కేరళ: ఈ ‘కిల్లర్’ ఏనుగును జనం ప్రేమిస్తారు, భయపడతారు.. దీని కోసం ఆలయాలు పోటీ పడతాయి

ఫొటో సోర్స్, DR GIRIDAS PB
- రచయిత, ఇమ్రాన్ ఖురేసీ
- హోదా, బీబీసీ కోసం
ఆ ఏనుగు కోసం కొన్ని ఆలయాలు పోటీపడ్డాయి. చివరకు ఓ ఆలయం అత్యధిక ధర చెల్లించి తాము నిర్వహించే వార్షిక ఉత్సవంలో ఆ 57 ఏళ్ల ఏనుగు పాల్గొనేలా ఒప్పందం కుదుర్చుకుంది.
తెచిక్కొట్టుకావు రామచంద్రన్.. భారతదేశంలోని పెంపుడు ఏనుగుల్లో అత్యంత పొడవైనదిగా చెబుతుంటారు. ఇది నిజమేనా కాదా అనేది నిర్ధరించుకోవడం కష్టమే. అయితే 10.53 అడుగుల ఎత్తుతో గంభీరంగా కదిలే దీని పక్కన ఇతర ఏనుగులన్నీ చిన్నగానే కనిపిస్తుంటాయి.
అందుకే అత్యంత ఎత్తయిన పెంపుడు ఏనుగు ఇదే అనడంలో ఎలాంటి అనుమానం లేదంటారు దీన్ని చూసినవారు.
కేరళలోని త్రిసూర్ జిల్లా తెచిక్కొట్టుకావు ఆలయ ట్రస్ట్ దీనికి యజమాని. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల కోసం దీన్ని చాలాకాలం కిందట ట్రస్ట్ లీజుకు తీసుకుంది.
రామచంద్రన్‌కు వేలాది మంది అభిమానులున్నారు. ఫేస్‌బుక్‌లో ఒక ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. ఈ పేజ్‌లో రామచంద్రన్ ఫొటోలు రెగ్యులర్‌గా పెడుతుంటారు. ఈ పేజ్‌కు 1,22,000 మంది ఫాలోవర్లున్నారు.
అంతేకాదు.. ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలలో రామచంద్రన్ పాల్గొన్నప్పుడు వేలాది మంది దాని చుట్టూ చేరుతారు. ఫొటోలు దిగుతారు.
అయితే, రామచంద్రన్ గత నాలుగు దశాబ్దాలలో 13 మందికి పైగా చంపేసిందని, మరో రెండు ఏనుగులూ రామచంద్రన్ దాడిలో హతమయ్యాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
తెచిక్కొట్టుకావు ఆలయ నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ మరణాలకు రామచంద్రన్ ప్రత్యక్షంగా కారణం కాదని, ఉత్సవాల సమయంలో బిగ్గరగా వచ్చే శబ్దాలు, ఇతర కారణాల వల్ల రామచంద్రన్‌కు కోపం వచ్చినప్పుడు జనం భయపడి పారిపోయిన సందర్భాలలో తొక్కిసలాటలు జరిగి చనిపోయారని చెప్పారు.
రామచంద్రన్ ఎడమ కంటికి చూపులేదు. బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనేలా రామచంద్రన్‌పై ఒత్తిడి పెంచరాదని జంతువుల హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
'పొడవుగా, అందంగా ఉండే రామచంద్రన్‌ను దగ్గరగా చూస్తే పరమాద్భుతంగా ఉంటుంది. కానీ, దాని గంభీరమైన రూపమే దానికి శాపం' అని 'పీపుల్ ఫర్ ఆర్గనైజేషన్' సంక్షేమ సంస్థకు చెందిన శ్రీదేవి ఎస్ కార్త అన్నారు.
రామచంద్రన్ కోసం గత వారం 35 ఆలయ కమిటీలు పోటీపడ్డాయి. ఆలయాలలో నిర్వహించే ఉత్సవాలకు రామచంద్రన్‌ను తీసుకెళ్లేందుకు వేలం నిర్వహించారు. త్రిసూర్‌లోని విశ్వనాథ ఆలయం అత్యధికంగా రూ. 6,75,000 చెల్లించి వేలం గెలిచింది.
'రామచంద్రన్ ఉంటే ఆలయానికి ఎక్కువ మంది వస్తారు. అందుకే రామచంద్రన్‌కు అంత డిమాండ్' అన్నారు తెచిక్కొట్టుకావు ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ పీబీ బినోయ్. కోవిడ్ కారణంగా చాలాకాలం నిలిచిపోయిన తరువాత ఇప్పుడు మళ్లీ ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో ప్రజల్లో ఉత్సాహం పెరిగిందన్నారు బినోయ్.

ఫొటో సోర్స్, DR GIRIDAS PB
2019లో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయ ఉత్సవాలలో రామచంద్రన్ పాల్గొనగా దానికి సమీపంలో ఎవరో బాణసంచా కాల్చడంతో అది కోపం పరుగులు తీసింది. దాంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఆ తరువాత ప్రఖ్యాత త్రిసూర్ పూరమ్ ఆలయంలో నిర్వహించే ఉత్సవంలో రామచంద్రన్ పాల్గొనకుండా అధికారులు నిషేధం విధించారు. ఉత్సవాల సందర్భంగా ఏనుగుతో ఆలయ ప్రధాన గేట్లను తెరిపించడం ఆనవాయితీ. ఆ పని రామచంద్రన్ చేయాల్సి ఉంది. అయితే, నిషేధం విధించడంతో రామచంద్రన్ అభిమానులు, ఏనుగుల యజమానులు నిరసన తెలిపారు. రామచంద్రన్‌పై నిషేధం ఎత్తివేయకపోతే వేరే ఏ ఏనుగును కూడా ఆలయాలకు పంపించబోమని యజమానులు చెప్పారు. దీంతో అధికారులు నిషేధం ఎత్తివేశారు.
మరోవైపు రామచంద్రన్ ఆరోగ్యంపైనా తరచూ వార్తలొస్తుంటాయి. రామచంద్రన్ ఆరోగ్యాన్ని పరిశీలించి నిర్ణయం వెలువరించే వరకు రామచంద్రన్ ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనరాదంటూ 2022 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఆదేశించింది. అందుకోసం ఓ కమిటీని వేసింది.
'కోర్టు వేసిన కమిటీ నెలకు రెండు కంటే ఎక్కువ కార్యక్రమాలలో రామచంద్రన్ పాల్గొనరాదని చెప్పింది. అయితే, ప్రభుత్వం మాత్రం వారానికి రెండు కార్యక్రమాలలో పాల్గొనవచ్చంటూ ఉత్తర్వులిచ్చింది' అని యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఎంఎన్ జయచంద్రన్ చెప్పారు.
రామచంద్రన్ చుట్టూ నలుగురు మావటీలు నిత్యం ఉండాలని, ఈ ఏనుగుకు సమీపంలోకి ప్రజలు రాకుండా చూడాలని కోర్టు ఆదేశించింది.
రామచంద్రన్ రెండో కన్ను కూడా సరిగ్గా కనిపించడం లేదని, వయసు పెరగడం వల్ల అది ఇబ్బందిపడుతోందని జయచంద్రన్ చెప్పారు.
అయితే, ఈ ఏనుగు వ్యవహారాలు చూసేవాళ్లు మాత్రం దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలేదంటున్నారు.
'రామచంద్రన్ రెండో కంటికి ఎలాంటి సమస్య లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏనుగులకు రిటైర్మెంట్ వయసు 65. రామచంద్రన్ వయసు ఇంకా 57 మాత్రమే' అన్నారు రామచంద్రన్ ఆరోగ్య బాధ్యతలు చూసే వెటర్నరీ డాక్టర్, కేరళ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యుడు పీబీ గిరిదాస్.
రామచంద్రన్ ఎవరికీ హాని కలిగించలేదని కూడా గిరిదాస్ అంటున్నారు. ప్రజలు పెద్దపెద్ద శబ్దాలు చేసినప్పుడు, దాని పక్కనే బాణసంచా కాల్చినప్పుడు దానికి ఇబ్బంది కలుగుతుంది అన్నారాయన.
రామచంద్రన్ సంపాదించే ఆదాయంలో ఎక్కువ భాగం దాని ఆహారం, దాని సంరక్షుల జీతాల కోసం వెచ్చిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
'కోవిడ్ కారణంగా ఆలయాలలో ఉత్సవాలు లేని కాలంలో కూడా గత మూడేళ్లలో రామచంద్రన్ ఆరోగ్యంపై సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేశాం' అని ఆలయ నిర్వాహకులు చెప్పారు.
అయితే, మరికొందరు మాత్రం ఆ ఏనుగు హక్కులను వీరంతా కాలరాస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















