రాహుల్ గాంధీ: ‘భారత్ జోడో’ యాత్రతో ఆయనను ప్రతిపక్షాలు తమ నాయకునిగా అంగీకరిస్తాయా

ఫొటో సోర్స్, @bharatjodo
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న మొదలైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 30వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగుస్తుంది.
రాహుల్ అనేక రాష్ట్రాల మీదుగా 3,750 కిలోమీటర్లు నడిచి ఈ యాత్రను పూర్తిచేశారు.
భారత్ జోడో యాత్రకు ఎన్నికల రాజకీయాలతో ముడిపెట్టరాదని రాహుల్ గాంధీ స్వయంగా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్‌చార్జ్ జైరాం రమేష్ కూడా అదే మాట చెప్తున్నారు.
రాహుల్ రాజస్థాన్‌లో ఉన్నపుడు జైరాం మీడియాతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ‘ఎన్నికల్లో గెలుపు’ యాత్ర కాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలుత 2014లో, ఆ తర్వాత 2019లో వరుసగా రెండు సార్లు పార్లమెంటు ఎన్నికల్లో 50 స్థానాలకు పడిపోయింది. దీంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ముందు ప్రతిపక్షం సంపూర్ణంగా అంతమైందనే వ్యాఖ్యానాలు చెప్పారు.
భారతదేశాన్ని ‘కాంగ్రెస్ ముక్త’ దేశంగా మార్చటం తమ లక్ష్యమని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు చాలా మంది బీజేపీ నేతలు చెప్పటం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ పనితీరు ఎంత బాగోలేకున్నా కానీ.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షమనేది వాస్తవమని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. కాబట్టి ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే దానికి నిజమైన అర్థం ‘ప్రతిపక్ష ముక్త భారత్’ అని అంటున్నారు.

ఫొటో సోర్స్, @bharatjodo
రాహుల్ గాంధీ కానీ ఇతర కాంగ్రెస్ నేతలు కానీ ఇది రాజకీయేతర యాత్ర అని అనొచ్చు. కానీ ఈ రాజకీయ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి: ఇప్పుడు భారత రాజకీయాలు ప్రతిపక్ష రహితంగా మారాయా? ఒకవేళ అదే నిజమైతే.. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిష్టించటంలో భారత్ జోడో యాత్ర సఫలమైందా?
అసలు రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా భారతదేశ ప్రజలకు ఇవ్వదలచుకున్న సందేశం ఏమిటి? అందులో ఆయన ఎంతవరకూ సఫలమయ్యారు? అనే ప్రశ్నలు కూడా ముఖ్యమైనవే.
ముందు ప్రతిపక్ష రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.
ఈ యాత్రను ప్రతిపక్ష నేతగా తనను ప్రతిష్టించుకోవటానికి తాను చేపట్టలేదని రాహుల్ గాంధీ సైతం ఎన్నడూ చెప్పలేదని జనతాదళ్ (యు) ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు కె.సి.త్యాగి అంటున్నారు.
భారత్ జోడో యాత్ర అనేది ఒక సాంస్కృతిక కార్యక్రమమని, ప్రజలలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన యాత్ర అని త్యాగి అభివర్ణిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతూ పోవటమే.. దీనిని సదుద్దేశంతో చేపట్టిన యాత్ర అని చెప్పటానికి నిదర్శనమని ఉటంకిస్తున్నారు.

ఫొటో సోర్స్, @bharatjodo
‘కాంగ్రెస్ లేకుండా ఏ కూటమీ సాధ్యం కాదు’
‘‘కాంగ్రెస్ పార్టీ 2014, 2019 ఎన్నికల తర్వాత పార్టీ చరిత్రలోనే అత్యంత కనిష్ట సంఖ్యకు పడిపోయింది. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తెచ్చుకోలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి, ప్రజలతో అనుసంధానించాల్సిన అవసరముంది. ఇందుకోసం రాహుల్ గాంధీ కృషి చేశారు. అందులో ఆయన చాలా వరకూ సఫలమయ్యారు’’ అని కె.సి.త్యాగి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏ రాజకీయ కూటమీ సాధ్యం కాదన్నది తమ పార్టీ వైఖరి అని ఆయన చెప్పారు.
బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగి.. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నితీశ్ కుమార్ దిల్లీ వచ్చి సోనియాగాంధీని కలిశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు.
దీనిపై కె.సి.త్యాగి స్పందిస్తూ.. ‘‘మేం నిరాశ చెందలేదు. నితీశ్ కుమార్ వెళ్లి సోనియా గాంధీని కలిసినపుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగబోతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మేం తర్వాత కలవాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్ష ఐక్యత విషయంలో కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రతిపాదనా రాలేదు. వారు ఏదైనా ప్రయత్నం చేస్తున్న సంకేతమూ లేదు’’ అని చెప్పారు.
కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏదా సాధ్యం కాదంటున్న త్యాగి.. బీజేపీని ఓడించటానికి నవీన్ పట్నాయక్, కేసీఆర్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి అందరూ కూడా ప్రతిపక్ష కూటమిలోకి రావాలని అంటున్నారు.
కాలమే ప్రతిపక్షాన్ని ఐక్యం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 1977 ఉదాహరణను చెప్పారు. ఆ సమయంలో దాదాపు ప్రతిపక్ష నేతలందరూ జైలులో ఉన్నారని, వారి మధ్య ఎలాంటి సమాచార సంబంధాలూ లేకుండా పోయాయని త్యాగి పేర్కొన్నారు. ‘‘జన్‌సంఘ్ ఎవరితో విలీనం కావటానికి సిద్ధంగా లేదు. సమాజ్ వాది పార్టీ కూడా భిన్నమైన మార్గంలో నడుస్తోంది. జేపీకి సైతం ఎలాంటి పార్టీని నెలకొల్పాలని లేదు. కానీ జనం ఒత్తిడితో ప్రతి ఒక్కరూ కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. దాంతో ఇందిరాగాంధీ కాంగ్రెస్ 1977 ఎన్నికల్లో ఓడిపోయింది’’ అని చెప్పారు.
‘‘దేశంలో సామాజిక అల్లికను, లౌకిక సంప్రదాయాన్ని బలోపేతం చేయాలన్న కాంక్ష అన్ని పార్టీల్లో బలంగా ఉన్నపుడు.. దేశ సమైక్యత కోసం వారందరూ కలుస్తారు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @INC
‘ఉమ్మడి ప్రతిపక్షం మాటలకు ఇంకా సమయం రాలేదు’
ఏ సాధారణ ఎన్నికల్లో అయినా ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైనది. ఎందుకంటే అక్కడి నుంచి 80 మంది ఎంపీలు ఎన్నికవుతారు. గత రెండు సాధారణ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించటానికి.. యూపీలో ఆ పార్టీ ప్రదర్శన కూడా ఒక కారణం. ఆ రెండు సార్లూ బీజేపీ యూపీలో 60 కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది.
అందుకే.. బీజేపీని నిలువరించాలంటే ఆ పార్టీని యూపీలో అడ్డుకోవాలి. కానీ ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షం చెల్లాచెదురుగా ఉంది.
భారత్ జోడో యాత్ర విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా చేపట్టిన గొప్ప కృషి అని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి ఘన్‌శ్యామ్ తివారి అభివర్ణించారు. ఆ యాత్ర రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందన్నారు. కానీ 2024 ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇంకా సమయం రాలేదని పేర్కొన్నారు.
2023లో దాదాపు డజను రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో చాలా రాష్ట్రాల్లో (కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోరు జరుగనుంది.
2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర ఏమిటనేది.. ఈలోగా జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని తివారి అభిప్రాయపడ్డారు.
యూపీ గురించి మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ పూర్తి బలంతో బీజేపీతో పోరాడటానికి సంసిద్ధమవుతోందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘కాంగ్రెస్ కాకుండా మరో ఆలోచన ఎందుకు రాదు?’
యూపీఏ హయాంలోనే తెలంగాణ ఏర్పాటైంది. ఒక సమయంలో.. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టుగా కూడా కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బద్ధవ్యతిరేకిగా మారింది. అంతేకాదు.. కేసీఆర్ తన జాతీయ ఆకాంక్షను నెరవేర్చుకోవటానికి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని కూడా మార్చారు.
‘‘రాహుల్ గాంధీ తన యాత్ర రాజకీయ యాత్ర కాదని చెప్తున్నారు. కానీ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆయన రాజకీయ ప్రకటనలు చేశారు. అంతేకాదు అక్కడి పార్టీలను బీజేపీ బి-టీమ్‌లు అని కూడా అభివర్ణించారు’’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ మన్నె పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర అనేది పూర్తిగా రాజకీయ కార్యక్రమమని, రాహుల్ గాంధీ ఇమేజ్‌ను బలోపేతం చేయటానికి చేపట్టిన యాత్ర అని క్రిషాంక్ అభివర్ణించారు. ‘‘అందులో ఈ దేశానికి ఇవ్వటానికి బలమైన సందేశమేదీ లేదు’’ అన్నారు.
ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏమిటన్న ప్రశ్నకు క్రిషాంక్ బదులిస్తూ.. ‘‘నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన హామీల నుంచి గత తొమ్మిదేళ్లుగా పారిపోతున్నారు. దీనిపై ప్రజల అజెండాతో మోదీని సవాల్ చేయటం మీద ఇప్పుడు మా దృష్టిని కేంద్రీకరించాం’’ అని చెప్పారు.
కాంగ్రెస్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ కాకుండే వేరేదాని గురించి మనం ఎందుకు ఆలోచించం? నేడు కాంగ్రెస్ పార్టీ 40-50 సీట్లకే పరిమితమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ (కాంగ్రెసేతర, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో) అక్కడి బలమైన పార్టీలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @INCINDIA
‘‘రాహుల్ ఇంకా ‘ప్రతిపక్ష ముఖచిత్రం’ కాదు’’
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్తింపు కలిగిన నాయుకుడిగా పునఃప్రతిష్టుడయ్యారని, ప్రతిపక్షంలో ఒక ప్రముఖ నాయకుడిగా అవతరించారని కాంగ్రెస్ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించే సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్తా చెప్తున్నారు.
