హెచ్ఐవీని తన దేశానికి స్మగ్లింగ్ చేసిన మహిళా శాస్త్రవేత్త....ఎందుకలా చేశారు?

డాక్టర్ రాడ్కా అర్గిరోవా
ఫొటో క్యాప్షన్, డాక్టర్ రాడ్కా అర్గిరోవా
    • రచయిత, జానెట్ బెర్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1985వ సంవత్సరం. ఓ పక్క ప్రచ్ఛన్నయుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. మరోపక్క అంతుచిక్కని కొత్త వైరస్ ప్రజల ప్రాణాలను మింగేస్తోంది.

చిన్న వయసులోనే అనేకమంది హోమోసెక్సువల్స్ గుర్తుతెలియని ఇన్‌ఫెక్షన్లు, అరుదైన క్యాన్సర్లతో ప్రాణాలు కోల్పోతున్నారు.

మాదకద్రవ్యాలను వాడేవాళ్లకూ ఈ ఇన్‌ఫెక్షన్ సోకడం మొదలైంది. రక్తమార్పిడి ద్వారా కొందరికి సంక్రమించింది. 

1981లో ప్రాణాంతకమైన అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్)ని కొత్త వ్యాధిగా గుర్తించారు.

"ఎయిడ్స్ వ్యాధి రోగ నిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరుస్తుంది. ఇది సోకినవారు పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, రోగాల బారినపడతారు. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది" అని అప్పట్లో బీబీసీ ఈ వైరస్ గురించి రిపోర్ట్ చేసింది.

కొన్నేళ్ల తరువాత, ఎయిడ్స్‌కు కారణం హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) అని కనిపెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు దేశాల్లో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు.

కానీ, బల్గేరియాలో పరిస్థితి వేరు. ఆ సమయంలో బల్గేరియాలో కఠినమైన కమ్యూనిస్ట్ పాలన ఉండేది.

కొత్తగా పుట్టుకొచ్చిన ముప్పును గుర్తించడానికి అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. ఇది "గే వ్యాధి" అని, క్షీణదశలో ఉన్న పశ్చిమ దేశాలకు సంబంధించిన వ్యాధి అని తోసిపుచ్చింది.

బల్గేరియన్ ఆస్పత్రులలో విదేశీ విద్యార్థులు, నావికులు ఎయిడ్స్‌తో మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

డాక్టర్ రాడ్కా అర్గిరోవా, బల్గేరియాలోని తొలి వైరాలజిస్టులలో ఒకరు. ఆ దేశ రాజధాని సోఫియాలో ప్రసిద్ధి చెందిన ఒక పరిశోధనా సంస్థలో పనిచేసేవారు.

1970 ప్రారంభంలో మాస్కోలోని ప్రఖ్యాత ఇవానోవ్స్కీ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆమెకు వైరాలజీ అంటే మక్కువ. 

"అప్పట్లో బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ప్రయోగశాలలో పనిచేసేదాన్ని. వైరాలాజీ కోసం అక్కడ చాలా మంచి ప్రయోగశాల ఉండేది" అని అర్గిరోవా బీబీసీతో చెప్పారు.

ఆ ప్రయోగశాలలో అర్గిరోవా, ఆమె సహ పరిశోధకులు కలిసి హెచ్ఐవీ మీద పరిశోధనలు చేశారు. 

1970ల చివర్లోనే వాళ్లు ఈ పరిశోధన ప్రారంభించారు. బయట దేశాల నుంచి దీనిపై వస్తున్న సైన్స్ అధ్యయనాలను పరిశీలించేవారు. 

ఆ వైరస్ గురించి కొంత తెలుసుకున్నప్పటికీ, అది కలిగించే ప్రాణాంతకమైన వ్యాధి అంతుచిక్కలేదు.

బల్గేరియన్ ప్రభుత్వం దాని గురించి బయటకు చెప్పడానికి సుముఖంగా లేదు. 

కానీ, డాక్టర్ అర్గిరోవా అంతటితో ఊరుకోలేదు.

ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

వైరస్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్లాన్...

బల్గేరియా వదిలి బయటకు వెళ్లడం డాక్టర్ అర్గిరోవాకు చిన్న విషయం కాదు.

