దిశ అత్యాచారం కేసు: నిందితుల ఎన్‌కౌంటర్ నుంచి కోర్టు విచారణ వరకు...

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిశ అత్యాచారం, హత్య 2019 నవంబరు 27 రాత్రి జరిగింది. ఆ అత్యాచారం, హత్య చేసింది వీరే అంటూ ఒక నలుగురును మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు.
వారిపై చార్జిషీటు వేసి కోర్టులో పెట్టక ముందే, డిసెంబరు 6న ఆ నలుగురూ పోలీసు కాల్పుల్లో చనిపోయారు.
‘‘వారు తప్పించుకోబోతే, మా మీద కాల్పులు జరపబోతే, ఆత్మరక్షణ కోసం కాల్చాం’’ అని చెప్పారు పోలీసులు.
చట్ట ప్రకారం నేరం చేసిన వారిని పోలీసులు పట్టుకుని, ఆ నేరం ఎలా చేశారన్న వివరణ రాసిన చార్జిషీటు కోర్టులో వేస్తే, కోర్టు విచారించి, వారిని శిక్షించాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు.

ఎన్ కౌంటర్ లో చనిపోయింది వీరే..
- మహమ్మద్ ఆరిఫ్
- చింతకుంట చెన్నకేశవులు
- జొల్లు శివ
- జొల్లు నవీన్
‘‘పోలీసులే న్యాయ నిర్ణేతలైతే అది ఇక్కడితో ఆగదు, పోలీసులు ఎవరినైనా ఇలా చేయరని నమ్మకం ఏంటి?’’ అనే ప్రశ్నలేవనెత్తాయి మానవ హక్కుల సంఘాలు.
అంతేకాదు, తెలంగాణకు చెందిన పలువురు మానవ హక్కుల కార్యకర్తలు, మహిళా సంఘాల వారు హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారు.
సుప్రీం కోర్టు ఈ ఎన్‌కౌంటర్‌ను సీరియస్‌గా తీసుకుంది.
అసలు ఈ ఎన్ కౌంటర్ నిజమైనదో కాదో తేల్చడానికి అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఒక కమిషన్‌ను నియమించారు.
2019 డిసెంబర్ 12న కమిషన్ ఏర్పాటైంది.
కమిషన్ సభ్యులు వీరే..
- జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్
- జస్టిస్ రేఖా బల్దోటా
- డీ ఆర్ కార్తికేయన్ (సీబీఐ మాజీ డైరెక్టర్)
ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ సుప్రీం కోర్టుకు 2022 జనవరి 28న ఒక నివేదిక ఇచ్చింది. ఇది నకిలీ ఎన్ కౌంటర్ అని విచారణ నివేదిక తేల్చింది.
ఆ నివేదిక బయట పెట్టకుండా సీల్డ్ కవర్ లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వాదించింది. దానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు.
''ఇందులో గోప్యమైనదేమీ లేదు. ఎవరో ఒకరు దోషులుగా తేలారు. ఇప్పుడు ప్రభుత్వం దాని సంగతి చూడాల్సి ఉంటుంది'' అని అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు.
చంపాలనే ఉద్దేశంతోనే నలుగురు యువకులపై పోలీసులు కాల్పులు జరిపారని, అవి వారి మరణానికి దారితీస్తాయనే స్పష్టమైన అవగాహనతోనే చేశారని కమిషన్ నిర్ధరించింది.
నిందితులు, పోలీసు పార్టీ నుంచి ఎలాంటి ఆయుధాలను లాక్కోలేదని, అందుకే 'ఆత్మ రక్షణ' కోసం కాల్పులు జరిపారనే వాదన తప్పు అని కూడా పేర్కొంది.
నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిపై హత్య కేసు (302 r/w 34 IPC, 201 r/w 302 IPC, 341 IPC సెక్షన్లు) పెట్టి విచారణ చేయాలని కమిషన్ నివేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు ఏడాది తరువాత హైకోర్టులో విచారణ
సుదీర్ఘ ఎదురు చూపుల తరువాత ఆ కేసు జనవరి 2వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
సుప్రీం కోర్టు న్యాయవాది వృందా గ్రోవర్ ఈ కేసులో హక్కుల సంఘాలు, కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల తరపున వాదనలు వినిపించారు.