అయితే, రాహుల్ గాంధీ తనను సీరియస్‌గా పట్టించుకోవాల్సి ఉంటుందని నిరూపించినప్పటికీ.. ఆయనను ఇప్పుడే ‘ప్రతిపక్ష ముఖచిత్రం’గా చెప్పలేమని ఆమె పేర్కొన్నారు.
కేసీఆర్, మమతా బెనర్జీ వంటి వారి ప్రథమ లక్ష్యం బీజేపీని ఓడించటమే అయితే, వారు కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్లాల్సి ఉంటుందని.. వారి దగ్గరకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ మిత్రపక్షాలదేనని స్మితా గుప్తా అభిప్రాయపడ్డారు.
అయితే రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రముఖ సోషియాలజిస్ట్ శివ్ విశ్వనాథన్ రాజకీయాలకు పూర్తి భిన్నమైన కార్యక్రమంగా పరిగణిస్తున్నారు.
రాహుల్ గాంధీ యాత్ర ఒకరకంగా భారతదేశాన్ని తిరిగి సందర్శించటం వంటిదని ఆయన అభివర్ణించారు.
భారత్ జోడో యాత్రలో సమాజంలోని విభిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఊర్మిళా మటోండ్కర్, స్వరా భాస్కర్, పూజా భట్, రియా సేన్, ఆనంద్ పఠ్వర్థన్ వంటి సినీ రంగ ప్రముఖులు వచ్చారు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్, తెలుగు రాష్ట్రాల నుంచి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కూడా పాల్గొన్నారు.
క్రీడా ప్రపంచం నుంచి చాలా మంది వచ్చారు. టి.ఎం.కృష్ణ వంటి సంగీత ప్రముఖులు, స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా, గణేష్ దేవి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రంజన్‌లు కూడా రాహుల్ పాదయాత్రలో నడిచారు.
రాహుల్ గాంధీ ఈ యాత్ర ఆరంభంలో మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించి ఉంటారని, కానీ యాత్ర కొనసాగే క్రమంలో ఆయన అభిప్రాయం మారిందని శివ్ విశ్వనాథన్ పేర్కొన్నారు.
యాత్ర ఆరంభ దశలో రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారని, కానీ ఆయన ప్రజలను కలుస్తున్నకొద్దీ ఈ తరుణంలో భారతదేశానికి కొత్త తరహా రాజకీయాలు అవసరమని తెలుసుకున్నారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, @bharatjodo
రాహుల్ గాంధీ స్వయంగా అర్థం చేసుకోలేకపోయారా?
రాహుల్ గాంధీ తన సందేశాన్ని ప్రజలకు తెలియజేయటంలో సఫలమయ్యారా లేదా అనే అంశంపై శివ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ సందేశం నెమ్మదిగా ప్రజలకు చేరుతోంది. అయితే ఈ యాత్రలో రాహుల్ గాంధీ కథానాయకుడని నేను భావించటం లేదు. ఈ యాత్రలో చేరిన భారతీయులు ఈ యాత్రకు కథానాయకులు. నేటి పార్టీ రాజకీయాలు డొల్లగా ఉన్నాయని ఆయనకు చెప్పినవారే నిజమైన కథానాయకులు’’ అని పేర్కొన్నారు.
అయితే ప్రజలను నిరాశపరచి, మళ్లీ పాత రోజులకు తిరిగి వెళ్లే చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
‘‘రాహుల్ గాంధీ పౌర సమాజంతో రాజకీయాలు చేయాలని కోరుకున్నట్లయితే.. అందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని కొత్త పద్ధతిలో సంస్కరించాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తుకు సంబంధించిన కొత్త రాజకీయ పార్టీ వస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీకి పౌర సమాజ ప్రజలు సాయపడగలరు. అదే జరిగితే ఒక అద్భుతం అవుతుంది’’ అని శివ్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ మిత్రులైన శరద్ పవార్, నితీశ్ కుమార్ వంటి వారు సైతం అధికారం పొందాలని, తమను తాము బలోపేతం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటారని.. కానీ రాజకీయ నాయకులను సాధికారం చేయటం కాకుండా.. ప్రజలను సాధికారం చేయటం గురించి మాట్లాడిన తొలి రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయన చెప్పారు.
ఈ యాత్ర సందర్భంగా ఏం జరుగుతోందనేది రాహుల్ గాంధీ సైతం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ చేసిన కృషి.. ఎన్నికల రాజకీయాలకు దూరంగా సరికొత్త భారతదేశపు స్వప్నాన్ని చూపుతోందన్నారు. కానీ కొన్నిసార్లు స్వప్నాలు చెదిరిపోతాయని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ‘ఆశా రాజకీయాలు’ చేస్తున్నారని శివ్ విశ్వనాథన్ అభివర్ణించారు. అయితే ఈ రాజకీయాలు సఫలం కావాలంటే ఆలోచనల రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















