అరుంధతి నక్షత్ర దర్శనం: పెళ్లిలో ఈ సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?

ఫొటో సోర్స్, MAHESH/SARANY
- రచయిత, ఎ.డి.బాలసుబ్రమణియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందువుల పెళ్లిలో ‘అరుంధతి నక్షత్రాన్ని’ చూపించడమనేది ఒక ప్రధాన సంప్రదాయంగా వస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది.
తాళికట్టిన తరువాత పెళ్లి కూతురికి ఆకాశంలోని అరుంధతి నక్షత్రాన్నిపెళ్లి కొడుకు చూపిస్తాడు.
నేడు వివాహాలు పగటి పూట జరుగుతున్నప్పటికీ అరుంధతి దర్శనం అనే సంప్రదాయం కొనసాగుతోంది.
16వ శతాబ్దం నాటి తమిళ కవి తాండవరాయ స్వామి తన ‘కైవల్య నవనీతం’ అనే పుస్తకంలో ఇలాంటి దాని గురించే రాశారు.
భౌతిక, ఊహాజనిత వస్తువుల దర్శనానికి సంబంధించిన వాక్యాలు అందులో కనిపిస్తాయి.
‘దగ్గరగా ఉండే చెట్లను చూపించి... ఆ తరువాత వాటి వెనకున్న నెలవంకను చూపినట్లే ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని ముందు చూపించి వాటిలో అరుంధతిని చూపిస్తారు’ అని ఆయన రాశారు.
అరుంధతి నక్షత్ర దర్శనం అనేది పెళ్లికి సంబంధించినదేనా? అలా అయితే ఆ రోజుల్లో రాత్రి పూట మాత్రమే వివాహాలు జరిగేవా? తాండవరాయ పుస్తకంలో పెళ్లి ప్రస్తావన లేదు కాబట్టి...అరుంధతి నక్షత్ర దర్శనానికి, పెళ్లికి సంబంధం లేదా?
అయితే ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ‘అరుంధతి నక్షత్ర దర్శనం’ వెనుక సైన్స్ ఉందని చెబుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి.
‘ఆకాశంలోని జంట నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటే. రెండోది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ అరుంధతి వశిష్ట జంట నక్షత్రాల్లో మాత్రమే ఆదర్శ దంపతుల మాదరిగా రెండు ఒకదాని చుట్టూ మరొక తిరుగుతూ ఉంటాయి.
వేల సంవత్సరాల కిందట ఆకాశంలోని ఆ ప్రత్యేకమైన నక్షత్రాలను చూసి ఒక సంప్రదాయాన్ని రూపొందించారంటే నమ్మశక్యంగా లేదు కదా!’ అని ఒక వీడియోలో ఒక అమ్మాయి చెబుతూ ఉంది.
ఆ అమ్మాయి చెప్పిన వీడియోలోని అంశాలు ఎంత వరకు నిజమో కనుగొనేందుకు ప్రయత్నించాం.
కేంద్ర సైన్స్, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్యర్యంలో నడిచే ‘విజ్ఞాన్ ప్రసార్’లో సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు టి.వి.వెంకటేశ్వరన్. ఆయన ఆ వీడియోలోని అంశాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అందుకు మూడు కారణాలు చెప్పారు.

ఫొటో సోర్స్, TV VENKATESWARAN
ఒకటి:
భూమికి 81.7 కాంతి సంవత్సరాల దూరంలో అల్కర్ నక్షత్రం ఉంది. ఈ అల్కర్‌నే అరుంధతి నక్షత్రం అంటున్నారు. ఇక వశిష్టునిగా పిలిచే మిజార్ నక్షత్రం 82.9 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
వాస్తవానికి ఆ రెండు జంట నక్షత్రాలు కాదు. ఒకే దిశలో రెండూ ఉండటం వల్ల ఆప్టికల్ ఇల్యూజన్‌తో అవి జంటగా ఉన్నట్లు భ్రమపడతారు. నిజానికి గెలాక్సీలలోని అలాంటి నక్షత్రాలను ఖగోళశాస్త్ర భాషలో ‘డాజ్‌లింగ్ స్టార్స్’ అంటారు.
రెండు:
అరుంధతి నక్షత్రంగా పిలిచే అల్కర్ స్టార్‌కు అల్కర్-బి అనే జంట నక్షత్రం ఉంది. అంటే అల్కర్, అల్కర్-బి అనేవి జంట నక్షత్రాలు.
మూడు:
జంట నక్షత్రాల్లో రెండు నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. అయితే అవి ఒకదాని చుట్టూ మరొకటి తిరగవు. రెండు నక్షత్రాల మధ్య ఉంటే ‘సెంటర్ ఆఫ్ మాస్’ అంటే ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి.
మనం సాధారణంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెబుతాం. కానీ వాస్తవానికి సూర్యుడు, భూమి మధ్య ఉన్న ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ భూమి తిరుగుతోంది. సూర్యుడు కూడా ద్రవ్యరాశి కేంద్రం చుట్టూనే తిరుగుతుంటాడు.
ఈ కథనం ఉద్దేశం హిందూ సంప్రదాయాలను తప్పుపట్టడం కాదు.
సంప్రదాయాలకు సైన్స్ ఆధారమని చెప్పడం వల్ల శాస్త్రీయపరమైన వాస్తవాలు పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది. తద్వారా ఏది సైన్స్, ఏది నమ్మకం అనే గందరగోళ స్థితి ఏర్పడొచ్చు.
ఇవి కూడా చూడండి:
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
- అజయ్ పాల్ సింగ్ బంగా: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' విద్యార్ధి నుంచి ప్రపంచ బ్యాంకు వరకు...
- హైదరాబాద్: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడానికి అధికార యంత్రాంగం వైఫల్యమే కారణమా?
- తెలంగాణ ‘పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు.. చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితుడి మృతి’ - ఖదీర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాక ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














