చైనా: ఫిలిప్పీన్స్ నేవీపై డ్రాగన్ దేశం లేజర్ ప్రయోగం... ఈ లేజర్ ఆయుధాలతో సైనికుల చూపు పోతుందా?

తమ తీర రక్షక పడవపై 'మిలిటరీ గ్రేడ్' లేజర్ లైట్‌ను చైనా ఉపయోగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది

ఫొటో సోర్స్, PHILIPPINE COAST GUARD

ఫొటో క్యాప్షన్, తమ తీర రక్షక పడవపై 'మిలిటరీ గ్రేడ్' లేజర్ లైట్‌ను చైనా ఉపయోగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది

చైనాపై చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అమెరికా, తైవాన్‌లతో స్పై బెలూన్ వివాదాలు మరిచిపోకముందే చైనా, ఫిలిప్పీన్స్‌ల మధ్య కొత్త వివాదం తలెత్తింది.

దీనికి కారణం లేజర్ కాంతి. తమ తీర రక్షక పడవపై 'మిలిటరీ గ్రేడ్' లేజర్ లైట్‌ను చైనా ఉపయోగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది.

ఫిలిప్పీన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 6న సియెర్రా మాడ్రే అనే పురాతన ఓడ వద్దకు పడవలో ఫిలిప్పీన్స్ దళాలు సామగ్రిని తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

దక్షిణ చైనా సముద్రంలోని సియెర్రా మాడ్రే ఓడను ఫిలిపినో నౌకా దళం ఔట్‌పోస్టుగా ఉపయోగిస్తుంది.

ఆ ఓడ దగ్గరికి వెళుతున్న ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ బోట్‌‌పై చైనా ఓడ లేజర్ పరికరాన్ని ప్రయోగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. దీంతో సిబ్బందికి తాత్కాలికంగా ఏం కనిపించలేదంది.

చైనా ఎలాంటి పరికరాలు ఉపయోగించింది? అవి ఎంత శక్తిమంతమైనవి అనేది స్పష్టంగా తెలియదని తెలిపింది. అయితే లేజర్ ఆయుధాలు కంటి చూపును దెబ్బతీస్తాయి. దీనిని ఐక్యరాజ్యసమితి నిషేధించింది.

ఈ ఘటనను అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఖండించాయి.

అదే సమయంలో చైనా తన 'సార్వభౌమాధికారం' రక్షణకు లేజర్‌లను ఉపయోగించే హక్కును సమర్థించింది. అయితే ఫిలిప్పీన్స్ సిబ్బందిపై లేజర్‌లను ప్రయోగించామనే వాదనను కొట్టిపారేసింది.

"చేతితో పట్టుకునే లేజర్ స్పీడ్ డిటెక్టర్లు, హ్యాండ్ హెల్డ్ గ్రీన్‌లైట్ పాయింటర్లను" ఉపయోగించామని, ఈ రెండూ ప్రమాదకరం కాదని చైనా వెల్లడించింది.

ఈ విషయంపై చైనా, ఫిలిప్పీన్స్ ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. అయితే ఈ సంఘటన వెనుక మునిగిపోయిన ఒక పెద్ద బండరాయి కూడా ఒక కారణం.

సియెర్రా మాడ్రే
ఫొటో క్యాప్షన్, సియెర్రా మాడ్రే

బండ రాయిపై నిలిచిన భారీ ఓడ

2014లో సియెర్రా మాడ్రేని వెతకడానికి బీబీసీ, దక్షిణ చైనా సముద్రాన్ని సందర్శించింది. అక్కడ సూర్యోదయం కావొస్తున్నా ఏమీ కనిపించలేదు.

అప్పుడు మమ్మల్ని ఓడ దగ్గరకు తీసుకెళ్తున్న వ్యక్తి "బాధపడకండి.. మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలుసు.. అది ఆ బండ మీద ఉంది'' అన్నారు

ఆయన ఉత్తరం వైపు చూపించారు. ఆ దిశలో తెల్లవారుజామున పొగమంచులో లేత బూడిద రంగులో భారీ ఆకారం కనిపించింది. ఆ నీటిలో మునిగి ఉన్న రాతిపై నిలిచి ఉంది భారీ ఓడ.

ఈ ఆకారం సియెర్రా మాడ్రేది. ఆ రాయి నీటికి కొన్ని అడుగుల దిగువన కనిపించింది.

సియెర్రా మాడ్రే అప్పట్లో ఏమంత పెద్ద ఓడ కాదు. దీన్ని రెండో ప్రపంచ యుద్ధంలో ట్యాంకులను ల్యాండ్ చేయడానికి తయారుచేశారు.

వియత్నాం యుద్ధంలో అమెరికా నౌకాదళం దీన్ని ఉపయోగించింది.

1970 లో ఈ ఓడను వియత్నాం నౌకాదళానికి ఇచ్చారు. 1975‌లో సైగాన్ పతనం తరువాత ఇది ఫిలిప్పీన్స్ వద్దకు చేరింది.

1999లో ఈ పురాతన నౌకను ఫిలిప్పీన్స్ తీరానికి 160 కి.మీ. దూరంలోని ఓ బండ రాయిపై వదిలేశారు.

బీబీసీ దగ్గరికి వెళ్లి చూడగా ఓడ చుట్టూ పెద్ద రంధ్రాలు కనిపించాయి. తుఫానులో ఈ ఓడ నాశనమైపోతుందని అనిపించింది.

సియెర్రా మాడ్రే 10 ఏళ్ల నుంచి తుప్పు పట్టి ఉంది. ఫిలిప్పైన్ మెరైన్‌ సిబ్బంది ఇప్పటికీ ఆ ఓడలో ఉన్నారు.

