలు సేకరించాం. దీనికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. మరిన్ని వివరాలు బయటకు వస్తాయి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.

ఫొటో సోర్స్, UGC
ఘటన స్థలంలోనే గ్లౌజులు
నవీన్‌ను హత్య చేసే క్రమంలో దొరకకుండా ఉండేలా వ్యవహరించాడని పోలీసు అధికారి చెబుతున్నారు. కత్తితో పొడిచే ముందు చేతికి గ్లౌజులు వేసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు గ్లౌజులు, మాస్కులు ఉన్నట్లు గుర్తించారు.
హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉండటంతో హత్య చేసేందుకు ఆ ప్రదేశాన్ని హరిహరకృష్ణ ఎంచుకున్నట్లు ఆ పోలీసు అధికారి చెప్పారు.
దీనికి ముందుగానే రెక్కీ నిర్వహించుకుని ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నవీన్ కుటుంబసభ్యులను క్షమించమని అడుగుతున్నా’’
వరంగల్‌లోని కరీమాబాద్‌లో హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘నవీన్ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతున్నా. శివరాత్రి పండుగ రోజు హరి వరంగల్ వచ్చాడు.
కంగారుగా ఉండటంతో ఏం జరిగిందని అడిగాం. ఏమీ లేదని చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయాడు. తర్వాత రెండు రోజులకు ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మళ్లీ 23న వరంగల్‌కు తిరిగి వచ్చాడు.
ఏం జరిగిందని నిలదీస్తే నవీన్‌కు, తనకు జరిగిన గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పాడు. పోలీసులకు లొంగిపోవాలని చెప్పా.
ఇక్కడే పోలీసుల వద్దకు వెళ్దామంటే, హైదరాబాద్ వెళ్లి అక్కడే లొంగిపోతానని చెప్పాడు. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. ఒక అమ్మాయి మూలంగా ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. ఒకరు చనిపోయారు..మరొకరు జైలుకు వెళ్లారు’’ అని ప్రభాకర్ అన్నారు.
హరిహరకృష్ణకు ప్రత్యేక బ్యారక్
హరిహరకృష్ణను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. అక్కడ ప్రత్యేక బ్యారక్‌లో ఉంచినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని జైలు అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అరుంధతి నక్షత్ర దర్శనం: పెళ్లిలో ఈ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?
- సోనియా గాంధీ: 'ఇన్నింగ్స్ ముగింపు' అనడంలో అర్థమేంటి... కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్లేనా?
- రష్యాలో అసమ్మతిని అణచివేసేందుకు వందకు పైగా చట్టాలు
- డబ్బు ఎప్పుడు పుట్టింది... డాలర్ ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది?
- ‘బాహుబలి కప్ప’:దీన్ని బతికించుకోడానికి ప్రకృతి ప్రేమికులు ఎలా పోరాడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