1985 జూన్‌లో ఆమె పశ్చిమ జర్మనీలోని హాంబర్గ్‌లో ఒక సైన్ సదస్సుకు హాజరయ్యారు. అందులో అర్గిరోవా తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

లుకేమియాకు, కొత్త వైరస్‌కు సంబంధం ఉందా, లేదా అని చర్చించేందుకు నిర్వహించిన సదస్సు అది.

ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద పెద్ద వైరాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధకుడు డాక్టర్ రాబర్ట్ గాలో కూడా వెళ్లారు.

తరువాతి కాలంలో ఎయిడ్స్‌కు కారణం హెచ్ఐవీ అని కనిపెట్టడంలో డాక్టర్ రాబర్ట్ గాలో ప్రధాన పాత్ర పోషించారు.

అలాగే, హెచ్ఐవీకి బ్లడ్ టెస్ట్ అభివృద్ధి చేయడంలో, హెచ్ఐవీకి సంబంధించిన పలు పరిశోధనలలో డాక్టర్ రాబర్ట్ గాలో ప్రముఖ పాత్ర పోషించారు.

కానీ, అప్పటికి హెచ్ఐవీ గురించి పెద్దగా ఏమీ తెలీదు.

"ఇది ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని మేం ఊహించలేదు. ఎందుకంటే, ఈ రకమైన వైరస్ సంక్రమించడం అంత సులువు కాదు. కానీ, క్రమక్రమంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇది వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని, ఇంతమంది చనిపోతారని మేం ఊహించలేదు. వైరస్ సోకి వ్యాధి ముదురుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ వచ్చింది" అని డాక్టర్ గాలో అదే ఏడాది బీబీసీతో చెప్పారు.

సదస్సు జరుగుతున్నప్పుడు, ఒకరోజు డాక్టర్ అర్గిరోవా, డాక్టర్ గాలోను కలిశారు. 

"ఆరోజు నేను బయటికొచ్చి సిగరెట్ తాగుతున్నా. డాక్టర్ గాలో నా దగ్గరకు వచ్చి సిగరెట్ అడిగారు. నేను బల్గేరియా నుంచి వచ్చానని తెలుసుకుని, మీ దేశంలో ఎయిడ్స్ పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. మా దగ్గర దీన్ని గుర్తించే ప్రయత్నాలు ఏవీ జరగట్లేదని, అందుకే ఈ వైరస్ గురించి ఏమీ తెలీదని చెప్పాను. దీనిపై పరీక్షలు జరపాలని చెప్పాను. వెంటనే ఆయన 'ప్లీజ్ చేయండి' అన్నారు. చేయొచ్చు కానీ, నా దగ్గర వైరస్ లేదు అని చెప్పాను" అని అర్గిరోవా వివరించారు. 

అర్గిరోవా మాటలు విన్నాక, గాలోకు ఒక ఆలోచన వచ్చింది. ఒక జర్మన్ సహ పరిశోధకుడిని పిలిచి, వాళ్ల ప్రయోగశాలలో హెచ్‌ఐవీని సిద్ధం చేసి, ఆధునిక మొబైల్ ఫోన్ పరిమాణంలో ఉన్న సీసాలో ప్యాక్ చేయమని అడిగారు.

కొన్ని రోజుల తరువాత, ఆ ప్యాకెట్‌ను అర్గిరోవాకి ఇచ్చారు. తన బ్యాగ్‌లో పెట్టుకుని రహస్యంగా సోఫియాకు తీసుకెళ్లమని చెప్పారు.

"అది ఎర్రగా ఉంది. వైరస్ లేదా దాని కణాలు ఏవీ కంటికి కనిపించలేదు. రెడ్ వైన్‌లా ఉంది. రెండు సీసాలు ఉన్నాయి. ఒక దానిలో ఇన్‌ఫెక్షన్ సోకిన కణాలు ఉన్నాయి. ఒకదానిలో ఇన్‌ఫెక్షన్ సోకని కణాలు ఉన్నాయి. ఆ సీసాలను నేను జాగ్రత్తగా నా సంచీలో దాచిపెట్టాను. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లి అక్కడి నుంచి సోఫియాకు బయలుదేరాను" అని ఆమె చెప్పారు. 