మొదటి విచారణకు పిటిషనర్లతో పాటూ, బాధిత కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
హైకోర్టులో న్యాయవాది వృందా వినిపించిన వాదనలో ప్రధాన అంశాలు
1. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు చేయాలి. కేసులోని 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టాలి.
2. ఎటువంటి ఎదురు కాల్పులు జరగలేదనీ, సాక్ష్యాలను తారుమారు చేశారనీ స్పష్టంగా తెలుస్తోంది.
3. డిసెంబరు 6న ఘటన జరిగితే 13వ తేదీ వరకూ ఆయుధాలు సీజ్ చేయలేదు. ఆ మధ్య ఏం జరిగింది?
4. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితులు తుపాకులను ఎలా అన్‌లాక్ చేశారు? ఒకవేళ పోలీసులే అన్‌లాక్ చేసుంటే అలా ఎందుకు చేశారో చెప్పడం లేదు.
5. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నప్పుడు వారి చేతులకు సంకెళ్లు ఎందుకు వేయలేదు?
6. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు చెప్పారు. కానీ కమిషన్ ముందు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పలేదన్నారు.
7. ఎఫ్ఐఆర్ మేజిస్ట్రేట్‌కి ఇవ్వకముందే, మృతదేహాలను మార్చురీకి పంపక ముందే కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టారు. తక్షణ న్యాయం పేరుతో ఎన్‌కౌంటర్ సమర్థించుకోవడానికే ప్రెస్‌మీట్ పెట్టారు.
8. ఘటన జరిగి మూడేళ్లు అవుతోంది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.
9. జువైనల్ జస్టిస్ నిబంధనలు పాటించలేదు.
వృందా గ్రోవర్ వాదనలు విన్న కోర్టు కేసును జనవరి 23కి వాయిదా వేసింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వ లాయర్ పోలీసుల తరపున తన వాదనలు వినిపిస్తారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ఈ కేసు విన్నారు.
‘‘స్త్రీల రక్షణ పేరుతో ‘రూల్ ఆఫ్ లా’ ని ఉల్లంఘించారు. ఇది కేవలం ఆ నాలుగు కుటుంబాలకు సంబంధించింది కాదు. మనందరి కుటుంబాలకు ప్రమాదం ఇది. పోలీసులు కట్టుకథ చెప్పారు.’’ అని పిటిషనర్ కె.సజయ మీడియాతో అన్నారు.
ఇప్పటి వరకూ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎటువంటి కేసూ నమోదు కాలేదు. దీనిపై తను రిటైర్ అయ్యే ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు.
‘‘ప్రస్తుతం కేసు హైకోర్టు పరిధిలో ఉంది. ఇప్పటి వరకూ పోలీసుల మీద ఎటువంటి కేసూ పెట్టలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం నడచుకుంటాం’’ అన్నారాయన.

బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
ఆ కుటుంబాలన్నీ సమాజంలో చిన్న కులాలుగా చెప్పే కులాల నుంచి వచ్చినవి. వారంతా గుడిసె లేదా ఒక్క గది ఇంట్లో ఉండే పేదలే. ఈ వార్త చూసినప్పుడు చాలా బాధపడ్డానని ఓ నిందితుడి భార్య అన్నారు .
"ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే. నాకు చాలా బాధేసింది. మా ఆయన చేశాడా, లేదా అనేది నేను మాట్లాడను. కానీ జరిగింది సరికాదు. ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు" అన్నారామె.
మిగిలిన నిందితుల తల్లితండ్రులు కూడా తమ వారు తప్పు చేస్తే, వారిని కఠినంగా శిక్షించాలనే మీడియా ముందు చెప్పారు.
కానీ ఈ మాటలు కొన్ని రోజులకే వారు నిందితుల కుటుంబాల హోదా నుంచి బాధిత కుటుంబాలుగా మారిపోయారు. వారు ఊహించనిది జరిగింది.