అయితే ఫిలిప్పీన్స్ నౌకపై చైనీస్ కోస్ట్ గార్డ్ షిప్ లేజర్ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పరిగణించవచ్చు.

చైనా ఏం చెప్పినా ఆ సియెర్రా మాడ్రే చుట్టూ ఉన్న జలాలు చైనాకు చెందినవైతే కావు.

2016లో హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగం తమదేనంటూ చైనా చేసిన వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఈ ప్రాంతాలను తరచుగా నైన్-డాష్ లైన్ అని కూడా పిలుస్తారు.

సియెర్రా మాడ్రే

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ ద్వీపాలు సృష్టిస్తున్న డ్రాగన్

దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలు, దిబ్బలు, జలాలకు సంబంధించి అనేక వాదనలు ఉన్నాయి. అయితే ఇక్కడ చైనా పరిధిని ఎక్కువగా విస్తరిస్తోంది.

ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, మలేషియాలు కూడా సముద్రంలో చిన్న భూభాగాలపై తమ వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి.

చాలా దావాలకు అంతర్జాతీయ చట్టాలు మద్దతు ఇవ్వలేదు.

సియెర్రా మాడ్రే ఉన్న శిలలను చైనీస్ భాషలో సెకండ్ థామస్ షోల్, ఆయుంగిన్ షోల్, రిన్-ఐ రాక్ అని పిలుస్తారు.

అయితే నీటిలో మునిగిన శిలను భూమిగా పరిగణించబోరు. ఈ శిలలను నియంత్రించడం వల్ల దేశానికి కొత్త ప్రాదేశిక జలాలు లభించవు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) కూడా విస్తరించదు.

దక్షిణ చైనా సముద్రంలో దాదాపుగా అసలు భూమి లేదు. అత్యంత వివాదాస్పద భూభాగాలు స్ప్రాట్లీ దీవులలోని ద్వీపాలు .

వాటిలో అతిపెద్దది తైపింగ్ దావో. ఇది 1,000 మీటర్ల పొడవు, 400 మీటర్ల వెడల్పుతో విస్తరించింది. యాదృచ్ఛికంగా ఇది తైవాన్ నియంత్రణలోకి వచ్చింది.

వీడియో క్యాప్షన్, చైనా- తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్- తైవాన్ వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా.?

రెండో అతిపెద్ద ద్వీపం పగసా. అరగంటలో పూర్తిగా చుట్టూ తిరగవచ్చు.

1971లో శక్తివంతమైన టైఫూన్ నుంచి తప్పించుకోవడానికి తైవానీస్ దళాలు వెనుదిరిగిన తర్వాత పగసాను ఫిలిప్పీన్స్ స్వాధీనం చేసుకుంది. వియత్నాంలో మరికొన్ని భూభాగాలు ఉన్నాయి.

1960, 1970లలో జరిగిన సాంస్కృతిక విప్లవం వల్ల ఏర్పడిన అంతర్గత కల్లోలాల కారణంగా చైనా దక్షిణ చైనా సముద్రంపై దృష్టి పెట్టడంలో చాలా ఆలస్యం అయింది.

తేరుకునేసరికి అసలు అక్కడ భూమి మిగిలే లేదు. అందుకే చైనా తన సొంత భూమిని సృష్టించాలని నిర్ణయించుకుంది.

మిస్చీఫ్ రాక్‌పై చైనా తన భూమిని సిద్ధం చేసే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

సముద్రంలో మిలియన్ టన్నుల కంకర, ఇసుకను పోసి భారీ కృత్రిమ ద్వీపాలను తయారు చేస్తోంది డ్రాగన్ దేశం.

మిస్చీఫ్ రాక్‌పై చైనా నిర్మించిన కొత్త భూమి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫిలిప్పీన్స్‌కు 320 కి.మీ దూరంలో ఉంది. ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్) కిందకు వస్తుంది.

కృత్తిమ ద్వీపం

ఫిలిప్పీన్స్ ఆందోళన ఏంటి?

ఈ కొత్త ద్వీపానికి అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. ఇది చైనాకు 20 కి.మీ దూరంలో ఉంది. ఈ నీటి ప్రాంతంపై చైనాకు హక్కులు ఉండవు.

అయితే చైనా తన వాదనను బలపరచడానికి కోస్ట్ గార్డ్, మెరైన్ మిలిటరీ ఫ్లీట్‌ను ఉపయోగించకుండా ఆపలేవు.

ఫిలిప్పీన్స్ మత్స్యకారులను తరిమికొట్టడం, వారి నౌకలకు సవాలు విసిరినా నిరోధించలేవు.

అయితే సైనిక వ్యూహకర్తలు మాత్రం చైనా కొత్త ద్వీపాలను చట్టపరమైన వివాదంగా కాకుండా నిజమైనవిగానే పరిగణిస్తారు.

అంటే ఇది ఎటూ తేలకుండా ఉన్న సరిహద్దు రేఖ వంటి వివాదం కాదు. ద్వీపాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించవచ్చు.

ఫిలిప్పీన్స్ భయాందోళనలు ఏంటంటే.. చైనా ఈ దుశ్చర్యలతో ఆగడం లేదు.

ఆయాంగిన్ షోల్ దాని తదుపరి లక్ష్యం కావచ్చు. అందుకే ప్రసిద్ధిగాంచిన సియెర్రా మాడ్రే దగ్గరకి వస్తోంది.

30 ఏళ్ల విరామం తర్వాత ఫెర్డినాండ్ బాంగ్‌బాంగ్ మార్కోస్ జూనియర్ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌లోని తమ స్థావరాలకు తిరిగి వచ్చేందుకు అమెరికన్ దళాలను అనుమతించింది.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)