డబ్బు ఎప్పుడు పుట్టింది... డాలర్ ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది?

పాత నాణేలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిసీలియా బారియా
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

డబ్బు చరిత్ర అద్భుతంగా అనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా మారకంగా పని చేస్తోంది. అంతేకాదు, కూడబెట్టుకున్న సంపద ప్రధాన రూపం కూడా డబ్బే అయింది.

డబ్బు అనేది లెక్కించటానికి ఉపయోగించే ఒక గణాంకం కూడా. అంటే.. ధరలను నిర్ణయించటానికి, అప్పుల పద్దులు రాసుకోవటానికి ఉపయోగపడే వ్యవస్థ.

డబ్బు అనే దానికి నిర్వచనం గురించి చాలా వాదనలున్నాయి. ఈ డబ్బు ఎలా పుట్టిందనే దాని మీద కూడా చాలా వివావాదాలున్నాయి.

మనుషులు అనాదిగా వస్తుమార్పిడి చేసుకున్నారు. తొలి వ్యాపార వ్యవస్థలు మొదలయ్యాక అకస్మాత్తుగా డబ్బు ప్రధాన మారకంగా మారిపోయింది. ఇదెలా జరిగిందంటే.. చరిత్రకారులు, పురాశాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు.. ఎవరికి వారే తమవైన సిద్ధాంతాలు చెప్తారు.

వేలాది సంవత్సరాల కిందట తిండి గింజలతో మొదలుపెట్టి.. మట్టి వస్తువులు, నత్త గుల్లలు, కోకో బీన్స్‌, వెండి పలుకులు వంటి అనేక రకాల వస్తువులను నేటి డబ్బులాగా మారకానికి ఉపయోగించారు. ఆ క్రమంలో ప్రాచీన ఇరాక్‌లో నాటి రాజులు అధికారికంగా లోహపు నాణేలను ముద్రించారు.

కాలక్రమంలో ప్రాంతాల మధ్య, దేశాల మధ్య వ్యాపారం, లావాదేవీలు పెరుగుతూ పోయాయి. ఈ లావాదేవీల్లో చేతులు మారే నాణేల పరిమాణం కూడా పెరిగింది. ఆ నాణేలు చాలా బరువుగా ఉండటంతో వాటిని మోసుకెళ్లటం తలకు మించిన భారంగా మారింది. అప్పుడు.. కాగితంతో చేసిన బ్యాంక్‌నోట్లు తొలిసారిగా చైనాలో ఆవిర్భవించాయి.

ఆపైన.. ఇటీవల అంటే ఓ 70 ఏళ్ల కిందట.. ఓ హోటల్‌లో రాత్రి పొద్దుపోయే వరకూ జరిగిన రహస్య రాజకీయ సంప్రదింపుల్లో.. డాలర్ అని పిలిచే ఒక పచ్చనోటుకు ప్రపంచ మారక హోదాను కట్టబెట్టారు. దాంతో ప్రపంచంలో డాలర్ అనేది అత్యంత శక్తివంతమైన కరెన్సీగా మారింది.

డబ్బు పుట్టుక, పరిణామం గురించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

రాతిపై చెక్కిన చిత్రాలు, శరాకార లిపిలో రాత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుమేరియన్లు శరాకారలిపి రాతలో తమ నాగరికతకు సబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు

సుమేరియన్ల లావాదేవీలు

మనం ఇప్పుడు లావాదేవీలు జరుపుకోవటానికి ఉపయోగిస్తున్న రూపంలోని డబ్బు మూలాలు.. 5,000 సంవత్సరాల కిందట మెసపటోమియా (నేటి ఇరాక్)లో కనిపిస్తాయని కొందరు నిపుణులు చెప్తారు. మెసపటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్లు వెండి పలుకులను, బార్లీ గింజలను డబ్బు తరహాలో మారకానికి ఉపయోగించేవారు.