ఆ నలుగురినీ పోలీసులు చంపడంతో వారి వాదన మారింది. కోర్టులో జరగాల్సిన ప్రక్రియను పక్కను పెట్టి ఇలా చంపడం వెనుక అసలు కారణం బయటకు రావాలని వారు ఆందోళనకు దిగారు.
"మా వాడు అలాంటిది ఏమీ చేయలేదు. అసలు తాను చేశాడో లేదో చెప్పడానికి మా వాడు ఉండాలి కదా" అని ఓ నిందితుడి తల్లి మౌలాంబి ప్రశ్నించారు.
"మా వాడు బతుకుంటే అసలు ఏం జరిగిందో తెలిసేది కదా. ఈ వయసులో ఇలా ఒంటరిగా మేం మిగిలిపోవడానికి పోలీసులే కారణం. మా పెద్ద కొడుకు మమ్మల్ని వదిలి వేరో చోట ఎక్కడో ఉన్నాడు. మా దగ్గరే ఉంటున్న శివను చంపేశారు" అని జొల్లు శివ తల్లి మణెమ్మ అన్నారు.
"దిశ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో మాకూ అంతే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అని తేలింది. మా నవీన్ బతికి ఉంటే జైలులో ఉండేవాడు. కనీసం చూసుకునే వాళ్ళం. అసలు సంఘటన జరిగిన 8 రోజులకే చంపేశారు. 14 రోజులు కస్టడీలో ఉంచలేదు. ఒకవేళ నవీన్ బతికి ఉంటే ఆరోజు ఏం జరిగిందో మీడియా ముందు చెప్పేవాడు. వారే నేరం చేశారో లేక ఏం జరిగిందో తెలిసేది. " అన్నారు నవీన్ తల్లి లక్ష్మి.

సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో ఏముంది?
2021 ఆగస్టు 21 నుంచి 2021 నవంబర్ 15 వరకూ 47 రోజులపాటు విచారణ చేపట్టింది. ఆ సమయంలో మొత్తం 57 మంది సాక్ష్యులను విచారించి, వారి వాంగ్మూలం రికార్డు చేసింది.
దర్యాప్తు రికార్డులు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలు, ఘటనాస్థలంలో తీసిన ఫొటోలు, వీడియోలు అన్నీ కలపి నివేదికతో పాటూ ఇచ్చింది కమిషన్.
నిందితులు పోలీసుల దగ్గరి నుంచి పిస్టల్ లాక్కుని పోరిపోవటానికి ప్రయత్నించారని చెప్తున్న పోలీసుల కథనం నమ్మశక్యంగా లేదని, దానికి ఆధారాలు లేవని విచారణ కమిషన్ స్పష్టంచేసింది.
''అనుమానితులు పోలీసులపై దాడికి దిగారని, వారి దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స చేశారని పోలీసులు చెబుతున్నదంతా అవాస్తవమని మేం గుర్తించాం. ఏసీపీ వి.సురేందర్ (సీడబ్ల్యూ-44), కానిస్టేబుల్ కె.వెంకటేశ్వర్లు (సీడబ్ల్యూ-49) నుంచి అనుమానితులు పిస్టల్స్ లాక్కున్నారన్నది కూడా నమ్మశక్యం కాదు. ఏసీపీ వి.సురేందర్ (సీడబ్ల్యూ-44) తొలుత ఇద్దరి నుంచి పిస్టల్స్ లాక్కోవడం స్వయంగా చూశానని చెప్పినప్పటికీ ఆ తరువాత ఒక్కరి నుంచి లాక్కోవడం మాత్రమే చూశానని తెలిపారు'' అని కమిషన్ తన నివేదికలో వివరించింది.
‘‘నమోదైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత మృతిచెందిన అనుమానితులు 2019 డిసెంబరు 6న పోలీసుల నుంచి తుపాకులు లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడికి దిగడం, వారిపై కాల్పులు జరపడం వంటివేమీ చేయలేదని మేం(కమిషన్) నిర్ధరణకు వచ్చాం. అనుమానితులు చనిపోతారన్న విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే నిందితులు(పోలీసులు) కాల్పులు జరిపారని’’ కమిషన్ అభిప్రాయపడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు వీరే..
