రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?

ఫొటో సోర్స్, @D_Roopa_IPS/K Venkatesh
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ హిందీ, బెంగళూరు
కర్ణాటకలో ఇద్దరు మహిళా అధికారుల మధ్య సోషల్ మీడియా ఫైట్ రాజకీయ నాయకత్వాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది.
ఒక ఐపీఎస్ అధికారిణి, ఓ ఐఏఎస్ అధికారిణిపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడమే కాకుండా ఆమె వృత్తిపరమైన విధానాన్ని కూడా ప్రశ్నించారు.
సదరు మహిళా ఐపీఎస్ అధికారిణి ఐఏఎస్ అధికారిణిపై ఆరోపణలు చేయడంతోపాటు, ఆమె వ్యక్తిగత ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా బహిరంగపరిచారు. ముగ్గురు లేదా నలుగురు పురుష అధికారులకు ఐఏఎస్ ఆఫీసర్ ఫొటోలను షేర్ చేశారంటూ ఐపీఎస్ ఆఫీసర్ ఆరోపణలు చేశారు.
ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ ఇంతకు ముందు కూడా ఇలాంటి కొన్ని ఆరోపణలు చేయడంతో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (జైళ్ల)గా ఉన్న అధికారి ఒకరు గతంలో తన పదవికి రాజీనామా చేశారు.
తాజాగా ఆమె ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేస్తున్నారు. 2015లో మాండ్య జిల్లా పరిషత్‌కు పనిచేస్తున్న సమయంలో ఏడాదిలోనే లక్ష మరుగుదొడ్లు నిర్మించడంతో, ఆమెకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవార్డును కూడా అందించారు.
రోహిణి సింధూరి చెప్పిన ఆ లక్ష మరుగుదొడ్ల నిర్మాణం తప్పుడు లెక్కలని ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఆరోపిస్తున్నారు.
ఈ ఇద్దరు మహిళా అధికారుల వివాదాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రూపా మౌద్గిల్‌ను, కర్ణాటక దేవాదాయ శాఖ, చారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రోహిణి సింధూరిని ఎలాంటి పోస్టింగ్ లేకుండా బదిలీ చేసింది.

ఫొటో సోర్స్, K VENKATESH
తనపై ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలపై స్పందించిన ఐఏఎస్ అధికారిణి సింధూరి.... దీనికి సరైన వేదికపైనే సమాధానమిస్తానని మీడియాతో అన్నారు. మౌద్గిల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు.
‘‘మానసిక అనారోగ్యమనేది చాలా పెద్ద సమస్య. దీనికి మందులు, కౌన్సిలింగ్ ద్వారానే చికిత్స చేయగలం’’ అని బీబీసీ హిందీకి పంపిన లేఖలో సింధూరి చెప్పారు.
ఈ విషయంపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా స్పందించారు. ‘‘ఈ అధికారులు వారి మధ్యనున్న వ్యక్తిగత గొడవలను ఇలా ప్రజల ముందుకు తీసుకు రాకూడదు. ఇది కర్ణాటక మొత్తం అధికార యంత్రాంగాన్ని కించపరుస్తుంది. నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడాను. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’’ అని తెలిపారు.
ఇదే సమయంలో, రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఉన్న 19 ఆరోపణలను ఒక లేఖ రూపంలో మౌద్గిల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సిబ్బంది, పరిపాలన సంస్కరణల విభాగ కార్యదర్శికి పంపారు.
మరోవైపు, రూపా మౌద్గిల్ తమ ఫోన్లను హ్యాక్ చేసి, తన భార్య ఫొటోలను అసభ్యకరంగా వాడుతున్నారంటూ రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘‘ఈ ఆరోపణలన్ని చేసేందుకు రూపా ఎవరసలు? సింధూరినే ఈ ఫొటోలను పంపిందని ఆమె చెబుతున్నారు. కానీ, ఎవరికి పంపారు? ఈ ఫొటోలను పొందినట్లు చెబుతున్న ఆ ముగ్గురు అధికారులు ఎవరసలు?’’ అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.
అయితే, ఈ వివాదంపై స్పందించేందుకు సీనియర్ అధికారులు ఇష్టపడటం లేదు. ముగ్గురు సీనియర్ అధికారులను బీబీసీ హిందీ సంప్రదించింది.
‘‘ఈ వివాదం వెనుకాల ఉన్న కారణం మాకు తెలుసు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతమే. దానిపై మేం మాట్లాడలేం’’ అని ఆ అధికారులన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సూచన మేరకు ప్రధాన కార్యదర్శి వందితా శర్మ ఈ మహిళా అధికారులకు నియమ, నిబంధనల గురించి వివరించారు.
బహిరంగంగా ఈ తరహా ఆరోపణలు చేసుకోవడం ఆల్ ఇండియా సర్వీసు రూల్స్‌కి వ్యతిరేకమని వారికి చెప్పారు.