ఆ ఉత్పత్తులకు ఒకవైపు వాటికంటూ ఒక విలువ ఉంటుంది. అలాగే ఇతర వస్తువుల విలువను లెక్కగట్టే కొలతగా కూడా ఉపయోగపడ్డాయి. ఒక బానిస విలువ ఎంత, ఒక పని విలువ ఎంత, ఒక అప్పు మీద వడ్డీ విలువ ఎంత అనే వాటిని.. వెంటి పలుకులు, బార్లీ గింజల బరువుతో లెక్కించేవారు. వీటితో చెల్లింపులు జరిపేవారు.

కొందరు శ్రామికులకు నిర్దిష్ట మొత్తంలో బీరు కానీ సామాన్లు కానీ వంటి వస్తువులతో చెల్లింపులు జరిపేవారని బ్రిటిష్ మ్యూజియంలోని మిడిల్ ఈస్ట్ డిపార్ట్‌మెంట్‌ క్యురేటర్ జాన్ టేలర్ చెప్తున్నారు.

అలాగే ముడి సరకులకు కూడా ఒక దానితో మరొక దానిని పోల్చినపుడు ఒక విలువ ఉండటం సాధారణమైన విషయం. ఉదాహరణకు.. ఉన్నికి, ఖర్జూరపండ్లకు.. వెంటి పలుకుల్లో సమానమైన విలువ ఉండి ఉండొచ్చు.

అలాగే ''దూరప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులు ఒక విధమైన అరువు ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక చోట కొన్ని వనరులను ఇచ్చి, మరొక చోట మరోరకమైన వనరులను పుచ్చుకునేవారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వనరులను బదిలీ చేసుకునేవారు'' అని టేలర్ వివరించారు.

అయితే ఈ లావాదేవీలను డబ్బు (మనీ) అని కానీ చలామణి (కరెన్సీ) అని కానీ అనొచ్చా అనే అంశంపై వాదోపవాదాలున్నాయి.

మెసపటోమియాలోని ఉర్ నగర రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెసపటోమియాలోని ఉర్ చాలా ముఖ్యమైన నగర రాజ్యాల్లో ఒకటి

అప్పులు, వడ్డీలు...

ఈ భావనలను మనం ఎలా నిర్వచిస్తామనే దాని మీదే ఇదంతా ఆధారపడి ఉంటుంది.

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఆంత్రోపాలజీ విభాగంలో ఉర్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు విలియం బి. హాఫర్డ్. మెసపటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్ నగర రాజ్యాల్లో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి ఉర్. ఆ ఉర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు జరిగిన తవ్వకాలను ఆయన పర్యవేక్షించారు.

''విలువను లెక్కగట్టేది మనీ (డబ్బు)'' అయితే, ఆ ''డబ్బుకు ప్రామాణిక భౌతిక రూపం కరెన్సీ (నాణెం, నోటు వంటి చలామణి)'' అని హాఫర్డ్ పేర్కొన్నారు.

ఈ కోణంలో చూసినపుడు.. మెసపటోమియా నగరికతలో బార్లీ, వెండి అనేవి చలామణి రూపాలు. ఇప్పటివరకూ మనకు తెలిసిన అత్యంత పురాతనమైన భౌతిక డబ్బులు అవే.

ఆ రకంగా డబ్బు మూలాలు.. ప్రాచీన మెసపటోమియాలోని జమ, అప్పు లావాదేవీల్లో ఉన్నాయని హాఫర్డ్ చెప్తారు.

వీడియో క్యాప్షన్, పాత నోట్లు, నాణేలకు లక్షలు ఇస్తామనే ప్రచారంలో నిజమెంత?

ఆ లావాదేవీల్లో.. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదైనా వస్తువు తీసుకుంటారు. దానికి బదులుగా భవిష్యత్తులో మరేదైనా వస్తువును ఇస్తానని హామీ ఇస్తారు. ఈ విధంగా అరువు అనే భావన లేదా విధానం మొదలైంది.

''చిన్నపాటి సమాజాల్లో మొదలైన ఈ మార్పిడి రూపం.. ఆ తర్వాత పెద్ద సమాజాల్లో పెరిగింది. కాలక్రమంలో.. రాయటం కనుగొన్న తర్వాత.. ఆ అరువును లెక్కించటం ఆరంభమైంది'' అని హాఫర్డ్ వివరిస్తున్నారు.