- వి. సురేందర్
- కె. నరసింహారెడ్డి
- షేక్ లాల్ మదార్
- మొహమ్మద్ సిరాజుద్దీన్
- కొచ్చెర్ల రవి
- కె.వెంకటేశ్వర్లు
- ఎస్. అరవింద్ గౌడ్
- డి.జానకిరామ్
- ఆర్. బాలు రాథోడ్
- డి.శ్రీకాంత్
వీరు వేర్వేరుగా పాల్పడిన చర్యలన్నిటి వెనుకా అనుమానితులను చంపాలన్న ఉమ్మడి ఉద్దేశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
పోలీస్ అధికారులు షేక్ లాల్ మదార్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి ఈ హత్యను సమర్ధించడానికి ప్రయత్నించినందుకు వారిని ఐపీసీ సెక్షన్ 302 విచారించాలని కమిషన్ అభిప్రాయపడింది.
మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అనే ముగ్గురు నిందితులు నేరం చేసేనాటికి మైనర్లని కూడా కమిషన్ గుర్తించింది.
ఈ కేసులో నిందితులు (పోలీసులు అధికారులు ) ఐపీసీ సెక్షన్ 76, అలాగే సెక్షన్ 300లోని 3 వ మినహాయింపు కింద రక్షణ పొందలేరని కమిషన్ అభిప్రాయపడింది.
దీనికి కారణం...ఈ కేసులో నిందితులైన అధికారులు తాము మంచి ఉద్దేశంతోనే ఈ అనుమానితులపై కాల్పులకు దిగినట్లు భావిస్తున్నారని, ఇది నమ్మశక్యం కాదని పేర్కొంది.
హైకోర్టులో హక్కుల సంఘాలు వేసిన పిటిషన్ లో అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరు 5వ రెస్పాండెంట్ గా ఉంది.

మానవ హక్కుల సంఘాల పిటిషన్లు
అసలు ఈ ఎన్ కౌంటర్ భూటకం అని ఆరోపిస్తూ, 15 మంది మహిళా, పౌర హక్కుల కార్యకర్తలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన మెమోరాండాన్ని పిల్‌గా తీసుకుంది కోర్టు. (WP PIL నం.173/2019).
ఈ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని, పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం, కోర్టు పర్యవేక్షణలో విచారణతో పాటు హత్యకు పాల్పడిన అధికారులపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు తమ మెమోరాండంలో విజ్ఞప్తి చేశారు.
దీని మీద హైకోర్టు వెంటనే స్పందించి మృతదేహాలను భద్రపరచాలని, పీయూసీఎల్ మార్గదర్శకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
తరువాత కె.సజయ, వి.సంధ్య, ఎం.విమల, మీరా సంఘమిత్రలు సుప్రీం కోర్టు ముందు మరో రిట్ పిటిషన్ (WP-Crl 364/2019) వేశారు.
సుప్రీం సూచన మేరకు, సాక్ష్యాలను భద్రపరచడం, సేకరించడంపై ఆదేశాలను కోరుతూ కె. సజయ తెలంగాణ హైకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేశారు.
ఈ కేసులో శవపరీక్ష, స్వాధీనం, సాక్ష్యాలను భద్రపరచడంపై తెలంగాణ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తరువాత సుప్రీం కోర్టు కమిషన్‌ను నియమించింది.
అంతకు ముందు ఈ ఎన్ కౌంటర్ మీద విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక విచారణ బృందం (సిట్)ని నియమించింది.
డిసెంబరు 8వ తేదీన సిట్ నియామకం జరిగింది.
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఈ టీమ్‌కు నేతృత్వం వహించారు.
కానీ, ఆ విచారణ సాగలేదు. తరువాత ఈ సిట్ బృందం కూడా సిర్పూర్కర్ కమిషన్ ముందు విచారణకు హాజరైంది.
ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- ‘‘తప్పుడు కేసులో జైలుకు పంపి సెక్స్‌కు దూరం చేశారు.. రూ. 10 వేల కోట్లు పరిహారం ఇవ్వాలి’’ - ప్రభుత్వంపై కేసు
- సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా
- అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