ఫొటో సోర్స్, @D_ROOPA_IPS
రూపా మౌద్గిల్ చేసిన ఆరోపణలేమిటి?
రోహిణీ సింధూరిపై మౌద్గిల్ చేసిన 19 ఆరోపణల్లో కొన్ని ఆమె వ్యక్తిగతమైనవి కాగా, మరికొన్ని వృత్తిపరమైనవి. వీటిలో చాలా ఆరోపణలు కొత్తవి కావు.
అయితే, తాజా ఆరోపణల్లో ముగ్గురు, నలుగురు ఐఏఎస్ అధికారులకు రోహిణి సింధూరి కొన్ని అసభ్యకరమైన ఫొటోలు పంపారని మౌద్గిల్ అంటున్నారు.
‘‘లోకాయుక్త నోటీసులకు రోహిణి సింధూరి స్పందించలేదు. కానీ కొందరు ఐఏఎస్ అధికారులకు మాత్రం ఈ ఫొటోలను పంపారు’’ అని మౌద్గిల్ బీబీసీ హిందీతో అన్నారు.
దీనిపై రాతపూర్వకంగా ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సింధూరి, తనపై వచ్చిన ఈ ఆరోపణలన్ని నిరాధారమైనవని, వీటిపై చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్టు పేర్కొన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి ఆత్మహత్యకు ముందు సింధూరితో చాట్స్ చేశారన్నది కూడా మౌద్గిల్ ఆరోపణల్లో ఒకటి.
ఒకవేళ డీకే రవి ఆయన పరిధిని దాటి ఆమెతో సోషల్ మీడియాలో చాట్స్ చేసినప్పుడు, సింధూరి ఎందుకు బ్లాక్ చేయలేదని మౌద్గిల్ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ప్రశ్నించారు.
కరోనా సమయంలో మైసూర్ నుంచి చామరాజనగర్ జనరల్ హాస్పిటల్‌కి ఆక్సిజన్ సరఫరా వ్యవహారంపై కూడా మౌద్గిల్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో సింధూరి మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు.
ఆక్సిజన్ సరఫరా లోపించడంతో ఆస్పత్రిలో 24 మంది మృతి చెందారు.

ఫొటో సోర్స్, K VENKATESH
అధికారుల మధ్య ఈ వివాదం ఎక్కడ ప్రారంభమైంది?
జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. మహేశ్‌ను సింధూరి రెస్టారెంట్‌లో కలిసిన సమయంలో తీసిన ఫొటోలు వెలుగులోకి రావడంతో ఈ వివాదం రాజుకుంది. ఆ సమయంలో వారితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అక్కడ ఉన్నారు.
అయితే, సింధూరికి, మహేశ్‌కి మధ్య అంతకుముందు తీవ్ర వివాదం నడిచింది. మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆమె తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించారని సింధూరిపై మహేశ్ ఆరోపణలు చేశారు.
మరోవైపు మహేశ్ భూకబ్జాకు పాల్పడ్డారంటూ సింధూరి కూడా విమర్శలు చేయడం కొన్నేళ్ల కిందట సంచలనంగా మారింది.
అయితే, ఈ వీరిద్దరూ ఒక రెస్టారెంట్ కూర్చుని కనిపించిన ఫొటోలు చర్చనీయాంశంగా మారాయి. వీరితో మరో ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఫొటోలో కనిపించారు.
ఇది రాజీ సమావేశం కాదు కదా? అంటూ మౌద్గిల్ ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.
ఇది అధికారిక సమావేశమైతే పక్కన ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకున్నారు అని ఆమె ప్రశ్నించారు.
మాండ్యా, హసన్ జిల్లాల్లో సింధూరి అధికారిగా పని చేసిన సమయంలో సింధూరి అక్రమాలకు పాల్పడ్డారని మౌద్గిల్ ఆరోపించారు.
లక్కీ అలీ తండ్రి కమెడియన్ మహమూద్ అలీ భూమి వివాదంలో సింధూరి పై మౌద్గిల్ పలు విమర్శలు చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండానే ఈ భూమిలో సింధూరి భర్త సుధీర్ రెడ్డి సర్వే చేశారని, ఈ విషయంలో భర్త రియల్ ఎస్టేట్ కంపెనీకి సింధూరి సాయం చేశారని ఆరోపించారు.
ఈ ఆరోపణల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన మౌద్గిల్, ఫొటోలను షేర్ చేయడం వ్యక్తిగతం కాదని ఇవి రుజువు చేస్తున్నాయని అన్నారు.

ఫొటో సోర్స్, BANGALORE NEWS PHOTOS
రోహిణి సింధూరి ఏమంటున్నారు?
తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన రోహిణి సింధూరి, ‘‘రూపా నాకు వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా బదనాం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె చేసిన ప్రతి పోస్టు ఇదే విధంగా ఉంది. ఆమె ఎప్పుడూ మీడియా అట్రాక్షన్ కోరుకుంటోంది. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే అర్థమవుతుంది. ఆమె ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. వృత్తిపరమైన పనుల కంటే ఇలాంటి విషయాలనే ఎక్కువ ఇష్టపడుతుంది’’ అని అన్నారు.
ఇవి ఫొటోలు కావని, స్క్రీన్‌షాట్లని మౌద్గిల్ షేర్ చేసిన ఫొటోలను ఉద్దేశిస్తూ సింధూరి చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తీసుకుని, తనని తప్పుడుగా చిత్రీకరించేందుకు చూస్తున్నారని అన్నారు.
ఈ ఫొటోలను తానెక్కడ తీసుకున్నానో మౌద్గిల్ చెప్పగలదా? అని ప్రశ్నించారు. తాను ఎవరికి ఈ ఫొటోలను పంపానో చెప్తే, అప్పుడు ఆమె బండారం బయట పడుతుందన్నారు.
రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి కూడా రిపోర్టర్లతో మాట్లాడారు. ‘‘అసలు రూపా ఎవరు? ఆమె సింధూరికి సీనియర్ అధికారిణా లేక ఆమెనే ప్రభుత్వమా? ఆమె కూడా ఒక అధికారిణి. ఇక్కడ వందలాది మంది అధికారులున్నారు. ఆమెకి కావాల్సిందేంటి? ఆమె వ్యక్తిగత అజెండా ఏంటి? ఇది మాకు ముందు తెలియాలి. ఆమెకి సింధూరితో ఏ మాత్రం సంబంధం లేదు. సింధూరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె సమస్యేమిటి? ఇది కేవలం అసూయతో చేస్తున్నట్లు ఉంది. ఆమెలో ఏదో లోపం ఉంది. ఇది మానసిక ఆరోగ్య సమస్య కావొచ్చు’’ అని సుధీర్ రెడ్డి అన్నారు.
మౌద్గిల్‌కు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చని, సింధూరికి సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదని, ఆమెకు పబ్లిసిటీ ఇష్టముండదనీ సుధీర్ రెడ్డి అన్నారు.
‘‘సింధూరి ఈ ఫోటోలను ఐఏఎస్ అధికారులకు పంపినట్లు చెబుతున్నారు. అసలు ఈ ఫొటోలను ఎవరికి పంపారో చెప్పాలి’’ అని సుధీర్ రెడ్డి అన్నారు.
ఐపీసీలోని పలు సెక్షన్ల కింద న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనడమే కాకుండా, అథారిటీల ముందు కూడా మౌద్గిల్ వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని రోహిణి సింధూరి అన్నారు.
ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ ప్రధాన కార్యదర్శి వందితా శర్మకు సింధూరి లేఖ రాశారు.
మౌద్గిల్ తన సీనియర్ కాదని, తన బాస్ కాదని కూడా, ఆమె చేసిన ఈ వ్యక్తిగత ఆరోపణలు, పూర్తిగా సర్వీసు కండక్ట్ రూల్స్‌కి విరుద్ధమని సింధూరి ఈ లేఖలో అన్నారు.
అయితే, సింధూరిపై చేసిన 19 ఆరోపణలకు అదనంగా మరిన్ని ఆరోపణలను చేశారు మౌద్గిల్. విచారణ తర్వాత సింధూరిపై ఎందుకు పరిపాలన పరమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
పోస్టింగ్ ఇవ్వకుండా ఇద్దరికీ బదిలీ
మరోవైపు ఈ ఇద్దరి మహిళా అధికారుల మధ్య వివాదం కొనసాగుతుండటంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన బొమ్మై సర్కార్ వీరిద్దర్ని బదిలీ చేసింది.
ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరిలను బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఇద్దరికీ ఇంకెక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
- ఉమన్ బాడీ బిల్డర్: కష్టాల కడలిలో ఈదుతూ కండలు తీర్చిదిద్దుకున్న మహిళ
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- నాగ సాధువులు ఔరంగజేబు సైన్యంతో పోరాడినప్పుడు ఏం జరిగింది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