ప్రాచీన మెసపటోమియాలో అరువు, అప్పు పట్టికలు చాలా బయటపడ్డాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఉదాహరణకు.. హమ్మురాబి నియమావళిలో.. వెండి మీద 20 శాతం, ధాన్యం మీద 33 శాతం వడ్డీగా చెప్తోంది.

వెండి తునకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెండి తునకలు, బార్లీ గింజలను వాణిజ్య లావాదేవీల్లో నగదుగా ఉపయోగించేవారు

వెండి బరువు

మెసపటోమియా చరిత్రలో చాలా వస్తువుల విలువను లెక్కించటానికి వెండిని ప్రమాణంగా ఉపయోగించటం ఎక్కువగా కనిపిస్తుంది.

''ఇళ్లలోని నేల మాళిగల్లో పాతిపెట్టిన వెండి ఖజానాలు మనకు తరచుగా కనిపిస్తుంటాయి. ఇందులో పాత కూజాల నుంచి కానీ పాత పూసల నుంచి కానీ కత్తిరించిన వెండి తునకలు, పోతపోసిన వెండి కడ్డీలు, మెలితిరిగిన వెండి రింగులు ఉంటాయి'' అని హాఫర్డ్ వివరించారు.

మెలితిరిగిన రింగుల రూపంలో వెండిని రవాణా చేయటం చాలా సులభంగా ఉండేది. జుట్టుకు కట్టుకుని కూడా వెంట తీసుకెళ్లేవారు. అలాగే బరువు సరిపోవటం కోసం కానీ, కొన్ని చెల్లింపుల కోసం కానీ మెలితిరిగిన రింగులో కొంత భాగాన్ని విరిచి ఉపయోగించుకోవచ్చు కూడా.

అప్పటి మార్పిడి ధర.. ఒక గుర్ (సుమారు 300 లీటర్లతో సమానం) ధాన్యానికి 1 షెకెల్ వెండి (8.4 గ్రాములు)గా ఉండేది. ధాన్యాన్ని దంచి పిండి చేసుకోవచ్చు. ఆ పిండి ఆహారంలో నిత్యావసర ఉత్పత్తిగా ఉండేది.

అనటోలియాలోని లిడియన్ నాణెం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో మొట్టమొదట అధికారికంగా ముద్రించిన నాణెం అనటోలియాలోని లిడియన్ నాణెం

తొలి నాణేలు

ఒక ప్రభుత్వం అధికారికంగా నాణేలు ముద్రించటం మొదటిసారిగా 640 బీసీలో అనటోలియాలో కనిపిస్తుంది. ఆ ప్రాంతమే ఇప్పటి తుర్కియే. లిడియా పాలకుడు కింగ్ అలియాటెస్ రాజముద్రతో తొలి నాణేలు ముద్రితమయ్యాయి.

లిడియా రాజ్యానికి చెందిన ఈ నాణేన్ని.. బంగారం, వెండి మిశ్రమంతో తయారు చేసేవారు. ఈ లోహ మిశ్రమాన్ని ఎలక్ట్రమ్ అంటారు. చైనా, ఇండియా, ఈజిప్టు, పర్షియా, గ్రీకు, రోమన్ నాగరికతల్లో కనిపించే తొలి నాణేలకన్నా పురాతనమైన నాణేలు లిడియా నాణేలు.

ఈ నాణేలు చాలా మన్నికగ ఉండేవి. తేలికగా రవాణా చేయవచ్చు. ఇలాంటి సౌలభ్యాలతో పాటు.. వాటికంటూ ఒక విలువ కూడా ఉంటుంది. దీంతో నాణేల ముద్రణ అనతికాలంలోనే విజయవంతమైంది.

ఈ నాణేలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడటంతో పాటు విలువైనవిగా మారాయి. దీంతో రాజకీయ నియంత్రణలో నాణేలు ఒక పనిముట్టుగా మారాయి.

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఏథెన్స్ నాణెం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన ఏథెన్స్ నాణెం

పన్నుల వసూళ్లకు వీలుకల్పించాయి. ఉన్నత వర్గాల సంపద పోగవటానికి సాయపడ్డాయి. సైన్యాలకు ఖర్చు చేయటానికి తోడ్పడ్డాయి. వ్యాపారం దేశదేశాల సరిహద్దులు దాటి విస్తరించటానికి దోహదపడ్డాయి.

నాణేలతో పాటు ఇతర రూపాల్లోని డబ్బు వినియోగం కూడా కొనసాగింది. నిజానికి సాలరీ (వేతనం) అనే ఆంగ్ల పదం 'సాలారియం' అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. లాటిన్‌లో సాలారియం అంటే ఉప్పు అని అర్థం.

రోమన్ సామ్రాజ్య కాలంలో సైనికులకు, ప్రభుత్వ సిబ్బందికి జీతాలుగా ఉప్పు చెల్లించేవారు. అప్పుడు ఉప్పు చాలా విలువైన పదార్థం. అనేక ఇతరత్రా అవసరాలతో పాటు ఆహారాన్ని నిల్వ చేయటానికి ఉప్పును ఉపయోగించేవారు.

ప్రాచీన నాణేల్లో కొన్ని చాలా అరుదుగా చాలా అందంగా ఉంటాయి. తవ్వకాల్లో బయల్పడే నాణేలు ఆ కాలపు నాగరికతల గురించి పరిశోధకులకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి.

అటువంటి నాణేల్లో సుమారు 450 బీసీలో ఏథెన్స్ నగరంలో ముద్రించిన టెట్రాడ్రాక్మా వెండి నాణేలు. ఈ నాణేల మీద ఏథెన్స్ దేవత అయిన గుడ్లగూబ ముద్ర ఉంటుంది.

సాంగ్ సామ్రాజ్యంలో ముద్రించిన చైనీస్ నాణేలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాంగ్ సామ్రాజ్యంలో ముద్రించిన చైనీస్ నాణేలు

కాగితపు నాణేలు

చైనాలో చాలా కాలం వరకూ రాగి నాణేలు, కంచు నాణేలను ప్రాధమిక నగదుగా ఉపయోగించారు. ఆ నాణేల మధ్యలో చిల్లు ఉంటుంది. ఆ చిల్లులు ఉండటం వల్ల.. నాణేలను దండగా గుచ్చి కట్టటానికి, గొలుసులా వేలాడదీయటానికి వీలుంటుంది.

అయితే ప్రయాణాలు, వ్యాపారాలు విస్తరించటంతో.. ఆ లావాదేవీల కోసం నాణేల అవసరం కూడా పెరిగిపోయింది.

ఒక సమయంలో రాగి లోహానికి కొరత తలెత్తింది. అంతకంటే ముఖ్యంగా.. కరెన్సీ మీద నియంత్రణ ఉండటం అవసరమని పాలకులు గుర్తించారు.

తమ విలువైన నాణేలు విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండాలనే ఆలోచనతో వారు ఒక నిబంధన తీసుకొచ్చారు. ఇనుముతో చేసిన నాణేలను మాత్రమే ఉపయోగించాలన్నది ఆ నిబంధన.

అయితే ఈ ఇనుప నాణేలు చాలా బరువుగా ఉండేవి. భారీ లావాదేవీలు జరిగినపుడు.. ఆ చెల్లింపుల కోసం ఉద్దేశించిన ఇనుప నాణేల బరువులను గాడిదలు మోయలేకపోయేవి. ఆ బరువుల బండ్లను లాగటానికి ఎడ్లు మొరాయించేవి.

జియోజి

ఫొటో సోర్స్, Creative commons

ఫొటో క్యాప్షన్, చైనీస్ జియోజిని ప్రపంచంలో అత్యంత పురాతనమైన బ్యాంక్‌నోటుగా పరిగణిస్తారు

మీరు ఒక పిడికెడు వెండి ఇస్తే.. దానికి బదులుగా నిలువెత్తు సంచిలో ఇనుప నాణేలు చెల్లిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

అలాంటి పరిస్థితుల్లో భారీ మొత్తంలో ఇనుప నాణేలకు బదులుగా కాగితంతో చేసిన 'ఆర్థిక పనిముట్టు'ను ముందుగా వ్యాపారులు ఉపయోగించి ఉంటారు.

సుమారు క్రీస్తు శకం 1,000 సంవత్సర కాలంలో.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో సాంగ్ వంశ పాలనలో రాచరిక ప్రభుత్వం అధికారికంగా ప్రపంచంలో తొలి కాగితపు డబ్బు జారీ చేసింది. మల్బరీ చుట్టు బెరడుతో తయారు చేసిన ఆ డబ్బును జియోజి అని పిలుస్తారు.

అప్పటి నుంచీ వ్యాపారులు తమ సొంతంగా కాగితపు ధృవపత్రాలను ఉపయోగించటం ఆపేశారు. ఆ వ్యవస్థను పాలకులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. జియోజిని అధికారిక నోటుగా మార్చారు.

అదే తరహాలో అమెరికాలో 1792లో డాలర్ అనే కాగితపు నోటు ఒక డిక్రీ ద్వారా ఆ దేశపు అధికారిక కరెన్సీగా చలామణిలోకి వచ్చింది.

1944 లో బ్రెటన్ ఉడ్స్ పట్టణంలో గల మౌంట్ వాషింగ్టన్ హోటల్‌‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ (మధ్యలోని వ్యక్తి)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1944 లో బ్రెటన్ ఉడ్స్ పట్టణంలోని మౌంట్ వాషింగ్టన్ హోటల్‌‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ (మధ్యలోని వ్యక్తి)

డాలర్‌ ఆధిపత్యం

రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరుకున్న దశలో.. మిత్ర రాజ్యాల ప్రభుత్వాలు తమ ముందు ఒక సమస్య ఉన్నట్లు గుర్తించాయి: యుద్ధంలో దెబ్బతిన్న తమ ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం మొదలైనపుడు అంతర్జాతీయ వాణిజ్యం ఏ కరెన్సీలో జరగాలి అనేది ఆ సమస్య.

అప్పుడు.. 1944 జూలై నెలలో 44 దేశాల ప్రతినిధులు 22 రోజుల పాటు సమావేశమయ్యారు. అమెరికాలోని బ్రెటన్ ఉడ్స్ అనే పట్టణంలో గల మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో ఆ సుదీర్ఘ భేటీ జరిగింది. యుద్ధానంతర వాణిజ్యం, ద్రవ్యవిధానం భవిష్యత్తుపై వారి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది.

ఆ భేటీలో పాల్గొన్న యూరప్ దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయి.

మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో పగటిపూట, హోటల్ లోని బార్‌లో రాత్రి పూట ఈ ప్రతినిధుల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణలు జరిగాయని ఎడ్ కాన్వే రచించిన 'ద సమ్మిట్' పుస్తకంలో రాశారు.

డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు వ్యక్తుల మధ్య చావో రేవో అన్నట్టుగా మేధో ద్వంద్వ యుద్ధం జరిగింది. బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ (ప్రపంచం మొత్తానికి 'బాంకర్' అనే ఉమ్మడి కరెన్సీని సృష్టించాలన్నది కీన్స్ కాల్పినక ఆలోచన), అమెరికా ఆర్థిక శాఖకు చెందిన హారీ డెక్స్‌టర్ వైట్‌ల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటంలో చివరికి హారీ గెలిచారు.

సదస్సు ముగిసేసరికి.. అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్‌ను కరెన్సీగా నిర్ణయించారు. ఆ సమావేశంలోనే.. యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వటానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌, ప్రపంచ బ్యాంక్‌ అనే రెండు సంస్థలను ఏర్పాటు చేశారు.

దాదాపు ఏడు దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందిన అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికీ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)