రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్‌లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?

రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రవీంద్ర జడేజా
    • రచయిత, విధాంశు కుమార్
    • హోదా, స్టోర్ట్స్ రిపోర్టర్, బీబీసీ కోసం

దిల్లీ టెస్ట్ మ్యాచ్ విజయం తరువాత 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాన్ని స్వీకరించేందుకు రవీంద్ర జడేజా ప్రజెంటేషన్ వేదిక వద్దకు వచ్చాడు. అప్పుడు ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆలోచనలో పడ్డట్లుగా కనిపించారు.

''నేను ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు నేను కొత్తగా ఏం ప్రశ్నలు అడగగలను. ఎందుకంటే చివరి మ్యాచ్‌లో కూడా మీరు ఈ అవార్డు అందుకున్నారు. అప్పుడే నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగాను. చాలా సమయం పాటు మన చర్చ జరిగింది'' అని రవీంద్ర జడేజాతో సంజయ్ మంజ్రేకర్ తన ఇబ్బంది గురించి నవ్వుతూ చెప్పారు.

ఆ తర్వాత మంజ్రేకర్ కొన్ని ప్రశ్నలు జడేజాను అడిగారు. వాటికి చాలా క్లుప్తంగా జడేజా సమాధానం ఇచ్చారు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాన్ని అందుకున్నాడు.

భారత క్రికెట్‌ దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఉంటాయి. కానీ, రవీంద్ర జడేజా పేరు వినిపించదు. అతని పేరును కూడా ఆ జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఇప్పుడు అతను బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నతీరు ప్రకారం చూస్తే రిటైర్ అయ్యే సమయానికి అతని సగటు, అతడ్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలపవచ్చు.

రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, ANI

దిల్లీ టెస్టులో ఎదురే లేదు

దిల్లీ వేదికగా జరిగిన టెస్టులో భారత్ 6 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలిచి బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.

ఈ టెస్టు మ్యాచ్ హీరో రవీంద్ర జడేజా. అతను తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా, భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

జడేజా 26 పరుగుల ఇన్నింగ్స్ ఎంత కీలకమైనదో కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్-అశ్విన్ జంటతో పాటు, విరాట్ కోహ్లి-జడేజా నెలకొల్పిన భాగస్వామ్యాలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్లు అని రోహిత్ అభివర్ణించాడు.

ఈ భాగస్వామ్యాల వల్లే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కేవలం ఒక పరుగుకే పరిమితం అయింది.

మరోవైపు చివరి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం అంత సులభం కాదు. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను వీలైనంత తక్కువ పరుగులకే కట్టడి చేయాలనేది భారత్ ప్రణాళిక. ఎందుకంటే చివరి ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు చాలా కష్టంగా మారుతుంది.

రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఒక దశలో 65/2 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు 250కు పైగా పరుగులు చేస్తుందని అనిపించింది. దీంతో భారత్‌కు కష్టాలు తప్పేలా లేవని అందరూ భావించారు.

కానీ, ఇక్కడే జడేజా మరోసారి మాయ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 7 వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియాను 113 పరుగులకే కట్టడి చేశాడు. అలా ఒకే టెస్టులో 10 వికెట్లు పడగొట్టి మరోసారి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారం అందుకున్నాడు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్‌ను వెనక్కి నెట్టాడు

దిల్లీ టెస్టు మ్యాచ్ ప్రదర్శనతో రవీంద్ర జడేజా తన ఖాతాలో కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇమ్రాన్ ఖాన్ వంటి పాకిస్తాన్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లను వెనక్కి నెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అతను టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అలాగే టెస్టు ఫార్మాట్‌లో 250 వికెట్లతో పాటు 2,500 పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు.

ఇయాన్ బోథమ్ ఈ ఘనతను 55 టెస్టు మ్యాచ్‌ల్లోనే సాధించగా, రవీంద్ర జడేజాకు 62 మ్యాచ్‌లు అవసరం అయ్యాయి. దీంతో అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో క్రికెటర్‌గా జడేజా నిలిచాడు.

ఇమ్రాన్ ఖాన్ 64 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్న జడేజా ఇంకా చాలా టెస్టులు ఆడగలడు.

టెస్టుల్లో 500 వికెట్లు, 5000 పరుగులు చేసి ప్రపంచ దిగ్గజ ఆల్‌రౌండర్‌గా అతను రిటైర్‌మెంట్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

కోహ్లి, రోహిత్ తర్వాత అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్

బ్యాట్స్‌మన్‌గా కూడా జడేజా అద్భుత గణాంకాలు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు అతను 62 టెస్టులు ఆడాడు. మొత్తం 91 ఇన్నింగ్స్‌లో 36 సగటుతో 2619 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక, 2016 నుంచి అతని గణాంకాలని పరిశీలిస్తే ఎంతగా రాటు దేలాడో అర్థం అవుతుంది.