డాక్టర్ రాబర్ట్ గాలో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రాబర్ట్ గాలో

భయం, అసూయ

ఎయిర్‌పోర్ట్‌కు అర్గిరోవా స్నేహితురాలు వచ్చారు. ఇద్దరూ కలిసి వాళ్ల ప్రయోగశాలకు వెళ్లి వైరస్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచారు.

"నేను సోఫియాకు తిరిగొచ్చేవరకు వైరస్ కణాలు బతికి ఉంటాయో లేదో తెలీదు. ఈ ప్రయాణం వాటికి కొంత షాక్ కలిగించింది. అందుకే వాటిని ఇంక్యుబేటర్‌లో ఉంచాం. మర్నాడు వచ్చి చూసేసరికి కణాలు సజీవంగా ఉన్నాయి. నాకు ఉత్సాహం వచ్చింది. వాటిపై పరిశోధన ప్రారంభించాం" అని ఆమె అర్గిరోవా. 

వైరస్ కణాలు కొత్త దేశంలోని ప్రయోగశాలలో ఊపిరి పోసుకుంటుండగా, అర్గిరోవా ఈ ప్రాణాంతక వైరస్‌ను దేశంలోకి తీసుకువచ్చారన్న వార్త గుప్పుమంది. తన తోటి పరిశోధకులు కూడా భయపడ్డారు.

"వార్తాపత్రికలలో పలు కథనాలు వచ్చాయి. చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు భయపడ్డారు. ఆశ్చర్యకరంగా కొందరు అసూయపడ్డారు" అని ఆమె చెప్పారు.

అప్పుడే ముప్పు ముంచుకొచ్చింది.

హెచ్ఐవీ/ఎయిడ్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఆమెపై విచారణ

బల్గేరియా ప్రభుత్వ అధికారులు అర్గిరోవాను ప్రశ్నించారు. దేశంలోకి వైరస్ ఎలా తీసుకొచ్చారంటూ నెలల తరబడి విచారణ జరిపారు.

"హోం శాఖ నుంచి అధికారులు రోజూ నన్ను ప్రశ్నించేవారు. గాలో నాకెందుకు ఆ వైరస్ ఇచ్చారు?, ఆయన ఉద్దేశాలేమిటి? అంటూ నిలదీసేవారు. ప్రతి రోజూ వాళ్లకు బదులు చెప్పలేక అలిసిపోయాను" అని అర్గిరోవా చెప్పారు. 

మొదట్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ, కమ్యూనిస్ట్ యంత్రాంగంలో కొందరు సన్నిహితులను కూడగట్టుకోగలిగారామె. మెల్లగా ఆమెకు మద్దతు పెరుగుతూ వచ్చింది. 

చివరికి, ఆమెకు వైరస్‌పై పరిశోధన జరిపేందుకు అనుమతి లభించింది.

1986లో బల్గేరియా దేశవ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. 20 లక్షల మంది బల్గేరియా వాసులకు హెచ్ఐవీ టెస్టులు జరిపారు.

రేడియో, టీవీ, వార్తాపత్రికలలో ఎయిడ్స్ సమాచారాన్ని నిరంతరంగా అందించారని మూడేళ్ల తరువాత వచ్చిన ఒక డాక్యుమెంటరీలో తెలిపారు. 

ఎట్టకేలకు, బల్గేరియాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ గురించి ప్రజలకు సమాచారం అందింది. డాక్టర్ అర్గిరోవా, ఆమె సహ పరిశోధకులు దీనిపై పరిశోధనలు కొనసాగించారు. ఈ వైరస్ ఎవరెవరి సోకుతోంది, ఎలా సంక్రమిస్తోంది అనే విషయాలపై దృష్టిపెట్టారు.

నాలుగేళ్ల తరువాత, డాక్టర్ రాడ్కా అర్గిరోవాకు హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై, నివారణ చర్యలపై బల్గేరియా ప్రజలకు అవగాహన కలిగించే బాధ్యతను అప్పగించారు.

ప్రస్తుతం డాక్టర్ రాడ్కా అర్గిరోవా బల్గేరియాలోని అతిపెద్ద ప్రయివేట్ ఆస్పత్రిలో వైరాలజిస్ట్‌గా ఉన్నారు. ఆ దేశంలో గుర్తింపు పొందిన కోవిడ్ 19 నిపుణులలో ఆమె ఒకరు.

ఇవి కూడా చదవండి: