హైదరాబాద్: కుక్కల దాడిలో బాలుడు చనిపోవడానికి అధికార యంత్రాంగం వైఫల్యమే కారణమా?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన కలకలం రేపుతోంది.
బాలుడిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొట్టన పెట్టుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటనపై మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు.
ఈ ఘటన తర్వాత హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.
అంబర్‌పేట ఘటన తర్వాత నెటిజన్లు తమ కాలనీల్లో ఉన్న వీధి కుక్కల సమస్యను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీనిపై స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
అంబర్‌పేట ఘటన మరవకముందే హైదరాబాద్‌లోని కొత్తపేట మారుతినగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న రిషి అనే బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
2022 ఏప్రిల్లో గోల్కొండ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు విడిచాడు.
2022 మే నెలలోనే కుల్సుంపురా వద్ద మూసీ నది పక్కన ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
అంబర్‌పేటలో జరిగిన ఘటనపై చనిపోయిన బాలుడి మేనమామ శ్రీకాంత్ బీబీసీతో మాట్లాడారు.
‘‘మా బావ గంగాధర్ కుటుంబం నాలుగైదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చింది. బాగ్ అంబర్‌పేటలోని ఎరుకుల బస్తీలో ఉంటోంది. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలోని కార్ల సర్వీస్ సెంటర్లో సెక్యురిటీ గార్డుగా ఆయన పనిచేస్తున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలను తీసుకుని వెళ్లాడు. తనతోపాటు కార్ల సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం అదే మొదటిసారి. సెక్యురిటీ క్యాబిన్ వద్ద పాప ఆడుకుంటోంది. బాబు ప్రదీప్ మాత్రం వాళ్ల నాన్నతో కలిసి సర్వీస్ సెంటర్ లోపలికి వెళ్లాడు. సర్వీస్ సెంటర్ లోపల నుంచి అక్క దగ్గరికి వెళ్దామని ప్రదీప్ వస్తున్నాడు. ఒక్కసారిగా మూడు కుక్కలు వచ్చి దాడి చేశాయి. బాబు మెడ వద్ద బాగా కొరికాయి. బాగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడని వైద్యులు చెప్పారు.’’ అని శ్రీకాంత్ వివరించారు.
ఈ విషయంలో తామేమి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పోలీసులు వచ్చే వివరాలు సేకరించి వెళ్లారని శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జీహెచ్ఎంసీ ఏం చేయాలి? ఏం చేస్తోంది?
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది.
అంబర్‌పేట ఘటన జరిగిన తర్వాత ఛే నంబరు నుంచి క్యాచింగ్ టీములు వెళ్లి 33 కుక్కలను పట్టుకొచ్చాయని మేయర్ గద్వాల విజయలక్ష్మి మీడియాకు చెప్పారు.
‘‘అక్కడ(ఛే నంబరు చౌరస్తా సర్వీస్ సెంటర్) పనిచేసే కొందరు సిబ్బంది, యానిమల్ వాలంటీర్లు రోజూ కుక్కలకు ఆహారం పెడుతున్నారు. ఓ మహిళ మాంసం కూడా పెడుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో ఆహారం లేదు. ఆహారం లేక బాలుడిపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చు.’’ అని విజయలక్ష్మి చెప్పారు.
విజయలక్ష్మి మాటలను సోషల్ మీడియాలో యూజర్లు తప్పుబడుతున్నారు. ఆహారం దొరకకపోతే కుక్కలు మనుషుల మీద దాడి చేసి పీక్కు తినే పరిస్థితులు ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టెరిలైజేషన్ ఎలా ఉంది?
2001లో యానిమల్ బర్త్ కంట్రోల్ – యాంటీ ర్యాబిస్(ఏబీసీ-ఏఆర్) పేరిట యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా వివిధ నిబంధనలు జారీ చేసింది.
కుక్కల సంఖ్యను నియంత్రణలో ఉంచాలంటే వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేయాలి.
ఈ ఆపరేషన్ చేసే సమయంలోనే యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.
ఆపరేషన్ అయిన ఐదు రోజుల వరకు జంతు సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
ఐదు రోజుల తర్వాత ఏ ప్రాంతం నుంచి తీసుకువచ్చారో.. అదే కాలనీ లేదా ప్రాంతంలో విడిచిపెట్టాలి.
2020-21 సంవత్సరంలో 50,091, 2021-22లో 73,601, 2022-23లో 40,155లో కుక్కలను స్టెరిలైజ్ చేసినట్లు మేయర్ విజయలక్ష్మి చెప్పారు.
స్టెరిలైజేషన్ చేసేందుకు మూడు ప్రభుత్వేతర సంస్థలకు అవకాశం ఇచ్చినట్లు హైదరాబాద్ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
కుక్కల సంఖ్య నియంత్రణ అంశంపై పీపుల్స్ ఫర్ యానిమల్స్ హైదరాబాద్ షెల్టర్ ఇన్‌ఛార్జి శివనారాయణ బీబీసీతో మాట్లాడారు.
‘‘మేం జంతువుల సంరక్షణతోపాటు మనుషుల క్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం. జీహెచ్ఎంసీతో కలిసి మా సంస్థ తరఫున యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) చేస్తున్నాం. వేసవి సమయంలో వీధి కుక్కలకు తిండి, నీరు దొరక్క ఇళ్లల్లోకి వెళుతుంటాయి. అందుకే వాటర్ బౌల్ ప్రాజెక్టును తీసుకువచ్చాం’’ అని ఆయన చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
హైదరాబాద్లో కుక్కల బెడద తప్పించేందుకు గత ఐదేళ్లలో ఎంత ఖర్చు చేశారని 2022 నవంబరులో యూత్ ఫర్ యాంటీ కరెప్షన్ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్ జీహెచ్ఎంసీకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
హైదరాబాద్లోని నాలుగు మున్సిపల్ జోన్లలో కలిపి 16.03 కోట్ల రూపాయలు కుక్కల స్టెరిలైజేషన్, సంరక్షణ, ఇతరత్రా కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు జీహెచ్ఎంసీ పశు సంవర్థక శాఖ విభాగం సమాధానం ఇచ్చింది.
ఈ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నా, వీధి కుక్కల సమస్య తీరడం లేదని పల్నాటి రాజేందర్ బీబీసీతో అన్నారు.
ఇదే విషయమై శంషాబాద్ కు చెందిన జంతు ప్రేమికురాలు సల్మా బీబీసీతో మాట్లాడారు.
‘‘వీధి కుక్కల విషయంలో ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. రోజూ ఆహారం, నీరు అందించాలి.
ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పశు సంవర్థక శాఖ సంయుక్తంగా పనిచేయాలి. వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా షెల్టర్స్ హోమ్స్ నిర్మించాలి. వీటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్ ఇవ్వాలి.
నగరంలో ఉన్న అన్ని కుక్కలను స్టెరిలైజ్ చేయాలి. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలి. నేను మా కాలనీలో 50 నుంచి 100 కుక్కలకు ఫీడ్ చేస్తుంటాను. ఈ కుక్కలకు ఆహారం, నీరు అందించే బాధ్యత ప్రభుత్వమో.. మున్సిపాలిటీనో తీసుకోకపోవడంతో మాలాంటి వాళ్లు సొంత డబ్బులు పెట్టుకుని చేస్తున్నాం’’ అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఏం చెప్పింది?
కేరళలో వీధి కుక్కల విషయంలో దాఖలైన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు 2016లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిరి జగన్ నేతృత్వంలో ప్యానెల్‌ను నియమించింది.
కుక్కకాటు బాధితుల నుంచి ఫిర్యాదులు, పరిహారం తదితర సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది.
ఆ వెంటనే వీధి కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిరిజగన్ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. అవేంటంటే-
- దేశంలో అన్ని ఆసుపత్రులలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు ఉంచాలి.
- జంతువులు కాటు వేసినప్పడు ఇవ్వాల్సిన చికిత్సపై మెడికల్ ఆఫీసర్లకు, నర్సులకు శిక్షణ ఇవ్వాలి.
- వ్యర్థాల నిర్వహణ సరిగా చేయాలి.
- వీధి కుక్కలను నియంత్రించాలి. పెంపుడు జంతువులకు లైసెన్సులు తీసుకోవాలి.
- అన్నింటికి కచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించాలి.
- 2016 మార్చిలో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దిల్లీ, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలని స్పష్టం చేసింది.
- ఈ ప్రక్రియ ఏడేళ్లయినా పూర్తి కాలేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తెలంగాణలో ఏటా 80 వేల కేసులు’
2022లో కేంద్ర పశు సంవర్థక, డెయిరీ, మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం- 2019 నుంచి జులై 2022 మధ్య దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది కుక్క కాటు బారిన పడ్డారు.
ఇందులో అత్యధికంగా 2019లోనే 72.22 లక్షల మంది బాధితులున్నారు. ఈ సంఖ్య 2020లో 46.33 లక్షలుగా ఉంది. 2021లో 17 లక్షల మంది, 2022 జులై నాటికే 14.5లక్షల మంది ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2021లో తెలంగాణలో 24,124 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 1,69,238 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత దేశంలో కుక్క కాటుతో సంభవించే మరణాలు సంవత్సరానికి 20 వేలకు పైనే ఉన్నాయని ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మి బీబీసీతో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ర్యాబిస్ మరణాలు భారత్‌లోనే అత్యధికంగా 36% నమోదవుతున్నాయని తెలిపారు.
