రాజస్థాన్‌లో ముస్లిం యువకుల కిడ్నాప్, హరియాణాలో అన్నదమ్ములను కారుతో పాటు తగులబెట్టారు... అసలేం జరిగింది?

హరియాణాలో హత్యలు

ఫొటో సోర్స్, ANI

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఘత్మిక అనే గ్రామం ఉంది. హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులో ఆ గ్రామం ఉంది.

ఈ గ్రామానికి చెందిన ఇద్దరు ముస్లిం యువకులను అపహరించారు. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో హరియాణాలోని భివానీ జిల్లాలో వారిని కారుతో సహా వారిని దహనం చేశారు.

బజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అపహరించి సజీవ దహనం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరియాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే తొలుత మృతదేహాలను ఖననం చేసేందుకు బంధువులు నిరాకరించారు.

కేసు తీవ్రత దృష్ట్యా భరత్‌పూర్ రేంజ్ ఐజీ, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల చర్చల అనంతరం మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు.

నాసిర్

ఫొటో సోర్స్, BBC/MOHARSINGHMEENA

ఫొటో క్యాప్షన్, నాసిర్

అసలేం జరిగింది?

ఫిబ్రవరి 15న భరత్‌పూర్ జిల్లా నగర్ తహసీల్‌లోని ఘత్మిక గ్రామానికి చెందిన ఇస్మాయిల్ తన ఇద్దరు సోదరులు కనిపించడం లేదంటూ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గోపాల్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లో.. "ఫిబ్రవరి 15న ఉదయం 5 గంటల ప్రాంతంలో జునైద్, నాసిర్ వ్యక్తిగత పని నిమిత్తం తమ హరియాణా నంబర్ వాహనంలో బయటకు వెళ్లారు. ఉదయం 9 గంటలకు ఒక దుకాణంలో ఇద్దరు యువకులను ఎనిమిది నుంచి పది మంది వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ కారులో తీసుకెళ్లారు" అని ఉంది.

ఇస్మాయిల్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. "నేను కాల్ చేసినప్పుడు, సోదరులిద్దరి మొబైల్‌లు ఆఫ్‌లో ఉన్నాయి. మేం వెతకడం ప్రారంభించాం. కొంతమంది ఇక్కడ ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు. ఇద్దరినీ కొట్టి, తీసుకెళ్లిన వ్యక్తులు భజరంగ్ దళ్‌కు చెందినవారని చెప్పారు. వారి పేర్లను కూడా మాకు వెల్లడించారు" అని వివరించారు.

జునైద్

ఫొటో సోర్స్, BBC/MOHARSINGHMEENA

ఫొటో క్యాప్షన్, జునైద్

అయితే ఫిబ్రవరి 16న భరత్‌పూర్‌లోని గోపాల్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌కు 250 కిలోమీటర్ల దూరంలో హరియాణాలో పోలీసులు కాలిపోయిన వాహనం, దానిలో మృతదేహాలను గుర్తించారు.

"భివానీ జిల్లాలోని ఒక గ్రామ శివార్లలో కాలిపోయిన వాహనం కనుగొన్నారు. వాహనంలో రెండు మృతదేహాలు కూడా కనిపించాయి. పోలీసులు మృతదేహాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు" అని హరియాణాలోని బీబీసీ ప్రతినిధి సత్ సింగ్ చెప్పారు.

పోలీసు అధికారులు బీబీసీతో మాట్లాడుతూ "ఉదయం స్థానిక ప్రజలు మేల్కొన్నప్పుడు గ్రామం వెలుపల కారు కాలిపోయిన స్థితిలో కనిపించింది.గ్రామస్తులు గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు'' అని తెలిపారు.

పోలీసులు ఏమంటున్నారు?

కేసుపై లోహారు డీఎస్పీ జగత్ సింగ్ మోర్ మాట్లాడుతూ "సీఐఏ, ఎఫ్‌ఎస్‌ఎల్, సైబర్, సాంకేతిక బృందాల సహాయంతో ప్రతి అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాం. సంఘటనా స్థలానికి వచ్చే అన్ని మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. తద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చు'' అని చెప్పారు.

ఆవుల అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతోనే యువకులిద్దరినీ కిడ్నాప్ చేసి సజీవ దహనం చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎఫ్‌ఐఆర్‌లో ఆవుల స్మగ్లింగ్ ప్రస్తావన లేదు.

హరియాణాలో హత్యలు

ఫొటో సోర్స్, ANI

గోపాల్‌గఢ్ పోలీస్టేషన్ ఇన్‌చార్జి, కేసు దర్యాప్తు అధికారి రామ్ నరేష్ బీబీసీతో మాట్లాడుతూ "చనిపోయిన వారి వద్ద పశువులు లేవు. ఎఫ్‌ఐఆర్‌లో ఆవుల స్మగ్లింగ్ ప్రస్తావన లేదు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు కారణం బయటకు వస్తుంది'' అని స్పష్టంచేశారు.

"మరణించిన వారిద్దరూ పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘత్మిక గ్రామానికి చెందినవారు. వాళ్లిద్దరూ హత్యకు గురవటానికి ముందు తమ బంధువుల వద్దకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు" అని రామ్ నరేష్ అన్నారు.

కాగా, మృతుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ విషయంపై స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ రామ్‌ నరేష్‌ స్పందిస్తూ.. ''అతను మా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే వ్యక్తి కాదు, విచారణ ఇంకా కొనసాగుతోంది'' అని బదులిచ్చారు.

