పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వందలాది గాడిదలను ఇరాన్ ఎందుకు చంపేస్తోంది?

గాడిదలు

ఫొటో సోర్స్, TWITTER/ICHRI

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌తో సరిహద్దుల్లోని ప్రాంతాల్లో ఇరాన్ భద్రతా దళాల సిబ్బంది వందల సంఖ్యలో గాడిదలను హతమారుస్తున్నారు.

సరిహద్దు ప్రాంతమైన సీస్తాన్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని కాలీగాన్‌లలో ఈ గాడిదలను హతమార్చినట్లు స్థానికులు తెలిపారు.

రోడ్డుపై భారీగా గాడిదల మృతదేహాలు కనిపిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

గాడిదలు

ఫొటో సోర్స్, Getty Images

చమురు అక్రమ రవాణా...

కాలీగాన్ ప్రాంతంలో చమురు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గాడిదలను ఇలా భారీగా హత్యచేస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ వీడియోను ఫిబ్రవరి 14న రికార్డు చేసినట్లు స్థానిక వర్గాలు ధ్రువీకరించాయి.

సీస్తాన్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని సరావాన్ జిల్లాలో పర్వత ప్రాంతమైన కాలీగాన్‌ ఉంటుంది.

గతంలోనూ చమురు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇక్కడ సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పెద్దయెత్తున గాడిదలను హతమార్చారు.

సీస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో దాదాపు 1100 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. నిరుద్యోగం ఎక్కువగా ఉండటంతో చమురు అక్రమ రవాణాకు కేంద్రంగా ఈ ప్రాంతం మారుతోంది.

గాడిదలు

ఫొటో సోర్స్, Getty Images

వందల కొద్దీ మృతదేహాలు...

కాలీగాన్‌లో ప్రస్తుతం వందల కొద్దీ గాడిదల మృతదేహాలు పడివున్నట్లు స్థానికులు బీబీసీకి వెళ్లిడించారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న దృశ్యాలు, ఫోటోలు ఇక్కడ తీసినవేనని వారు ధ్రువీకరించారు.

చమురును సరిహద్దులను దాటించేందుకు ఈ గాడిదలను ఉపయోగిస్తుంటారు.

సరిహద్దులు దాటిన వెంటనే అక్కడ గాడిదలను వదిలిపెట్టేస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ వీటిని చమురు అక్రమ రవాణా కోసం నేరస్థుల ముఠాలు తీసుకెళ్తుంటాయి.

అయితే, ఇలా చమురు అక్రమ రవాణాకు ఉపయోగించకుండా ఉండేందుకు వీటిని భద్రతా దళాలు హతమారుస్తుంటాయి.

వీడియో క్యాప్షన్, ఆ సింహానికి ఇయర్ డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు?

గాడిదలను ఇలా హతమార్చడంపై జంతువుల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వందల కొద్దీ గాడిదల మృతదేహాలు కనిపిస్తున్న దృశ్యాలను ఆ సంస్థలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

కొన్ని గాడిదలను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు తీసుకొస్తుంటారు. స్థానిక వ్యాపారుల ఒక్కొక్కరి దగ్గర పది నుంచి 20 వరకు గాడిదలు ఉంటాయి. వీటిపైనే ఆధారపడి వారు జీవనం సాగిస్తుంటారు.

ఈ గాడిదలను అద్దెకు కూడా ఇస్తుంటారు. నేరస్థుల ముఠాలు కూడా కొన్నిసార్లు వీరి దగ్గర నుంచి చమురు అక్రమ రవాణాకు గాడిదలను తీసుకెళ్తుంటాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో కనిపించే వీటిని భద్రదా దళాలు ఎప్పటికప్పుడే హతమారుస్తున్నట్లు వార్తలు వస్తుంటాయి.

సీస్తాన్, బలూచిస్తాన్‌తోపాటు కుర్దిస్తాన్‌లోనూ భారీగా వీటిని హతమారుస్తున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే, వీటిని తామే హత్య చేశామని నేరుగా ఎవరూ ప్రకటించుకోరు.

వీడియో క్యాప్షన్, ఈ బుజ్జి మేకను ఎంత ధరకైనా కొంటామని ముందుకొస్తున్నారు. ఎందుకంత క్రేజ్?

జంతువుల పరిరక్షణే లేదు

జంతువుల పరిరక్షణకు ఎలాంటి చట్టాలు, న్యాయపరమైన వ్యవస్థలులేని దేశాల్లో ఇరాన్ కూడా ఒకటని లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్స్ ప్రొటెక్షన్ తెలిపింది.

జంతువుల సంరక్షణ, దాడుల నుంచి రక్షణ కోసం సంస్థ కృషి చేస్తోంది. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో జంతువులను హతమార్చడాన్ని 2015లో కొన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సభ్య దేశాలు కూడా ఖండించాయి.

భద్రతా దళాల చర్యలను ఇరాన్ పార్లమెంటులోని సోషల్ కమిషన్ సభ్యుడు షాకూపుర్ హుస్సేన్ షక్లాన్ కూడా ఖండించారు.

‘‘జంతువులను చంపే బదులు, వాటి యజమానులను చట్ట ప్రకారం అరెస్టు చేయాలి’’అని హుస్సేన్ డిమాండ్ చేశారు. అయితే, కుర్దిస్తాన్ స్టేట్ సరిహద్దు దళం కమాండర్ మాత్రం ఇలాంటి డిమాండ్లను తోసిపుచ్చుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)