తెలంగాణలోనే సంవత్సరానికి 80 వేలకు పైన కుక్క కాట్లు నమోదవుతున్నాయని ఆమె చెప్పారు.
2019 నాటి లెక్కల ప్రకారం ప్రకారం దేశంలో 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని 2022లో పార్లమెంటుకు ఇచ్చిన ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
కుక్క కాటుకు పరిహారం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ
2020లో అజయ్ సింగ్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో కుక్క కాటు బాధితులకు రూ.2 లక్షల పరిహారం సుప్రీంకోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
ఇందులో లక్ష రూపాయలు ప్రభుత్వం, మరో లక్ష స్థానిక సంస్థల నుంచి చెల్లించాలని పేర్కొంది.
అంతకుముందు 2016లో సుప్రీంకోర్టు నియమించిన ప్యానల్ తరఫున ఫిర్యాదులు స్వీకరిస్తోంది. వాటిని కమిటీ పరిశీలన తర్వాత కేరళ సర్కారు కుక్కకాటు బాధితులకు పరిహారం అందించడం ప్రారంభించింది.
కుక్క కాటు బాధితులకు కేరళలో స్థానిక సంస్థల నుంచి పరిహారం చెల్లిస్తున్నారు.
కుక్క కాటు బాధితులు దరఖాస్తు చేసుకుంటే.. మెడికల్ రిపోర్టులు, సివిక్ బాడీ పరిధి వంటివి పరిశీలించి స్థానిక సంస్థల నుంచి పరిహారం ఇస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుక్క కరిస్తే ఏం చేయాలి?
కుక్కకాటు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి వివరించారు.
“కుక్క కరిచిన వెంటనే ఆ ప్రదేశాన్ని నీటితో, సబ్బుతో, బాగా కడగాలి. పట్టీ కట్టకుండా గాలికి వదిలేయాలి. వీలయినంత తొందరగా ఆసుపత్రికి వెళ్ళాలి. కుక్క కాటు వల్ల కేవలం ర్యాబిస్ కాక ఇతర ఇన్ఫెక్షన్లు కూడా కలగవచ్చనే విషయం మరచి పోవద్దు. టీ.టీ ఇంజెక్షన్ తీసుకోవడం, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటిబయాటిక్స్ వాడడం, పుండు మానడానికి అవసరమైన చికిత్స తీసుకోవడం కూడా ముఖ్యం” అని ఆమె చెప్పారు.
కుక్క కరిచిందని పత్యం పేరుతో, బలమైన ఆహారం ఏమీ పెట్టకుండా, కారం అన్నం మాత్రమే పెట్టే మూఢాచారాలు మంచిది కాదని డాక్టర్ ప్రతిభాలక్ష్మి హెచ్చరించారు.
ర్యాబిస్ వ్యాధి విషయంలో ఆమె మరికొన్ని సూచనలు చేశారు... ప్రధానంగా అవేంటంటే...
- కుక్కకి ర్యాబిస్ ఇన్ఫెక్షన్ ఉంటే, అది మనకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
- ర్యాబిస్ వస్తే మరణం తప్పదు. అందుకే, ఏ మాత్రం అనుమానం ఉన్నా, వాక్సిన్ తీసుకోవడం మేలు.
- ర్యాబిస్ లక్షణాలు తొలి దశలో సాధారణమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం, తిమ్మిర్లు పట్టడం వంటి వాటితో మొదలవుతాయి.
- కండరాల నొప్పులు, అయోమయం, ఆందోళన, భ్రమలు, నీటిని చూస్తే భయపడడం వంటివి కలిగి కొన్ని వారాలల్లో చనిపోయే అవకాశం ఉంది.
- కుక్క ఏ శరీర భాగాన్ని కరించింది అనే దాన్ని బట్టి లక్షణాలు తెలియడానికి రోజుల నుండి వారాల వరకు పట్టొచ్చు.
- (తలకు దగ్గర అయితే త్వరగా, దూరం అయితే ఆలస్యం).
- ఒక సారి లక్షణాలు కనిపించిన తరవాత వాక్సిన్ తీసుకున్నా పనిచేయదు.
- ఒక వేళ తీవ్రమైన గాయాలైతే, కుక్క కరిచిన చోట ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ వైద్యులు చేస్తారు.
- మామూలు గాయాలకు కుక్క కరిచిన 0, 3, 7, 14, 28 రోజులలో 5 డోసులు ఇస్తారు.
- కుక్క కాటు వల్ల కేవలం ర్యాబిస్ కాక ఇతర ఇన్ఫెక్షన్లు కలిగే వీలుంది.
- టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటిబయాటిక్స్ వాడడం, పుండు మానడానికి అవసరమైన చికిత్స తీసుకోవడమూ ముఖ్యమేనని గుర్తుంచుకోవాలి.. అని డాక్టర్ ప్రతిభాలక్ష్మి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?















