సోనియా గాంధీ: 'ఇన్నింగ్స్ ముగింపు' అనడంలో అర్థమేంటి... కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్లేనా?

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, రాయ్‌పూర్ నుంచి బీబీసీ హిందీ కోసం
అది 2017 డిసెంబర్ నాటి ఘటన. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడికి కొద్దిరోజుల ముందు పార్లమెంటు బయట సోనియా గాంధీని జర్నలిస్టులు ఓ ప్రశ్న అడిగారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైతే పార్టీలో మీ పాత్ర ఏంటని వారు ప్రశ్నించారు.
‘నేను రిటైర్ అవుతున్నాను’ అని ఆమె సమాధానమిచ్చారు.
మళ్లీ అయిదేళ్ల తరువాత ఇప్పుడు సోనియా గాంధీ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చనీయమైంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో శనివారం సోనియా గాంధీ మాట్లాడుతూ, 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యత చేపట్టడం తనకు దక్కిన గౌరవం అని.. గత పాతికేళ్లలో పార్టీలో ఎన్నో విజయాలను సాధించిందని, అదేసమయంలో ఎంతో అసంతృప్తీ ఉందన్నారు.
2004, 2009లో సాధించిన విజయాలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం తనకు వ్యక్తిగతంగా చాలా సంతృప్తి కలిగించాయని సోనియా అన్నారు. అయితే, భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన ఇన్నింగ్స్ ముగియడం సంతృప్తిగా ఉందన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాగా ప్లీనరీలొ భాగంగా సోనియా రాయ్‌పూర్‌లో చేసిన ప్రసంగం దిల్లీ వరకు చర్చలో నిలిచింది. దీనిపై రాయ్‌పూర్‌కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సునీల్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
‘సోనియా గాందీ తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటన చేయడం ప్రజలకు చెప్పడం వరకే. వాస్తవానికి ఆమె ముందే రిటైరయ్యారు. మల్లికార్జున ఖర్గేకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం, పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ పదవి నుంచి తాను తప్పుకోవడంతోనే సోనియా ఇన్నింగ్స్ ముగిసింది’ అన్నారు సునీల్ కుమార్.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
సుదీర్ఘ పదవీకాలం
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటి తరుణంలో సోనియా రిటైర్మెంట్ ప్రకటన చేశారు. దీంతో రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో, దేశ రాజకీయాలలో సోనియా పాత్ర ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సోనియా సుమారు 19 ఏళ్లున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ కాలం అధ్యక్ష పదవిలో ఉన్నవారు ఇంకెవరూ లేరు.
ఆమె అధ్యక్షురాలిగా ఉన్న కాలంలోనే 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం, విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి వచ్చాయి. ఇవన్నీ దేశ రాజకీయాలను కొత్త మార్గం పట్టించాయి.
సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే దేశానికి తొలి మహిళారాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్, తొలి దళిత మహిళా లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ వ్యవహరించారు.
ఆమె పదవీకాలంలోనే పార్లమెంటులో మహిళాబిల్లు పెట్టారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ గత కొద్దిరోజులుగా యాక్టివ్‌గా లేరు. సోనియా తాజా ప్రకటనతో ఆమె రెండు సంకేతాలు పంపించారు. కాంగ్రెస్ పార్టీని తన నీడ నుంచి బయటపడేయాలనుకుంటున్నానన్ని సంకేతం ఇవ్వడంతో పాటు తనలాగే మిగతా సీనియర్లూ తప్పుకొని యువతకు అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశం కనిపిస్తోంది.
రాయ్‌పూర్ ప్లీనరీలో పార్టీ మరో కీలక తీర్మానం చేసింది. పార్టీ వర్కింగ్ కమిటీలో 50 శాతం పదవులకు రిజర్వేషన్ పాటించాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువతతో ఈ 50 శాతం పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు.
రాహుల్ గాంధీ తరచూ పఠిస్తున్న యువ మంత్రం కూడా సోనియా ఉపదేశించిందేనని పరిశీలకులు అంటున్నారు. తన ఇన్నింగ్స్ ముగిసిందని సోనియా చెప్పడం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఆమె పూర్తిగా దూరం కానుండడడానికి సంకేతమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇదే మాట చెప్పారు.
‘పార్టీ బాధ్యతల నుంచి, రోజువారీ పార్టీ పనుల నుంచి తప్పుకొంటానని సోనియా చెప్పారు. కానీ అనుభవజ్ఞులైన నేతల పాత్ర వేరే రకంగానూ ఉంటుంది. సలహాలు ఇవ్వడం, విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేయడం, పార్టీలోనిఅంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం వంటి విషయాలలో సోనియా క్రియాశీలంగా ఉండాలని పార్టీ నాయకులు కోరుకుంటున్నారు’ అన్నారు సందీప్ దీక్షిత్.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
ఇన్నింగ్స్ ముగిస్తున్నట్లు సోనియా చెప్పిన మాటలను రిటైర్మెంట్‌తో పోల్చరాదని కాంగ్రెస్ నేతలు కొందరు అంటున్నారు.
సోనియా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్ కారని, ఆమె వ్యాఖ్యల అర్థం అది కాదని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రతాప్ సింగ్ అన్నారు.
‘కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తన ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లు మాత్రమే సోనియా చెప్పారు. మాజీ అధ్యక్షురాలిగా వర్కింగ్ కమిటీలో ఆమె ఉంటారు. వర్కింగ్ కమిటీలో ఉండడమంటే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండడమే’ అని అఖిలేశ్ అన్నారు.
సోనియా ఇన్నింగ్స్ ముగింపు వ్యాఖ్యలకు, ఆమె రిటైర్మెంట్‌తో ముడిపెట్టడం సరికాదని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుమారి శెల్జా అన్నారు.
సోనియా వ్యాఖ్యలకు రాజకీయ అర్థం ఏమైనప్పటికీ రానున్న కాలంలో ఆమె ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది.
భారత దేశాల రాజకీయాలలో రిటైర్మెంట్ అనే సంప్రదాయం లేదు. అలాంటి పరిస్థితుల తరువాత సోనియా తన తాజా ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? దేశ రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