ఘత్మిక గ్రామ హిల్ పోలీస్టేషన్ ఇన్‌ఛార్జ్ శివ్ లాహిరి బీబీసీతో మాట్లాడుతూ "వారిపై ఇక్కడ ఎటువంటి కేసు నమోదు కాలేదు" అని స్పష్టంచేశారు.

రాజస్థాన్‌లోని ఘాత్మిక గ్రామంలో హతుల కుటుంబాలు.. మృతదేహాలను ఖననం చేయటానికి నిరాకరించాయి

ఫొటో సోర్స్, BBC/MOHARSINGHMEENA

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లోని ఘాత్మిక గ్రామంలో హతుల కుటుంబాలు.. మృతదేహాలను ఖననం చేయటానికి నిరాకరించాయి

జునైద్‌కు ఆరుగురు పిల్లలు

ఇస్మాయిల్‌ బీబీసీతో మాట్లాడుతూ "జునైద్ వయసు 35 సంవత్సరాలు, నాసిర్ వయసు 30 ఏళ్లు. జునైద్‌కు ఆరుగురు పిల్లలు, నాసిర్‌కు ఇంకా పిల్లలు లేరు. జునైద్‌, నాసిర్‌లు పొలం పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద ట్రక్కులు కూడా నడిపేవారు. పోలీసులు మృతదేహాలను తీసుకువచ్చి పోస్ట్‌మార్టం తర్వాత అప్పగించారు. ఎటువంటి హామీ లేకుండా మృతదేహాన్ని ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు" అని తెలిపారు.

అయితే స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామ్ నరేష్ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడుతూ "మృతదేహాలను ఖననం చేయడానికి అంగీకరించారు. సొసైటీ పంచాయతీలో తీర్మానం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జాహిదా ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 15 లక్షల పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. జాహిదా ఖాన్ తరఫున మరో రూ. 5 లక్షలు కూడా ఇస్తామని ప్రకటించారు. దీంతోశుక్రవారం ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాలను ఖననం చేయాలని నిర్ణయించారు" అని వివరించారు.

మృతులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలపై బీబీసీతో ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ''ఇరువురు బొలెరో కారులో ఉన్నారు. వారి వద్ద ఏమీ దొరకలేదు. ఏదైనా ఉంటే పోలీసులకు దొరికి ఉండేది. అవన్నీ అవాస్తవం. వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు'' అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ప‌ట్ట‌ప‌గ‌లే యువ‌తిని కాల్చి చంపిన దుండ‌గులు

నిందితుల వాదనేంటి?

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం 'అనిల్, శ్రీ కాంత్, రింకు సైనీ, లోకేష్ సింగ్లా, మోనులపై ఐపీసీ సెక్షన్లు 143, 365 (కిడ్నాప్), 367 (కిడ్నాప్ చేసి గాయపర్చడం), సెక్షన్ 368 సహా వివిధ సెక్షన్లు నమోదు చేశారు.

కిడ్నాప్‌ ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. అయితే వాహనంలో కాలిపోయిన స్థితిలో మృతదేహాలు లభించడంతో ఇప్పుడు సెక్షన్లు మార్చే అవకాశం ఉంది.

రాజస్థాన్‌లో నమోదు చేసిన ఫిర్యాదులో నిందితులందరూ భజరంగ్ దళ్‌తో సంబంధం కలిగి ఉన్నారని మృతుడి బంధువు ఇస్మాయిల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై భజరంగ్ దళ్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన ఏ నాయకుడూ అందుబాటులోకి రాలేదు.

అయితే ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేరు నమోదైన మోను మనేసర్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తన వాదనను వినిపించారు. తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న మోను మనేసర్ హరియాణాలో గోరక్షా ప్రాంతీయ ప్రముఖ్‌గా, బజరంగ్ దళ్ నేతగా చెప్తున్నారు

ఫొటో సోర్స్, BBCHINDI

ఫొటో క్యాప్షన్, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మోను మనేసర్ హరియాణాలో గోరక్షా ప్రాంతీయ ప్రముఖ్‌గా, బజరంగ్ దళ్ నేతగా చెప్తున్నారు

ఎవరీ మోను మనేసర్?

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుడు మోను హర్యానాలోని మనేసర్ నివాసి. ఆయనను సోషల్ మీడియాలో మోను మనేసర్ పేరుతో పిలుస్తారు. సోషల్ మీడియాలో తనకు తాను బజరంగ్ దళ్‌తో అనుబంధం కలిగి ఉన్నట్లు చెప్పుకుంటారు.

ఈ ఘటనలో మోను పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు తనపై, తన బృందంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

అంతేకాదు మోను సోషల్ మీడియాలో హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ ఒక సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు.

‘‘గోపాల్‌గఢ్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో సంఘటన జరిగిన సమయంలో నేను, నా సహచరులు 14వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో బస చేశాం. ఈ ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కోడలికి ఘనంగా రెండో పెళ్లి చేసిన అత్త

ఆయన విడుదల చేసిన వీడియోలో "మాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. భజరంగ్ దళ్ టీమ్ ఏదీ అక్కడ లేదు. నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఆ సంఘటన చాలా దురదృష్టకరం’’ అన్నారు.

‘‘ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టకూడదు. ఈ విషయంలో నాకు, నా టీమ్‌కు సంబంధం లేదు. పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, అందులో ఏవేవో పేర్లు పెట్టారు. అవి పూర్తిగా నిరాధారమైనవి" అని పేర్కొన్నారు.దీనిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని తెలిపారు.

''ఘత్మిక నివాసితులైన ఇద్దరు వ్యక్తులను హరియాణాలో హత్య చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజస్థాన్, హరియాణా పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం'' అని చెప్పారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)