ఆశాకిరణ్ బార్లా: వయసు 17 ఏళ్లు.. రన్నింగ్‌లో 11 నేషనల్, 2 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్.. కానీ...

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ కోసం
"వయసు కేవలం 17 ఏళ్లు. సాధించినవి రన్నింగ్‌లో పదకొండు జాతీయ, రెండు అంతర్జాతీయ బంగారు పతాకలు. ఆశాకిరణ్ బార్లా 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు."
ఈ మాట చెబుతూ ఆశాకిరణ్ కోచ్ ఆశు భాటియా వ్యాకులపడ్డారు.
"నేను 17 మంది గిరిజన పిల్లలకు ఉచిత అథ్లెటిక్స్ కోచింగ్, వసతి, భోజన ఏర్పాట్లు చేశాను. ఈ సౌకర్యాలతోనే ఆశాకిరణ్ కిందటేడు పదకొండు బంగారు పతకాలు సాధించింది. కానీ, ఒలింపిక్స్‌కు సిద్ధం కావడానికి కావలసిన సౌకర్యాలను నేను ఆమెకు అందించలేకపోతున్నాను" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆశాకిరణ్ బార్లా బొకారో జిల్లాలోని 'బొకారో థర్మల్' పట్టణంలో ఉన్న 'భాటియా అథ్లెటిక్స్ అకాడమీ' హాస్టల్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రైవేట్ అకాడమీని 'భాటియా అథ్లెటిక్స్ అకాడమీ ట్రస్ట్' నిర్వహిస్తోంది. దీనికి కార్యదర్శి ఆశాకిరణ్ కోచ్ అషు భాటియా.
జార్ఖండ్‌లో మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ అమ్మాయి
ఆశాకిరణ్, జార్ఖండ్ రాజధాని రాంచీకి 100 కి.మీ దూరంలో పర్వతాల నీడన ఉన్న నవాడిహ్ గ్రామ నివాసి. ఈ ఊరు గుమ్లా పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది.
వాళ్ల ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో గుమ్లా వైపుకు వెళ్లే రహదారి ఒకటి ఉంది. అడవి, నది, కొండలు తప్ప ఆ గ్రామానికి చుట్టుపక్కల జనాభా లేదు.
గ్రామానికి చుట్ట్టుపక్కల ఉన్నవి నక్సల్ ప్రభావిత ప్రాంతాలని స్థానికులు చెబుతున్నారు. గ్రామం చుట్టూ కనీస సౌకర్యాలు కూడా లేవు. అందుకే నక్సల్ ప్రాంతంగా మారి ఉండవచ్చు.
ఈ గ్రామ ప్రజలు వైద్యం కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేండ్వా పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళతారు. 18 కిమీ దూరంలో కాందారా సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. అనారోగ్యం ఎక్కువైనా, రాత్రి పూట వైద్య చికిత్సలు కావాలన్నా కాందారా వెళ్లాల్సిందే.
గ్రామంలో ఎవరికీ కార్లుగానీ, జీపులుగానీ లేవు. ఆరు కుటుంబాలకు బైక్‌లు ఉన్నాయి. 22 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో కేవలం రెండు ఇళ్లు ఇటుకలతో కట్టినవి. మిగిలినవన్నీ మట్టి గోడలున్న ఇళ్లే.
"ఇంటి గోడలకు పగుళ్లు, పైకప్పు పడిపోతోంది. మా అమ్మాయి దేశ, విదేశాల్లో మా గ్రామానికి కీర్తి తెస్తోంది. కానీ, మా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ఇప్పటికీ మేం దీన స్థితిలో ఉన్నాం" అంటూ ఆశాకిరణ్ తల్లి రోసానియా అయింద్ బార్లా వాపోయారు.
ఈ గిరిజన గ్రామ ప్రజలు జీవనోపాథి కోసం దూరంలో ఉన్న ఊళ్లకు పొలం పనులకు వెళతారు.
చుట్టుపక్కల గ్రామాల్లో వరిపంట పండుతుందని, విత్తనాలు నాటడానికి, కోతలకు రోజుకు వంద రూపాయలు కూలీ ఇస్తారని రోసానియా చెప్పారు.
"మీరే చెప్పండి, వంద రూపాయలకు ఏమోస్తుంది? వితంతు పెన్షన్ కింద నెలకు వెయ్యి రూపాయలు వస్తున్నాయి. కానీ, ఏడుగురు ఉన్న కుటుంబం ఇంత తక్కువ మొత్తంతో ఎలా నడుస్తుంది?" అంటూ ఆమె నిస్సహాయ స్వరంతో ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారు
ఆశాకిరణ్ బార్లాకు నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి విలియమ్స్ బార్లా తొమ్మిదేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయారు.
"నాన్న బతికున్నప్పుడు మా పరిస్థితి ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. పొలంలో పని దొరికితే రెండు పూటలా భోజనం చేస్తాం. కానీ, ఒక్కోసారి రెండు రోజులకు ఒకసారి భోజనం దొరుకుతుంది" అని ఆశాకిరణ్ చెల్లెలు ప్రీతి బార్లా చెప్పింది.
రేషన్ కార్డుపై బియ్యం, గోధుమలు దొరుకుతాయి కానీ, అవి పదిహేను రోజులకే వస్తాయని ఆశాకిరణ్ అన్న ఆశిష్ బార్లా చెప్పారు.
నవాడిహ్ గ్రామంలో నీటి సౌకర్యాలు లేవు. గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బావిపైనే ఆధారపడాలి. ప్రతి రోజు బావి నుంచి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటారు.
ప్రభుత్వం కొన్ని మరుగుదొడ్లు నిర్మించింది, కానీ ఒక్కటి కూడా పనికి రాలేదని ఆశిష్ చెప్పారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
స్కూలు లేదు
నవాడిహ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండేది. అందులో ఒకే ఒక్క టీచర్ ఉండేవారు. ఆయన ఆశాకిరణ్ తండ్రి విలియమ్స్ బార్లా. గ్రామంలో అందరికన్నా ఎక్కువ చదువుకున్నది ఆయనే.
తన తండ్రి గ్రాడ్యుయేషన్ చేసి, బీ.ఎడ్ చేశారని ఆశాకిరణ్ చెప్పారు.
"నాన్న ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పేవారు. కానీ, ఆయన చనిపోయిన తరువాత బడి మూతపడింది. నాన్న ఉన్నప్పుడు బడిలో యాభై మంది పిల్లలు చదువుకునేవారు" అని ఆశాకిరణ్ చెప్పింది.
ఆశాకిరణ్ చిట్ట చివరి చెల్లి, తమ్ముడు ఏడు, అయిదు తరగతుల్లో ఉన్నారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ఇద్దరూ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహూగావ్‌కు వెళ్లి చదువుకుంటున్నారు.
"2013లో నేను 9వ తరగతి చదివాను. నాన్న చనిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి నేను చదువు మానేయాల్సి వచ్చింది" అని ఆశిష్ చెప్పారు.
ఈ గ్రామం చుట్టుపక్కల సుదూరంలో కూడా పట్టణం లేకపోవడంతో కూలిపనులు దొరకవని చెప్పారు.
కిందటి ఏడాది ఆశిష్‌కు మహారాష్ట్రలోని ఒక వంతెన నిర్మాణంలో కూలిపని దొరికింది. అక్కడ నాలుగు నెలలు పనిచేసి రూ.12,000 సంపాయించారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
2022లో ఇంటికి కరెంట్ వచ్చింది
కువైట్‌లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో ఆశాకిరణ్ బార్లా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, వాళ్లింట్లో కరెంటు, మొబైల్ లేకపోవడంతో రెండు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందింది.
"2015 నుంచి మా అమ్మ కరంట్ కోసం సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. 2022లో మా ఇంటికి కరంట్ వచ్చింది."
ఆ తరువాత, గుమ్లా జిల్లా యంత్రాంగం చొరవతో ఆశాకిరణ్ కుటుంబానికి ఒక టీవీ సెట్ కూడా అందింది.
దాంతో, ట్రాక్‌పై పరుగెత్తుతున్న ఆశాకిరణ్‌ని ఊరిలో అందరూ చూశారని ఆశిష్ చెప్పారు.
"టీవీ వచ్చినందుకు సంతోషమే. కానీ, దీంతో కుటుంబాన్ని నడపలేం కదా. మాకు మరింత సహాయం కావాలి" అన్నారు ఆశిష్.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
గోల్డెన్ గర్ల్‌గా ప్రస్థానం
తన విజయానికి కారణం సెయింట్ మేరీస్ టీచర్ సిస్టర్ దివ్య జోజో, ప్రస్తుత కోచ్ అషు భాటియా అని ఆశకిరణ్ చెప్పింది.
వాస్తవానికి, ఆశాకిరణ్ అక్క ప్లోరెన్స్ బార్లా 2016లో ఒక జిల్లా స్థాయి కార్యక్రమం 'బాల సమాగం'లో జరిగిన వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది.
ఆ సమయంలో, ఆమె సెయింట్ మేరీస్ స్కూల్లో గేమ్స్ టీచర్ సిస్టర్ దివ్య జోజోతో తన చెల్లెలు ఆశాకిరణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. తన చెల్లి మంచి క్రీడాకారిణి అని చెప్పింది.
"తన చెల్లి ఆశాకిరణ్ తన కన్నా మెరుగైన క్రీడాకారిణి అని ఫ్లోరెన్స్ చెప్పింది. కానీ, కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె అయిదవ తరగతితోనే చదువు నిలిపివేయాల్సి వచ్చిందని, రాంచీలో ఒకరి ఇంట్లో పనికి కుదిరిందని చెప్పింది" అని టీచర్ దివ్య జోజో చెప్పారు.
సిస్టర్ దివ్య జోజో చొరవతో 2017లో ఆశాకిరణ్ రాంచీ-గుమ్లా సరిహద్దుకు సమీపంలోని మహూగావ్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో ఆరో తరగతిలో చేరింది.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
కాళ్లకు చెప్పులు లేకుండానే పరుగు..
ఫ్లోరెన్స్, ఆశాకిరణ్ ఒకే స్కూల్లో చదువుకోవడం ప్రారంభించారు. స్కూల్లో చేరాక ఆశాకిరణ్ సామర్థ్యాని మెరుగుపరచడమే సిస్టర్ దివ్య జోజో మొదటి లక్ష్యం. కానీ, ఆశాకిరణ్ కుటుంబ పేదరికం ఇందుకు అడ్డంకిగా నిలిచింది.
స్కూల్లో ఎక్కువసేపు ఉండి చదువుకోమని వాళ్లకు చెప్పేవారు. కానీ, అక్కచెల్లెళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయేవారు. వాళ్ల ఇంటి పరిస్థితి తెలుసుకోవడానికి సిస్టర్ దివ్య జోజో వాళ్ల గ్రామానికి వెళ్లారు.
"అక్కచెల్లెళ్లిద్దరూ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి తిండితిప్పలు లేకుండా వస్తారని నాకు తెలిసింది. ఆ తరువాత, వాళ్లు ఆటపై దృష్టి పెట్టి సాధన చేయడం కోసం నేనే వాళ్లకు భోజనం పెట్టడం మొదలుపెట్టాను" అని దివ్య జోజో చెప్పారు.
ఒక్కోసారి ఫ్లోరెన్స్, ఆశాకిరణ్ కాళ్లకు చెప్పులు లేకుండా ఏడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ స్కూలికి వెళ్లేవారు.
మొదట్లో ఇద్దరూ ఉత్తి కాళ్లతోనే పరుగు పోటీల్లో గెలిచేవారు. తరువాత, సిస్టర్ దివ్య వాళ్లిద్దరికీ చెప్పులు, షూస్, ట్రాక్ సూట్ కొనిచ్చారు.
"రాంచీలో 'నవాతండ్ డే బోర్డింగ్ స్కూలు'కు చెందిన బ్రదర్ కాలేప్ టోప్నో వీరిద్దరి ప్రతిభకు ముగ్ధుడై, వాళ్లకు గైడెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆశాకిరణ్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయ పతాక ఎగరేయడం మొదలెట్టింది" అని సిస్టర్ దివ్య జోజో చెప్పారు.
2017లోనే విశాఖపట్నంలో జరిగిన అండర్-14 పోటీల్లో ఆశాకిరణ్ స్వర్ణం సాధించింది. జాతీయ స్థాయిలో ఆమెకు ఇదే తొలి స్వర్ణం.
ఆశాకిరణ్ ప్రతిభను గుర్తించి సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ అధికారులు చొరవ తీసుకోవడంతో, ఆమె 2018లో రాంచీ ఖేల్‌గావ్‌లో చేరింది.
ఇంటర్మీడియట్ చదువు తరువాత ఫ్లోరెన్స్ బొకారో థర్మల్‌లో ఉన్న అషు భాటియా అకాడమీలో చేరింది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఖేల్‌గావ్ మూసివేయడంతో ఆశాకిరణ్ తన గ్రామానికి తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఇంటి వద్ద సరైన భోజనం దొరకక ఆమె బలహీనపడింది. సరిగ్గా సాధన చేయలేకపోయింది.
అప్పుడు కోచ్ అషు భాటియా ఆశాకిరణ్‌కు రేషన్ అందించారు.
"అషు సార్ మా ఇంటి పరిస్థితి చూసి, ఇలా ఉంటే ప్రాక్టీస్ చేయడం కష్టమని అన్నారు. వెంటనే తన అథ్లెటిక్స్ అకాడమీలో చేరమని చెప్పారు. లాక్డౌన్ సమయంలోనే నేను అక్కడ చేరాను. అప్పటి నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా. గత రెండేళ్లుగా అషు సర్ తన స్వంత ఖర్చుతో మా అక్కచెల్లెళ్ళిద్దరినీ అథ్లెటిక్ ఈవెంట్‌లకు తీసుకెళుతున్నారు. మేం అన్నిచోట్లా విజయం సాధించాం. నా తదుపరి లక్ష్యం 2024 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం" అని ఆశాకిరణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
'పీటీ ఉష నాకు స్ఫూర్తి '
2019లో జాతీయ క్రీడల సందర్భంగా పీటీ ఉష రాంచీకి వచ్చారు. కానీ, అప్పుడు ఆశాకిరణ్ ఉషను కలవలేకపోయింది.
"పరుగులో పీటీ ఉష ఎలా విజయం సాధించారో, అలాగే 2024 ఒలింపిక్స్‌లో నేను కూడా విజయం సాధించాలని అనుకుంటున్నా. నాకు ఆమే స్ఫూర్తి."
"నేను ఒలింపిక్స్‌లో పతకం తెస్తాను. అప్పుడు నాకు ఉద్యోగం దానంతట అదే వస్తుంది. ఇక్కడే ఉంటూ జార్ఖండ్ కోసం పనిచేయాలనుకుంటున్నా" " అంటోంది ఆశాకిరణ్.

ఫొటో సోర్స్, SARTAJ ALAM/BBC
అంతర్జాతీయ స్వర్ణం
గత ఏడాది కువైట్‌లో జరిగిన నాలుగో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆశాకిరణ్ బార్లా భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. 800 మీటర్ల ఫైనల్లో 2:06.79 సెకెన్లతో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కొత్త రికార్డ్ సృష్టించింది. అంతకుముందు, యూత్ ఆసియా అథ్లెటిక్స్‌లో 800 మీటర్ల బాలికల విభాగంలో 2:09.03 సెకన్ల రికార్డు ఉంది. ఆశాకిరణ్ దాన్ని బద్దలుగొట్టింది.
"ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఒకే ఒక్క రికార్డు సాధించింది. అది ఆశాకిరణ్ చేసిన రికార్డు" అని కోచ్ అషు భాటియా చెప్పారు.
2019లో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ఆహ్వానిత అథ్లెటిక్స్ పోటీలో ఆమె అక్క ఫ్లోరెన్స్ బార్లా 400 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది.
కజకిస్తాన్‌లో జరిగిన మిక్స్‌డ్ రిలే రేసులో కూడా ఫ్లోరెన్స్ బార్లా భారతదేశానికి అంతర్జాతీయ స్వర్ణం సాధించిందని కోచ్ భాటియా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- తేనెటీగలకు వ్యాక్సీన్.. ప్రపంచంలోనే తొలిసారి... దీన్ని ఎలా ఇస్తారు
- కోటగిరి: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా
- రాహుల్ గాంధీ: ‘మోదీ చేయనిది.. రాహుల్ చేశారు’ – భారత్ జోడో యాత్ర గురించి విదేశీ మీడియా ఎలా విశ్లేషిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