2016 నుంచి 44.16 సగటుతో అతను 2000కు పైగా పరుగులు సాధించాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మినహాయించి, ఈ కాలంలో 2000 పరుగులు సాధించిన మిగతా ఏ భారతీయ బ్యాట్స్‌మన్‌కు కూడా జడేజా అంత సగటు లేదు.

ఆరు లేదా ఏడు స్థానంలో బ్యాటింగ్‌కు దిగే జడేజా సాధించిన పరుగులు, సగటు అనేవి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, చతేశ్వర్ పూజారా కంటే ఎక్కువ. ఈ బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్, కోహ్లి తర్వాత జడేజాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

జడేజా అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాల కారణంగానే, అనేక సార్లు విదేశీగడ్డపై 4 సీమర్లతో ఆడే అవకాశం భారత్‌కు దక్కింది.

బౌలింగ్ పరంగా చూస్తే అతని సగటు, అశ్విన్ కంటే కాస్త తక్కువగా ఉంటంది. కానీ, బ్యాటింగ్‌లో అతని సగటు చాలా మెరుగ్గా ఉంది. తద్వారా ఆరు లేదా ఏడో స్థానంలో జడేజా మెరుగ్గా పరుగులు సాధించగలడనే విశ్వాసాన్ని అతను మేనేజ్‌మెంట్‌కు కలిగించాడు. ఈ జట్టులో జడేజా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ తరహాలో కూడా ఆడగలడు.

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రవిచంద్రన్ అశ్విన్

అశ్విన్‌తో కలిసి బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకుంటాడు

ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జడేజా అద్భుతమైన స్పిన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అశ్విన్ 90 టెస్టుల్లో 463 వికెట్లు తీయగా, జడేజా 62 మ్యాచ్‌ల్లో 259 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అశ్విన్ కంటే జడేజా వికెట్లు తీసే సగటు, స్ట్రయిక్‌రేట్ తక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అశ్విన్‌తో పోలిస్తే జడేజాకు చాలా తక్కువ అవకాశాలు లభించాయి.

అశ్విన్, జడేజా జోడీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే వీరిద్దరూ చెత్త బంతులు వేయరు, అలాగే పొరపాట్లు కూడా చేయరు.

పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచుతున్నప్పుడు మరో మార్గం లేక బ్యాట్స్‌మెన్ రిస్క్ తీసుకుంటారు. ఇదే అదునుగా అద్భుతమైన బంతుల్ని సంధిస్తూ వారిద్దరూ వికెట్లను పడగొడతారు.

దిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 3, జడేజా 7 వికెట్లు తీశారు. మొత్తం 10 వికెట్లు ఈ జోడీ పేరు మీదనే ఉన్నాయి.

జడేజా

ఫొటో సోర్స్, ANI

ఫిట్‌నెస్

ఇంతకీ, బౌలింగ్‌లో జడేజా విజయ రహస్యం ఏంటి? బౌలింగ్‌లో సరళతే అతని బలమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా అభిప్రాయపడ్డారు.

''బంతిని కొద్దిగా టర్న్ చేస్తూ జడేజా, వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడు. పిచ్ నుంచి అతనికి మద్దతు లభిస్తే అతని బౌలింగ్‌లో ఆడటం కష్టంగా మారుతుంది. బౌలింగ్‌లో నిలకడ ఉంటుంది.

అతను ఎక్కువ వేరియషన్లను ప్రయత్నించడు. బౌలింగ్ సరళంగా ఉండేలా చూసుకుంటాడు. తాను బంతిని సంధించాలని నిర్ణయించుకున్న ప్రాంతంలోనే ఎక్కువ సేపు బౌలింగ్ చేస్తాడు.

ఇది చెప్పడానికి చాలా తేలికగా ఉంటుంది. కానీ, అలా పదే పదే ఒకే చోట బంతిని సంధించడం చాలా కష్టం. ఇలాంటి నిలకడ సాధించడం కోసం ఫిట్‌నెస్ చాలా కీలకం. ఫిట్‌నెస్ విషయంలో జడేజా ఎక్కడా తగ్గడు'' అని ఆయన వివరించారు.

బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాకుండా కళ్లు చెదిరే ఫీల్డింగ్ అతని సొంతం. గత 10 ఏళ్లుగా భారత జట్టులో అతను అత్యుత్తమ ఫీల్డర్‌గా ఉన్నాడు. వరల్డ్ టాప్-3 అత్యుత్తమ ఫీల్డర్లలో అతను కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి: